విషయ సూచిక
1. నవరాత్రి అంటే ఏమిటి?
2. నవరాత్రి ప్రాముఖ్యత – స్త్రీత్వం ధరించు వేళ
3. నవరాత్రి ఉపవాసంలోని ఆంతర్యం ఏమిటి?
4. తొమ్మిది రోజుల నవరాత్రికి వ్యాఖ్యానం
5. నవరాత్రి – 9 రోజులు, 3 గుణాలు
6. నవరాత్రుల్లోని తొలి మూడు రోజుల ప్రాముఖ్యత – తమో గుణం
7. నవరాత్రుల్లోని మధ్య మూడు రోజుల ప్రాముఖ్యత – రజో గుణం
8. నవరాత్రుల్లోని ఆఖరి మూడు రోజుల ప్రాముఖ్యత – సత్త్వ గుణం
9. నవరాత్రుల్లోని 9వ రోజు – ఆయుధ పూజ లేదా మహర్నవమి
10. నవరాత్రిని ఎలా జరుపుకోవాలి?

1. నవరాత్రి అంటే ఏమిటి?

సద్గురు: ఈ సంస్కృతి, మానవ వ్యవస్థ - భూమి, చంద్రుడు, సూర్యుడు ఇంకా దైవం యొక్క వివిధ అంశాలతో దాని సంబంధం గురించిన లోతైన పరిశీలనలపై వేళ్ళూనుకొని ఉంది. మనం మన పండుగలను ఎప్పుడు ఎలా జరుపుకుంటాము అనే దానిలో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. నవరాత్రి అంటే అక్షరాలా “తొమ్మిది రాత్రులు.” అమావాస్య తిథి మరుసటి రోజు నుండి ఈ తొమ్మిది రాత్రులని లెక్కిస్తారు. శుక్ల పక్షంలోని మొదటి తొమ్మిది రోజులూ స్త్రీతత్వంగా పరిగణించబడతాయి. దివ్యత్వంలోని స్త్రీతత్వాన్ని సూచించే దేవికి ఈ సమయం విశిష్టమైనది. తొమ్మిదవ రోజుని నవమి అంటారు. పౌర్ణమి తిథి దగ్గరలోని ఒకటిన్నర రోజు తటస్థ కాలం. మిగతా పద్దెనిమిది రోజులూ స్వాభావికంగా పుంసత్వానివి. మాసంలోని స్త్రీతత్వానికి చెందిన రోజులు దేవి గురించినవి. ఇందుకే సాంప్రదాయంలో, నవమి వరకూ జరిగే ఆరాధన అంతా దేవికి అంకితమైనది.

సంవత్సరంలో ఇలాంటి తొమ్మిది రోజుల వ్యవధులు పన్నెండు ఉంటాయి. అలాగే ఇవి దివ్య స్త్రీ లేదా దేవిలోని వివిధ కోణాలపై దృష్టి పెడతాయి. అక్టోబర్ సమయంలో వచ్చే నవరాత్రి ఎంతో ప్రధానమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సకల విద్యాస్వరూపిణి అయిన శారదా దేవికి అంకితమైన సమయం అది. మానవుడు చేయగల అనేక విషయాల్లోకెల్లా, ఈ సంస్కృతి విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యతను ఆపాదించింది. ఇతర ప్రాణులు మనకంటే వేగంగా నడవగలవు; మనకంటే దృఢంగా ఉంటాయి, మనం చేయలేని ఎన్నో వాటిని అవి చేయగలవు – కానీ మనం నేర్చుకున్నట్టుగా అవి నేర్చుకోలేవు. మానవునిగా ఉండడంలోని గర్వం ఏంటంటే, మీరు సుముఖంగా ఉంటే గనుక మీరు ఏదైనా నేర్చుకోగలరు.

2. నవరాత్రి ప్రాముఖ్యత – స్త్రీతత్వం ధరించు వేళ

“పురుషత్వం” లేదా “స్త్రీతత్వం” అన్నప్పుడు, మనం మాట్లాడేది లింగభేదం గురించి కాదు; సృష్టిలోని ప్రాధమిక ధ్రువత్వ గుణాల గురించి మాట్లాడుతున్నాము. పగలు-రాత్రి, వెలుగు-చీకటి, పురుషత్వం- స్త్రీత్వం, అలాగే ఆడ-మగ – ఈ ద్రువత్వాల మధ్య మాత్రమే ఈ భౌతిక ప్రపంచం ఉనికిలో ఉండగలదు. ఆడ-మగ అనేవి స్త్రీతత్వం అలాగే పురుషత్వం యొక్క వ్యక్తీకరణలు, స్వతహాగా అవి గుణాలు కావు.

