ప్రశ్న: పూర్వం ఆది శంకరాచార్యుల వారు, మరణించిన ఒక రాజుగారి శరీరంలో ప్రవేశించి, ఆ శరీరంతో కొంతకాలం జీవించారు అంటారు. ఇది నిజంగా సాధ్యమేనా? సాధ్యమే. అయితే, ఎలా సాధ్యం? అలాంటి అసాధారణమైన పనులుచేయడానికి ఎలాంటి యోగవిద్యా కౌశలం అవసరం అవుతుంది?

సద్గురు: ఆది శంకరులు ఒకసారి, ఒకరితో వాదంచేసి, అందులో గెలవటం జరిగింది. అప్పుడు, ఓడిపోయిన వ్యక్తి గారి భార్య ఆ వాదంలో తానూ కలగజేసుకొంది. ఆడవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసుకదా? ఆదిశంకరుల వాదన పటిమ అసాధారణమైంది. అలాంటి వారితో మీరు వాదనలు పెట్టుకోకూడదు. కానీ ఆవిడ మాత్రం మంచి సాకు ఒకటి పట్టుకొని వాదనలోకి దిగిపోయింది. 'మీరు నా భర్తను ఓడించారు. కానీ నేను లేకుండా ఆయన అసంపూర్ణుడు. మేమిద్దరమూ రెండు అర్ధ భాగాలం. ఇద్దరమూ కలిస్తేనే ఒక పూర్ణత్వం. కాబట్టి మీరు నాతో కూడా వాదించాలి!' అంది. ఈ తర్కాన్ని ఎలా తిరస్కరించగలం? అందుచేత ఆవిడతో వాదం ఆరంభమైంది. క్రమంగా, వాదంలో తను ఓడిపోతున్నాని ఆమె గ్రహించింది. దాంతో ఆమె ఆయనతో కామ శాస్త్ర పరమైన విషయాలను గూర్చి ప్రశ్నించటం మొదలుపెట్టింది. శంకరులు తను చెప్పవలసిందంతా చెప్పారు. కానీ ఆమె మరిన్ని వివరాలలోకి వెళ్ళిపోయి, 'మీకు ఈ విషయాల గురించి స్వానుభవ పూర్వకంగా తెలిసిందే చెప్పాలి సుమా!' అని పట్టు పట్టింది. మరి శంకరులేమో ఆజన్మ బ్రహ్మచారి! ఆయనకు ఇదంతా తనను ఓడించేందుకు ఆమె పన్నుతున్న పన్నాగం అని అర్థమై పోయింది. కాబట్టి ఆయన, 'నాకు ఒక మాసం సమయం కావాలి! ఆ తరవాత, ఇప్పుడు మనం వాదాన్ని ఎక్కడ ఆపుతున్నామో అక్కడినుంచి మళ్ళీ కొనసాగించుదాం.' అన్నారు.

అక్కడినుంచి ఆయన ఒక గుహలోకి వెళ్లారు. 'నేను నా శరీరం వదిలేసి కొన్నాళ్ళ పాటు మరో శరీరంలోకి ప్రవేశించబోతున్నాను. కనుక మీరు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరినీ ఈ గుహలోకి రానివ్వకండి!' అని శిష్యులకు ఆదేశం ఇచ్చారు.

జీవ శక్తి అనేది పంచప్రాణాల రూపంగా ఉంటుంది. ప్రాణ, సమాన, అపాన, ఉదాన, సమాన వాయువుల రూపంగా ఉంటుంది. వీటన్నిటికీ వాటి వాటి విధులూ, కర్తవ్యాలు ఉంటాయి. ప్రాణ వాయువు శ్వాస క్రియనూ, ఆలోచన ప్రక్రియనూ, స్పర్శ జ్ఞానాన్నీ నియంత్రిస్తుంది. కనకనే శ్వాస ఆగిపోతే, మనిషి మరణించాడు అంటాం. ప్రాణవాయువు శరీరం నుంచి నిష్క్రమించటం మొదలయినప్పుడు శ్వాస ఆగిపోతుంది. ప్రాణ వాయువు శరీరం నుంచి పూర్తిగా నిష్క్రమించటానికి దాదాపు గంటన్నర కాలం పడుతుంది.

