బ్రహ్మతో మొదలైన ఛాందసవాదం

శివతత్త్వాన్ని తెలుసుకునేందుకు అనేక పురాణ కధలు ఉన్నాయి. ఎందుకంటే, అనంతమైన సృష్టి రహస్యాలని ఒక రుపకంతో ఎలా వర్ణించగలం? ఛాందసం వల్ల కలిగే ప్రమాదాలను తెలియజేసే కధ ఒకటి ఉంది.
 

అంతరిక్ష స్థూపం

ఒకనాడు సృష్టికర్త బ్రహ్మా, స్థితి కారకుడు విష్ణుమూర్తీ ఒక జ్వలిస్తున్న స్థూపాన్ని చూశారు. వాళ్లకి దాని మొదలూ తుదీ కనపడలేదు. బ్రహ్మాండమైన తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ స్థూపం నుంచి ఓం కారం వినవస్తోంది. వారికి కుతూహలం కలిగింది. అదేమిటో పరిశోధించాలని నిర్ణయించుకున్నారు. ఆ స్థూపపు ఆదీ, అంతమూ కనుక్కోవాలని బయలుదేరారు. హంస రూపం ధరించి నీలాకాశంలో ఎత్తుగా ఎగిరి ఆ స్తంభం అగ్రభాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు బ్రహ్మ. వరాహ రూపంలో భూమిని లోతుగా తవ్వుకుంటూ మారుమూల చీకటి బొరియల్ని వెతుక్కుంటూ వెళ్లాడు మహా విష్ణువు. ఇద్దరి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఎందుకంటే ఆ విశ్వస్థూపం ఎవరో కాదు, దేదీప్యమానంగా వెలుగొందుతూ, తన సహజ సనాతన స్థితిలో ఉన్న శివుడే. కొలతలకందని దాన్ని కొలవాలని ప్రయత్నించడం, అణిచిపెట్టడానికి సాధ్యపడని ఆధిపత్య ధోరణిగల మానవబుద్ధికి మాత్రమే  సాధ్యం. విష్ణువు వెనక్కిరాగానే తన వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు. అయితే తన ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేని బ్రహ్మ తాను ఆ స్తంభపు అగ్రభాగానికి వెళ్లి చూశానని చెప్పి, అందుకు ఋజువుగా ఒక తెల్లని పుష్పాన్ని చూపించాడు. తానా పుష్పాన్ని విశ్వపు పైకప్పు మీద చూశానని నమ్మబలికాడు. ఆ తెల్లని పుష్పం కేతకి కూడా, బ్రహ్మకి వత్తాసుపలికింది.

బ్రహ్మ చెప్పిన అబద్ధం

ఆ అబద్ధం బ్రహ్మకి చాలా ఖరీదైనదిగా పరిణమించింది. బ్రహ్మ అలా పలికాడో లేదో, శివుడక్కడ అదియోగిగా ప్రత్యక్షమయ్యాడు. దేవతలిద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు.

సంవత్సరంలో కేవలం శివరాత్రి నాడే, లోతైన ఆధ్యాత్మికతకి అవకాశముండే ఆ గాఢమైన చీకటి వేళ మాత్రమే తెల్లని కేతకి పుష్పాలని పూజలో ఉపయోగిస్తారు.
అబద్ధం చెప్పినందుకుగాను ఆ క్షణం నుంచి బ్రహ్మ తన పూజార్హతను కోల్పోతాడని శివుడు ప్రకటించాడు. ఇలా మభ్యపెట్టే కార్యంలో పాలుపంచుకున్నందుకు కేతకి పుష్పం ఇక అనుగ్రహ పాత్రం కానిదైయ్యింది. ఆదియోగి ఈ పుష్పం తన పూజకు పనికిరాదని తిరస్కరించాడు. అయితే, శివరాత్రి నాటి పూజలో మాత్రం ఈ పూవుని వాడవచ్చని  ఒక మినహాయింపు ఇచ్చాడు శివుడు. సంవత్సరంలో కేవలం శివరాత్రి నాడే, లోతైన ఆధ్యాత్మికతకి అవకాశముండే ఆ గాఢమైన చీకటి వేళ మాత్రమే తెల్లని కేతకి పుష్పాలని పూజలో ఉపయోగిస్తారు. బ్రహ్మ చెప్పిన అసత్యం, భూగ్రహం మీద మత ఛాందసవాదపు మొదటి చర్యగా ముద్రపడింది. ఒక మతవాది అనాలోచిత చర్యకు పరోక్షంగా మద్దతునిచ్చిన కేతకి పుష్పం కూడా శిక్షకు గురయ్యింది. అనంత ప్రక్రియకి పరిమిత ముగింపుని ప్రస్తావించడం, అమితమైనదాన్ని ఒక పరిమితిలోకి కుదించడం, సరిహద్దులులేని దానికి హద్దులేర్పాటు చేయడం, అగాధాన్ని కొలవాలని ప్రయత్నించడం - ఏదీ నిశ్చితం కాని చోట  నిశ్చయత్వాన్ని సృష్టించే మానవ నైజానికి ఆరంభం ఇది. ఇది వేదన, యాతన, మాయకు పుట్టుక.

అనంతమైన అనిశ్చయత్వం

ఆధ్యాత్మిక యాత్రనేది స్పష్టతవైపు చేసే ప్రయాణమే గాని నిశ్చయత్వం వైపు చేసేది ఎంతమాత్రమూ కాదు. ఆద్యంతాల గురించి మీరు నిర్ధారించేటట్టైయితే, మీరొక విశ్వాసి అవుతారు. నిజంగా మీకేమీ తెలియదని ఒప్పుకున్నపుడు మీరు అన్వేషి అవుతారు. జ్ఞానిగా మారడమంటే అదొక నిశ్చిత స్థితి కాదు. అది పరిమిత జ్ఞానం నుంచి అపరిమితమైన తెలియనితనం వైపు ప్రయాణించడం. అంతులేని అజ్ఞానం, మితిలేని అనిశ్చితి గల స్థితికి చేరడం. సృష్టి తాలూకు పరిమితులకి లోబడని స్థితిలో మీరున్నపుడే  సృష్టికర్త తాలూకు స్వేచ్ఛ మీకు లభ్యమౌతుంది. కైలాస పర్వతం శివుని అనంతత్వానికి ఓ అసమానమైన ప్రతీక.

ప్రపంచంలోకెల్లా అద్భుతమైన మార్మిక భాండాగారం ఇది – జడ స్థితిలో ఉన్నది కాదు, మనవ చైతన్యానికి ఓ సజీవమైన పరిశోధనా శాల. శివుడు ఇక్కడ నివసిస్తాడా అని ప్రజలు తరచూ అడుగుతుంటారు. “అవును” అన్నదే అందుకు సమాధానం. ఈ జ్ఞానమ్మే శివుడు కదా..! ఆయన ఇక్కడ సజీవంగా ఉన్నారు – భౌతిక స్వరూపంలో కాదు, అఖండమైన శక్తి స్వరూపంగా. ఏ జ్ఞానం అయితే 100 శాతం సజీవమైనదో, అనుభవ పూర్వకమైనదో అది 100 శాతం ఇప్పుడు ఇక్కడే ఉంది – అదే శివుడు. ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఈయనను మనం ఒక గ్రంధంగానో, ఓ జాతి గానో, ఓ సిద్ధాంతంగానో లేక ఒక నమ్మక వ్యవస్థగానో వర్ణించలేకపోయము. ఈయనను మనం స్వాధీనం చేసుకోలేము. ఆయనలో లయం అవ్వగలం కానీ ఆయనను గ్రహించలేము. నమ్మకమనే మాయ నుండి తెలియదనే స్పష్టత వైపుకు, అర్భాటాల నుంచి వ్యక్తిత్వ ప్రాముఖ్యత కోల్పోవడం – ఇదే ముక్తికి మార్గం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1