ఒక మనిషిగా, మీరు ఈ గ్రహానికి ఒక చిన్న అణువంత పొడిగింపు మాత్రమే! ప్రత్యేక పొడిగింపు కూడా కాదు.  మీరు శ్వాసించాలి, తినాలి, తాగాలి - మీరు నిరంతరం మిగిలిన జగత్తుతో అనుసంధానమై ఉండాలి. ఈ  లావీదేవీలు లేకుండా మీరు ఒక్క క్షణం కూడా బతకలేరు. మీరొక చిన్న నీటి బుడగ లాంటివారు, ఏదో ఒక రోజు ఆ బుడగ పేలిపోతుంది. శరీరానికి ఆ విషయం తెలుసు. కానీ బుద్ధి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడదు. అది ఈ వాస్తవాన్ని మీ నుంచి దాచిపెట్టి, మీకొక ఊహాత్మకమైన అబద్ధపు గుర్తింపునిస్తుంది.

లేనిది ఉన్నట్టుగా కనిపించే ఈ ప్రపంచాన్నే, మన సంప్రదాయం ‘మాయ’ అంటుంది, అదే భ్రాంతి. బుద్ధి నడిపిన విధంగా మీరు నడిస్తే, విభజించడమే చేస్తారు. చైతన్యపు సహజ స్వభావం కలుపుకోవడం. చైతన్యం అంటే విశ్వం తాలూకు ఒక పెద్ద ఆలింగనం. సాధికారత పొందిన బుద్ధికి ఆ అనుభవం కలగకపోతే, ఆ బుద్ధి ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. ఒక సామెత ఉంది, ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని. బుద్ధి కనుక విపరీతమైతే అది వినాశనానికి దారితీస్తుందని అర్ధం.

ఇది మనో వ్యవస్థ యొక్క లోతైన అంశం. జ్ఞాపకశక్తి వల్ల మలినం కాని మేధస్సు. 
మానవ కుటుంబాన్నే ఉదాహరణగా తీసుకోండి. ఒకప్పుడు వందమందికి పైగా జనం ఒక కుటుంబంగా కలిసి జీవించేవారు. కాలక్రమేణా ఆ సంఖ్య నలుగురికి తగ్గింది. ఇప్పుడు జీవిత భాగస్వాములు కూడా విడి విడిగా జీవించే స్థితి ఏర్పడింది! స్వతస్సిద్ధంగా ఇందులో తప్పుగాని ఒప్పుగాని ఏమీ లేదు. ఇది కేవలం ఆధునిక జీవన శైలిలో బుద్ధికి పెరుగుతున్న ప్రాధాన్యతని సూచిస్తుంది.

ఇది ఖచ్చితంగా  విభజనకి దారితీస్తుంది. ఇలాగే ఇంకా ముందుకి వెళ్లారంటే మీరు మనోవైకల్యానికి గురవుతారు, ఎందుకంటే మీ బుద్ధి మిమ్మల్ని కూడా భిన్నమైన భాగాలుగా విడగొడుతుంది. ఈనాటి ప్రపంచంలో ఐక్యత కోసం, బుద్ధిపూర్వకంగా అన్నిటినీ దగ్గరకు చేర్చాలని ఎంతో కృషి జరుగుతోంది. కానీ ప్రపంచాన్ని కత్తితో(సూదితో కాదు) దగ్గరగా కలిపి కుట్టాలని ప్రయత్నిస్తే, చివరికది అన్నిటినీ పీలికలు చేసి వదులుతుంది. అందువల్ల, ఇవాళ్టి ప్రపంచంలో లోపించిన కీలకమైన దినుసు ఏమిటంటే, యోగాలో ప్రస్తావించబడ్డ ‘చిత్తం’ . ఇది మనో వ్యవస్థ యొక్క లోతైన అంశం. జ్ఞాపకశక్తి వల్ల మలినం కాని మేధస్సు.

ఏదైతే మిమ్మల్ని సృష్టి యొక్క మూలానికి అనుసంధానిస్తుందో అది. చిత్తం అంటే ఎరుక. ఎరుక అంటే అప్రమత్తత కాదు; సజీవత; బుద్ధికీ, జ్ఞాపకశక్తికీ, విచక్షణకీ, కర్మకీ, సమస్తమైన విభజనలకీ ఆవల ఉన్న లోతైన మేధస్సు. ఆ మేధస్సు అస్తిత్వానిదే, సజీవమైన మస్తిష్కంలో విశ్వమే ఉన్నది. యోగ సాంప్రదాయంలో ఇలా చెప్పబడింది - మీ  వారసత్వపరమైన, కర్మ సంబంధిత ( karmic software) నిర్బంధాల నుంచి, మీ బుద్ధి తాలూకు స్వార్ధ ప్రయోజనాల నుంచి, గుర్తింపుల నుంచి, ఒక్కసారి మిమ్మల్ని మీరు దూరం చేసుకోగలిగారంటే, చిత్తంతో మీరు కలిసి ఉన్నట్టే. నిర్మలమైన చైతన్యంతో  మీరు కలిసి ఉన్నట్టే. ఇప్పుడు మీ జీవితం సహజంగా ఎలా ఉండాల్సి ఉందో అలాంటి స్థితికి వస్తుంది. తాజాగా, సజీవమై ప్రకాశించే స్థితికి, లోపరహితమైన స్థితికి, చిత్తం తిరిగి చేరుకుంటుంది. అప్పుడిక దైవానికి కూడా మిమ్మల్ని సేవించక తప్పని పరిస్థితి అది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు