ఆరోగ్యమంటే....సంపూర్ణత్వం..!!

 

Sadhguruప్రస్తుతం, వైద్యశాస్త్రాలు భౌతిక శరీరం గురించి తెలుసుకోవడానికే పరిమితమయ్యాయి. ఆ పరిధిని దాటి ఏదైనా సంభవిస్తే దానిని మనం అద్భుతం అనుకుంటున్నాం. మౌలికంగా, ఆరోగ్యమనే పదం ‘సంపూర్ణత్వం’ అనే మూలం నుంచి పుట్టింది. ‘ఆరోగ్యంగా ఉన్నాం’ అని మనకు అనిపించడం అంటే మనలో మనకు సంపూర్ణానుభూతి ఉందన్నమాట. కేవలం వైద్యపరంగా మనకు ఏ రోగాలూ లేకుండా ఉండడమే సంపూర్ణారోగ్యం కాదు. ఒక మానవునిగా మనలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణానుభూతి కలిగినప్పుడే నిజానికి మనం సంపూర్ణారోగ్యంతో ఉన్నట్లు. వైద్యశాస్త్ర పరంగా సంపూర్ణారోగ్యంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు, కానీ వారంతా నిజానికి సంపూర్ణారోగ్యంతో ఉన్నట్లు కాదు, ఎందుకంటే వారి అనుభూతిలో వారికి స్వస్థత లేదు కాబట్టి.

ఎవరైనా తమలో తాము సంపూర్ణత్వాన్ని, భావైక్యాన్ని అనుభూతి చెందాలంటే, వారి శరీరం, మనస్సు, వీటిన్నిటిని మించి వారిలోని చేతనశక్తి ఒక నిర్దిష్ట స్థాయిలో ఉండాలి. వైద్యశాస్త్రపరంగా ఒక వ్యక్తి సంపూర్ణారోగ్యాన్ని కలిగి ఉన్నా, అతనిలోని శక్తి మందముగా ఉండి ఉండవచ్చు. కొందరికి అన్నీ సక్రమంగానే ఉన్నట్లు కనబడుతున్నా, తమ లోపలా, బయటా కూడా జరగవలసిన అనేకమైనవి సక్రమంగా ఎందుకు జరగటం లేదో తెలియదు. తమలోని చేతనశక్తిని వారు సరిగా పరిరక్షించుకునేందుకు ప్రయత్నించక పోవడమే ఇందుకు కారణం.

మీ శక్తి శరీరం సమతులంగా ఉండి, చేతనశక్తి సరిగా ప్రవహిస్తుంటే మీ భౌతిక శరీరం, మానసిక శరీరం సంపూర్ణారోగ్యంతో ఉంటాయి;

మీరు జీవితంలో అనుభూతి చెందే ప్రతి శారీరక, మానసిక పరిస్థితికి ఒక శక్తిపరమైన మూల కారణం ఉంటుంది, దానికి మళ్ళీ రసాయనిక కారణం కూడా ఉంటుంది. ఒక విధంగా చూస్తే ప్రస్తుతం మనమంతా తీసుకునే ఆధునిక అలోపతి మందు కేవలం ఇలాంటి రసాయనిక పరమైనదే. మన శరీరంలో తలెత్తే ప్రతి ఆరోగ్య సమస్యకు మనం ఏదో ఒక మందుని, రసాయనాన్ని, లోపలికి పంపి మళ్లీ సమతుల్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఒక అంశాన్ని పెంచడానికో, లేదా మరో దాన్ని  తగ్గించడానికో ఇలా రసాయనిక పదార్థాలని వాడుతూ ఉంటే, వాటి వల్ల మరికొన్ని సమస్యలు (సైడ్‌ఎఫెక్ట్స్‌) తలెత్తుతాయి. ఈ సైడ్‌ ఎఫెక్టులను తగ్గించడానికి మళ్లీ విరుగుడు మందులుంటాయి. వాటి ప్రభావాన్ని నియంత్రించడానికి మరో విరుగుడు మందు ఉంటుంది. ఇలా ఇది ఎడతెగకుండా కొనసాగుతుంది. మన శరీరంలో రసాయన స్థాయిలో ఏది జరుగుతున్నా దానిని మన చేతన శక్తి ప్రవాహం నియంత్రిస్తుంటుంది. ఒక వ్యక్తి శరీరంలో ఆమ్లాలు పెరిగిపోయాయనుకోండి, అది నివారించడానికి క్షారాలను ఇస్తాం. కాని అసలు అతనిలో ఆమ్లాలు ఎందుకు పెరిగిపోయాయి? అతని శరీరం, మనసు, అతని చేతనశక్తి పనిచేసే విధానమే ఇందుకు కారణం.