అందుకే శ్వాస ఆగిపోయిన తరవాత, కనీసం ఒక గంటన్నర కాలం పాటు వేచివుండి, ఆ తరవాత గాని పార్థివ శరీరాన్ని దహనం చేసే సన్నాహాలు చేయకూడని సంప్రదాయం చెప్తున్నది. శ్వాస ఆగిన తరవాత కూడా, మనిషి కొంత సమయం పాటు కొన్ని విధాలుగా సజీవుడిగానే ఉంటాడు. అందుకే మనిషి శ్వాసక్రియ పూర్తిగా ఆగిపోయి, మెదడు పనిచేయటం పూర్తిగా మానివేసి, శరీరంలో అన్నీ విధాల స్పందనలూ సంపూర్ణంగా సమాప్తం అయిపోవటానికి గంటన్నర కాలం నిరీక్షిస్తాం. ఆ తరవాత దహన సంస్కారాలు నిర్వహిస్తే, ఇక ఆ కళేబరానికి దహన తాపం, బాధా ఉండవు.

అయితే పంచప్రాణాలలో ఒక్కటి మటుకు, మరి కొంత ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటుంది. పంచ ప్రాణాలలో చివరిదయిన 'వ్యాన' వాయువు 12 నుంచి 14 రోజుల దాకా అలాగే ఉంటుంది. శరీరాన్ని నిలిపి ఉంచటం ఈ వ్యానం అనే ప్రాణం మన శరీరంలో నిర్వహించే విధి. అందుకే శంకరులు తమ శరీరాన్ని వదలినప్పుడు, తన వ్యాన వాయువును మాత్రం ఆ శరీరంలోనే ఉంచారు. ఆ శరీరాన్ని చెడిపోకుండా ఉంచటానికి అది అవసరం.

ఆ సమయంలోనే, ఒకానొక రాజు పాము కాటుకు గురై మరణించటం జరిగింది. పాము విషం మనిషి శరీర వ్యవస్థలోకి చేరిందంటే, అది రక్తాన్ని గడ్డ కటిస్తుంది. విష ప్రభావం వల్ల రక్తప్రసరణ కష్టమైపోతుంది. దానితో, శ్వాసక్రియ కూడా కష్టమైపోతుంది. ప్రాణ వాయువు శరీరంలో నుంచి నిష్క్రమించటానికి చాలా ముందుగానే, శ్వాస ఆగిపోతుంది. ఎవరయినా ఆ శరీరంలోకి 'పరకాయ ప్రవేశం' చేయటానికి ఆ సమయం చాలా అనువుగా ఉంటుంది. మామూలుగా అయితే ప్రాణ వాయువు శరీరంలోనుంచి నిష్క్రమించేందుకు, గంటన్నర వ్యవధి మాత్రమే ఉంటుంది. త్రాచు పాము విషం శరీరంలో వ్యాపించితే మాత్రం, ఈ వ్యవధానం దాదాపు నాలుగున్నర గంటలపాటు కొనసాగుతుంది.

కనక, ఆది శంకరుల వారు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకొని, రాజుగారి శరీరంలోకి తేలికగా పరకాయ ప్రవేశం చేయగలిగారు. ఆ శరీరంలో కొన్నాళ్లు జీవించి, అన్ని విధాల భోగాలూ, స్వానుభవ రూపంగా తెలుసుకోగలిగారు. దాంతో, ఆయన వాదంలో తన ప్రతిద్వంద్విని అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆమె కోరినట్టే స్వానుభవ పూర్వకంగా సమాధానం చెప్పగల స్థితికి వచ్చేశారు.

అయితే, అందులో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. చనిపోయిన రాజుగారి ఆంతరంగికులలో ఎందరో తెలివిగల వారు ఉన్నారు. రాజుగారు చనిపోయారని ప్రకటించిన తరవాత, ఆయన మళ్ళీ సజీవంగా లేచి కూర్చోవటం, తన మామూలు ధోరణికి కొంత భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండటం చూస్తే, వాళ్ళకు ఏదో అనుమానం వచ్చింది. పునర్జీవితుడైన రాజు రూపంలో తిరుగాడుతున్నది తమ రాజుగారు కాదనీ, మరెవరో వ్యక్తి అనీ వాళ్ళు అనుమానించారు.

అందుచేత, వాళ్ళు రాజభటులను రాజధానిలో అన్ని ప్రాంతాలకూ పంపారు. ఊళ్ళో ఎక్కడయినా ఏదయినా మృత కళేబరం కనిపిస్తే, దాన్ని వెంటనే దహనం చేయించమని వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. అలాంటి కళేబరంలో నుంచి బయటపడి ఎవరయినా తమ రాజుగారి శరీరంలోకి 'పరకాయప్రవేశం' చేసి ఉంటే, అలాంటి వాడికి మళ్ళీ తన శరీరంలోకి ప్రవేశించే అవకాశమే లేకుండా దాన్ని దహనం చేస్తే, అతగాడు ఇక తప్పనిసరిగా రాజు శరీరంలో ఉండిపోతాడు అని వాళ్ళ ఆలోచన. ఎవరు తమ రాజుగారి శరీరంలో పరకాయ ప్రవేశం చేయనే చేశారు. ఆ చేసిన వాడెవరో, కొన్ని తేడాలున్నా చూపులకు పాత రాజు లాగే ఉన్నాడు. ఎవరయితేనేమీ, మళ్ళీ మళ్ళీ మార్పులు లేకుండా కొనసాగితే సరిపోతుంది అనుకొన్నారు. కానీ వాళ్ళ ఉపాయం పారలేదు. తన పని పూర్తి కాగానే శంకరులు మళ్ళీ తన స్వశరీరంలోకి ప్రవేశించగలిగారు.

ఇలాంటి పర కాయ ప్రవేశాలు సాధ్యమా? అని ఇప్పుడు ప్రశ్న. ఆహాఁ, సాధ్యం కాకేమి, ఖచ్చితంగా సాధ్యమే!

మరి అటువంటిది సాధ్యమా? సాధ్యమే! అంత గొప్ప ఘనకార్యమూ కాదు. కానీ ఇలా పరకాయ ప్రవేశం చేయాలంటే, మీకు మీలో అంతర్గతంగా ఉండే ప్రాణశక్తి లక్షణాల గురించీ, వాటి నడవడి గురించీ, కొంతపాటి అవగాహన మాత్రం అవసరం. బతికి ఉన్న వాళ్ళ శరీరాలలోకి పరకాయ ప్రవేశం చేయటం అంటే అది కొంత క్లిష్టమైన వ్యవహారం. ఇప్పుడే ప్రాణం పోయినవారిలోకి ప్రవేశించటం కొంత సులభం. ప్రాణం పోయిన తరవాత మొదటి గంటన్నర సమయం అందుకు బాగా అనువైనది. ఎందుకంటే, ఆ కళేబరంలో అప్పుడే కొంత శూన్యత్వం ఏర్పడి ఉంటుంది. అది తప్ప, మిగతా శరీర వ్యవస్థ అంతా ఇంకా యథా తథంగానే ఉంటుంది.

ఈ కారణం చేతే, భారత దేశంలో మృత్యు వు ఆసన్నమై, శ్వాస తగ్గిపోతున్న వాళ్ళని ఇంట్లోనుంచి బయటకు తెచ్చేస్తారు. సాంబ్రాణీ అవీ వెలిగించి, భగవన్నామ కీర్తన లాంటివి చేస్తారు. మరణం ఆసన్నమైన వారికి వీటి వల్ల కొంత ఊరట కలుగుతుందని నమ్మకం. అంతే కాదు, ఆ శరీరంలోకి మరెవరూ ప్రవేశం చేసే అవకాశం ఉండకూడదని కూడా. పరకాయ ప్రవేశాలను నిరోధించేందుకు, ఎన్నో సంప్రదాయాలూ, ఉపాయాలూ ఉన్నాయి. అయినా ఈ కాలంలో పరకాయ ప్రవేశాలు చాలా చాలా అరుదు. అందుకే వాటిని అసాధారణ ఘనకార్యాలుగా భావించటం జరుగుతోంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు