పుస్తక పఠనం సంస్కృతిలో భాగం కావాలి

ఈరోజుల్లో మొబైల్ ఇంకా కంప్యూటర్ వచ్చిన తరుణంలో అందరూ కూడా ఏ సమాచారాన్ని కావాలన్నా కూడా అందులోనే చూడడం మొదలుపెట్టారు. కాని మన జీవితంలో పుస్తక పఠనం కూడా ఒక భాగం కావాలి అని సద్గురు ఎందుకు చెబుతున్నారో చదివి తెలుసుకోండి.
 
 

సద్గురు: అసలు పుస్తకాలు చదవడం అన్నది ఒక సంస్కృతిగా ప్రోత్సహించాలి. వీడియోలు చూడడం, వీడియో గేములు ఆడడం కన్నా పుస్తక పఠనం మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. పుస్తకాలు మెదడుకి మంచి ఎక్సరసైజ్ ఇచ్చి ఆలోచనా దృక్పధాన్ని పెంచుతాయి. వీడియోల కన్నా చదవడం ఎంతో గాఢమైనదీ, లోతైనది. యువతరం వీడియోలు చూడడంకన్నా ఎక్కువగా పుస్తక పఠనం చేస్తారని ఆశిస్తున్నాను. దృశ్య శ్రవణ విధానాలు కూడా  ఎంతో నేర్పుతాయి, అవి తమ తరహాలో ఎంతో ప్రభావవంతమైనవే, కాని ఒక సినిమానో మరొకటో చూసినదాని కన్నా, ఒక పుస్తకం చదంటంలో మరింత విశిష్టత ఉన్నది.

అందరూ పైపైనే చూస్తున్నారు, దృశ్య శ్రవణ సాధనాలే దానికి కారణం అనుకుంటాను. వాటికి నేను వ్యతిరేకం కాదు, కాని అవి పుస్తక పఠనానికి ప్రత్యామ్నాయాలు కావు.

ప్రజలు ఇప్పడు ప్రస్తుత సమాజంలో ఉన్న దానికన్నా కొంచెం చదవడం మీద ఎక్కువ శ్రద్ధపెడితే, వారు మరింత ప్రశాంత చిత్తులుగా, జీవితం గురించి మరింత లోతుగా ఆలోచించేవారుగా ఉంటారు. ఎందుకంటే చదవడం అనేది ఒకరకమైన ధారణ. మీ మనసును దేనిపైన అయినా కేంద్రీకరించడమే ధారణ అంటే. అది మెదడు పనిచేసే విధానాన్ని మెరుగు పరుస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాల పై మోజు అన్నింటినీ మించిపోతోంది, అటువంటి పరిస్థితులలో మనం మన సమాజంలో ఈ పుస్తక పఠనం అనే సంసృతిని వదిలిపెట్టకుండా చూసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే, జీవితాన్ని లోతుగా పరిశిలించడం అన్నది ప్రజల్లో కనుమరుగై పోయింది. జీవితంలోని విశిష్టత లోపిస్తున్నది. అందరూ పైపైనే చూస్తున్నారు, దృశ్య శ్రవణ సాధనాలే దానికి కారణం అనుకుంటాను. వాటికి నేను వ్యతిరేకం కాదు, కాని అవి పుస్తక పఠనానికి ప్రత్యామ్నాయాలు కావు.

పరిశీలన, సున్నితత్వం

ఇప్పుడు జీవనమే ఒక విద్యా ప్రక్రియ. విద్య అనేది జీవితానికి భిన్నమైనది కాదు. ఎందుకంటే జీవితం లేకపోతే విద్య లేదు, విద్య లేకపోతే జీవితం లేదు. ఇక మీరు విద్యాబుద్ధులు ఎలా నేర్చుకుంటున్నారన్నదే ముఖ్యం, అవునా? ఏ స్కూలుకూ వెళ్ళకుండా, కేవలం తమ పొలానికే వెళ్ళిన మనిషి ఏమీ చదవలేదు అనగలమా? భూమి, పంటలు, వాతావరణం, ప్రకృతి గురించి అతనికి  మీకన్నా ఎక్కువ తెలుసు. నేను పొలంలో  నివసించే కాలంలో ఈ విషయం నాకు ఎంతో ఆశ్చరయం కలిగించేది. నేను వాతావరణం గురించి చదివి తెలుసుకునే ప్రయత్నం చేశాను, ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తున్నాకదా. కాని అక్కడ కేవలం నెలకు 150 రూ. జీతం తీసుకునే చదువురాని పనివాడు ఉండేవాడు. అక్కడ వేసవికాలం భూమి చాలా గట్టిగా, దున్నడానికి అనువుగా ఉండేది కాదు.

మీరెంత సున్నితంగా ఉంటే మీకు జీవితం అంతగా తెలుస్తుంది.

ఒకరోజు తెల్లవారు ఝామున ఐదు గంటలకే అతను నాగలిని కడుతున్నాడు. ‘నేను ఈ నాగలితో ఇప్పుడు ఏమి చేద్దామనుకుంటున్నావు?’ అన్నాను. అతను ‘ఈరోజు వాన పడబోతోంది’ అన్నాడు. ‘ఏమిటీ, ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు, వాన ఎలా పడుతుంది?’ అన్నాను. ‘లేదు సామీ ఈరోజు వానపడుతుంది’ అన్నాడు. మరి అతను వానపడుతుంది అన్నప్పుడు వానపడుతుంది. మరి అతనికి ఆవిషయం ఎలా తెలుసు? అదేదో మానవాతీత విషయం కాదు, కేవలం గాలి ఎలా వీస్తోంది, ఉష్ణోగ్రత ఎలా మారుతోంది, చుట్టూ జరుగుతున్నదాని పరిశీలించగలగడం అంతే. మరి అతను ఆరోజు వానపడుతుంది అంటే వానపడుతుంది. మీరెంత సున్నితంగా ఉంటే మీకు జీవితం అంతగా తెలుస్తుంది. మరి అటువంటప్పుడు మనం మన చుట్టూ ఉండేవాటి పట్ల సున్నితంగా ఉండేందుకు చేయవలసిందేదో  మరింత మెరుగ్గా  చేయవద్దా? మనం సున్నితంగా లేకపోతే మనకేమీ తెలియదు. మనకు అనుభూతి, స్పర్శ ఉన్నవి కాబట్టే ఒక చిన్నదోమ కుట్టినా తెలుస్తుంది, కుక్క కరచినా తెలుస్తుంది. ఒకవేళ మీరు తోలు మందంగా ఎలాంటి సున్నితత్వం లేకుండా ఉనట్లయితే, దోమ కుట్టినా తెలియదు, కుక్క కరచినా తెలియదు అవునా? కావలసినదల్లా, కేవలం అక్కడ ఉన్నదాని పట్ల  పరిశీలన,అక్కడ ఏముందో అవగతం చేసుకోవడం . మీరు మీ చుట్టూ ఉండేవాటి మీద మరింత పరిశీలనా దృష్టి కలిగి ఉంటే మీరు మరింత సున్నితులు అవుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1