​​​​​

స్వామి వసునంద: ఒక పత్రికలో యోగపై ప్రచురించిన వ్యాసాన్ని, అందులో మెలికలు తిరిగిన శరీరాలను చూసి “ఇవన్నీ నేను చేయాలా?” అని ఆశ్చర్యంతోను, భయంతోనూ అడిగాను. నా మేనల్లుడు నన్ను యోగ క్లాసులో చేరమని ఒత్తిడి చేస్తుంటే నాకిది తగినదన్న నమ్మకం, నాకు కుదరలేదు. కానీ తప్పుకోవడానికి నాకు అవకాశం అతడు ఇవ్వలేదు. సద్గురుతో నా మొదటి క్లాసులో నేను అలా అడుగుపెట్టాను – ఇక జీవితం ఎప్పటికీ మారిపోయింది. 

సద్గురు మమ్మల్ని శూన్య దీక్షలోకి ప్రవేశ పెట్టినప్పుడు ఆ గదంతా బీజ మంత్రంతో మారుమ్రోగినట్టుగా అనిపించింది. నేను పారవశ్యంలో మునిగిపోయాను. ఆఖరు రోజున కోయంబత్తూరులోని సద్గురు శ్రీ బ్రహ్మ సేవా ఆశ్రమంలో సమావేశం అయ్యాము. నేనున్న ప్రదేశానికి అది ఒక కిలోమీటరు లోపలే ఉన్నా, నేనెప్పుడు అక్కడికి వెళ్ళలేదు. సేవా ఆశ్రమంలోని సద్గురు శ్రీ బ్రహ్మ ఫోటోని చూసి “ఇతను సద్గురులాగా ఉన్నారు” అనుకున్నాను. క్లాసు నన్ను ఎంతో ప్రభావితం చేసింది, కానీ అన్నిటికన్నా అక్కడి వాలంటీర్లు తమను తాము అర్పించుకున్న విధానం నన్ను ఎంతో ఎక్కువ ప్రేరేపించింది. వారందరితో కలవాలని అనిపించడంతో ఆ క్లాసు తరువాత నేను వాలంటీర్ చేయడం మొదలుపెట్టాను. మొదటగా కోయంబత్తూరులో జరుగుతున్న ఈశాయోగ క్లాసులో దీక్ష ఇచ్చే రోజున వాలంటీరుగా వెళ్ళేవాడిని. ఆ తరువాత తక్కువ సమయంలోనే కోయంబత్తూరులో జరిగే దాదాపు అన్ని ఈశా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉండే వాడిని, ప్రతి ఆదివారం ఈశా ఆశ్రమానికి వెళుతూ ఉండేవాడిని.

కెవ్వుమనే నిశ్శబ్దం

1995 మే లో నాకు ఆశ్రమంలో జరిగే మొదటి సమ్యమ కార్యక్రమానికి వాలంటీరుగా అవకాశం దొరికింది. 200 మంది కార్యక్రమంలో పాల్గొనగా మేము పదకొండు మంది వాలంటీర్లు మాత్రమే అన్ని పనులు కలిసి చేశాము. వంట చేయడం, హాలు తయారు చేయడం, సెక్యూరిటీ బాధ్యతలు, హాలు లోపలి వాలంటీరింగు మొదలయినవన్ని. ఇప్పుడున్న 2వ గేటు దగ్గర నుండి ట్రై ఆంగిల్ బ్లాకు వరకూ (ట్రై ఆంగిల్ బ్లాకు అనే ఈశా యోగ సెంటర్ లోని ఒక భవనం) పెద్ద పెద్ద వంట సామానులను చేతులతోనే చేరవేసేవారము. అది ఎంతో కష్టమైన పనైనా, నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అప్పటికి నేను సమ్యమ చేయలేదు, అందువల్ల నాకు ఆ వాతావరణమంతా మార్మికంగా ఉన్నట్టు అనిపించింది. ఆశ్రమం అంతా నిఘూఢమైన నిశ్శబ్దంతో నిండి ఉన్నట్టు ఉన్నా, మాకు మనుషులు గట్టిగా అరుస్తూ, వివిధ జంతువుల అరుపులు చేస్తూ, ఆ ప్రదేశంలో పొర్లడం వినిపిస్తోంది. మొదటి కొద్ది రోజుల తరువాత సాధకులు అర్ధరాత్రి సమయంలో వెన్నెలలో సాధనకు బయటకు వచ్చేవారు. ఇందులో పాల్గోవటం ఎంతో అద్భుతంగా అనిపంచింది. తొందరలోనే నేను మొదటిసారి సమ్యమ చేసినప్పుడు ఈ అనుభవాలను రుచి చూసాను.

పోగొట్టుకున్న సాధన అవకాశం

ఒకసారి నేను కరూర్ లో జరిగిన క్లాసుకు వాలంటీరు చేస్తున్నాను. జైన్ గుహలకు దగ్గరలో ఉన్న ఒక వాలంటీరు ఇంట్లో సద్గురు బసచేశారు. అక్కడి జైను గుహలను గురించి సద్గురు చాలాసార్లు ప్రస్తావించారు. సద్గురు ఆ గుహలను దర్శించి అవి ఆధ్యాత్మిక సాధకుల సాధనకు ఎంతో ఉపయుక్తమని, అవి ఇంకా ఎంతో స్పందనా యుతంగా ఉన్నాయన్నారు. క్లాసు ముగిసిన తరువాత సద్గురు నన్ను ఇంకొక వాలంటీరుని పిలిచి మమ్మల్ని ఆ కొండపైకి ఎక్కి గుహలలో మా సాధన చేయమని చెప్పారు. మీరు కూడా మాతో రండి అని సద్గురుని కోరాను. ‘‘నేను సాధన చేయడం మానివేసానప్పా’’ అని అన్నారు నవ్వుతూ. ఆయన లేనప్పుడు వెళ్ళడానికి మనసొప్పక నేను ఆ అవకాశం పోగొట్టుకున్నాను. ఇప్పటివరకు, నేను ఆ గుహలకి వెళ్ళలేదు. తిరిగి నాకు ఆ అవకాశం రాలేదు, అప్పుడప్పుడు అనిపిస్తుంది సద్గురు మాట వినివుండవలసినదని.’ .

ఉత్సాహమైన ఊరేగింపు

నాకు అత్యంత ఉత్సాహన్ని ఇచ్చిన ఇంకొక వాలంటీరింగ్ అనుభవం అవుడియార్ని (ధ్యానలింగ క్రిందిభాగం) కరూర్ నుండి తీసుకువచ్చినప్పుడు. సింగనల్లూర్ (కోయంబత్తూర్ లో ఒక ప్రాంతం)లో ‘విజ్జి మా’ అవుడియారుకి హారతి ఇచ్చిన తరువాత ఊరేగింపుతో నేను కూడా కలిశాను. మా కందరికీ సంతోషంతో తలమునకలు అవుతుండగా ఆ ఊరేగింపు ఒక పండుగలా మారింది. వాలంటీర్లు అందరూ ముఖాలకు రంగులు వేసుకుని, తల చుట్టూ బట్ట కట్టుకుని, డప్పు వాయిస్తూ నాట్యం చేస్తున్నారు. అవడియారు లారీలో వెనుక భాగంలో ఉంది, నేను దగ్గరగా ఉన్నా నన్ను నేను ఆపుకోలేక నాట్యం చేస్తూపోయాను. సద్గురు మాతో చేరి – బరువైన ఆ ట్రక్కుని ఒక ఇరుకైన బ్రిడ్జి మీదనుండి తీసుకువెళ్ళడంతో ఆ విశేషం మా ఉత్సాహన్ని మరింత ఎక్కువ చేసింది.

ఆఖరి చూపు

జనవరి 23, 1997 సాయంత్రం, ఆశ్రమంలో ఉన్న ఒక వాలంటీర్ నాకు ఫోనుచేసి, కొన్ని అసాధారణ వస్తువులు తీసుకుని వెంటనే ఆశ్రమానికి రమ్మన్నాడు. ఇక్కడికి చేరిన తరువాతే తెలిసింది ఆ వస్తువులు ‘విజ్జి మా’ అంత్యక్రియలకని. సామాన్లు బ్రహ్మచారికి ఇచ్చి నేను ఆఖరి చూపు కోసం లైనులో నిలబడ్డాను. నేను పాద స్పర్శ కోసం దగ్గరికి చేరగా, నా చూపు సద్గురు చూపుతో కలిసింది. అందులోని భావం వ్యక్తీకరించలేకపోయినా ఈ రోజువరకు నేను ఆ చూపు మర్చిపోలేను. ఆ రాత్రి ఆశ్రమంలో ఉండి మరునాడు అంత్యక్రియలు ముగిసిన తరువాత తిరిగివెళ్ళాము.