అందుకే, యోగ పరంగా ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాలను గమనించము, కేవలం చేతనశక్తి ప్రవాహాన్నే గమనిస్తాము. మీ శక్తి శరీరం సమతులంగా ఉండి, చేతనశక్తి సరిగా ప్రవహిస్తుంటే మీ భౌతిక శరీరం, మానసిక శరీరం సంపూర్ణారోగ్యంతో ఉంటాయి; ఇందులో సందేహమే లేదు. మన శక్తిశరీరాన్ని సంపూర్ణ సక్రియ దిశలో ఉంచుకోవడం అంటే ఏదో చికిత్స తీసుకోవడమో, మరేదో చేయడమో అని కాదు. మన చేతనశక్తి మూలాలను సరి చేసుకోవడం, దాన్ని సక్రియంగా, సరైన దిశలో స్పందించేలా చేసుకోవడం, అలా జరిగేలా మౌలికమైన యోగిక పద్ధతుల్ని అవలంబించి మన శరీరం, మనస్సు సహజంగానే బాగుండేలా చూసుకోవడం.

జీవితంలోని ఒత్తిడులు, తీసుకునే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు ఇవన్నీ అనేక రకాలుగా మనపై ప్రభావాన్ని చూపుతాయి.

ఇక ఆరోగ్యానికి సంబంధించినంతవరకూ, ఎవరూ పూర్తిగా అనువైన పరిస్థితులలో జీవించరు. జీవితంలోని ఒత్తిడులు, తీసుకునే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు ఇవన్నీ అనేక రకాలుగా మనపై ప్రభావాన్ని చూపుతాయి. మనం ప్రపంచ వ్యవహారాలలో ఎంత ఎక్కువగా లగ్నమైతే అంత ఎక్కువగా మన రసాయనిక సమతుల్యంపై ఇవి ప్రభావం చూపి మనల్ని అనారోగ్యానికి లోనైయ్యేలా చేస్తాయి. కానీ, ఒకవేళ మనమే కనుక మనలోని చేతనశక్తి వ్యవస్థని క్రమబద్ధీకరించుకుని, సక్రమంగా ఉంచుకుంటే ఇలాంటి పరిస్థితుల ప్రభావం మనపై ఉండదు. మన భౌతిక శరీరం, మానసిక శరీరం రెండూ సరైన ఆరోగ్యంతో ఉంటాయి, ఇందులో సందేహమే లేదు.

చూడండి! మన జీవనం అనేక విధాలుగా సాగుతుంది. మీకు విద్యుత్తు గురించి అసలు ఏమీ తెలియదు అనుకుందాం, ‘’ఈ హాలు అంతా చీకటిగా ఉన్నా, అక్కడ ఉన్న స్విచ్‌ వేయండి చాలు, హాలంతా వెలుగు నిండుతుంది!’’ అని నేను అన్నాననుకోండి, మీరు నమ్ముతారా? లేదు! ఒకవేళ నేనే స్విచ్‌ వేసి గది అంతా వెలుగులు నింపితే, మీరు దానిని ఆశ్చర్యంగా భావిస్తారు. అవునా, కాదా? కారణం మీకు విద్యుత్తు ఎలా పనిచేస్తుందో తెలియదు కనుక. అలాగే జీవనం ఎన్నో రీతులుగా సాగుతుంది. కాని మనల్ని మనం మన భౌతిక, తార్కిక -  భౌతిక అనుభవాలకు, తార్కిక ఆలోచనలకు మాత్రమే పరిమితం చేసుకుంటున్నాం.

ప్రస్తుతం, వైద్యశాస్త్రాలు కేవలం భౌతిక శరీరాన్ని తెలుసుకోవడం వరకే పరిమితమౌతున్నాయి. ఆ పరిధిని దాటి ఏదైనా సంభవిస్తే దానిని అద్భుతంగా మనం భావిస్తున్నాం. ఇది మరో రకమైన శాస్త్రమని నేనంటాను. అంతే, ఇదే మరో రకమైన శాస్త్రం. మనలోని జీవచైతన్యం ఈ శరీరం మొత్తాన్ని- ఈ ఎముకలను, ఈ మాంసాన్నీ, ఈ గుండెను, ఈ కిడ్నీలను, ఇలా ఒకటేమిటి సమస్త శరీరావయవాలనూ సృజిస్తుంది. మరి ఇన్నింటిని సృజించిన ఈ చైతన్యశక్తి మనలో ఆరోగ్యాన్ని సృజింపలేదా చెప్పండి? మన చైతన్యశక్తిని మనం సక్రమంగా, సరైన దిశలో సంపూర్ణంగా ప్రవహింపజేస్తే అది కేవలం ఆరోగ్యమే కాదు, అంతకన్నా అధికమైనవే అందిస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1