ప్రేమకి మరొక వ్యక్తితో పని లేదని, ఉన్నదంతా మీతోనే అని, మనలో అప్పటికే ఉన్న (ప్రేమ అనే) వస్తువుని తెరవడానికి మనం ఆ రెండవ వ్యక్తిని ఒక తాళం చెవిలా ఉపయోగిస్తున్నామని సద్గురు వివరిస్తున్నారు.

అతిగా వినియోగించేదీ, దుర్వినియోగ పరచబడేదీ, అదే రెండక్షరాల పదం: ప్రేమ


మీరీ బోధనలు వినే ఉంటారు. ప్రపంచం అంతటా, ప్రేమే దైవమనీ, ప్రేమ సర్వోత్కృష్టమైనదనీ, సర్వ శ్రేష్ఠమైనదనీ, మనం మన పొరుగువారిని ప్రేమించాలనీ చెప్పే సూక్తులు వినని వారుండరు. కానీ ఒకసారి మీరు ప్రయత్నపూర్వకంగా ప్రేమగా ఉండడం మొదలెడితే, అది ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఇలా ప్రయత్నపూర్వకంగా ప్రేమిస్తూ బ్రతకడం కంటే, అసలు ఎవరినీ ప్రేమించకుండా బ్రతకడం తేలిక.


కానీ, ప్రేమించడం అంటే స్వేచ్ఛగా స్పందించడానికి సుముఖత కలిగి ఉండడం. ప్రస్తుతం అది మీ జీవితంలో ఏ ఒక్కరికో, ఇద్దరికో పరిమితమై ఉండి ఉండొచ్చు. కానీ దీనిలో ప్రపంచమంతటినీ కలుపుకోవటం సాధ్యమే.


అంటే, రోడ్డుమీదపోయే ప్రతివ్యక్తినీ కౌగలించుకోమనా అర్థం? అది బాధ్యతా రహితంగా ప్రవర్తించడమే కాదు, అది వెర్రి క్రింద పరిగణించబడుతుంది. బాధ్యత అన్నది ఒక చర్య కాదు, అది ఒక జీవన విధానం. ప్రేమించడం అన్నది మీరు చేసే ఒక చర్యకాదు; అది మీ జీవన సరళి.

ఇప్పుడు మీ జీవిత కవాటానికి ఒక తలుపు తెరిచి ఉంచారు - కొందరు వ్యక్తులకి. ఆ కిటికీ తలుపు కనక మీరు మూసేస్తే, మీకు పిచ్చెక్కుతుందని మీరు గ్రహించారు గనుక ఆ తలుపు తెరిచి ఉంచారు. ఆ తలుపు మీరు మూసేస్తే, అప్పుడు మీకున్న రెండే రెండు ప్రత్యామ్నాయాలు: ఆత్మహత్యచేసుకోవడం, లేదా పిచ్చివాళ్ళుగా మారడం. కానీ, దానికి మరో మార్గం ఉంది. అంటే మరో కిటికీ తెరవడమా?  మరో తలుపు తెరవడమా? 


అన్నిటి కన్నా మంచి ప్రత్యామ్నాయం, మీరు అసలు ఆ గోడనే ఎందుకు బద్దలు కొట్టకూడదు అని? ప్రేమకి మరొక వ్యక్తితో పని లేదు. ఉన్నదంతా మీతోనే. ప్రేమ ఒక రకమైన జీవన స్థితి. మౌలికంగా, దానర్థం మీ భావాలలో కమ్మదనాన్ని తీసుకురావడం. మీకు ఇష్టమైన వాళ్ళు మరొక దేశానికి తరలి వెళ్లారనుకోండి, మీరు వాళ్ళని ఇంకా ప్రేమించ గలరా? మీరు ప్రేమించగలుగుతారు. మీకు ఇష్టమైన వాళ్లు మరణిస్తే, వాళ్లని మీరు ఇంకా ప్రేమిస్తూ ఉండగలరా? ఉండగలరు. మీరు ప్రేమించే వ్యక్తి భౌతికంగా మీతో లేకపోయినా, మీరు ప్రేమించగలరు. అలాంటప్పుడు, ప్రేమంటే నిర్వచించడం ఎలా? అంటే ప్రేమ అనేది మీ గుణం. మీలో అప్పటికే ఉన్న (ప్రేమ అనే) వస్తువుని తెరవడానికి మీరు ఆ రెండవ వ్యక్తిని ఒక తాళం చెవిలా ఉపయోగిస్తున్నారు.  


అక్కడ తాళం లేనపుడు, తలుపే లేనపుడు, అసలు గోడే లేనపుడు మీరెందుకు తాళంచెవితో తడబడుతున్నారు?  మీరు ఊహాత్మకమైన గోడలు సృష్టించుకుని, అలాగే ఊహాత్మకమైన తాళాలు కూడా సృష్టించుకుని, తాళంచెవి కోసం తడబడుతుంటారు. ఒకసారి తాళంచెవి దొరికితే, అది పోతుందేమోనని తెగ భయపడిపోతారు.


చాలా మందికి ప్రేమ మొదట్లోనే ఆనందకారకం, కొద్ది కాలం తర్వాత, అది ఆందోళనకి దారి తీస్తుంది. ఎందుకని? ఆ తాళంచెవికి దానికంటూ ఓ మనసు, కాళ్ళు చేతులూ ఉన్నాయి. దాన్ని మీ జేబులో దాచుకోలేరు; మెడలో ధరించలేరు. మీరలా చెయ్యడం ప్రారంభిస్తే, రెండు జీవితాలు తిన్నగా ప్రమాదంలో ఇరుక్కుంటాయి.


మీ ఆనందం అన్నది మీ మీద బలవంతంగా రుద్దబడినది కాకుండా, మీ అంతట మీరు ప్రయత్నించినదైతే, మీ సాంకేతిక నైపుణ్యాన్ని మీరు మెరుగుపరచుకున్నట్టే. మీరింక ఏ బాహ్య కారణాలకూ బానిస కారు - అది వ్యక్తి కావచ్చు, సందర్భమో, సంఘటనో కావచ్చు. మీరిప్పుడు ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండానే, ప్రపంచంలో మిగతావారి ప్రవర్తనతో సంబంధం లేకుండానే, అలా ప్రశాంతంగా కూర్చుని ఆనందంగా ఉండగలరు. ఒకసారి ఇలాంటి అంతర్గతమైన స్వేచ్ఛని అనుభవిస్తే, మీ జీవితంలో అభద్రతా భావాన్ని మరెన్నడూ అనుభూతి చెందరు. ఎలా చూసినా, ఒకసారి మీరు బ్రహ్మానందంతో జీవిస్తున్నట్లయితే, సహజంగా అందరూ మిమ్మల్ని అనుసరించి ఉండడాన్ని కోరుకుంటారు! బ్రహ్మానందం అంటే జీవితం సుసంపన్నంగా సాగిపోవడం,  జీవితానికి కావలసింది అదే!

ప్రేమాశిస్సులతో,
సద్గురు