భూమిని పరిరక్షించాలా?

 

ఈ భూమిపై ఏ విషయమైనా చక్కదిద్దడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వనరులు, సామర్థ్యం అన్నీ ప్రస్తుతం మనకు ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ మనుషులు ఇంత సామర్థ్యంతో లేరు. కాని ప్రస్తుతం కేవలం ఒకే ఒక విషయం కొరవడింది, అది కలుపుగోలు తత్వం.

మనం ఇప్పుడు ఎలాంటి సమయంలో జీవనం సాగిస్తున్నామంటే, ఇంతకాలం మనల్ని పోషించిన వాటిని మనం ఈరోజు పరిరక్షించుకోవడం గురించి ఆలోచించవలసి వస్తుంది . మానవ మనుగడలో మొట్టమొదటిసారిగా భూమిని సంరక్షించుకోవటం గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ, ఎవరికీ భూమిని రక్షించుకోవలసి రావడం లాంటి వెర్రి ఆలోచనలు రాలేదు. ఇన్నాళ్ళూ ఈ భూమే మనల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంది.

ఆర్ధికపరమైన ఆదుర్దాలెలా ఉన్నా, పర్యావరణ సంబంధిత విషయాలు మన ఆర్థిక అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగాలుగా పరిగణించాలి. 

ఈ భూమిని పరిరక్షించచడం, పోషించడం అనేవి మనం బాగా జీవించడం కోసమే, ఎందుకంటే భూమి సరిగ్గా లేకపోతే మనకు సరైన జీవనం ఉండదు. ప్రస్తుతం పర్యావరణ సంబంధితమైన వ్యవహారాలు మనం ఏదో విధిగా చేయవలసిన బాధ్యతలుగా పరిగణిస్తున్నాం. ఇది కేవలం విధిగా చేయవలసిన పనికాదు. ఇదే మన జీవినం, మనం పీల్చుకోనే, వదిలే ప్రతి ఊపిరి ఇదే.

ఈ విషయం అనుభూతి పొంది, అనుభవంలోకి తెచ్చుకోకపోతే తప్ప, మనుషులు ఈ విషయంలో నిజంగా ఏదో చేయగలరని నాకు నమ్మకం కలగటం లేదు. ఈ నేలను ప్రజలు సరిగ్గా పట్టించుకోకపోతే, మొత్తం దేశాన్ని వారు నాశనం చేస్తారు. ఆర్ధికపరమైన ఆదుర్దాలెలా ఉన్నా, పర్యావరణ సంబంధిత విషయాలు మన ఆర్థిక అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగాలుగా పరిగణించాలి. వాటికి మనం చాలా చేయవలసి ఉంది, లేకపోతే మనం చాలా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది ఎలాంటి విషయం అంటే రాజనీతిజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఎప్పుడూ దీనికి స్పృహతో స్పందించి, కృషి జరపాలి.
ఈ భూమిపై ముఖ్యమైన కొద్దిమందిలో ఏ కొంచెం మార్పు చేయగలిగినా, అలాగే వాటిపై అవసరమైన దృష్టి పెట్టి సరైన రీతిలో వనరులను వెచ్చించినా, ఈ భూమాత తనను తాను సరిచేసుకుంటుందని నేను అనుకుంటున్నాను.

మనం ఒక్క అవకాశం ఆమెకు ఇస్తే, ఆమె తిరిగి సంపూర్ణమైన సంవృద్ధి, సౌందర్యాలను ఖచ్చితంగా పొందగలదు. మనం ఏ గొప్ప పనులు చేయనక్కరలేదు. మనం భూమిని సరిచేయనక్కరలేదు. మనం వీలైనంతవరకు ఆమె జోలికి పోకుండా, కేవలం మనం చేస్తున్న నష్టాన్ని తగ్గిస్తే, మిగతాది అంతా దానంతట అదే జరుగుతుంది.

ఈ రోజు శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఈ భూమిపై అన్ని క్రిమికీటకాలు అంతరించి పోతే, ఈ భూమిపై జీవం 25 సంవత్సరాలు మించి ఉండలేదు. జీవరాశి మొత్తం, మనతో సహా, 25 సంవత్సరాల గడువులో అంతమొందుతుంది. కీటకాలు కనుక వెళ్ళిపోతే, ఒక్క జీవి కూడా మిగలదు. సమస్త జీవులు చనిపోతాయి. కానీ మనుషులు 25 సంవత్సరాలు కనిపించకుండా పోతే, ఈగడువు లో భూమి తిరిగి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మనం చెస్తున్న వాటి నుండి వచ్చేవి అన్నీ సహజంగా ప్రకృతిలో నశించేవి కాక పోయినా, మనం సహజంగా ప్రకృతిలో నశించేవారమే కదా.

మనం చేయలేని పని చేయకపోతే ఫరవాలేదు. కానీ మనం చేయగలిగినది కూడా చేయకుండా ఉంటే, మనమే ఒక విపత్తు.

ఎవరైనా వారి అంతరంగంలోకి చూసుకుంటే, సహజంగానే అతని ఉనికికీ, బయట ఉండే వాటి ఉనికికీ తేడా లేదని వారు గుర్తించగలరు. అన్నింటినీ కలుపుకోగలిగిన అనుభవం ఎప్పుడు వస్తుందో, మీ చుట్టూ ఉన్న అన్నింటి గురించీ బాధ్యత వహించడం, జాగ్రత్తపడడం అనేది మీకు చాలా సహజమైపోతుంది. మన తరం ఒక విపత్తుగా మారకూడదని నా ఆకాంక్ష. మనం చేయలేని పని చేయకపోతే ఫరవాలేదు. కానీ మనం చేయగలిగినది కూడా చేయకుండా ఉంటే, మనమే ఒక విపత్తు.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1