జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? నిశ్చయించుకోలేక పోతున్నారా? ఏ మార్గంలోనైనా సరే.. పూర్తి నిమగ్నతతో ఉంటే చాలని సద్గురు అంటున్నారు.

ప్రశ్న:  నేనెన్నోసార్లు ఏవో విషయాలను ఎంపిక చేసుకుంటాను, మళ్ళి వదిలివేస్తుంటాను. ఉదాహరణకు నాకు కొన్నిసార్లు సంగీతం నేర్చుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు చదువుకోవాలనిపిస్తుంది. నాకు ఏది సరైందో నిర్ణయించుకోవడం ఎలా?

సద్గురు : మీరు గొప్ప సంగీత విద్వాంసులు కావాలనుకుని, కాలేకపోతే, కనీసం ఒక సంగీత విద్వాంసుడి ఇల్లు ఊడవవచ్చు కదా, ఒక సంగీతపు దుకాణంలో పనిచేయవచ్చు కదా! కనీసం మీరు ఒక సంగీత వాద్యపరికరాన్నన్నా శుభ్రంగా తుడుస్తారు. ఎంపిక అలా ఉండాలి. ఒకవేళ సంగీతాన్నో,చదువునో ఎంచుకోవడానికి మీ అంతః భావాలూ కారణాలు కాక సామాజిక కారణాలున్నాయనుకోండి - అంటే ఏది మీకు అధిక సాఫల్యాన్నిస్తుందో అది అని  - అప్పుడు అక్కడ మీకు ఎంపిక ఉండదు.

మీరెక్కడ చిక్కుకోవాలో అన్నది ప్రశ్న కాదు, మీరెక్కడ నిమగ్నులు కావాలన్నది ముఖ్యం. ఎక్కడో మీకు తెలియకపోతే మీరిప్పుడేం చేస్తున్నారో దాంట్లో 100% మునిగిపోండి.

మీరు ఏమి ఎంపిక చేసుకోవాలో మీకు అర్ధం  కాకపోతే.. మీరిప్పుడు ఏం చేస్తున్నారో దానిపైనే మీ హృదయాన్నీ, మనస్సునూ లగ్నం చేయండి. మీరు సంగీతపు దుకాణాన్ని శుభ్రం చేయడంలో మనసుపెట్టి పనిచేశారనుకోండి, మీ అంతర్గత స్వభావం ప్రకారం మీరు పుష్పిస్తారు, మీరేం చేయాలో దాన్ని కనుక్కోగలుగుతారు. మీరిప్పుడు చేస్తున్న పనిలో ఎటువంటి చిక్కులూ లేకుండా నూటికి నూరు శాతం మగ్నులైపొండి. ప్రజలు ఎప్పుడూ ‘‘నేనెక్కడ చిక్కుకుంటానా’’ అని ఆలోచిస్తూంటారు. మీరెక్కడ చిక్కుకోవాలో అన్నది ప్రశ్న కాదు, మీరెక్కడ నిమగ్నులు కావాలన్నది ముఖ్యం. ఎక్కడో మీకు తెలియకపోతే మీరిప్పుడేం చేస్తున్నారో దాంట్లో 100% మునిగిపోండి.

చాలా మంది  తినడం కాని, శ్వాసించడం కాని, మేల్కోవడం కాని, నిద్రపోవడం కాని ఏదీ నిమగ్నతతో చేయడంలేదు. అందువల్లే ఏం చేయాలో వారికి తోచడం లేదు. వాళ్లేం చేసినా అది అసంతృప్తిగానే ఉంటుంది - అది వాళ్లు చేయవలసిన పనిగా కనిపించదు. మీరు చేసే ఏ పని అయినా నిమగ్నతతో, ఆసక్తితో చేయండి. అప్పుడు జీవితమే దానికి ఏమి కావాలో అది ఎంపిక చేసుకుంటుంది. అదెప్పుడూ తప్పు అవ్వదు...!

ప్రేమాశిస్సులతో,
సద్గురు