రకుల్ ప్రీత్ సింగ్: ఈ ‘ఆకర్షణ’ తదితర విషయాల గురించి నాకు ఆసక్తి ఉంది. ఎందుకంటే ఎవరైనా తాము కోరుకున్నది గట్టి నమ్మకంతో, సరైన దిశలో ప్రయత్నాలు చేస్తే, జరుగుతుందని అంటారు. ఎందుకంటే, మీ విధిని మీరే నిర్ణయించుకుంటారని, మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకుంటారని, అంటే నా ఉద్దేశం మీరు ఒక సానుకూలమైన సంకేతాలను పంపిస్తున్నారు అని..

సద్గురు:ఎవరికి?

రకుల్ ప్రీత్ సింగ్: విశ్వానికి.

సద్గురు: ఏ దిశలో? పైకా, కిందకా?

రకుల్ ప్రీత్ సింగ్: నేను అడుగుతున్నది ఈ ఆకర్షణ అనేది ఇది ఎలా పనిచేస్తుంది అని?

సద్గురు: అది పని చేయదు.

రకుల్ ప్రీత్ సింగ్: మరి ఏది పనిచేస్తుంది? ఎవరైనా తమ విధిని ఎలా నిర్ణయించుకోలరు?

సద్గురు:రెండు అయస్కాంతాలు అయినా, ఆడ మగ అయినా, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అయినా, ఈ ఆకర్షణ అనేది రెండు భిన్న ధ్రువాల మధ్యనే జరుగుతుంది. మరి మీరు ఇప్పుడు విశ్వం గురించి మాట్లాడుతున్నారు, అంటే మీ ఉద్దేశంలో మీరు బయట నుంచి విశ్వంలోకి వచ్చిన వారా?

రకుల్ ప్రీత్ సింగ్: నేను విశ్వంలో భాగమే.

సద్గురు: మీరు విశ్వంలో భాగమైతే, మరి దేని గురించి ఆకర్షణ?

రకుల్ ప్రీత్ సింగ్: : అందరూ మీ విధిని మీరే నిర్ణయించగలరు అంటారు కదా?

సద్గురు: మీరు మీ విధిని నిర్ణయించుకోగలరు ఇంకా మీరు నిర్ణయించుకోవాలి కూడా. నిజానికి, మనిషి అంటే అర్థం అదే. మీరు ఈ ప్రపంచంలోకి మిగతా ఏ ఇతర జీవిగా వచ్చినా, అవి కొన్ని నిర్ణీత రీతిలో తమ జీవితాన్ని గడిపేస్తాయి. వాటికి పర్వాలేదు. ఎందుకంటే వాటి సామర్ధ్యత అంతవరకే.

కానీ, మీరు మీ జీవితాన్ని చూస్తే, మిగతా వాటితో పోల్చుకుంటే మీరేమి భిన్నంగా చేయటం లేదు. అవి పుట్టాయి, మీరు పుట్టారు. అవి పెరుగుతాయి, మీరు పెరుగుతారు. అవి పునరుత్పత్తి చేస్తాయి, మీరూ చేస్తారు. అవి మరణిస్తాయి, మీరూ మరణిస్తారు. రెంటిలో పెద్ద తేడా ఏమీ లేదు. కానీ, మీరు ఈ చిన్న చిన్న విషయాలను స్పృహతో చేయగలరు. అదే మానవునిగా ఉండటంలోని విశిష్టత.

మీరు, మీ చేతిని స్పృహతో కదిలిస్తే, మీకు కావాల్సింది చేయవచ్చు. అలాగే మీ ఆలోచనలు కూడా స్పృహతో నిర్వహిస్తే, మీ మనసు, మీ ఆలోచన కూడా మీకు కావాల్సింది చేస్తుంది. కానీ మీ ఆలోచనలు మీకు కావలసిన విధంగానే ఉంటే, మిమ్మల్ని మీరు మహదానందంతో ఉంచుకుంటారా లేక బాధగా ఉంచుకుంటారా?

రకుల్ ప్రీత్ సింగ్: మహదానందంగా.

సద్గురు: మీరే స్వతహాగా ఆనందంగా ఉంటే, మీరు సంతోషం కోసం వెతికే ప్రయత్నం చేస్తారా?

రకుల్ ప్రీత్ సింగ్: లేదు, అలా ఉంటే చాలు అనుకుంటారు.

సద్గురు: మీరు బ్రహ్మానందంగా ఉంటే, మీరు సంతోషం కోసం వేంపర్లాడరు. ప్రపంచంలో అందరూ ఇలా శాంతంగా, సంతోషంగా ఉండటం అనేది అది గొప్ప విషయాలు అనుకుంటారు. మీరు మహదానంతో ఉంటే అవి మీకు గొప్ప విషయాలు అనిపించవు. మీ ఆలోచనలు, మనోభావాలు మీ నుంచి సూచనలు తీసుకుంటే మీరు మిమ్మల్ని ఉత్తమ స్థాయి ఆనందంలో ఉంచుకుంటారు కదా?

రకుల్ ప్రీత్ సింగ్: : అవును.

సద్గురు: మరి అలా జరిగితే, మీ మొత్తం జీవన ప్రక్రియ చాలా హాయిగా జరిగిపోతుంది. కానీ ప్రస్తుతం మీరు మాటువేసిన పులి లాంటి వారు. మీకు ఎప్పుడూ, ఏదో ఒకటి పొందాలనే ఉంటుంది. నిజానికి, మీరు పొందవలసినది ఏమీ లేదు. మీరు అలా కూర్చుని ఉంటే మీ జీవితం పరిపూర్ణం. అటువంటప్పుడు అది పూర్తి హాయిగా ఉంటుంది. అది అంత హాయిగా ఉన్నప్పుడు, అది ఎంతో గ్రహణ శక్తితో ఉంటుంది. అటువంటప్పుడు ఇలా మీ వృత్తిని కొనసాగించటం, డబ్బు సంపాదించడం, ఆనందంగా, ప్రేమపూర్వకంగా ఉండడం, లేక ప్రేమలో పడటం అనేవి కూడా మీకు పెద్ద విషయాలుగా అనిపించవు. ఎందుకంటే, అలా కూర్చుని కూడా, మీరు మీలో ఎంతో ఉన్నత స్థాయి హాయి పొందుతున్నారు.

మరి అటువంటప్పుడు, మీరు మీ జీవితంతో ఏమి చేస్తారు? సహజంగానే, మీరు మీ అనుభూతిలో లేని దేనినో అనుభూతిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికం అలానే మొదలవుతుంది. అలానే మీరు మీ జీవితాన్ని మీ అధీనంలోకి తీసుకుంటారు.

మీరు దేన్నో కోరుకుంటున్నారు.... మీరు ఈ విషయాన్ని గమనించండి, చాలామందికి, కనీసం 50 శాతం మందికి, తాము కోరుకున్నవి జరుగుతున్నాయి. కానీ వారు చేస్తున్నది ఏమిటంటే, జరగని వాటిపై వారు తమ దృష్టి పెడుతున్నారు. చక్కగా స్థిరపడిన వారిలో అయితే, వారు కోరుకున్న వాటిలో 90 శాతం వరకు జరగవచ్చు. ఇక వారు మదన పడేది, ఈ మిగతా పదిశాతం గురించే. మీరు ఆ 90% గురించి సంతోషపడరు, ఎందుకంటే వారికి కావలసిన దానిలో 10 శాతం దొరకలేదు అనే బాధ.

ఏవో కొన్ని విషయాలు జరగలేదు, అవే మిమ్మల్ని బాధ పెడతాయి. ఇలా ఎందుకంటే, మీరు కోరుకున్నవన్నీ మీరు కోరుకునే విధంగానే జరగబోవు. ఎందుకంటే పరిస్థితులు కేవలం మీ గురించే కాదు. అక్కడ ఎంతోమంది, ఎన్నో శక్తుల యొక్క భాగస్వామ్యం ఉన్నది. అన్నీ నేను కోరుకునే విధంగా జరగాల్సిన పనిలేదు, కానీ నేను కోరుకున్న విధంగా నేను ఉంటే, నేను పరమానందంగా ఉంటాను. నేను కొట్టిన గోల్ఫ్ బంతి సూటిగా వెళ్ళినా, లేక ఎక్కడో పడిపోయినా నేను మహదానంగానే ఉంటాను.

రకుల్ ప్రీత్ సింగ్: అంటే మీరు గోల్ఫ్ ఆడుతున్నంతసేపూనా?

సద్గురు: అలా ఆడకపోయినా సరే.

రకుల్ ప్రీత్ సింగ్: అంటే జరగవలసినవన్నీ మీరు అనుకున్నట్లు జరిగితే, మీరు అనుకున్న మార్గంలోనే ఉంటే, మీరు హాయిగా ఉంటారు.

సద్గురు:కాదు, కాదు. అది కాదు. మీరు అనుకున్నట్లుగా జరిగితే మీరు హాయిగా ఉండడం గురించి కాదు. మీరు పరమానందంగా ఉంటే, ఏమి జరిగినా మీరు పట్టించుకోరు అంటున్నాను. అది ఎలా జరిగినా మీరు పరమానందంతోనే ఉంటారు.

అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచం, గుర్రం కన్నా బండిని ముందు పెట్టింది. మీరు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీకు మిమ్మల్ని నియంత్రణలో పెట్టుకోవడం తేలికా? లేదా మిగతా అందరినీ మీ నియంత్రణలో పెట్టుకోవడం తేలికా?

రకుల్ ప్రీత్ సింగ్:నన్ను నేను నియంత్రణలో పెట్టుకోవడం.

సద్గురు: మిమ్మల్ని నియంత్రణలో పెట్టుకోవటం. మీరు అన్నిటికన్నా ముందు అది చేయాలి. మిమ్మల్ని మీరు మీ నియంత్రణలో ఉంచుకుంటే, మీరు అందరి నుంచి ఎంత సహకారం పొందుతారో అన్నది తరువాత చూద్దాం. మీరు సంతోషం పొందే ప్రయత్నంలో ఉంటే, దానర్థం మీరి కొరకునేది ఏమిటంటే, అందరూ మీరు అనుకున్న విధంగా ఉండాలి. అంటే మీరు ఏమి అంటున్నారంటే, ఇలా జరిగితే నేను సంతోషంగా ఉంటాను. అది జరిగితే నేను సంతోషంగా ఉంటాను. అలా అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచమే మీరు అనుకున్న విధంగా స్పందించాలి అని.

రకుల్ ప్రీత్ సింగ్: నేను ఆమాట అనటం లేదు. నేను దానిని నమ్మను, అన్నింటికీ అలా కండిషన్లు పెట్టడం అంటే ఇష్టపడను. నేను ఏమంటున్నానంటే మీరు మీ జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారో, కనీసం దాని పట్లైనా. ఎలాగంటే ఒకరు యాక్టరు కావాలని, ఒకరు క్రికెటర్ కావాలని కనీసం అటువంటి వాటిలో.

సద్గురు: ఉదాహరణకు అలా జరగకపోతే ఏమిటి అర్థం? మీ నటన ప్రజలకు నచ్చలేదు. క్రికెట్ జట్టులోకి మీరు సెలక్టు కాలేదు, అలాంటివి జరిగితే. మీకు కావలసింది జరగలేదు, మరి అప్పుడూ మీరు ఆనందంగా ఉండగలరా? అదే అసలు ప్రశ్న.

రకుల్ ప్రీత్ సింగ్: చాలా మంది అలా ఉండలేరు.

సద్గురు: మరి నేను అనేది అదే. మీరు చేస్తున్నది అందరికీ నచ్చాలని మీరు అనుకుంటే, ఒక రకంగా వారి బుర్రలను మీరు మీ నియంత్రణలో పెట్టుకోవాలనుకుంటున్నారని. మీ సినిమాల ద్వారా లేదా ఏ ఇతర మార్గాల ద్వారానో మీరు వారి బుర్రలను మీ నియంత్రణలో పెట్టుకుంటున్నారు. వారికి కావలసింది మీరు చేస్తున్నారు, మరి అదే ఫలితాన్ని ఇస్తోంది. మరి ఏది సులువు, మిమ్మల్ని మీ నియంత్రణలో పెట్టుకోవడమా, అందరినీ మీ నియంత్రణలో పెట్టుకోవడమా? మిమ్మల్ని మీ నియంత్రణలో పెట్టుకోవడమే. మిమ్మల్ని మీరు నియంత్రణలో పెట్టుకుంటే, మీరు ఆనందం కోసం పరుగెత్తవలసిన పనిలేదు, అప్పుడిక మీకు దేని గురించి వత్తిడి ఉండదు. మీ మెడపై కత్తి లేదు కాబట్టి. అప్పుడు మీరు మీ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయగలరు.

ఏమి జరిగినా, మీరు చక్కగానే ఉంటారు, ఇంతమాత్రం మీకు తెలుసుగదా? మీకు ఏ విషయం గురించిన చింత లేదు కాబట్టి మీరు అన్నీ ఎంతో బ్రహ్మాండంగా చేస్తారు, మీకు ఇక ఏవిధమైన స్వార్ధం లేదు. కావలససిందేదో మీరు సునాయాసంగా చేయగలరు. మిగతా వారు ఏదో గొప్ప ఘనకార్యం అనుకున్నది మీరు అతి సునాయాసంగా, ఆనందంగా చేయగలరు.

రకుల్ ప్రీత్ సింగ్: సరే, మీరు ఆకర్షణను పూర్తిగా కొట్టిపారేశారు. మీకు కావలసింది విశ్వమే ఇస్తుంటే అటువంటిదేమీ లేదని..

సద్గురు: విశ్వం అనేది ఎక్కడుందని నేను అడుగుతున్నాను.

రకుల్ ప్రీత్ సింగ్:: అవును, మనం అందులో భాగం.

సద్గురు: మనకు ఈ నాడు సప్తర్షులుగా పిలుస్తున్న ఏడుగురు ఋషులు ఆదియోగిని ‘‘ఈ విశ్వం ఎక్కడ మొదలయ్యింది? ఎక్కడ దీని అంతం? ఇది ఎంత పెద్దది? అసలు అది ఏమిటి? అని అడిగితే. ఆదియోగి నవ్వి, ‘‘నేను మీ విశ్వాన్నంతా ఒక ఆవగింజలో ఇమడ్చగలను’’ అన్నారు. అది ఎంతో సమర్ధమైన ప్యాకింగ్ కదా. మీరు దేశ కాలాలు అనుకునేవి, మీ మానసిక స్వభావాన్ని బట్టి ఉంటాయి. మీరు మీ మానసిక పరిమితులను దాటి వెళితే ఇక్కడ ఉన్నది అక్కడా ఉంది, అక్కడ ఉన్నది ఇక్కడా ఉంది. ఇప్పుడు ఉన్నది అప్పుడూ ఉంది, అప్పుడు ఉన్నది, ఇప్పుడూ ఉన్నది. దేశ కాలాలు మీ అనుభూతిలో కలసిపోతాయి. అలాంటిది జరిగితే మీరు విశ్వం గురించి మాట్లాడరు. కేవలం తమ ఇరుగు పొరుగు వారితో మాట్లాడని వారే విశ్వంతో మాట్లాడతాము అంటుంటారు.


 

Editor’s Note: Find more of Sadhguru’s insights in the book “Of Mystics and Mistakes.” Download the preview chapter or purchase the ebook at Isha Downloads.

A version of this article was originally published in Isha Forest Flower, March 2018.