మన జీవితంలోని చివరి దశలో ఎలా జీవించాలి?

 

ఈ భూమి మీద మన జీవిత చివరి దశ  కోసం మనం ఎలా సంసిద్ధం కావాలో ఇంకా ఆ దశలో జీవితాన్ని మనం ఎలా గడపాలన్న ప్రశ్నకు సద్గురు సమాధానం చెప్తున్నారు.

ప్రశ్న: సద్గురు, ఈ భూమి మీద తన జీవితంలోని ఆఖరి అంకం కోసం ప్రతివ్యక్తీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా, నైతికంగా ఎలా సిద్ధం కావాలి?

సద్గురు : అది చివరి దశ కాబట్టి, ఇంక మెల్లగా నడవకండి. మీ శక్తినంతా వినియోగించండి. మొదటి అడుగా, చివరి అడుగా అన్న భేదం చూపించకండి. ఒక వేళ మొదట్లో మీరటువంటి భేదం చూపించినా, ఇప్పుడు అలంటి భేదం చూపించకుండా ఉండడం నేర్చుకోండి. మరో వంద అడుగులు వేయాలా, ఒక్కటే అడుగు వేయాలా అని పట్టించుకోకండి - తేడా చూపించకుండా ఎప్పుడూ ఒకేలా సాగండి. ‘‘కనీసం చనిపోయే ముందయినా దేవుణ్ణి తలచుకోవాలి ’’ అంటుంటారు చాలా మంది. జీవితమంతా గుడ్డిగా గడిపి చివరి క్షణంలో ‘రామ, రామ’ అనుకుంటే సరిపోతుందా? అదేమీ అలా పనిచేయదు.

మీరు బిజూ పట్నాయక్ గురించి విన్నారా? ఆయన ఒడిశా ముఖ్యమంత్రిగా చేశాడు. రాజకీయ క్షేత్రంలో ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన తన జీవితం తన పద్ధతిలో జీవించాడు. ఆయన మరణశయ్య మీద ఉన్నప్పుడు ఎవరో భగవద్గీత తెచ్చి ఆయనకు చదివి వినిపించబోయారు. ఆయన, ‘‘అదంతా ఆపండి, నేను నా జీవితాన్ని సరిగ్గానే జీవించాను’’ అని అన్నాడు.

ఎప్పుడూ ఎందులోనో మునిగిపోయి ఉండడం

ఇప్పుడు  చివరి దశలో మీరేం చేయాలి అన్నది మీ ప్రశ్న. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ‘బాలస్తావత్ క్రీడా సక్తః’ - మీరు బాల్యంలో ఉన్నప్పుడు, మీ ధ్యాస అంతా ఎప్పుడూ ఆటలమీదే. మీరు యువకులుగా ఉనప్పుడు ఆ క్రీడాసక్తత మీకు అర్థరహితంగా తోస్తుంది. మీరు మరింత అర్థవంతంగా, గంభీరంగా, ప్రయోజనకరంగా ఉన్నట్లనిపిస్తుంది. అప్పుడేం జరుగుతుంది? మీ వివేకం కంటే మీ హార్మోన్లు మీ మీద ఎక్కువగా పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు దేన్నీ స్పష్టంగా చూడలేరు. అకస్మాత్తుగా మీరో స్త్రీనో, పురుషుణ్ణో చూసినప్పుడు ఏవేవో జరిగిపోతాయి. తర్వాత వయసు మీరుతుంది. వృద్ధులు ఊరికే దిగులుపడుతుంటారు. పిల్లలు  ఆటల్లో పూర్తిగా నిమగ్నులై ఉంటారు; వాళ్లతో మోక్షం గురించి మాట్లాడలేం కదా! యవ్వనాన్ని హార్మోన్లు పూర్తిగా వశం చేసేసుకుంటాయి. ఆ యువకుడితోనో, యువతితోనో ఈ విషయం మాట్లాడలేం కదా! వృద్ధులు స్వర్గంలో తమ హోదా ఏమిటోనని దిగులు పడుతుంటారు. వాళ్లతోనూ ఈ విషయం మాట్లాడలేం కదా! మరి మనం మాట్లాడడానికి ఎవరున్నారు? పిల్లలు కాదు, యువకుడు కాదు, వృద్ధుడు కాదు - కేవలం జీవితమే తానైన వ్యక్తి - అతనితో మాత్రమే మీరు మాట్లాడగలరు.

 గుర్తింపులకు అతీతమైన జీవం

అందువల్ల అది మీ తొలి అడుగా, చివరి అడుగా అన్నది మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ కేవలం ఓ జీవంలాగా ఉండండి. ఇదే అత్యుత్తమమైన పద్ధతి. మీరు యువకులూ కారు; వృద్ధులూ కారు. మీ శరీరాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకోవాలో భూమి నిర్ణయిస్తుంది. మీ దేహం కేవలం ఓ ఎరువు లాంటిది – ఈ  ఎరువు పక్వానికి వచ్చినప్పుడు భూమే మిమల్ని తీసేసుకుంటుంది - చెట్లు ఎరువు కోసం ఎదురు చూస్తుంటాయి! దాన్ని గురించి దిగులు చెందకండి. మీరు కేవలం ఓ జీవం, అంతే..! జీవానికి యవ్వనమూ ఉండదు, వార్ధక్యమూ ఉండదు. ఇది ఇప్పుడున్న స్థితి నుంచి మరేదో పెద్దదానిగా పరిణామం చెందాలి.

మీరిక్కడ కేవలం ఓ జీవంగా - మిమల్ని మీరు దేనితోను గుర్తించుకోకుండా ఉన్నట్లయితే, జీవితంలోని అన్ని కోణాలూ మీకు అనుభవంలోకి వస్తాయి. మీరిక్కడ పురుషుడిగా ఉంటే మీ జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయి. స్త్రీగా ఉంటే మీ జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయి. శిశువుగా ఉంటే మరొకటేదో జరుగుతుంది. డాక్టరో, ఇంజినీరో, చిత్రకారుడో, అదో, ఇదో లాంటి గుర్తింపులతో మీరు ఉంటే, మీ జీవితంలో భిన్నభిన్నమైన విషయాలు జరుగుతాయి. కానీ మీరు మిమల్ని దేనితోను గుర్తించుకోకుండా కేవలం ఒక జీవంగా ఇక్కడ కూర్చుని ఉంటే, జీవితానికి జరగవలసినవన్నీ మీకు జరుగుతాయి.

మీ వయసు రెండు రోజులే కావచ్చు, లేదా మీకు ఈ భూమి మీద ఇంకా రెండు రోజులే మిగిలి ఉండవచ్చు. మీరు ఇక్కడ కేవలం ఓ జీవంగా ఉంటే చాలు. మిమల్ని మీరు భూమితోనో, స్వర్గంతోనో గుర్తించుకోకండి. కేవలం ఇక్కడ ఉండండి. అప్పుడు మనకింకా ఒక్కరోజు జీవితమే మిగిలి ఉన్నా, మరో నూరేళ్లున్నా మీకు తేడా ఏముంటుంది? మీలో ఇటువంటి తేడాలేనప్పుడు ఈ జీవితంలో జరగవలసినవన్నీ ఎట్లాగూ జరుగుతాయి. ఇలా ఉండడమే మిమల్ని మీరు సంసిద్ధులుగా మలచుకోవడమంటే...!

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1