మూడు ఆహ్వానాలు

ఆ రోజులలో ‘‘ఆశ్రమంలోకి పూర్తిగా చేరనా?’’ అని నేను సద్గురుని మూడుసార్లు అడిగాను. ప్రతిసారీ ఆయన రమ్మనే అనేవారు. కానీ నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. సద్గురు అందిస్తున్న ఆధ్యాత్మిక ప్రక్రియకి పూర్తిగా అంకిత మవ్వాలని ఒక వైపు ఉన్నా ఇంకొక వైపు నాకు ఆ ప్రక్రియలో పూర్తి అవగాహన లేదనిపించింది. ఆశ్రమంలోని బ్రహ్మచారులు ఎంతో శ్రమిస్తూ తమను తాము పూర్తిగా అర్పించుకోవడం చూసి, నేను అలా చేయగలనా అన్న ప్రశ్న తలెత్తేది. వీటి గురించి ఎంత ఆలోచించినా ఫలితం లేదని కొద్ది రోజులలోనే తెలిసింది. సద్గురు సమక్షంలో నాకు కలిగే అనుభూతికి, నేను వాలంటీర్ చేసేటప్పుడు నాకు కలిగే అనుభవానికి నేను వివరణ ఇవ్వలేను, ఇంకొక ప్రక్క, ‘నాకు పూర్తిగా అవగాహన లేని దానికి నా పూర్తి జీవితాన్ని అంకితం చేయడం సబబేనా’ అనే నా మానసిక తర్కానికి కూడా జవాబు లేదు. ఆఖరికి 1997లో నేను ఆశ్రమంలో చేరాను, 2000 సంవత్సరంలో బ్రహ్మచర్యలోకి దీక్ష పొందాను. దీక్ష తీసుకున్న తరువాత నాలో ఒక విధమైన స్వేచ్ఛను అనుభవించాను..

ఇటుకలను పేర్చడం

నేను ఆశ్రమంలో చేరిన తరువాత నా మొదటి పని, ధ్యానలింగ నిర్మాణానికి అవసరమైన ఇటుకలను తయారుచేయడాన్ని పర్యవేక్షించడం. నేను డిగ్రీలో ఫిజిక్సు చదివాను. ఆ తరువాత మా కుటుంబ స్టేషనరీ తయారీ వ్యపారంలో మా అన్నగారికి సహాయం చేసేవాడిని. నిర్మాణ రంగంలో నాకు అస్సలు అనుభవం లేదు. ఈ ఇటుకలు ఒక విశేష కార్యక్రమానికి వాడేవి అని తెలిసి నాకు భయం వేసింది. కానీ ఆశ్రమంలో జరిగే అన్ని విషయాలలో లాగానే, ఇందులో కూడా సమయానికి అన్నీ అమరుతూ జరిగిపోయాయి. మేము మూడు నెలలో రెండు లక్షల ఇటుకలను తయారు చేశాము. వీటిని వరుసలుగా పేర్చి ఇందు కోసం ప్రత్యేకంగా వేసిన షెడ్లలో ఎండపెట్టడం, ఆ రోజులలో దాదాపు సంవత్సరం పొడవునా పడే వర్షాల నుండి వాటిని కాపాడటం, అంటే అది సామాన్యమైన పని కాదు. ఇటుకలను కాల్చడానికి మేము తయారుచేసిన తాత్కాలిక బట్టీలు చూడడానికి చాలా ఆశ్చర్యం కలిగించేవి. ఆ ఇటుకలు ఎక్కువ శాతం ధ్యానలింగ నిర్మాణానికి వాడగా, మిగిలినవి టీ-బ్లాకు నిర్మాణానికి వాడినట్టున్నారు.

”ఫిర్యాదులు వద్దు”

వంట గదిని ‘టీ బ్లాకు’ నుండి స్పంద హాలుకి అనుబంధంగా ఉన్న ఓల్డ్ బిక్షా హాలుకి మారినప్పుడు నన్ను వంట విషయాలు చూడమన్నారు. నాకు వంట రాదు. నాకున్న కొంత సామర్ధ్యంతో, నేను ఇంతకు ముందు ప్రోగ్రాంలలో వంట చేసిన అనుభవంతో, ఎలాగో నాకు తెలిసినట్టు చేశాను. కొంత మందికి నేను చేసింది నచ్చింది, మరికొంత మందికి నచ్చలేదు. నేను నా పూర్తి ప్రయత్నం చేశాను. ఒక రోజు మేము 2000 మందికి వంట చేశాము. మేమది చేయగలగినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. మహాశివరాత్రి 2017 లో లక్ష కన్నా ఎక్కువమందికి భోజనం చేశారని విని నేను ఆశ్చర్యపోయాను. అక్షయ (ఆశ్రమ వంట సిబ్బందికి) ఇది ఎంత పెద్ద పనో నాకు తెలుసు. . 

నేను కోరగా సద్గురు మాతో వచ్చి భోజనం చేసిన కొన్ని సందర్భాలు నాకెంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఆ తరువాత నన్ను సింగనల్లూర్ ఆఫీసులో కిచెన్ కేర్ టేకర్ గా మార్చారు. ఇక్కడ కూరగాయలు కొనటం దగ్గర నుండి, వంట పాత్రలు కడగటం, వంట తరువాత వంట గది శుభ్రం చేయడం అన్ని పనులూ తోడయ్యాయి. ఆ సమయంలో ఒకసారి నేను నా వ్యక్తిగత విషయం గురించి సద్గురు దగ్గరకి వెళ్లాను. నేను విషయం చెప్పక ముందే ఆయన “ఫిర్యాదులు వద్దు” అన్నారు. ఆయన చెప్పిన విధానం బట్టి నాకు తెలిసింది ఏమిటంటే, నా వ్యక్తిగత విషయాలను నేనే సరి చేసుకోవాలని, సద్గురుని ఇటువంటి వ్యక్తిగత విషయాలతో ఇబ్బంది పెట్టకుండా, ఆయన చేసే పనికి, ఆయన పూర్తి సమయం కేటాయించే అవకాశం ఇవ్వాలని తెలిసింది. అప్పటినుండి నేను సద్గురు దగ్గరికి ఏ విషయం గురించి వెళ్ళలేదు. సింగనల్లూర్ ఆఫీసులో పనిచేసినప్పుడు నాకు తిరిగి దొరికిన అత్యంత పెద్ద ప్రతిఫలం, సద్గురు అక్కడికి వచ్చి కొన్నిసార్లు భోజనం చేయడం.

తిరుగులేకుండా పూర్తిగా పాలుపంచుకోవడం

​​​​path-of-the-divine-sw-vasunanda-pic1

నేను 2004 లో ఆశ్రమానికి తిరిగి వచ్చాను. అప్పుడు 2వ గేటు(వెల్కమ్ పాయింట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆఫీసు) దగ్గర సెక్యూరిటీ పనులు చూసుకుంటున్నాను. ఇక్కడే చిన్నపిల్లలు కొందరు నా దృష్టిలో పడ్డారు. పోయిన 14 సంవత్సరాల నుండీ, ఇప్పటి వరకూ కూడా నేను అదే ధ్యాసలో ఉన్నాను.

అది సాయంత్రం 5 గంటల సమయం, నా దగ్గర గిరజన గ్రామంలోని కొంత మంది ఆడపిల్లలు వచ్చి మీ దగ్గర సైకిల్ ఉంటే మేము కాసేపు నడుపు కుంటాము అని అడిగారు. మొదట నేను ఆశ్చర్యపోయాను, కానీ తిరిగి చూస్తే వారు పేద పిల్లలు, సైకిలు తొక్కాలన్న ఉత్సాహంతో ఉన్నారు. దురదృష్టవశాత్తు నా దగ్గర సైకిల్ లేదు, ఆశ్రమంలో కూడా నాకు దొరకలేదు. కానీ నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వారందరూ దగ్గరలోని ‘దానికండి’ అనే గిరిజన గ్రామం నుండి వస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, వాళ్ళు ప్రతి రోజు సాయంత్రం ఆశ్రమానికి వచ్చి భోజనం చేసివెళ్తున్నారు, వాళ్లకు ఎందరో మంది బ్రహ్మచారులు తెలుసు. ‘‘ఏ క్లాసులో చదువుతున్నారు?’’ అని అడిగాను. ‘‘ఎనిమిది’’ అని చెప్పింది ఒక అమ్మాయి గొప్పగా. ఆ అమ్మాయితో నవ్వుతూ కొన్ని ఇంగ్లీషు పదాలు వ్రాయమని అడిగాను. ఆ అమ్మాయి ఇంగ్లీషు అక్షరాలు కూడా వ్రాయలేకపోయింది. మిగిలిన పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంది. వారిని చూసి నాకు బాధ కలిగి సాయంత్రం భోజనానికి ఒక గంట ముందు ఇంగ్లీషు, లెక్కలు నేర్చుకోవడానికి రమ్మని చెప్పాను. వాళ్ళందరూ మరునాడు గంట ముందు ఎంతో ఆసక్తితో వచ్చారు. దాని తరువాత జరిగింది నేను ఊహించలేదు.

25 మందితో క్లాసు

path-of-the-divine-sw-vasunanda-with-kids

4 నుండి 14 సంవత్సరాల వరకూ మొత్తం 25 మంది ఉన్నారు. అందరూ ఎంతో ఉత్సాంహంగా, అల్లరి చేస్తూ ఉన్నారు. ఏదన్నా నేర్పాలంటే నాకు అసాధ్యం అనిపించింది. ‘‘మీరు 6 నుండి 8వ క్లాసులో ఉంటే,’ మరునాడు రండి” అని చెప్పాను. కొంత మంది బాధపడ్డారు కానీ నేను ఒక్కడినే అందరినీ చూసుకోలేను. మరునాడు నుండి మా క్లాసులు 2వ గేటు సెక్యూరిటీ ప్రక్కన ఉన్న గదిలో మొదలయ్యాయి. మెల్లగా ఇతర గిరిజన గ్రామాల పిల్లలు కూడా ఈ క్లాసులకి రావడం మొదలుపెట్టారు. 

2006 లో సద్గురు ఈశా విద్య స్కూలు మొదలు పెడతామని ప్రకటించారు. ఎన్నో వనరులు అవసరమయ్యే ఈ కార్యక్రమంలో ఈశా అడుగుపెట్టటం అవసరమా అని అప్పుడు నాకు ఆనిపించింది. “ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటిలో చదువుతున్న పిల్లలకు ట్యూషన్ ఇప్పిస్తే సరిపోతుంది” అని నేను అనుకున్నాను. ఆ తరువాత నేను ఈశా విద్య స్కూలు చూశాను. వారి టీచర్లు, ప్రాధమిక సదుపాయాలు, బోధన ప్రణాళిక చూసిన తరువాత సద్గురుకి నాలోనే అభివాదం చేసి, పల్లెటూరి పిల్లలకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషించాను. “దీనితో ఈ గ్రామాల పిల్లలు పట్టణ పిల్లలతో సరితూగగలరు” అని కలలు కన్నాను.  

అన్ని వయసులవారు ఒక ఎంట్రన్స్ పరీక్ష వ్రాసి 1 నుండి 9వ తరగతి వరకూ ఈ స్కూలులో చేరవచ్చని ముందుగా నిర్ణయించారు. నేను ఊరూరూ తిరిగి 60మంది పిల్లలను అడ్మిషన్ కోసం తీసుకువచ్చాను, కానీ అందరూ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అప్పుడు మేము 5 సంవత్సరాల పిల్లలను తీసుకుని LKG నుండి మొదలుపెడదామని నిర్ణయించాము. తిరిగి ఊరూరు వెళ్ళి, వారి చిన్న పిల్లలను స్కూలుకి పంపమని తల్లి తండ్రులను ఒప్పించాము. 100 మంది గిరిజన పిల్లలు పూర్తి స్కాలర్ షిప్పుతో – స్కూల్ ఫీజు, బస్సు ఫీజు, యూనిఫారం, పుస్తకాలు, కాపీలు, ఇతర స్టేషనరీ మొదలైనవి ఇచ్చి మొదలుపెట్టాము. 2015 లో ఈ మొదటి బాచ్ పిల్లలు 10వ తరగతి పరీక్షలలో 89.6% మొత్తం మార్కులతో పాస్ అయ్యారు. ఈ పిల్లలు కొంతమంది డాక్టర్, ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నారు. ఇది సద్గురు ఆశీర్వాద మహిమ.

గ్రామీణ భారతాన్ని చదివించడం అంత తేలిక కాదు

path-of-the-divine-sw-vasunanda-pic2

ఈశా విద్యలో చేరిన కొంత మంది పిల్లలు, ఒక సంవత్సరంలోనే వేరు వేరు సామాజిక కారణాల వల్ల స్కూలు మానేశారు. ఒకరికి తల్లి తండ్రులు లేకపోవడం, ఇంకొకరికి తండ్రి తాగుబోతు లేదా మానసిక వ్యాధితో బాధపడటం, ఇటువంటి దయనీయ పరిస్థితులు ఎవైనా కావచ్చు. నాకు ఇది మానసికంగా భాధ కలిగించింది. ఎలాగో డోనార్లను వెతికి, స్కాలర్షిప్పులు ఇప్పించి ఈశా మెడిటేటర్ల సహాయంతో 13మంది అమ్మాయిలను కోయంబత్తూరు లోని PSSG రెసిడెన్షియల్ స్కూలులో చేర్చాము. కానీ వారిలో 11 మంది ఒక సంవత్సరంలోపే అందులోనుండి బయటకు వచ్చేశారు. ఇది నన్నెంతో నిరుత్సాహానికి గురిచేసింది. వీళ్ళని విద్యావంతులని చేయడం ఎవరి తరము కాదు, నా శ్రమ, డబ్బు అంతా దండుగ అనుకుని, తరువాత రెండు సంవత్సరాలూ, గ్రామాలలో తిరిగి పిల్లలని చేర్చకూడదు అనుకున్నాను. ఒకరోజు ఆ రెసిడెన్షియల్ స్కూలులో ఇంకా చదువుతున్న అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయి పెరుగుదలలో చెప్పదగిన మార్పు కనిపించింది, అది చూసి నాకు తిరిగి ఉత్సాహం వచ్చింది. అప్పుడు అమ్మాయిలకు తిరిగి సహాయం అందచేయాలని నిర్ణయించుకున్నాము. కుటుంబ చీలికలు ఉన్న ఆడపిల్లలను రెసిడెన్షియల్ స్కూలులో చేర్చి వారికి అండగా ఉండాలని అనుకున్నాము. వారిలో కొంతమందైనా ఆ పరిస్థితుల నుండి బయటకు రాగలిగితే అదే గొప్ప వరం.  

వారిలో ఎక్కువమంది స్కూలు వదిలేసింది, తమ ఒంటరితనంతో బాధపడటం వల్ల అని మాకు అర్థం అయ్యింది. అందుకని అప్పటినుండి ఒక్కొక్క ఊరినుండి ఒంటరిగా కాక కొంతమందిని కలిపి తీసుకున్నాము. ముందు అందిన సహాయాన్ని ధైర్యంతో ఉపయోగించుకున్న ఇద్దరు ఆడ పిల్లలు మాకు ఈ గిరిజన పల్లెల్లో దూతలుగా, కొత్త పిల్లలకు స్పూర్తిని అందించి వాళ్ళు సర్దుకోవడానికి సహాయపడ్డారు. ఇప్పుడు దాదాపు ఈశా అధ్వర్యంలో 30 మంది ఆడపిల్లలు కోయంబత్తూరులో పూర్తి స్కాలర్ షిప్పుతో చదువుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రిందట ఆశ్రమం చుట్టుప్రక్కల ఉన్న 20 గిరిజన గ్రామాలలో బహుశా ఇద్దరు, ముగ్గురు మాత్రమే డిగ్రీ వరకూ చదువుకుని ఉండేవారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కొంతమంది డిగ్రీ అందుకుంటున్నారు. మొదటి బాచ్ లోని ఒక అమ్మాయి పోయిన సంవత్సరం B.Ed డిగ్రీ పొంది ఈశా విద్యలో ఉపధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ పిల్లలను చూసి నేనెంతో గర్వపడతాను. 

ఆశ్రమం చుట్టుపక్కల గ్రామాలవారు ఇప్పుడు మమ్మల్ని వారిలో ఒకరిగా భావిస్తారు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, నీటి సమస్య, కుటుంబ కలహాలు, పండుగలు జరుపుకోవడం, జీవితంలో వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా మమ్మల్ని తలుచుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రిందట నాకొక ఫోను వచ్చింది. ఒక యువతి విషం తాగి చనిపోతోందని. మేము వెంటనే గ్రామానికి వెళ్ళి ఆ అమ్మాయిని హాస్పిటలుకి తీసుకు వెళ్ళాము. చట్టపరమైన కారణాలవల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న వారిని హాస్పిటలులో చేర్చడం అంత తేలిక కాదు. కానీ ఎలాగో ఆ అమ్మాయిని కాపాడగలిగాము. కుటుంబ కలహాలవల్ల ఆ అమ్మాయి ఆత్మహత్యకి పాల్పడిందని తెలిసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి ఆశ్రమంలో ఉద్యోగం ఇచ్చాము. ఈ మధ్యన జరిగిన మరొక సంఘటనలో ఫౌండేషన్ ఆ అమ్మాయికి ఆదియోగి దగ్గర ఒక దుకాణం ఇచ్చింది. ఆర్ధిక స్వతంత్రం అన్నది, గ్రామీణ మహిళలకు గొప్పవరం. నేను ఆ దుకాణం దగ్గర నుండి వెళ్ళిన ప్రతిసారీ, ఆ అమ్మాయి నాకు నవ్వుతూ చేయి ఊపడమో లేక పరిగెత్తుకుని వచ్చి తన జీవితంలో ఏమి జరుగుతోందో చెప్పడమో జరుగుతుంది. ఆమె సంతోషం చూసి నాకు సంతోషంగా ఉంటుంది.

భయమేసినా ఫర్వాలేదు

జీవితంలో మరువలేని రోజులలో కొన్ని, నేను సద్గురుతో మంగళూరు వెళ్ళిన సందర్భం. ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, సాహసం నిండి ఉండటంతో నాకెంతో గుర్తుకు వస్తూ ఉంటుంది. మేము నడుస్తూ ఉండగా మాకు వరదలో ఉన్న నది, మా దారిలో వచ్చింది. ముందుకు వెళ్ళాలంటే నదిని దాటాలి, చుట్టు తిరిగి వెళ్ళే దారి లేదు. ప్రవాహం చాలా జోరుగా ఉంది. నాలాంటి వాళ్ళు ఎప్పటికీ దాటలేరు. నాకు ఈత రాదు, సాహసం లేదు. చిన్నప్పుడుగానీ, యువకునిగాగానీ నేనెప్పుడు ట్రెక్కిoగ్ కూడా చేయలేదు. ఈ ఉప్పొంగుతున్న ప్రవాహాన్ని నడుస్తూ దాటటం అంటే పూర్తిగా భయం వేసింది. 

సద్గురుతో పాటు బాగా ఈత వచ్చిన బ్రహ్మచారులు కొంతమంది ముందుగా వెళ్ళారు, వారితో పాటు తాడు ఒక చివరను తీసుకు వెళ్ళారు. ఈ తాడును నదికి రెండు వైపులా గట్టిగా కట్టేసారు. నాలా ఈత రానివారు ఈ తాడును పట్టుకుని నదిని దాటాలి. నీటిలో దిగటానికి నా వంతు వచ్చినప్పుడు నాకు ఊపిరి ఆడలేదు. ఇక దారిలేదని తెలిసినప్పుడు నేనిక నెమ్మదిగా, స్థిరంగా నడవటం మొదలుపెట్టాను. కొన్నిసార్లు నీరు నా భుజాల వరకూ వస్తే, మరికొన్ని సార్లు నా కాలి క్రింద నేల కూడా అందలేదు. అలాగే నేను నడుచుకుంటూ వెళ్లాను. నదిని దాటిన తరువాత ఏదో పెద్దది సాధించినట్టు అనిపించింది ఆ రోజు. 

