ప్రశ్న: మనం అగస్త్యముని వంటి వారిని మరొకరిని సృజించగలమా..??

సద్గురు: మనకు అగస్త్యముని గురించి తెలిసిన ఒక విషయం ఏమిటంటే, మిగతా ఆరుగురికంటే కూడా ఈయన కొంచెం కురచగా, అందవికారంగా ఉండేవారని. అందుకని మీలో ఎవరైతే అగస్త్యముని అవ్వదలచుకుంటున్నారో వారికివి ముఖ్యమైన అర్హతలు. అగస్త్యుడు తమిళనాడుకు చెందిన మనిషి. ఈయన కొంచెం పొట్టిగా, బలిష్టంగా, నల్లగా ఉండేవారు. కానీ ఈ స్వభావాలేవి సమస్య కాదు. అగస్త్యుడే కాదు, సప్తఋషులందరిలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, వారి జీవితాన్నంతా  సాధనలోనే గడిపారు. వారినివారు సంసిద్ధం చేసుకున్నారు. 84 ఏళ్ల పాటు సాధన చేశారని చెబుతారు. 84 అనేది ఎంతో ముఖ్యమైన సంఖ్య. ఒక మానవుడు ఎంత చెయ్యగలడో అదంతా వీరు చేశారు. వారు మొత్తం 84 అంశాలను తెలుసుకొని, వాటికై కృషి చేసి, వారిని వారు సంసిద్ధం చేసుకున్నారు.

వారు ఎన్నో సంవత్సరాలు కృషిచేసి, కష్టపడి నేర్చుకున్న విద్యను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కారణం చేతే, వారు ఆ విధంగా రూపు దిద్దుకోగలిగారు.
ఆదియోగి శివుడు వారికి ఎంతకాలం బోధించారో, వారికి ఏదైతే ప్రసరింప చేయ్యలనుకున్నారో అదంతా ఎంత కాలంలో పట్టిందో, ఎవరికీ తెలియదు. అది 12 నెలలో లేదా 12 సంవత్సరాలో లేదా 144 సంవత్సరాలో మనకి తెలియదు. కానీ శోధించ తగినవన్నీ కూడా ఆయన ఈ ఏడుగురిని ఉపయోగించుకున్నారు. కాని దీనిని పార్వతీదేవితో చెయ్యలేదు.  ఆవిడకు దీనిని అనుభవపూర్వకంగా తెలియజెప్పినా కూడా, దానిలో ఉన్న శాస్త్రాన్ని ఆవిడకి అందించలేదు. ఎందుకంటే, వారిలో ఉన్న సాధన ఆవిడలో లేదు. ఈ ఏడుగురూ(సప్తఋషులు) కూడా ఎంతో అద్భుతమైన తేజోపాత్రులుగా వెలిగారు. అందుకే ఆదియోగి వీరితో ముక్తిని చేరుకొనే అన్ని విధానాలను పంచుకున్నారు. ఈ శాస్త్రాన్ని ఆదియోగి ఏడు భాగాలుగా విభజించి, ఒక్కొక్కరికీ 16 విధానాలను అందించారు. ఆ తరువాత చివరిగా వారికి ఒక పరీక్షను పెట్టి, ఆ పదహారూ కూడా ఆయనకే అర్పించేలా చేశారు. ఈరోజుకీ, దానికి ప్రతీకగానే మనం గురు పూజ చేస్తాం. వారి సాధన, వారి అచంచలమైన ఏకాగ్ర దృష్టి ఎంతో అసాధారణమైనది. వారు, దేనిని విడిచిపెట్టేయడానికైనా సుముఖులుగా ఉన్నారు. వారు ఎన్నో సంవత్సరాలు కృషిచేసి, కష్టపడి నేర్చుకున్న విద్యను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కారణం చేతే, వారు ఆ విధంగా రూపు దిద్దుకోగలిగారు.

మిమ్మల్ని మీరు సృజించుకోవడం

మరోమాటలో చెప్పాలంటే, ఈ పురాణం ఎం చెబుతుందంటే, సప్తఋషులు ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడలేదు.   వారిది ప్రత్యేకమైన జననమేమి కాదు. వారు పుట్టినప్పుడు నక్షత్రాలు ఒకటవ్వడం, ఒక పెద్ద మెరుపు ఎలా మెరిసిందొ వంటి కథలేవి చెప్పలేదు. అంతాకూడా చాలా సాధారణంగానే జరిగింది. వారు భారతదేశంలో ఎక్కడ పుట్టారో కూడా ఎవరికీ తెలియదు. ఎవరో స్త్రీలు, ఎక్కడో అంత ప్రాముఖ్యం లేని ప్రదేశంలో వారికి జన్మనిచ్చి ఉండవచ్చు.  వారు స్వర్గం నుంచి ఊడిపడలేదు. వారినివారు ఆవిధంగా తయారు చేసుకున్నారు. వారి కథలో ముఖ్యమైన అంశం ఇదే.

ఆయన ఎంచుకున్న, చేస్తున్న పనినుంచి ఎప్పుడూ ఆయన వెనుదిరగలేదు. అందుకని అగస్త్యముని లాగా ఉండాలంటే, మీరూ ఈ విధంగా మారాలి.
యోగా, యోగం, సాధన. మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎలా జన్మించినప్పటికీ, మీ తల్లిదండ్రులు ఎలాంటివారైనప్పటికీ, మీకు ఎటువంటి కర్మ ఉన్నప్పటికీ - మీరు సుముఖంగా ఉంటే; మిమ్మల్ని మీరు రూపు దిద్దుకోవచ్చు. అడవిలో ఉన్న ఎంతో పెద్ద చెట్లు కూడా, వాటినవే సృజించుకున్నాయి.. కదూ..?? మనం, ఇప్పుడు ఒక పెద్ద చెట్టుని, ఎంతో ఆశ్చర్యంగా చూస్తాం. కానీ, బహుశా కొన్ని సంవత్సరాల క్రితం, అది ఒక మొక్క అయి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకోలేనివారు, అది ఎక్కడినుంచో ఊడిపడిందేమోనని అనుకుంటారు. ఎందుకంటే, వారు ఎప్పుడూ వారి ఆలోచనల్లో మునిగిపోయి, దేనిపట్లా దృష్టి పెట్టరు కాబట్టి. మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక 60 సంవత్సరాల క్రితం, ఒక అడవిలో ఒక చెట్టు ఎన్నిటిని ఎదుర్కొని ఉండవలసి వచ్చి ఉండొచ్చో.. వాతావరణాన్ని, ఋతువులు మారడాన్ని, దానికి పౌష్టికత లభించడం కోసం ఇంకా ఎన్నిటికో అది కష్టపడి ఉండాలి.. అది ఎదిగి నిటారుగా నిన్చోగలగాలంటే..! దానికి ఆహారాన్ని ఎవరూ ఒక పళ్ళెంలో వడ్డించి అందించరు కదా..? అది సూర్య కాంతినీ తీసుకోవాలి, మిగతా చెట్లతో పోటీ పడి పౌష్టికతను, సారాన్ని భూమినుంచి తీసుకోవాలి.

ఆ చెట్టుకి ఇదే ఎంతో అఖండమైన సాధన.. కదూ..? కానీ, అది ఈరోజున ఉన్న విధంగా తననితాను సృజించుకుంది. ఇప్పుడు, మనం ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకుని దానిని చూస్తాం. అదేవిధంగా అగస్త్యుడిని, సప్తఋషులను కూడా మనం ఎంతో ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకుని చూస్తాం.  ఎందుకంటే వీరు మనకు మానవాతీతంగా కనిపిస్తారు కాబట్టి. వారు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. కానీ, వారిని వారు, ఆవిధంగా తయారు చేసుకున్నారు. ఎటువంటి సహాయ సహకారాలూ లేకపోయినా, వారి ఆకాంక్ష, వారి పట్టుదల, చెదరని వారి దృష్టితో వారు కృషి చేస్తూనే ఉన్నారు. ఆదియోగి వారిని విస్మరించినప్పటికీ, వారు సాధనను ఆపలేదు. వారిలో ఎంతో ముఖ్యమైన అంశం ఇదే. అది 84 సంవత్సరాలా లేదా 84 జీవిత కాలాల సాధనా అన్నది వారు  పట్టించుకోలేదు. వారు, అది చెయ్యడానికి సుముఖంగా ఉన్నారు.

అనుగ్రహం ఇంకా అచంచలమైన దృష్టి

ఉదాహరణకు, అగస్త్యముని, ఇక్కడకు దగ్గరలో,  ఒక పల్లెటూరిలో,  జన్మించాడనుకుందాం. ఒకరోజున, అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఆయన హిమాలయాలకు ఆదియోగివద్ద ఉండడానికి వెళ్ళారనుకోండి. ఆ గ్రామస్తులు అగస్త్యుడి గురించి ఏమి మాట్లాడతారనుకుంటున్నారు..? వారి తల్లిదండ్రులని పొగిడి, మీ కొడుకు ఒక గొప్ప సాధువు అవ్వబోతున్నాడని చెప్తారా..? లేదు. వారు, వారి తల్లిదండ్రులను హేళన చేస్తారు. “ఏడీ..? మీ మూర్ఖుడు ఎక్కడ ఉన్నాడు..? “అని అంటారు. ఒకవేళ ఎన్నో సంవత్సరాల తరువాత ఆయన తిరిగి వచ్చినప్పటికీ కూడా, ఆయన హిమాలయాలకు వెళ్లి ఆదియోగిని కలిసి వచ్చాడని వాళ్ళందరూ ఆయనను చూడడానికి ఉత్సాహం చూపిస్తారని అనుకుంటున్నారా..? లేదు. వారు ఆయనని చూసి నవ్వి ఉండి ఉండవచ్చు.

ఆయన ఒక చిన్న గోచీ గుడ్డతో ఒక మృగంలాగా కనిపిస్తూ తిరిగి వచ్చాడు కాబట్టి..!! ఈరోజున మనం ఇదంతా ఎంతో ఆశ్చర్య విభ్రమాలతో చూస్తూ ఉంటాం.  కానీ, ఆయన కాలంలో ఇటువంటి వాటికి ఎటువంటి గుర్తింపు గానీ, ప్రశంసలు గానీ లేవు. ఎవ్వరూ ఆయన కోసం చప్పట్లు కొట్టలేదు. ప్రతీవాళ్ళూ కూడా, ఈయన ఒక మూర్ఖుడు, తల్లిదండ్రులను వదిలేసి, బాధ్యత లేకుండా వెళ్ళిపోయాడనుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ, వారు ఎప్పుడూ చెదరని దృష్టితో ఉన్నారు. ఇది అగస్త్యముని. ఒక విషయం ఏమిటంటే, ఒకసారి మీరు, ఒక దిశని ఎంచుకున్నాక, ఏమి జరిగినా అదేవిధంగా ఉండగలగాలి. ఆయన, అనుగ్రహంలో ఉండాలని ఎంచుకున్నారు. ఆయన ఎంచుకున్న, చేస్తున్న పనినుంచి ఎప్పుడూ ఆయన వెనుదిరగలేదు. అందుకని అగస్త్యముని లాగా ఉండాలంటే, మీరూ ఈ విధంగా మారాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు