సద్గురు: ఈ నేల, ఈ దేశం, ఈ ప్రాచీన నాగరికత అద్భుతమైన ప్రతిభకు ఇంకా మేధస్సు గల ఎంతో మంది వ్యక్తులకు పునాదిగా ఉంటూ వచ్చింది. ఈ ప్రతిభ ఇంకా మేధస్సు ముఖ్యంగా అధ్యయనం నుండి కాకుండా భక్తి నుండి వచ్చాయి. గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు ఇంకా గణిత శాస్త్రజ్ఞులు అందరూ భక్తులుగా గొప్ప ఉదాహరణాలు, ఎందుకంటే భక్తిలో మీరు అన్నింటినీ అక్కున చేర్చుకుంటారు. ఇలా ఉండటం వల్ల, మీకు దొరకనిది అంటూ ఏదీ ఉండదు. భక్తుడిగా ఉండటం అంటే గ్రహణ శక్తీ , ఇంకా మేధస్సుకిసంబంధించి ఒక ప్రత్యేకమైన పార్శ్వాన్ని చేరుకోవడం, అల్పమైన విషయాలను విడిచిపెట్టి దైవిక సంభావ్యతను ఆహ్వానించడం. ఒక భక్తుడు వజ్రాలు పొదిగిన సింహాసనంపై కూర్చోడు, లేదా దాని కోసం ఆశపడడు. దైవ సాన్నిధ్యంలో ఉండాలన్నదే అతని ఆకాంక్ష. దీని అర్థం ఎక్కడికో చేరాలనే కోరిక కాదు. సమస్త సృష్టి గురించి తన మౌలిక గ్రహణశీలతను మార్చుకోవడం ద్వారా మాత్రమే దైవ సాన్నిధ్యంలోకి చేరుకుంటాడు.

పరిమితులను అధిగమించడానికి ఇది ఒక సాధనం

భక్తి అనేది ఒకరు తమ పరిమితులను అధిగమించడానికి ఒక అద్భుతమైన సాధనం. మానసికమైనా, భావోద్వేగాలపరమైనా లేదా కర్మపరమైన పరిమితులున్నా – భక్తి వెల్లువ ఉంటే, ఈ పరిమితులన్నింటిని అనాయాసంగా దాటవచ్చు. నిరంతర సాధనతో, ఈ పరిమితులను దాటడానికి అపారమైన కృషి చేయాల్సి ఉంటుంది. కానీ అపారమైన భక్తితో చేసే సాధనతో, మీలో మీరు సృష్టించుకున్న అన్ని పరిమితులను వెల్లువలా దాటేయవచ్చు. కాలం - కాలక్రమేణా, మనలో ఉన్న పరిమితమైన గ్రాహ్యత వల్ల ఏర్పడిన నిర్బంధనాల్ని కూడా తీసి వేస్తుంది.

భక్తి అనేది మీరు వేసే ఒక లెక్క కాదు. భక్తి అనేది అన్ని లెక్కలకు మించి ఎదగడానికి ఒక మార్గం.
మీరు చక్కగా అమర్చిన పువ్వులను చూశారని అనుకుందాం. ఇలా ఎవరు అమర్చారో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇంకా బుద్ధి ప్రతి మనిషిలో సాధారణం. మీరు ఒక కళాఖండాన్ని చూస్తే, దానిని ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటారు. కానీ నమ్మశక్యం కాని విధంగా,చాలా కొద్ది మంది మాత్రమే, ఎవరైతే జీవితంలో మానవ వ్యవస్థ రూపంలో సృష్టించబడిన ఈ కళాఖండం తో నిమగ్నమై ఉన్నారో, వారే, “ దీని సృష్టికర్త ఎవరు?” అనే ప్రశ్న అడుగుతారు. దీనికి, ప్రజల దగ్గర ముందే సిద్ధం చేసుకున్న సమాధానాలు ఉన్నాయి. భక్తి అనేది ముందే సిద్ధం చేసుకున్న ఒక సమాధానం కాదు. ఆ సమాధానాన్ని చేరుకోవడానికి భక్తి ఒక పరికరం. భక్తి అనేది మీరు ఏర్పరచుకున్న అభిప్రాయం కాదు . భక్తి అనేది అన్ని అభిప్రాయాలకు మించి ఎదగడానికి ఒక మార్గం. మీ అనుభవంలో ఉన్న అన్ని పరిమితులను ఇంకా నిర్బంధాలను దాటి మిమ్మల్ని తీసుకువెళ్ళే వెల్లువను సృష్టించే మార్గం భక్తి. ఈ ఇరవై ఒక్క రోజులు మిమ్మల్ని మీరు సమర్పించికున్నట్లయితే, మీరు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాలను శుద్ధి చేసినట్లే. దీని వల్ల ఈ దేశం ఇంకా ప్రపంచం ఎంతో ప్రయోజనాన్ని పొందుతాయి. ఇంకా భక్తి అనేది ఇరవై ఒక్కరోజుల కార్యాచరణ కాదు ప్రతిరోజూ అది మీ నుండి పొంగి పొర్లుతూ ఉండాలి. ఇది మీరు చేసే ఒక పని కాదు, మీరు జీవించే విధానం. ఇది మీ శ్వాస లాంటిది. భైరవి దేవీ అనుగ్రహం మీ మనసులో స్థిరపడినట్లయితే, మీరు విజయం లేదా వైఫల్యం, శ్రేయస్సు లేదా పేదరికం, జీవితం లేదా మరణం గురించి చింతించాల్సిన అవసరం లేదు. దైవ సాన్నిధ్యంలో ఉన్న వ్యక్తికి, ఈ విషయాలన్నీ అల్పమైనవి ఇంకా ఎటువంటి ఫలితం లేనివి.

భక్తిని పునఃస్థాపన చేయడం

మీరు ప్రారంభించిన ఈ ప్రక్రియ మిమ్మల్ని నిజంగా భక్తిలో ముంచెత్తాలని నా ఆశ , ఎందుకంటే సృష్టి ప్రక్రియ ఇంకా సృష్టి యొక్క మూలం మిమ్మల్ని మైమరచెలా చేయకపోతే, మీరు శిలగా ఉండటానికి కూడా పనికిరారు. ఇది మిమ్మల్ని పరవశంలో ముంచెత్తకపోతే, ఇంకేది మిమ్మల్ని ముంచెత్తుతుంది? తమిళనాడు ప్రభుత్వ చిహ్నం ఒక దేవాలయం. వారు ఈ చిహ్నాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ భూమి ఎంత భక్తితో నిండినది, అంటే మీరు ఎక్కడికి వెళ్లినా ఇది ఎల్లప్పుడూ దేవాలయంలా అనిపిస్తుంది. ఇక్కడి ప్రజల జీవితంలో భక్తి ప్రధానమైనది. దీన్ని మళ్లీ నెలకొల్పడానికి ఇదే సమయం. భక్తి లేకపోతే మనకూ ఇతర ప్రాణులకూ తేడా ఉండదు. అలాంటప్పుడు మనం ఇక్కడ అసలు ఎందుకు ఉన్నామా అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే జీవితం అంటే ప్రతిరోజూ కేవలం తినడం, నిద్రపోవడం, పునరుత్పత్తి చెయ్యడం, ఏదో ఒక రోజు చనిపోవడమే అయితే, మధ్యలో ఎప్పుడో, ఎక్కడో మీ మెదడులో “నేను ఇక్కడ అసలు ఎందుకు ఉన్నాను? నా జీవితం యొక్క స్వభావం ఏమిటి? ” అనే ప్రశ్న వస్తుంది.

సహజంగానే ఆనందంగా ఉండడం

భక్తి అనేది ఒక శక్తివంతమైన సాధనం. ఇది మీలోని అన్ని ఆటంకాలను నేలకూల్చే ఒక సాధనం. భక్తితో అన్నీ ఏకమవుతాయి. ఈ ఇరవై ఒక్క రోజుల సాధన యొక్క ఉద్దేశం ఏమిటంటే, భక్తిని మీ జీవితంలో ఒక భాగం చేయడమే, ప్రతిక్షణం భక్తితో ఉండేలాగా! మీరు ఒక చోట భక్తితో ప్రవర్తించి, మరో చోట అలా లేకపోతే, మీరు నటిస్తున్నారని అర్థం. మీ భక్తి నిజమైతే, మీరు మీ జీవితంలోని ప్రతి క్షణం, ప్రపంచంలోని ప్రతిదానితోనూ ఒకలానే ఉంటే - అదే భక్తి. భక్తి లేని మనసు ఒక ఎడారి లాంటి మనసు . దానిని ఆనందంగా మార్చడానికి చాలా కృషి ఇంకా ప్రేరణ అవసరం. భక్తితో నిండిన హృదయం సారవంతమైన హృదయం. అది సహజంగానే ఆనందంగా ఉంటుంది. మనకు ఒక భక్తి తరంగం అవసరం. భక్తిలో నిమగ్నమైతే , సహజంగానే పరమానందం కలుగుతుంది. దయచేసి ఇది మీకు ఇంకా వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్న వారికి జరిగేలా చూడండి.

ఎడిటర్ నోట్: ముక్తిని చేరుకోవడానికి ఒక సాధనంగా భక్తి మార్గం గురించి సద్గురు జ్ఞానోపదేశాలు ఇంకా ఇలాంటి ఎన్నో భక్తుల కథనాల గురించి మరింత చదవండి.

Sadhguru on Devotion