అదే ప్రయాణంలో మేము కుమార పర్వతానికి కూడా వెళ్ళాము. ఇక్కడే కుమార స్వామి తన శరీరం విడిచాడు. ముందు రోజు రాత్రి సద్గురు మమ్మలనందరినీ ఒక్కొక్కరిగా కాక కలసి గుంపుగా ఉండమని చెప్పారు. తాచు పాములు, పులులు ఉండవచ్చని మమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నారు. (బహుశా మేము అప్రమత్తంగా ఉండాలని భయపెట్టి ఉండవచ్చు) మా గ్రూపు సూర్యోదయానికి ముందే 5 గంటలకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాము. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా చూసుకుంటూ మేము ముందుకు వెళ్ళాము. ప్రొద్దున 11 గంటలకల్లా మేము పైకి చేరుకున్నాము. కొన్ని గంటలు గడిపి, సాయంత్రం 5 గంటలకల్లా క్రిందికి వచ్చాము. దారిపొడవునా మాకు కుందేలు తప్ప ఇంకే జంతువులు కనిపించకపోవడం నాకు ఎంతో ఉపశమనం కలిగింది.

దారి చూపే సాధన

ముందే చెప్పినట్టు, బ్రహ్మచర్య దీక్ష అనేది, ఆధ్యాత్మిక పథంలో నాకు ఉన్న అవగాహనతో తీసుకున్నది కాదు. సద్గురుకి దగ్గర కావడానికి, నేను వాలంటీర్ లా పూర్తిగా అంకితం కావడానికి తీసుకున్నది. బహుశా అందువల్లనే, నేను నా చేతిలో ఉన్న పనికి అంకితమైనంతగా, నా సాధనకి అంకితం కాలేకపోయాను. కొన్నిసార్లు నా కార్యకలాపాల సమయంలో, నాలో నేను ఎంతో కష్టపడినా, అది నేను వెలుపలి విషయాలను సరిదిద్దుకోకపోవడం వల్ల అని సరిపెట్టుకునేవాడిని. పోయిన సంవత్సరం నేను సమ్యమలో కూర్చున్నాను, అదే సంవత్సరం సమ్యమ సాధనలో కూడా పాల్గొన్నాను. సంఘ(ఈశా బ్రహ్మచారులు, సన్యాసులు) సహాయంతో పోయిన సంవత్సరం నా సాధనను క్రమబద్దం చేసుకున్నాను. నాలో వచ్చిన మార్పు తెలుస్తూ ఉంది. నేను నా సాధన పూర్తిగా చేసిన రోజున నా జీవితానుభవానికి, చేయని రోజున నా అనుభవానికి వ్యత్యాసం ఎంతో కనిపిస్తుంది.  

సాధనలో ఈ స్థిరత్వం నాకు ఆధ్యాత్మిక పథంలోని అందం, ప్రయోజనం గురించిన స్పష్టత తీసుకు వచ్చింది. సద్గురువుకి నన్ను ఇంకా దగ్గర చేసినట్లు అనిపిస్తోంది. ఏదో ఒక రోజు నేను సద్గురువుని జ్ఞానోదయం పొందిన కళ్ళతో చూడగలనని ఆశిస్తున్నాను. నన్ను ఈ స్థితికి(తెలుసుకోవాలన్న తపన) జేర్చిన ఈశా బ్రహ్మచారి, సన్యాసి సంఘ సభ్యులకి నా కృతజ్ఞతలు.

“ఈ దారిలో ఎన్నో ఒడి దుడుకులు అడ్డంకులు ఉన్నా, నన్ను దారిలో నడిపే శబ్దం మాత్రం – శంభో!“


Editor's Note: Watch this space every month as we share with you the journeys of Isha Brahmacharis in the series, "On the Path of the Divine."