శరత్కాలపు విషువత్తుకు పిదప కాలం స్త్రీతత్వం ధరించే సమయం. సంవత్సరంలో ఈ సమయం సహజంగానే స్త్రీతత్వానికి అనువైనది. కొన్ని సమాజాలు స్త్రీతతాన్ని సుస్థిరపరిచేందుకు ఎరుకతో కృషి చేశాయి, ఎందుకంటే పురుషత్వం అంతగా ప్రోత్సాహం లేకుండానే దానికదే స్థిరీకరించుకుంటుంది. స్త్రీతత్త్వం దానికదే సుస్థిరం చేసుకోవాలంటే, దానికి సహకారం అవసరం – లేదంటే గనుక అది మరుగున పడుతుంది.

ఏ సమాజాన్ని తీసుకున్నా, స్త్రీతత్వం గనుక మరుగున పడితే, అందులోని వారు దోపిడీదారులుగా అవుతారు. దానర్థం వాళ్ళు శూన్యమైన జీవితపు చట్రంలో కూర్చుండిపోతారు. వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని జయిస్తారు కానీ ప్రపంచపు ఆస్వాదన తెలియని వారు. ఇదే పురుషత్వంలోని దుస్థితి. వారు ప్రపంచంలో ఉన్నత స్థితికి చేరుతారు. ఆ ఎత్తుల్లోనే దుఃఖాన్ని అనుభవిస్తారు.

3. నవరాత్రి ఉపవాసంలోని ఆంతర్యం ఏమిటి?

స్త్రీతత్వాన్ని మీ ఇంటికి, సంస్కృతిలోకి, మీ రోజువారీ ఆచరణల్లోకి తీసుకురావడం అనేది ఎంతో ముఖ్యం. ఇది సక్రమంగా జరగడం కోసం, భారతీయ సంస్కృతి సంపూర్ణమైన విధానాలు, ఆచారాల పరంపరలను ఇంకా మరెన్నో సాధనాలను సృష్టించింది. ఇది నవరాత్రి అని మీకు ఎరుకలో ఉండకపోవచ్చు, కనుక ఈ తొమ్మిది రోజులూ మీరు ఉపవాసం చేయాలని పెద్దలు చెప్పారు. కడుపులో ఆహారం ఉన్నప్పుడు, మీకు అది ఏ తిథి అనేది గుర్తుండదు. కానీ మీరు ఉపవాసం చేస్తుంటే గనుక, ఆ తిథి ఎరుక మీకు ఉంటుంది. మీరు తొమ్మిదవ రోజుకు చేరుకునే సమయానికి, మీరు గొప్ప ఎరుకతో ఉంటారు! కనుక, మిమల్ని మరింత ఎరుకతో ఉండేలా చేయడానికి అలాగే శరీరంలో నిర్దిష్ట స్థాయిలో శుద్ధీకరణ జరిగేందుకు, మీరు ఉపవాసం చేయాలి.

నవరాత్రి అనేది దేవి వివిధ అవతారాల సమాహారం. అందులో కొన్ని మృదు స్వభావమైనవి, అద్భుతమైనవి. కొన్ని తీక్షణంగా, ఉగ్రంగా, భయానకంగా ఉంటాయి. మీ తలని సైతం భక్షించే స్త్రీ మూర్తిని ఆరాధించే ఏకైక సంస్కృతి ఇది. దీనికి కారణం ఏంటంటే, ఒకరి జ్ఞానం, తెలివి, మేథాసంపత్తి అలాగే ఇతర సామర్థ్యాలు కేవలం సత్ప్రవర్తన అనే బలిపీఠానికి దాసోహమవ్వడం మనకు ఇష్టం లేదు. సత్ప్రవర్తన అనేది సామాజిక సౌలభ్యాన్ని అందిస్తుంది, కానీ జీవం మిమ్మల్ని తిరస్కరిస్తుంది. ఈ భూమి మీద మీరు ఏకైక జీవి గనుక అయితే, మీకు ఫలానాది మంచి ప్రవర్తన అని చెప్పడానికి ఎవరూ ఉండరు. మీ చుట్టుపక్కల వారిని పరిగణనలోకి తీసుకుని మీరు వారితో మంచిగా నడుచుకుంటారు కానీ ఒక జీవంగా, అది మీకు అర్థం లేనిది.

ఒక మనిషిగా రూపుదిద్దుకోవడంలోని అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే, మానవుడు తన సంపూర్ణ సామర్థ్యానికి వికాసం చెందుతాడు. ఈ తొమ్మిది రోజులూ దానిని గురించినవే. అదేవిధంగా పదవ రోజు విజయదశమి, అంటే విజయం పొందిన రోజు. అంటే మీరు వికసించారని అర్థం!

4. తొమ్మిది రోజుల నవరాత్రికి వివరణ

దుర్గ, లక్ష్మి, సరస్వతులు స్త్రీత్వానికి మూడు పార్శ్వాలు. ఇవి వరుసగా భూమి, సూర్యుడు, మరియు చంద్రుడు లేదా తమస్సు (జడత్వం), రజస్సు (క్రియాశీలత, ఉద్రేకము), సత్త్వము(శ్రేష్ఠం, జ్ఞానం, స్వచ్ఛత)లకు ప్రతీకలుగా ఉంటాయి.

శక్తిశౌర్యాలను కాక్షించే వారు, భూమాత వంటి స్త్రీత్వ స్వరూపాలను అంటే దుర్గ లేదా కాళి వంటి వాటిని ఆరాధించాలి. ఐశ్వర్యం, భోగం లేదా ధన-కనక-వస్తు వాహనాదులను కోరుకునేవారు లక్ష్మి లేదా సూర్యుడిని ఆరాధిస్తారు. జ్ఞానం, ముక్తి లేదా నశ్వర శరీరానికి ఉండే పరిమితులను అధిగమించాలని ఆశించే వారు సరస్వతి లేదా చంద్రుడిని ఆరాధించాలి.

తొమ్మిది రోజుల నవరాత్రి ఈ ప్రాథమిక గుణాలను అనుసరించి వర్గీకరించబడింది. అందులో మొదటి మూడు రోజులూ దుర్గాదేవికి అంకితం, తరువాతి మూడు రోజులూ లక్ష్మికి అంకితం, అలాగే ఆఖరి మూడు రోజులూ సరస్వతికి అంకితం. పదవ రోజైన విజయదశమి, జీవితంలోని ఈ మూడు అంశాలపై పరిపూర్ణమైన విజయాన్ని సూచిస్తుంది.

ఇది కేవలం ప్రతీక మాత్రమే కాదు, శక్తి స్థాయిలో కూడా ఇది నిజం. మానవులుగా మనం భూమి నుండి ఉద్భవించి క్రియాశీలకంగా ఉన్నాము. కొంత కాలానికి, మళ్ళీ జడత్వం మన దరి చేరుతుంది. ఇది కేవలం వ్యక్తులుగా మనకు మాత్రమే కాదు, పాలపుంత అలాగే సమస్త విశ్వం విషయంలోనూ జరిగేదే. జడంగా ఉన్న స్థితి నుంచే విశ్వం ఆవిర్భవించి, క్రియాశీలకమై, తిరిగి మళ్ళీ జడంగా మారుతుంది. అయితే ఈ వలయాన్ని చేధించే సామర్థ్యం మనకు ఉంది.

దేవిలోని మొదటి రెండు పార్శ్వాలూ మానవ మనుగడ, అలాగే శ్రేయస్సుకు అవసరం. మూడవది  పరిమితులను అధిగమించాలన్న ఆకాంక్ష. సరస్వతి కటాక్షం పొందాలంటే, మీరు కృషి చేయాలి. లేదంటే మీరు ఆమెను చేరుకోలేరు.

