బాధ ఎక్కడ ఉంది..??
 
 

మీరు బుద్ధుడి గురించి విన్నారా..? నేను బుద్ధా అని అనగానే మీరు గౌతమ బుద్ధుడు అని అనుకుంటారు.  గౌతముడు అన్నది ఆయన పేరు మాత్రమే..! ఆయన బుద్ధుడిగా మారారు. కొన్ని వేలమంది బుద్ధులు ఉన్నారు.  బుద్ధా అంటే అర్థం, “బు” అంటే బుద్ధి,  వివేకం. “ద్ధా”  అంటే అతీతం. ఎవరైతే తన బుద్ధికి అతీతంగా ఉన్నారో, వారే బుద్ధా. ఎవరైతే, బుద్ధిలో ఉన్నారో, వారు ఎడతెరిపి లేని బాధలో ఉంటారు. ఇప్పుడు, మీరు అక్కడే ఉన్నారు. మీరు, మీ బుద్ధిలో ఉన్నప్పుడు ఇది తప్పనిసరి అవుతుంది. మీరు కనుక, బుద్ధిని అధిగమిస్తే, మీరు దానినుంచి విముక్తి పొందుతారు. మీరు బుద్ధి కంటే క్రింద ఉన్నట్లైతే కూడా, మీకు ఇంత బాధ తెలియదు. మానవులకి తెలిసినటువంటి బాధ పశువులకి తెలియదు కదా..? వాటికి కడుపు నిండితే చాలు, అవి హాయిగా ఉంటాయి. మీరు ఇది పశువుల్లో గమనించారా..? వాటి కడుపు నిండితే చాలు, వాటికి అంతా హాయిగానే ఉంటుంది.

మీరు మీ మనస్సుకి సాక్షీభూతంగా ఉన్నట్లైతే, మీరు మీ మనస్సు చర్యకు అతీతంగా ఉన్నట్లైతే, మీకు అసలు బాధ అన్నదే ఉండదు.

కానీ, మీ విషయంలో అలా కాదు. మీకు కడుపు నిండకపోతే, ఒకటే సమస్య -  ఆహారం. కడుపు నిండితే - వంద సమస్యలు. ఎందుకంటే, మీ బాధ బాహ్యం నుండి వస్తున్నది కాదు. ఇది అంతర్గతమైనది. ఇది ఎడతెరిపి లేకుండా తయారు చేయబడుతూనే ఉన్నది. మీరు ఒక బాధను పరిష్కరిస్తే, మరో పది బాధలు క్యూ లో నిలుచొని ఉంటాయి. మీరు మీ మనస్సుకి సాక్షీభూతంగా ఉన్నట్లైతే, మీరు మీ మనస్సు చర్యకు అతీతంగా ఉన్నట్లైతే, మీకు అసలు బాధ అన్నదే ఉండదు. ఎందుకంటే బాధ అంతా కూడా మనస్సులో ఉన్నదే. ఒకసారి మీరు దాని నుంచి వెలుపలికి వచ్చేసిన తరువాత ఇంకా బాధ ఎక్కడ ఉంటుంది..? ఏ మనస్సైతే ఆనందాన్ని సృష్టించగలదో, పారవశ్యాన్ని సృష్టించగలదో అది ఇప్పుడు మీకు బాధను కలిగిస్తోంది.  అంటే తెలిసో తెలియాకో మీకు మీరే బాధను కలిగించుకుంటున్నారు.

ఎవరికి వారే బాధను కలిగించుకుంటుంటే, వారు ఖచ్చితంగా సరైన స్థితిలో ఉన్నట్లు కాదు. మీరు “లేదు.. లేదు.. నా జీవితంలో ఏమి జరిగిందో మీకు తెలియదు..” అంటారు. మీ జీవితంలో ఏమి జరిగినా సరే, మీ బాధ అన్నది మీ జీవితంలో ఏదో జరగడం వల్ల రావడం లేదు. మీ బాధ అన్నది మీ మనస్సు  చేస్తున్న దానిని మీరు నియంత్రించలేక పోతున్నారు కాబట్టే వస్తోంది. అది, దాని చెత్త అది చేసుకుంటోంది.  అందుకే మీరు బాధగా ఉన్నారు.. కదూ..?? ఇది ఇలా ఎందుకు  జరిగిందంటే,  మీరు ఏదైతే కాదో అటువంటి ఎన్నో విషయాలతో మీరు మమేకమయ్యారు. ఒకసారి మీరుకాని విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్న తరువాత, మీ మనస్సు మరో విధంగా పని చేయలేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1