గతాన్ని విశ్లేషించడం వివేకవంతమా..?

 

ప్రశ్న : ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలంటే, మన గతాన్ని విశ్లేషించుకోవడం, దానినుండి భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు ఉపయోగపడుతుంది?

ఈ లోకంలో ఎన్నో సిద్ధాంతాలు, బోధనలు ఉన్నాయి. ఒకదాన్ని మించినదొకటి ఉంటుంది. ఈ సందర్భంలో మనం చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఆ బోధన చేసిన వ్యక్తికి, తాను చేస్తున్న బోధన ఉపయోగపడిందా లేదా అన్నది. అది అతనికి ఉపయోగపడకపోతే దానివల్ల మీకూ ఉపయోగమేమీ లేదు. అతనికి మంచిది కానిది మీకెలా మంచిదవుతుంది? ఒకవేళ, ఆ బోధన వారందరికీ ఉపయోగపడితే, మీకు దాని విషయంలో మేధోపరంగా సందేహాలున్నా మీరూ పాటించండి, ఎందుకంటే అది పనిచేస్తుంది కాబట్టి.  గొప్పగా కనిపించేదంతా గొప్పగా పని చేస్తుందని చెప్పలేం. అంత గొప్పగా కనపడనిది అద్భుతంగా పనిచేయవచ్చు. కొందరు అసమర్థంగా కనిపించవచ్చు, కానీ వారు అద్భుతమైన వాళ్లు కావచ్చు. మరికొందరు అద్భుతంగా కనిపించవచ్చు కాని వాళ్ల వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు.

మీరు కూర్చునే పద్ధతి, శ్వాసించే పద్ధతిలోనే మీ గతకాలపు ప్రభావాలు కనిపిస్తాయి.

ఇక మీ గతాన్ని విశ్లేషించుకోవడం విషయానికి వస్తే, యోగా మిమల్ని - మీకు, మీ గతానికి మధ్య కొంచెం దూరం ఉంచమని చెప్తుంది. ప్రాథమికంగా మీరు అవగాహన చేసుకోవలసింది ఏమిటంటే, గతాన్ని మీరు సరిచేయలేరు. గతం నుండి మీరు నేర్చుకోగలరా? నేర్చుకోవడం అనేక విధాల జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు మళ్లీ గతాన్ని జల్లెడ పట్టవలసిన అవసరం లేదు. మీరు కూర్చునే పద్ధతి, శ్వాసించే పద్ధతిలోనే మీ గతకాలపు ప్రభావాలు కనిపిస్తాయి. మీరు ఓ పదిమంది మనుషుల్ని తీసుకుని పరిశీలించి చూస్తే, వారందరి శ్వాస ఒకలాగే ఉండదు. వాళ్లమీద అంతకుముందున్న ప్రభావాల ప్రకారమే వారి శ్వాస ఉంటుంది. ‘సంయమ’ ప్రోగ్రాం లో పాల్గొంటున్న వారిని గమనిస్తే , ఆ ఏడురోజుల్లోనే , వారు శ్వాస తీసుకునే విధానం మారిపోవడం మీరు గమనించవచ్చు – ఇది వాళ్లు ఉద్దేశపూర్వకంగా దాన్ని అలా మార్చుకోవడానికి ప్రయత్నించడం వల్ల జరగదు. వాళ్లు వారి నుండి వారి  గతాన్ని కొంచెం దూరంగా ఉంచగలగడం వల్ల జరుగుతుంది. వారి జీవన ప్రక్రియ సాగే పద్ధతిలోనే అకస్మాత్తుగా ఒక సౌలభ్యం. దాని ఫలితంగా శ్వాస తీసుకునే విధానం మారుతుంది.

యోగా గతాన్ని జల్లెడలో జల్లించడంపై విశ్వాసముంచదు. ఒక ప్రత్యేకమైన పని చేయదలచుకున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన మనిషికోసం అన్వేషిస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని గుర్తించడం కోసం కాస్త అతని గతాన్ని పరిశీలిస్తాం. గత జీవితాల్లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మీకు ఎరుకలో ఉన్న స్మృతిని, మీ అస్తిత్వాన్ని అర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. అటువంటప్పుడు గతాన్ని తవ్వడం వల్ల ఏమీ ఉపయోగంలేదు. దాన్నుండి దూరంగా ఉండడమే చేయవలసిన పని. లేకపోతే మీరందులో చిక్కుబడిపోతారు. గతం గురించి మీరెటువంటి అవగాహన సంపాదించినప్పటికి మీ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకోలేరు.

వర్తమానం నుండి నేర్చుకోండి

మీ ఆసక్తి జీవనం మీద ఉన్నట్లయితే – మీరెక్కడో పిహెచ్.డి. సంపాదించుకోవడానికి పనికివచ్చే విషయం కాదు – మీ గతాన్ని జల్లెడ పట్టవలసిన అవసరం లేదు. మీరు నేర్చుకోవలసింది ఉంటే దాన్ని వర్తమానం నుండే నేర్చుకోవాలి, గతం నుండి కాదు. ముఖ్యంగా మీ స్మృతిలోని ఉపచేతనంగా, అచేతనంగా ఉన్న పొరలను వెలికితీయదలచుకుంటే అది చాలా పెద్ద పొరపాటవుతుంది. ఎందుకంటే, మీరు ఇలా చేయడం వల్ల మీరు నియంత్రించలేని దయ్యాల్ని మీరు నిద్రలేపినట్టు అవుతుంది. మీరు గతాన్ని తవ్వుకుంటున్నారంటేనే మీ ప్రస్తుత జీవితం తగినంత అందంగానూ, ఉత్సాహంగానూ లేదని అర్థం. ఇక్కడున్న దాన్ని మీరు తగినంతగా అనుభవించలేకపోతున్నందునే మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి గతంలో ఏదో లభిస్తుందేమోనని వెతుకులాడుతున్నారు. మీ కార్యకలాపాల స్థాయిని  మీరు ఎప్పుడూ మెరుగుపరచుకుంటూనే ఉండవచ్చు, కాని మీ జీవితం అనుభవాత్మకంగా మెరుగుపడవలసిన అవసరం ఉందంటే మీ పరిస్థితి బాగా లేదన్నమాట.

మీరిప్పుడు ఉత్తేజంతో ప్రజ్వలిస్తూ ఉంటే మీ గతం ఎలా ఉన్నా సరే, అది మిమ్మల్ని బాధించదు.

అందువల్ల దయచేసి మీ గతాన్ని విశ్లేషించకండి. ప్రస్తుతం మీకు కావలసింది మీలో ఒక రకమైన ఉత్తేజం. మీరిప్పుడు ఉత్తేజంతో ప్రజ్వలిస్తూ ఉంటే మీ గతం ఎలా ఉన్నా సరే, అది మిమ్మల్ని బాధించదు. లేకపోతే గతం మిమ్మల్ని లోపలినుండి కమ్ముకుంటుంది. మీరు నిస్సారంగా ఉంటే మీ గతం మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ఆవరించుకుంటుంది. గతాన్ని తవ్వి, సాగు చేయవలసిన అవసరం లేదు. మీరిప్పుడు సంపూర్ణంగా క్రియాశీలంగా ఉండడం ముఖ్యం.

మీ శరీరమూ, మనస్సూ కూడా స్మృతి యొక్క ఉత్పత్తులు. రెండు భిన్న ప్రాణులు ఒకే ఆహారాన్ని తిన్నప్పటికి అవి తిన్న ఆహారాన్ని వాటి శరీరంగా మాత్రమే మలుచుకుంటాయి. దీనికి కారణం, అవి మోసుకొని వస్తున్న జ్ఞాపకాలే.

స్మృతుల గానుగ(Treadmill of Memory)

మీ శరీరంలో పరిణామగతమైన, జీవాణుస్మృతి ఉంటుంది. లేకపోతే ఒకే ఆహారం భిన్నప్రాణుల భిన్న శరీరాలుగా ఎలా పరిణమిస్తుంది? అది కేవలం మీలో కొనసాగించే స్మృతి  మీద ఆధారపడుతుంది. అదే మీ మనస్సుకూ వర్తిస్తుంది. నేను మీకు ఏమిచ్చినా దానిలోనుండి మీక్కావలసిన దాన్ని నిర్మించుకుంటారు, కాని జీవితమనేది ఒకటి ఉంది – మీ శరీరాన్ని, మనస్సును అధిగమించి – అది ఒక జ్వాల వంటిది. దాన్ని మీరు ఒక నిర్దిష్ట గాఢతతో ప్రజ్వలింప చేస్తే మీ శరీరం, మనస్సు జ్ఞాపకాలు ఏమైనప్పటికీ దాని జ్వాల, వెలుగు ఒకేదిశగా కదులుతాయి. మీరు ఆకాంక్షిస్తున్న దిశలో జీవితం కదులుతుంది. కాని మీ స్మృతుల రాశిని బట్టి మీరు ప్రయాణిస్తే అది మీరు వెళ్లదలచుకున్నవైపు వెళ్లనీయదు. మీరేం చేసినా అది మిమల్ని గానుగెద్దులాగా ఒకే వలయంలో తిప్పుతుంది.

కాని మీ స్మృతుల రాశిని బట్టి మీరు ప్రయాణిస్తే అది మీరు వెళ్లదలచుకున్నవైపు వెళ్లనీయదు

జ్ఞాపకం అన్నది ఒక వలయం వంటిది – ఇందులో చిక్కుకుని తిరుగుతూ ఉంటే మీకు చాలా వ్యాయామం ఇస్తుంది కాని, ఎక్కడికీ తీసికొనిపోదు. మీరు ఆ గానుగను వదిలిపెట్టి నేలమీద నడవాలనుకుంటే మీలోని జీవితం జ్వలించాలి. మీ అస్తిత్వం పట్ల మీకు తీవ్ర నిబద్దత కావాలి. మీ శరీరంలోని ప్రతి జీవకణంలో స్మృతి ఉంటుంది. మీ డిఎన్ఏ స్మృతి, మీ క్రోమోజోములు స్మృతి – ప్రతిదీ స్మృతి. మీరు దాన్ని తోసివేయలేరు. కాని, జీవితం తగినంత గాఢంగా జ్వలిస్తూ ఉంటే – అప్పుడు మీకూ, మీ గతానికీ కొంత దూరం ఏర్పడుతుంది. మీకూ, మీ స్మృతికీ మధ్య ఒకసారి దూరం ఏర్పడినట్లయితే మీకూ మీ శరీరానికీ, మీకూ మీ మనస్సుకూ స్పష్టమైన దూరం ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కడికైనా చేరుకోగలుగుతారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1