5. నవరాత్రి – 9 రోజులు, 3 గుణాలు

ఈ మూడు పార్శ్వాలూ లేని భౌతిక పదార్థం లేదు. నిర్దిష్టమైన స్థితి స్వభావం, శక్తి అలాగే సచేతనత్వం అనే మూడు పార్శ్వాల నుండి ఏ పరమాణువూ స్వతంత్రమైంది కాదు. అవి లేకుండా మీరు దేనినీ కలిపి ఉంచలేరు. అది విడిపోతుంది. కేవలం సత్త్వ గుణం మాత్రమే ఉంటే గనుక మీరు ఇక్కడ క్షణం కూడా ఉండలేరు – మీరు వెళ్లిపోతారు. కేవలం రజోగుణం మాత్రమే అయితే, అది పనిచేయదు. కేవలం తమోగుణం మాత్రమే అయితే, మీరు ఎప్పుడూ నిద్రావస్థలోనే ఉంటారు. ఈ మూడు గుణాలూ అన్నిట్లోనూ ఉంటాయి. మీరు ఏ మేరకు వీటిని కలుపుతున్నారు అనేదే ప్రశ్న.

6. నవరాత్రుల్లోని మొదటి మూడు రోజుల ప్రాముఖ్యత – తమో గుణం

నవరాత్రుల్లోని మొదటి మూడు రోజులూ తమో గుణ ప్రధానమైనవి. దుర్గా, కాళి వంటి తీక్షణమైన రూపాల్లో దేవి ఉంటుంది. తమోగుణం భూ స్వభావం. అంటే పుట్టుకకు మూలమైన భూమాత గుణం. మనం తల్లి గర్భంలో గడిపే కాలం తమోగుణ భూయిష్టమైనది. అది దాదాపు సుప్తావస్థ లాంటిది. కానీ మనలో ఎదుగుదల ఉంటుంది. కనుక తమము అనేది భూమాత గుణం అలాగే మీ పుట్టుక స్వభావం. మీరు భూమాత ఒడిలో ఉన్నారు. మీరు ఆమె (భూమాత)తో కలిసి ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. మీరు ఎలాగూ ఆమెలో భాగం. ఆమె కోరుకున్నప్పుడు, మిమ్మల్ని బయటకు విడుదల చేస్తుంది, మళ్ళీ తాను కోరుకున్నప్పుడు మిమ్మల్ని తనలోకి లాగేసుకుంటుంది.

మీరు ఎప్పటికప్పుడు మీ భౌతిక శరీర స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. ప్రస్తుతం, అటు ఇటూ కదులుతున్న ఒక మట్టిదిబ్బ మీరు. భూమాత మిమల్ని తనలోకి లాగేసుకోవాలనుకున్నప్పుడు, మీరు కేవలం ఒక చిన్న కుప్పలాగా అవుతారు.

ఆశ్రమంలో నేను ఇక్కడి వారికి ఎప్పుడూ చెప్పేది ఎంటంటే, మీరు ఏ పనైనా చేయండి, రోజులో కనీసం ఒక గంట పాటు మీ వేళ్ళు మట్టిని తాకాలి. పెరట్లో ఏదైనా పని చేయండి. ఇలా చేయడం వల్ల మీరు అమరులు కాదు అనే సహజమైన శారీరక స్మృతిని మీరు ఏర్పరచుకుంటారు. ఇది శాశ్వతం కాదు అని మీ శరీరానికి తెలుస్తుంది. శరీరం దీనిని గ్రహించడం అనేది మనం ఆధ్యాత్మిక అన్వేషణపై శ్రద్ధ పెట్టేందుకు ఎంతో కీలకం. ఎంత తొందరగా ఇది అనుభవంలోకి వస్తే, అంత పటిష్టమైన ఆధ్యాత్మిక దృష్టి అలవడుతుంది.

7. నవరాత్రుల్లోని మధ్య మూడు రోజుల ప్రాముఖ్యత – రజో గుణం

రజోగుణం ప్రవేశిస్తే గనుక, మీరు ఎదో ఒకటి చేయాలనుకుంటారు. ఒకసారి ఏదైనా చేయడం ప్రారంభించి, తగిన ఎరుక, సచేతనత్వం గనుక లేకపోతే, రజోగుణం స్వభావం ఏంటంటే, అది బాగున్నంత కాలం బాగుంటుంది. అది బాగోకపోతే, రజస్సు అనేది చాలా దుర్భరంగా అవుతుంది.

రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి గొప్ప శక్తివంతుడు. కాకపొతే ఆ శక్తి సక్రమంగా వినియోగించబడాలి. మీరు చేసే ప్రతీ పనీ, మిమ్మల్ని విముక్తుల్ని చేసేది కాగలదు లేదా చిక్కుకుపోయేలా చేయగలదు. మీరు సంపూర్ణమైన సుముఖతతో ఏ పనిని అయినా చేస్తే గనుక, ఆ పని అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు ఆనందాన్నిస్తుంది. అదే మీరు ఏ కారణం చేతనో, ఏదైనా పనిని విముఖతతో చేస్తే, అది మీకు బాధని కలిగిస్తుంది. మీరు ఏది చేస్తున్నా, నేలపై కసువు ఊడుస్తున్నా కూడా, దానికి మీరు అంకితమైపోండి. పూర్తిగా నిమగ్నమై ఆ పనిని చేయండి. అదే కావాల్సిందల్లా.

మీరు దేని పట్లైనా ఉద్విగ్నతతో లీనమైనప్పుడు, మీ దృష్టిలో వేరేదీ ఉండదు. ఉద్విగ్నత అంటే, “స్త్రీ-పురుషుల” ఉద్రేకం కాదు. ఉద్విగ్నత అంటే ఒకదాని పట్ల అమితంగా నిమగ్నమవ్వడం. అది ఏదైనా కావచ్చు. – మీరు మక్కువతో పాడవచ్చు, మక్కువతో నర్తించవచ్చు లేదా ఉద్విగ్నంగా నడవవచ్చు. ప్రస్తుతం మీరు దేనిని తాకితే దాని పట్ల పూర్తి ఉద్విగ్నతతో ఉంటారు. మీరు మక్కువతో శ్వాస తీసుకోండి, మక్కువతో నడవండి, మక్కువతో జీవించండి. అసలు మీ ఉనికే, అన్నింటిపట్లా సంపూర్ణమైన నిమగ్నత.

8. నవరాత్రుల్లోని ఆఖరి మూడు రోజుల ప్రాముఖ్యత – సత్త్వ గుణం

తమోగుణం నుండి సత్త్వ గుణం వైపు పయనించడం అంటే, మీరు భౌతిక, మానసిక, భావోద్వేగ, శక్తి శరీరాలను శుద్ధి చేస్తున్నారు అని అర్థం. మీరు దీనిని మరింతగా శుద్ధి చేసి, పారదర్శకంగా మారితే గనుక, మీరు మీలోని సృష్టి మూలాన్ని తెలుసుకోకుండా ఉండరు. ప్రస్తుతం, మీరు చూడలేనంతగా అది అపారదర్శకంగా ఉంది. దానిని శుద్ధి చేసే సమయం వచ్చింది. లేదంటే గనుక మీకు గోడ నిర్మాణం మాత్రమే బాగా తెలుస్తుంది కానీ, దానికి లోపల ఉన్న జీవాన్ని తెలుసుకోలేరు.

9. నవరాత్రుల్లోని 9వ రోజు – ఆయుధ పూజ లేదా మహర్నవమి

ఆయుధపూజ అనే పండుగ కేవలం ఒక క్రతువుగానే కాకుండా ఎదుగుదలకు ఒక ముఖ్యమైన సాధన ఎలా కాగలదో సద్గురు వివరిస్తున్నారు. ఆయుధపూజ ప్రాముఖ్యతను తెలుసుకోండి.

10. నవరాత్రిని ఎలా జరుపుకోవాలి?

సద్గురు: నవరాత్రిని జరుపుకునే ఉత్తమమైన పధ్ధతి ఆ వేడుకలు అందించే స్పూర్తిని గ్రహించడం. గాంభీర్యాన్ని విడిచి, సంపూర్ణంగా నిమగ్నం కావడమే జీవిత రహస్యం. సాంప్రదాయకంగా దేవిని ఆరాధించిన సంస్కృతులు, ఈ ఉనికిలో ఎన్నటికీ అర్థం చేసుకోలేనిది ఎంతో ఉంది అనేది తెలుసుకున్నాయి. మనం దానిని ఆస్వాదించగలం, దాని సౌందర్యాన్ని వేడుక చేసుకుంటాం, కానీ ఎప్పటికీ దానిని అర్థం చేసుకోలేము. జీవం మర్మమైనది, ఎప్పటికీ మర్మంగానే ఉంటుంది. నవరాత్రి పర్వదినం ఈ ప్రాథమికమైన అంతర్దృష్టిని ఆధారంగా చేసుకుంది.