ప్రశ్న: దేవాలయాల  ప్రాణ ప్రతిష్టకి సంబంధించి భారతదేశంలోనూ , బయటిదేశాలలోనూ వ్యత్యాసాలున్నాయా? ఒకవేళ ఉంటే భక్తులు వీటిని ఏ విధంగా తీసుకోవాలి ?

సద్గురు: మామూలుగా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒకే ఆలయంలో అనేకమంది దేవతలు ఒకేచోట ప్రతిష్ఠించబడి ఉండటం గమనించాను నేను. బహుశా తమ దేశంలో ఆయా దేవతామూర్తులను చూడలేకపోతున్నామన్న భావనతో అక్కడ స్థిరపడ్డ భారతీయులు నిర్మించినవి అవి. తమ సంస్కృతి ప్రతిబింబాలుగా అవి నిలవాలన్న ఉద్వేగం వాటి నిర్మాణంవెనుక వుంది. దానివల్ల  ఏమవుతోందంటే, దేవతామూర్తులనందరినీ గుదిగుచ్చినట్టు ఒకేచోట ప్రతిష్ఠిస్తున్నారు. కానీ ప్రాచీన భారతంలో ఆలయాలు ఈవిధంగా రూపుదిద్దుకోలేదు.  

వివేచనా శక్తి - భావోద్వేగాల బంధం

ఆలయం అంటే దేవుడికి అర్జీ ఇచ్చే చోటు కాదు. మన సంస్కృతిలో అటువంటి భావనే లేదు. మీ అర్జీలను పరిశీలించే కార్యాలయం, సిబ్బంది ఆయనకు లేవు. ఆలయాలంటే వివేచనాత్మక శక్తిని కలిగున్న ప్రదేశాలు. గుడిలో ప్రాణ ప్రతిష్ట జరపటమంటే ఒక ప్రత్యేకమైన ప్రయోజనానికి తగిన వివేచనాశక్తి సాధనాన్ని సమకూర్చటం.

ఒక గొప్ప వైజ్ఞానిక సాంకేతికతను ప్రజలీరోజున ఉద్వేగపూరిత స్థాయికి తగ్గించేశారు. అలాగని వారిలోని ఉద్వేగాన్ని  తక్కువచేయటం కాదు. మీ భావోద్వేగాలు ముఖ్యమే ఎందుకంటే, మీ  ఉద్వేగమెక్కడుంటే మీ మస్తిష్కమూ అక్కడుంటుంది. మీ బాల్యంలో మీరు చదువుకునే పాఠశాలలో మీ మాస్టరు చెప్పినవిషయాలను గుర్తుచేసుకోండి అంటే మీకది కష్టంగా అనిపిస్తుంది. అందుకే పరీక్షలు అంత కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. తమకు ఆసక్తిలేని విషయాలను గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరూ.


సరే మిమ్మల్ని ఎవరో ఎంతగానో ఆకర్షించారనుకుందాం. వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటారు. తీపిగురుతులు అనుకునే చెత్త విషయాలను కూడా చాలా బాగా గుర్తుంచుకుంటారు. దానికి కారణం భావోద్వేగాల బంధంలో మీరు చిక్కుకునుండటమే.

భక్తిపూర్వకంగా కొలవటమంటే ఇదే. ఒక బలమైన భావోద్వేగంలో మీరు ఉంటే మీ మనసు ఇంకా మీ శక్తి మీ భావోద్వేగంతో ముడిపడి ఉన్న అంశంతో పెనవేసుకునుంటాయి. అందువలన భక్తి అనేది చాలా అవసరం. కానీ దేవాలయమంటే ఎవరిగురించో అర్జీ పెట్టుకోవడం కాదు. అదొక వివేచనతో కూడిన శక్తి ప్రదేశం. ఆ ప్రదేశంతో మీరు గనక తాదాత్మ్యం చెందగలిగితే మీకు కొన్ని అనుభూతులు కలగవచ్చు.

కొంత దూరంగా వెళదాం

భిన్న దేవాలయాలు విభిన్నంగా నిర్మించబడ్డాయి. మీరు భయాందోళనలో ఉంటే ఒకరకమైన గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. సంపదలతో తులతూగాలంటే మరొక రకమైన గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరో విధమైన గుడికి వెళతారు. ఈ విధంగా మన జీవితంలో వేరువేరు అవసరాలు నేరవేర్చుకోవటం కోసం మనం సృష్టించుకున్న సాధనాలివి. అయితే కాలక్రమేణా ఇవి కొంత గందరగోళానికి దారి తీసాయి.

ఆలయం అంటే దేవుడికి అర్జీ ఇచ్చే చోటు కాదు.మన సంస్కృతిలో అటువంటి భావనే లేదు.

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పంచభూతాలైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశంలపై పట్టు సాధించడానికి ఐదు దేవాలయాలను సృష్టించాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి పనిచేయాలన్న ఆశయం వీటి వెనకుంది. అంటే సరైన రీతిలో ఆచార వ్యవహారాలను పాటించటం ద్వారా ఈ దేవాలయాల పరిధిలో నివసించే ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించే వీలుంది. అయితే ఈ రోజున అవి వేటికవే ప్రత్యేక సంస్థలుగా మారిపోయాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా మెలుగుతున్నాయి. మన శరీరంలో కలిసుండే ఈ పంచభూతాలు, ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఎలా ఉంటాయి?


ఇదెలా ఉందంటే మనమో గొప్ప కారును తయారుచేసిదాన్ని నడుపుతున్నప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే మీ తరవాతి తరంలో ఐదుగురు కొడుకులున్నారనుకుందాం. నలుగురు కొడుకులు నాలుగు చక్రాలను, ఐదో కొడుకు స్టీరింగ్ను పట్టుకున్నాడనుకుందాం. ఇక అక్కడ కారు  అనేడి ఉండదు. ఎవరికి వారు తమ చేతుల్లోనే ఏదో ఉందనుకుంటారు. దురదృష్టవశాత్తు మనమందరమూ ఇప్పడు ఇలానే ఉన్నాం. ఈ దేవాలయాలన్నీ మనంతట మనం పొందలేని శ్రేయస్సును పొందటం కోసం ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్మించబడినవి.

సాధన శక్తి

మానవాభ్యుదయానికి దేవాలయాలు శక్తివంతమైన సాధనాలు. ఈ సాధనాలను ఉపయోగించుకునే పరిజ్ఞానాన్ని కలిగిఉండటం వల్లనే  ఇతర జీవులకు భిన్నంగా మనిషి మనగలుగుతున్నాడు. లేకపోతే చీమలదండు కూడా మీపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండేది.

మానవాభ్యుదయానికి దేవాలయాలు శక్తివంతమైన సాధనాలు.

ఒక బల్లకున్నస్క్రూ గురించి ఆలోచించండి. ఒట్టి చేతులతో ఆ స్క్రూను విప్పమని అడిగితే మీ పదివేళ్ళకున్నగోళ్ళను ఆ ప్రయత్నంలో మీరు కోల్పోవచ్చు. అయినా ఆ స్క్రూ మాత్రం రాకపోవచ్చు. అదే మీకో స్క్రూడ్రైవర్ ఇచ్చి విప్పమంటే సునాయాసంగా ఆ స్క్రూను విప్పుతారు. అదే ఒక సాధనానికున్న గొప్పదనం.

భౌతిక ప్రపంచంలో మనముపయోగించే స్క్రూడ్రైవర్లు, గొడ్డళ్ళ కంటే ఎంతో గొప్ప సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలనే మనం దేవాలయాలుగా పేర్కొంటాం. సాధనాసంపత్తిగా ఉపయోగపడాల్సిన ఈ దేవాలయాలు దురదృష్టవశాత్తూ ఇప్పుడు వాటి అర్థాన్ని కోల్పోయాయి. నేను ఆశ పడేదేమిటంటే, కనీసం రాబోయే తరాలవారికోసమైనా మనం సరైన సాధనా సంపత్తిని సమకూర్చగలిగితే, అప్పుడు మానవాళి అంతా అసాధారణమైన, మహత్తరమైన జీవితాన్ని  జీవించే అవకాశముంటుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

Download Bha-ra-ta