ప్రశ్న : సద్గురూ! నేను ‘సాధన’ చేసేటప్పుడు, మగతగా నిద్రమైకంతో ఉంటాను. నేను ఇది అలసట వల్లనేమో అనుకున్నాను, కాని నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా కూడా నిద్రపోతాను. నేను ధ్యానం చేసేటప్పుడు మెలకువగా ఎలా ఉండగలను ?

మొదట మనం నిద్ర అనేది ఏమిటో అర్థం చేసుకుందాం. మీ రోజువారీ జీవితంలో, పగటిపూట   ఏ సమయంలోనైన మీకు నిద్ర వస్తూ, మిమల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, మొదట మీ ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవాలి. మీ వ్యవస్థలో ఏదైనా లోపం ఉందేమో తెలుసు కోవాలి. శారీరికంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు, మీరు మామూలు కంటే ఎక్కువ నిద్ర పోయే అవకాశం ఉంది – శరీరం విశ్రాంతి కోరుకుంటుంది.

రెండవ విషయం మీరు తినే ఆహారం. ఆరోగ్యం కోసం కొంచెం శాకాహార పదార్థాలు, ముఖ్యంగా వండనివి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆహారం వండినప్పుడు, అందులోని ‘ప్రాణశక్తి’ చాలా వరకు నాశనం అవుతుంది. మీకు నిద్రమత్తు కలగడానికి ఇదొక  కారణం. మీరు కొంత వండని ఆహారం తింటే, ఎన్నో  లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా, వెంటనే జరిగే ఒక విషయం ఏమిటంటే మీ నిద్రావసరాలు బాగా తగ్గుతాయి.

మీరు ధ్యానం చెయ్యాలనుకుంటే, మీ అప్రమత్తత కేవలం మీ మెదడు నుంచే కాదు, మీ ప్రాణ శక్తి నుంచీ రావాలి.

మీ చురుకుదనానికి, మీ శక్తి వ్యవస్థకు సంబంధం ఉంది. మీ శక్తి వ్యవస్థని మీరు ఎంత జాగ్రత్తగా నియంత్రిస్తే, మీలో చురుకుదనం అంత మెరుగ్గా ఉంటుంది. మీరు ధ్యానం చెయ్యాలనుకుంటే, మీ అప్రమత్తత కేవలం మీ మెదడు నుంచే కాదు, మీ ప్రాణ శక్తి నుంచీ రావాలి. దీనికి తోడ్పడేందుకు, సాధారణంగా, యోగ మార్గంలో ఉన్న వారికి, మీరు కేవలం ఇరవై నాలుగు ముద్దలు తినాలని, ప్రతి ముద్దను కనీసం ఇరవై నాలుగు సార్లు నమలాలని చెప్తారు. అప్పుడు మీ ఆహారం ఇంకా మీ జీర్ణ కోశంలోకి వెళ్లకముందే, మీ నోటిలోనే చాలా వరకు జీర్ణమయ్యి, మీలో మాంద్యాన్ని కలిగించకుండా ఉంటుంది.

సాయంత్రం మీరు ఈ విధంగా భోజనం చేసి, రాత్రి నిద్రపోతే, మీరు తేలికగా ఉదయం మూడున్నరకే నిద్ర మేలుకో గలుగుతారు, ధ్యానం చెయ్యగలుగుతారు.

యోగ శాస్త్రంలో ఈ సమయాన్ని ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. ఇది నిద్ర లేచేందుకు సరైన సమయం, ఎందుకంటే ఆ సమయంలో మీ ‘సాధన’ కు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది. దాని నుండి మీకు అదనపు సహాయం ఉంటుంది. మీరు తలస్నానం చేసి మీ తలను తడిగానే ఉండనిచ్చి, సాధన చేసుకుంటే, మీకు, ఎనిమిదింటి దాకా అంటే సుమారు మీ సాధన ముగిసేంత వరకూ మీరు చురుకుగానే ఉంటారు. మీరు పొద్దున్న భోజనం చేసేటప్పుడు కూడా కేవలం ఇరవై నాలుగు ముద్దలను తింటే, మీకు రాత్రిభోజన సమయం వరకూ ఎటువంటి మగతా ఉండదు. గంటన్నర లేక రెండు గంటల తరువాత మీకు ఆకలిగా అనిపిస్తుంది, అది మంచిదే. కేవలం కడుపు ఖాళీగా ఉన్నది కదా అని, మీరు ఆహారం తేసుకో అఖర్లేదు. కేవలం మంచినీళ్ళు తాగండి, మీరు రోజంతా చురుకుగా, శక్తిమంతంగా ఉంటారు. ఇది మీ శరీర  వ్యవస్థకూ మంచిది,  మీరు తిన్న ఆహారాన్ని వృధా చెయ్యకుండా, మీరు తిన్న ఆహారాన్ని బాగా ఉపయోగించడం నేర్చుకుంటుంది. ఆర్థికంగా, పర్యావరణపరంగా కూడా ఇది ప్రపంచానికి, మీ ఆరోగ్యానికి మంచిది – మీరు ఈ విధంగా తింటే మీకు అనారోగ్యం కూడా కలగదు.

 ప్రేమాశిస్సులతో,
సద్గురు