నేటితరంలో విస్మయ భావన ఉందా..?

 

అవార్డులు గెలుచుకున్న నటుడు అనుపమ్ ఖేర్‌తో ఆసక్తిదాయకమైన ఈ సంభాషణలో సద్గురు బాల్యంలో ప్రతి వ్యక్తిలోనూ కన్పించే విస్మయ భావన గురించి మాట్లాడతారు. నేటి యువతరంలో ఈ భావన వేగంగా అదృశ్యమైపోతూ ఉంది.

అనుపమ్ ఖేర్ : నా చిన్నతనంలో, నేను దేన్ని చూసినా ఒక విస్మయానికి, ఆశర్యానికి లోనయ్యే వాణ్ణి. నేటి పిల్లల్లో నాకది కనబడడం లేదు.

సద్గురు : కారణమేమిటంటారు, వాళ్లు దాన్ని ‘www’ తో బదలాయించారు. ఆరేళ్లన్నా నిండకముందే వాళ్లు మొత్తం విశ్వాన్ని గురించి తెలుసుకుంటున్నారు.

అనుపమ్ ఖేర్ : అవును..సరిగ్గా అదే - వాళ్లకన్నీ తెలుసు. వాళ్లు గూగుల్ వెదికితే చాలు, కావాల్సిన సమాచారమంతా వచ్చేస్తుంది. కానీ ఈ విషయాలే జ్ఞానం కాదు. మళ్లీ నా ప్రశ్నలోకే వెళదాం - ఈ రోజుల్లో ఎవరైనా తమ అమాయకత్వాన్ని, ఒక విస్మయ భావనను నిలుపుకోవడం ఎట్లా?

సద్గురు : చూడండి. విస్మయం, అమాయకత్వం రెండూ వేర్వేరు విషయాలు. విస్మయమన్నది తప్పనిసరిగా అమాయకత్వం నుండే ఉద్భవించాలనేమీ లేదు. ఉదాహరణకు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం విస్తృతమైన అన్వేషణ చేసింది. మనం ఎన్నటికీ సంభావ్యం కాదనుకొనే అనేక విషయాల్లోకి వాళ్లు ప్రవేశించారు. మీ బాల్యంలో మీరు కచ్చితంగా ఆకాశంవైపు చూసే ఉంటారు, అవునా?

అనుపమ్ ఖేర్  : అవును, కచ్చితంగా.

సద్గురు : నేను ఇంటి కప్పుమీద కూర్చుని, ఆకాశాన్ని కొన్ని విభాగాలుగా చేసుకొని చుక్కలు లెక్కపెట్టేవాణ్ణి. పదిహేడు వందలదాకా లెక్కపెట్టిన తర్వాత అంతా కలగా పులగమైయ్యేది. అప్పట్లో ఉన్నది ఇప్పుడు లేదు, ఆ రోజుల్లో ఏదైతే లేదో అది ఇప్పుడు  వచ్చిచేరింది. అప్పట్లో, అదే ఒక అద్భుతం - పదిహేడువందలే నన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేశాయి. మరిప్పుడు శాస్త్రజ్ఞులు వంద బిలియన్ల పాలపుంతలు - నక్షత్రాలు కాదు - వంద బిలియన్ల పాలపుంతలున్నాయని చెప్తున్నారు. మీరు అన్వేషించిన కొద్దీ మీ ఆశ్చర్యం కూడా పెరుగుతుంది, ఎందుకంటే సృష్టి స్వభావాన్ని గుర్తించగలుగుతారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు విస్మయం చెందుతున్నారు; ఎటువైపు ప్రయాణించాలో వాళ్లకర్థం కావడం లేదు. వాళ్లు ఎటుచూసినా ప్రతిదీ ఇంతకుముందు కంటే లోతుగా కనిపిస్తూ ఉంది. మీకు తెలుసా, కేవలం మీ ముఖ చర్మంమీద కొన్ని బిలియన్ల ప్రాణులున్నాయని. మనం జీవితాన్ని ఎంత దగ్గరగా చూస్తే, విస్మయం అంత అధిక స్థాయిలో విస్ఫోటం చెందుతుంది.

ఈ సృష్టిలోని ఏదైనా మీ అధీనంలోకి ఎప్పుడు వస్తుందంటే మీరు దానిపై తగినంత ధ్యాస ఉంచినప్పుడు మాత్రమే. కాని జనం ఎలా తయారయ్యారంటే వారి ధ్యాస దేనిమీదా నిలవదు.

అమాయకత్వం వల్లో, అమాయకత్వం లేకపోవడం వల్లో ఈ విస్మయ భావన మాయం కాలేదు. మనం జ్ఞానమనీ, జీవితమంటే ఇదన్న మూర్ఖ ఆలోచనలవల్ల అది మాయమైంది. ఇవ్వాళ జనం తమ ధ్యాసలోపాన్ని ఒక గుణంగా చెప్పుకుంటున్నారు. ఈ సృష్టిలోని ఏదైనా మీ అధీనంలోకి ఎప్పుడు వస్తుందంటే మీరు దానిపై తగినంత ధ్యాస ఉంచినప్పుడు మాత్రమే. కాని జనం ఎలా తయారయ్యారంటే వారి ధ్యాస దేనిమీదా నిలవదు. ఇటువంటి పరిస్థితిలో దేనిపట్లా విస్మయం ఉండదు, కేవలం మీ మనస్సులో వాటి  గురించి అభిప్రాయాలే ఉంటాయి. మీ తలలో కేవలం స్వగతాలే తిరుగాడుతూ ఉంటాయి; అవగాహన ఉండదు. మీకు అవగాహనే ఉంటే మీ బుర్రలోని గోలంతా ఆగిపోతుంది. మీ దృష్టి కనుక సంపూర్ణ సుందరత్వం కలిగిన వస్తువు, ఆకర్షణీయమైన వస్తువు మీద పడితే అన్నీ ఆగిపోతాయి.

అందుకే ప్రజలు సినిమా చూసి ఆనందిస్తారు: లైట్లు ఆర్పి వేస్తారు. మీ దృష్టి అంతా సినిమా మీదే కేంద్రీ కృతమై ఉంటుంది. మీ బుర్రలోని సాధారణ స్వగతాలు మాయమైపోతాయి - మరేదో జరుగుతూ ఉంటుంది. తరువాత జరిగేదేమిటో వారికి తెలియదు. అక్కడ వారి ధ్యాస నిరాటంకంగా ఆకర్షితమై ఉంది, సినిమా హాలుకు పోవడం వల్ల తమకు ఆరోజేదో జరిగినట్లు వాళ్లు అనుభూతి చెందుతారు. లైట్లు వేసి ఉంచి సినిమా చూస్తే ఆ ప్రభావం ఉండదు. లేకపోతే వారిలో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కూడా ఆ ప్రభావం ఉండదు. తెరమీద ఏం ఆడుతుందోనన్నది కాదు ముఖ్యం, వారి ధ్యాస ఎక్కడున్నదన్నది ముఖ్యం. తెరమీద నడుస్తున్నది వారి ధ్యాసని ఆకర్షించడానికి ఒక సాధనం. కాని అనుభూతిని కలిగించేది మీ నిరంతర ధ్యాస. ధ్యానానికి ఇది ప్రాథమిక రూపం, దీనినే  ధారణ అంటారు.

మన శ్రద్ధని ప్రగాఢం చేసుకోవడం ఎట్లా

అనుపమ్ ఖేర్: మరి, ఈ రోజుల్లో ఎవరైనా శ్రద్ధని నిలబెట్టుకుంటున్నారా?

సద్గురు: ప్రతి వ్యక్తీ దీని గురించి తానేదైనా చేసి తీరాలి. ప్రతిపాఠశాలా పిల్లవాడి ధ్యాస ఏదో ఒకదానిపై నిరంతరాయంగా నిలిచేటట్లు చేయాలి. అది సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు.  మీరు మీ ధ్యాసని కేంద్రీకరించకుండా పాడలేరు, నృత్యం చేయలేరు. కాని సరైన ధ్యాస పెట్టకుండా కూడా మీరు పరీక్షలో ఉత్తీర్ణులు కావచ్చు. మీకు తెలుసా, మేము ఈశా హోం స్కూలు నడుపుతున్నాం. ఈ పాఠశాల ఇప్పుడున్న అనేక పాఠశాలలకంటే భిన్నమైన పద్ధతిలో నడుస్తుంది. ఒకరోజు నేను వాళ్ల అసెంబ్లీకి వెళ్లాను. ఆరు, ఆరున్నరేళ్ల పిల్లలు ఒకచోట కుదురుగా కూర్చోలేకపోతున్నారు. అప్పుడు నేను ఓ మార్పు తెచ్చాను. ప్రతిరోజూ ఉదయం ప్రతి పిల్లా/పిల్లవాడు పదిహేను నిమిషాలపాటు ‘స రి గ మ ప ద ని స’ పాడాలి. ఇలా చేయడం మొదలు పెట్టిన, రెండు నెలల్లో వాళ్లు కుదురుగా కదలకుండా కూర్చోవడం ప్రారంభించారు. దీనికి ఈ చిన్న మార్పు సరిపోయింది.

శారీరకంగానూ, మానసికంగానూ మీ పిల్లలు తమ పూర్తి సామర్థ్యాలను సాధించుకోవాలి. అప్పుడే వాళ్ల జీవితంలో సాఫల్యం వ్యక్తమవుతుంది.

వాళ్లని మీరు చీకటిలో అడవిలో నడిపించారనుకోండి. వాళ్లు శ్రద్ధా సామర్థ్యాన్ని మీరు చూడగలుగుతారు. వారి విస్మయ భావన విస్ఫోటం చెందుతుంది. వాళ్లను రాత్రివేళ టార్చి లైట్లు, సెల్‌ఫోన్లు, ఏమీ లేకుండా ఒక భద్రమైన వాతావరణంలో నడిపించారనుకోండి. ఒక్కరాత్రిలో వారి విస్మయ భావనలో అద్భుతమైన పరివర్తన జరుగుతుంది. కాని మనం వీటిని శారీరకంగా వారికి అసాధ్యం చేస్తున్నాం. శారీరకంగా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, వాళ్లు ఫిర్యాదు చేస్తారు, ఇంకేమీ చేయరు. తల్లిదండ్రులు జాగ్రత్త తీసికోవలసిన విషయాలివి. పిల్లల్ని పెంచడమంటే బడికి పంపడం, వాళ్లకి మార్కులు, గ్రేడ్లు రావడం కాదు. అదంతా అర్థరహితం. శారీరకంగానూ, మానసికంగానూ మీ పిల్లలు తమ పూర్తి సామర్థ్యాలను సాధించుకోవాలి. అప్పుడే వాళ్ల జీవితంలో సాఫల్యం వ్యక్తమవుతుంది. కేవలం మార్కులు సాఫల్యానికి గుర్తులు కావు.

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1