ప్రశ్న: సద్గురూ! సహకరించని వారితో సంబంధం ఉంటే, మరి కూరుకుపోకుండా, ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోవడం ఎలా? 

సద్గురు: మీకు ఆధ్యాత్మికంగా ముందుకుపోవడం మీ లక్ష్యం అయితే, మీ జీవిత భాగస్వామి ఒక దెయ్యం అయితే, అది ఎంతో మంచిది. మీ భార్య అయినా, మీ భర్త అయినా, అది ఆధ్యాత్మిక అభివృద్ధి ఒక్కదానికే కాదు. మీకు అన్యోన్య దాంపత్యం కావాలన్నా, మీకు ఇష్టమైన వారిని మీరు ఎంచుకోవాలి. అయినా, ప్రపంచంలోని ఏ వ్యక్తిలోనైనా మీకు నచ్చని విషయం ఏదో ఒకటి ఉంటుంది, అవునా? మీరు మీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఆ విషయాన్ని ఎంచుకోండి, మిగతా దానితో మీ జీవితాన్ని ఆనందించండి. 

మీ ఉద్దేశంలో మంచి దాంపత్యం కావాలనే అయితే, ఇద్దరి మధ్య కొంత పొంతన అవసరం, అంటే మీ ఇద్దరి మధ్యా కొన్నైనా నచ్చే విషయాలు ఉండాలి. మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరాలంటే కొంత ఇచ్చి, పుచ్చుకునే తత్వం ఉండాలి. దానికి ప్రేమ, ఓపిక ఉండాలి. మీకు సహకరించని వారితో ఎవరితోనైనా సయోధ్య కావాలి, కానీ వారి దోవలోకి వెళ్ళకూడదు అని మీకుంటే, దానికి ఎంతో ఓర్పు కావాలి. మీరు ప్రేమించే వారితో, అది అంత సులభం కాదు.

మరి ఏం చేయాలి? మీరు చేయగలిగినదొకటి ఏమిటంటే, మీరు మిమ్మల్ని ఎలా పరిణమింప చేసుకోవాలంటే, మీ సమక్షంలో ఉంటే, తెలియకుండానే వాళ్లు మీ వైపుకు తిరగాలి.

కొంతకాలం కిందట, నేను బయటకి వెళ్ళినప్పుడు వాన కురవడం మొదలైంది. రెండు ఫోన్లు నాతో ఉన్నాయి. ఎందుకంటే నాకు కొన్ని ముఖ్యమైన ఫోన్ కాల్స్ రావాల్సి ఉంది. ఒకటి ఇండియా ఫోను, మరో ఫోను బయట ఫోన్ కాల్స్ కి. ఒకటి నా కోటు జేబులో, మరొకటి నా పాంటు జేబులో ఉన్నాయి. రెండూ తడిచి పాడైపోయాయి. నా చుట్టూ ఉన్న వాళ్లు ఏమన్నారంటే, “సద్గురూ రెండు ఫోన్లు ఎందుకు, ఇప్పుడు ఒక ఫోన్ లోనే రెండు సిమ్ లు వేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక చైనా ఫోను. మీరు దానిని ఒకరకంగా పట్టుకుంటే, ఇండియా సిమ్ మీద మాట్లాడవచ్చు. దాన్ని అటు తిప్పితే అదే తనంతట తాను మరో సిమ్ కార్డు మీదకి మారిపోతుంది. మీరు ఏదీ మార్చనక్కరలేదు.”
నా దగ్గర అటువంటి ఫోన్ లేదు. కానీ నేను చెప్పేదేమిటంటే  మీరు మనుషులను మీ వైపు తిప్పుకోవాలంటే మీరు అలా మారిపోవాలి. మీరు ఒంటరిగా నడవాలంటే చాలా సులభం. కానీ మీరు ఇతరులను మీతో తీసుకు వెళ్లాలంటే, దానికి ఎంతో శ్రమించాలి.

ఒకసారి గౌతముని ఎవరో ఈ ప్రశ్న అడిగారు ‘ఆధ్యాత్మికపథంలో పోవాలంటే మీరు ఒంటరిగా నడవాలా? లేదా మరొకరితో వెళ్ళవచ్చా?’ అని. 

అప్పుడు ఆయన ‘ఒక మూర్ఖునితో నడవడం కంటే, ఒంటరిగా ఉండటమే మంచిది’ అన్నారు.

ఎందుకంటే వారు మీ సమయాన్ని, శక్తిని వృధా చేయవచ్చు. అంతేకాదు వారు బలవంతులైతే వారు మీ దారిలోకి రావడం కంటే, మిమ్మల్ని వారి దారిలోకి తిప్పుకోవచ్చు. అక్కడ ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది.

గౌతముడు చెప్పింది నేను చెప్పను కానీ, నేను చెప్పేది ఏమిటంటే,  మీరు ఎలా నడచినా సరే, ఆధ్యాత్మిక పథం అంటే, మీరు ఎప్పుడూ ఒంటరే, మీతో ఎవరూ ఉండరు. మీరు మరొకరితో పంచుకునేవి శారీరకమైనవి, భౌతికమైనవే. మీరు ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే వెళతారు. మీకు కవల సోదరుడుగాని, సోదరిగాని ఉన్నాసరే, మీరు వచ్చింది ఒంటరిగానే, పోయేది ఒంటరిగానే. ఈ రెంటినీ మీరు కలగాపులగం చేయొద్దు. మీరు దాన్ని బాగా సమర్థించుకోండి. భౌతికమైనవి మీ శక్తి మేర సమర్థించుకోండి. మీకు ఏది సాధ్యం, ఏది అసాధ్యం చూడగలగాలి. మీ భాగస్వామి మీతో వస్తే అది ఎంతో అద్భుతం, రాకపోతే పర్వాలేదు, అంతేగాని వారిపై కక్ష పెట్టుకోవద్దు, ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఆ మార్గంలోకి మరల వద్దు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు