సంసార జీవనంలో ఉన్న ఒక వ్యక్తి తన మీద ఎంతో మంది ఆధారపడి ఉండటం వల్ల  ఎన్నో బంధనాలలో చిక్కుకొని ఉంటాడు. అలాంటప్పుడు, అతను ఆ బంధనాల నుండి ఎలా విముక్తుడవుతాడు ? ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం ఏమిటో ఈ ఆర్టికల్  చదివి తెలుసుకోండి!


బహుశా, మీరు మీ శరీరాన్ని బంధనాల నుండీ విడిపించలేరేమో, కానీ మీ మనసును మాత్రం ఖచ్చితంగా బంధనాల నుండి విడిపించగలరు. అది, మీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం, బహుశా మీరు సన్యాసాన్ని తీసుకొని ఒక ఆశ్రమంలో జీవించలేరేమో – మీ భర్త, భార్య లేదా మీ పిల్లలు మిమ్మల్ని అలా చేయనీయకపోవచ్చు. కానీ మీరు మానసికంగా స్వేచ్ఛగా ఉండేందుకు మిమ్మల్ని ఎవరైనా ఆపగలరా ? లేదు, ఆపలేరు. ఈ బంధనాలు మీ వల్ల ఏర్పడ్డవే, మరెవరివల్లనో కాదు.

స్వేచ్ఛఅంటే అర్థం మీ పరిస్థితులన్నిటిని మీరు మార్చుకోవడం అని కాదు. స్వేచ్ఛగా ఉండడం కోసం మన జీవితాన్నో, మన పరిస్థితులనో పూర్తిగా తలకిందులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక పరిస్థితి మరొక పరిస్థితి కంటే మెరుగైనదేం కాదు; అలాంటి భ్రమపడవద్దు. అదొక ఎంపిక మాత్రమే. కొందరు ఒక రకమైన పరిస్థితులలో జీవించాలనుకుంటే, మరికొందరు మరొక రకమైన పరిస్థితులలో జీవించాలనుకుంటారు; ప్రతీదానికీ దానికి తగ్గ లాభ నష్టాలు ఉంటాయి. మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్న  మీరు మీ అంతరంగంలో ఎలా ఉన్నారన్నదే ముఖ్యమైన విషయం.  మీ బాహ్య పరిస్థితులని మీరు వెంటనే మార్చుకోవడానికి సాధ్యపడకపోవచ్చు. బహుశా దానివల్ల ఎలాంటి ఇబ్బందీ లేదేమో. దాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదేమో. కానీ, మీరు మీ అంతరంగ పరిస్థితిని మార్చాలి. ఎందుకంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.

ఈ మనసు దివ్యత్వానికి నిచ్చెన కాగలదు – అది మిమ్మల్ని పరవశుల్ని చేయగలదు.

ఈ మనసు దివ్యత్వానికి నిచ్చెన కాగలదు – అది మిమ్మల్ని పరవశుల్ని చేయగలదు. ఎన్నోసార్లు ఈ మనసు మిమ్మల్ని సంతోషపెట్టింది. అలాగే ఇదే మనస్సు మిమ్మల్ని బాధ పెట్టగలదు, ఇబ్బంది కలిగించగలదు. ఎన్నోసార్లు ఈ మనస్సు మిమ్మల్ని దుఃఖంతో, భయంతో, ఆందోళనతో లేదా గందరగోళంతో నింపింది. కాబట్టి, ఈ రెండిటిని అదే మనసు చేస్తోంది. దానికి ఏది తోచితే అది చేస్తోంది, ఎందుకంటే ఈ మనస్సనే చిన్ని పరికరం ప్రస్తుతం  చేతుల్లో లేదు, అది అదుపు తప్పి ఉంది. ఉదాహరణకి మీరొక కారు నడుపుతుంటే,  దాని మీద మీకు తగినంత కంట్రోల్ ఉంటే మీరు అనుకున్న చోటుకి చేరుకోవచ్చు. కంట్రోల్ లేకపోతే నేరుగా ఒక చెట్టుకి డీకొట్టవచ్చు. కారు మీద మీకు తగినంత నియంత్రణ ఉందా, లేదా అనేది చాలా ముఖ్యం. దాని మీద తగినంత నియంత్రణ మీకు ఉంటే మీరు ఎంత దూరమైనా ప్రయాణించగలుగుతారు. మీ మనస్సు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు