దురదృష్టవశాత్తూ, మనం ఇప్పటికీ ఎంతో పెద్ద సమస్యలను ముక్కలు ముక్కలుగా చూస్తున్నాం. ఈ ప్రపంచం ఇలానే పని చేస్తోంది. మనం ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్కసారి దృష్టి పెడుతున్నాం. ప్లాస్టిక్ అనేది ఒక  ప్రత్యేకమైన సమస్య కాదు. సమస్య మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నది. మనం ఇక్కడ జీవులుగా ఉన్నాం అన్న విషయం మరచిపోయాం. మన జీవితం, మన మనుగడ మన చుట్టూతా ఉన్న జీవంతో ముడిపడి ఉందన్న విషయాన్ని మరచిపోయాం. మన చుట్టూతా ఉన్న జీవంతో ఒకరోజులో దాదాపు 7 కేజీల లావాదేవీలు జరుగుతాయి-అని ప్రజలు చెబుతున్నారు. మనం మన జీవితంపట్ల స్పృహని కోల్పోయాం. మన జీవితానికి పౌష్టికత అందించే అన్నిటిపట్ల స్పృహని కోల్పోయాం. ప్రాధమికమైన సమస్య ఇది. ఈ ప్రపంచంలో ఇది ఎన్నో విధాలుగా వ్యక్తమౌతోంది. 

మన దేశంలో మన భూమి, నీరు ఉన్న పరిస్థితి ఎంతో విషమంగా ఉంది. సుమారు 1.3 బిలియన్ ప్రజల జనాభా మనది. మన మట్టి, నీరూ ఈ విధంగా దిగజారిపోయినప్పటికీ, మన దేశాన్ని మన చేతుల్లోకి మనం తీసుకోలేదు. “ర్యాలీ ఫర్ రివర్స్” తో మేము ఈ సమస్యని ఎదురుకోవడంలో నీటిని పునరుద్ధరించడంతో మొదలుపెట్టాము. యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన ఎంతో లోతైన సమస్య “ప్లాస్టిక్”. ప్లాస్టిక్ ను మనం వాడిన తీరుని చూస్తే మనం ఎంత బాధ్యతారహితంగా ఉన్నామో, మనం ఎలాంటివారమో అన్న విషయం అర్థం చేసుకోవచ్చు.   

ప్లాస్టిక్ ఒక అద్భుతం           

మనం ఈ భూమిమీద ఎన్నో రకాల పదార్థాలను తయారుచేశాం. అందులో ప్లాస్టిక్ అనేది అద్భుతమైనది.  ఒకవేళ మనం దానిని సరిగ్గా ఉపయోగించినట్లయితే, దానిని తిరిగి మళ్ళీ వాడవచ్చు. కానీ, మనం దానిని ఎంత బాధ్యతారాహిత్యంతో ఉపయోగించామంటే; అది ఇప్పుడు విషపూరితంగా మారిపోయింది. అన్నిటిల్లోనూ చేరుతోంది.  ఇప్పుడు, ఎన్నో సూక్ష్మ జీవుల్లో ప్లాస్టిక్ ఉందన్న విషయం చెప్తున్నారు. 

ఇది వదులాడుకోవడానికి సమయం కాదు. ఏదో ఒక చర్య తీసుకోవలసిన సమయం ఇది. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు దీనికి వెంటనే స్పందించినప్పటికీ; ప్రజలు వారంతటవారు తమనితాము ఈ విషయంలో సరి చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. అందుకని మనం దీనికి ఒక చట్ట విధానం తీసుకురావడం అన్నది అవసరం. అందుకని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ని నిషేధించాలి అన్న విషయమై మేము చూస్తున్నాము.   

ఈ బాధ్యతారాహిత్యం అన్నది కేవలం గత 20 ఏళ్ళల్లో జరిగిన విషయం. అంతకు ముందర మనం ప్లాస్టిక్ ని ఈ విధంగా మన దేశంలో ఎప్పుడూ వాడలేదు. మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ కవర్ వస్తే, మా అమ్మ దానిని ఎంతో జాగ్రత్తగా మడత పెట్టి మళ్ళీ వాడడానికి అట్టి పెట్టేది. మేము దానిని కనీసం 2-3 సంవత్సరాలు ఉపయోగించేవాళ్ళం. అప్పడు జీవించినట్లుగా, ఇప్పుడు జీవించడం అన్నది పెద్ద కష్టమేమీ కాదు.  మనం, వ్యక్తులుగా చెయ్యగలిగిన చిన్న-చిన్న పనులు మన నిబద్ధతను మనం వ్యక్తం చేసుకునేందుకు ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఈ సమస్య అంతకంటే పెద్దది.  అందుకని దీనికి పరిష్కారం కూడా కొంత పెద్దఎత్తులోనే తీసుకురావాలి.

తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇక అంతే సంగతి

ఇప్పుడు 40%  ప్లాస్టిక్ ని ప్యాకేజింగ్ లో వాడుతున్నారు. ఈ అంశాన్ని ఉద్దేశించి మనం మాట్లాడాలి. దీనిని మనం తేలికగా నిషేధించవచ్చు.  ప్రపంచంలో వాడబడే ప్లాస్టిక్ వినియోగంలో మంచినీటి సీసాలకు 8-9% వరకూ అవుతోంది. మనం దాదాపుగా సంవత్సరానికి ½ ట్రిలియన్ బాటిల్స్ చొప్పున ప్రతియేడూ తయారు చేస్తున్నాము.  నేను ఈ బాటిల్స్ తయారు చేసే సంస్థలతో మాట్లాడాను.  వారు దీనిని మార్చడానికి సుముఖంగా ఉన్నారు.  ఇక మన ప్రభుత్వాలు దీనిని ముందుకు తీసుకుని వెళ్ళాల్సి ఉంది. సంస్థలు వారి మనుగడ కోసం ఇలా చేస్తున్నాయి.  నెదర్లాండ్స్ లో ఉన్న విశ్వవిద్యాలయాలతో, మరికొన్ని మార్కెటింగ్ సంస్థలతో ఈ కంపెనీలు కొన్ని కలిసి దీనిని రీసైకిల్ చేసే ప్రక్రియను కనుగొన్నాయి. అంటే, అవే సీసాలను తిరిగి మళ్ళీ-మళ్ళీ దాదాపుగా ఎప్పటికీ వాటిని ఉపయోగించవచ్చు.

మన జీవిత విధానాలను మార్చుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం. కానీ, మనం 7.6 బిలియన్ ప్రజల గురించి మాట్లాడుతున్నాం. వారందరి జీవితవిధానం మార్చడం అనేది ఎంతో దీర్ఘకాలిక పరిష్కారం. ఆపాటికి మరో తరం పుట్టుకొస్తుంది. వారు మరేదో చేస్తారు. అందుకని రీసైక్లింగ్ అన్నది జరగాలి అన్న విషయంపై మనం ఒక చట్టాన్ని తీసుకురావాలి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ప్లాస్టిక్ లో ఎన్నో తరహాలు ఉన్నాయి. కొన్నిటిని మనం తిరిగి వాడవచ్చు.  కొన్నిటిని మనం తిరిగి వాడలేము. ఇటువంటి వాటిని మనం పూర్తిగా నిషేధించాలి. ఎటువంటి ప్లాస్టిక్స్ అయితే మనం తిరిగి వాడవచ్చో అందులో కూడా ఎన్నోరకాలు ఉన్నాయి. అమెరికాలో ఒక శక్తివంతమైన గ్రూప్ ని ఏర్పాటు చేశాం.  వీరు ఇందుకు పరిష్కారాలతో సంస్థల వద్దకు వెళ్తున్నారు. ఉదాహరణకు కోక్ బాటిల్స్ ని మనం తేలికగా రీసైకిల్ చెయ్యవచ్చు. కానీ,  దానిమీద ఉన్న పేపర్ లేబిల్ కారణంగా దానిని ప్రస్తుతం రీసైకిల్ చెయ్యలేక పోతున్నారు. మీరు, దానిని ఆ పేపర్ లేబిల్ తో కనుక రీసైకిల్ చేసినట్లయితే, అది ఆహారపదార్థాన్ని నిలవచేసుకోవడానికి తగినట్లుగా ఉండదు.  అదేకనుక,  ఆ లేబిల్ కూడా ప్లాస్టిక్ అయినట్లయితే, దానిని ఎంతో తేలికగా రీసైకిల్ చెయ్యవచ్చు. బాటిల్ మీద ప్రింట్ చేసే సామర్థ్యంతో ఉన్న కొన్ని సంస్థలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం.

ఎవరికీ వ్యతిరేకం కాదు

మనం వ్యాపారాల వద్దకు పరిష్కారాలతో వెళ్ళాలి, వాటిని వ్యతిరేకిస్తూ కాదు. ఎందుకంటే; మన ఉద్దేశ్యం వారి వ్యాపారాలను నాశనం చెయ్యడం కాదు. మన ఆర్ధిక సమస్యలూ, ఒక వ్యాపారానికి ఉన్న ఆర్ధిక సమస్యలూ, దేశానికి ఉన్న ఆర్ధిక సమస్యలూ అన్నవి ఎంతో ముఖ్యమైనవి కాదు. దురదృష్టవశాత్తూ, ఇప్పటివరకూ అది ఎప్పుడూ ఆర్ధిక వ్యవస్థా  లేదా పర్యావరణమా..?-  అన్నట్లుగానే ఉంది. ఇది మనం ర్యాలీ ఫర్ రివర్స్ తో మార్చాము. ఆర్దికమా? లేక పర్యావరణమా? - అన్న సమస్య వచ్చినప్పుడు.. అది మీ ఇంట్లో అయినా, మీ సమాజంలో అయినా, మీ దేశంలో అయినా ఖచ్చితంగా ఆర్ధికవ్యవస్థ అన్నదే నెగ్గుతుంది.

ఎందుకంటే, ప్రజలు ఆర్ధికం అన్నది ఈరోజు సమస్యగా, పర్యావరణం అన్నది రేపటి సమస్యగా భావిస్తున్నారు. లేదు.. పర్యావరణం అన్నది కూడా ఈరోజున మనకు ఉన్న సమస్యే..! మనం ఈ వ్యాపారాలని మన పర్యావరణానికి అనుకూలంగా ఉండేలాగా, పనిచేసేలాగా పరిణమింప చెయ్యాలి. వీటిని, మనం అన్ని స్థాయిల్లోనూ చూడాలి. మీరు; ఎవరో ప్రాంతీయంగా పని చేసేవాళ్ళ దగ్గరకు వెళ్లి, మీరు ప్లాస్టిక్ వాడకూడదు- అని మాత్రమే చెప్పకూడదు. అయితే;  మరి ఏం వాడాలో కూడా చెప్పగలగాలి. అందుకు ప్రత్యామ్నాయంగా వారు ఏం వాడాలి ? ఎలా వాడాలి ? అది వారికి ఉపయోగకరంగా ఎలా ఉంటుంది ? - అన్నది చెప్పాలి. ఈ విషయాలన్నీ కూడా మనం వెలుగులోనికి తీసుకుని రావాలి. కేవలం వ్యాపారాలపట్లా, సంస్థలపట్లా  ప్రతిఘటన చూపిస్తే, ఇది ఎంతో కాలం పని చెయ్యదు. ఖచ్చితంగా ఆర్ధిక వ్యవస్థ అన్నదే గెలుస్తుంది. మనం, పర్యావరణం గెలవాలి అనుకున్నట్లయితే, మనం పర్యావరణానికి ఆర్ధిక వ్యవస్థతో వివాహం చెయ్యాలి. ఇప్పుడు మా కృషి అంతా అదే.