మీరు కోరుకుంటున్నదొక్కటే: శరీరానికి బయటా, లోపలా ఒక ఆహ్లాదకరమైన స్థితి. మీ అంతరంగం ఆహ్లాదంగా ఉంటే దానిని శాంతి అనీ, ఆనందమనీ, సంతోషమనీ అంటున్నాము. మీ చుట్టుపక్కల అంతా ఆహ్లాదకరంగా ఉంటే దాన్ని విజయం అంటున్నాం. వీటిలో వేటిపైనా మీకు ఆసక్తిలేక స్వర్గానికి వెళ్ళాలనుకుంటే, మీరేది కోరుకుంటున్నట్టు? మరణానంతర లోకాల్లో విజయం! కనుక, మానవ జీవితానుభవం అంతా కూడా, వివిధ స్థాయిల్లో ఆహ్లాదకరంగా ఉండడం లేదా ఉండలేపోవడం గురించిన ప్రశ్నే.

రోజు మొత్తం మీద ఒక్క క్షణం కూడా ఏ రకమైన ఆందోళనా, గాభరా, చిరాకు, ఒత్తిడి లేకుండా ఆనందంగా గడిపిన రోజులు మీ జీవితంలో ఎన్ని ఉన్నాయి? మీరు రోజంతా, అంటే ఇరవై నాలుగు గంటలూ పూర్తి పరమానందంలో గడిపిన రోజులెన్ని? ఈ మధ్య కాలంలో అలా గడిపిన రోజు ఏది?

శాంతితో నిండిన సమాజాన్నీ, ఆనందంగా ఉండగలిగే ప్రపంచాన్నీ నిర్మించడానికి ప్రశాంతమైన ఆంతర్యమే తిరుగులేని భవిష్య నిధి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద ఏ వ్యక్తికీ, అతను ఎలా జరగాలని కోరుకుంటాడో అలా జరిగిన రోజు ఒక్కటీ ఉండదు. అలాగే, అవి ఎంత క్షణికమైనప్పటికీ, సంతోషం, ప్రశాంతత, బ్రహ్మానందం అనుభవించని వ్యక్తి కూడా ఉండడు. వాళ్లా స్థితిలో ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు అంతే. ఆ స్థితికి ఎలాగోలా చేరుకున్నా కూడా, అది కొద్దిసేపట్లోనే కూలిపోవడం మొదలవుతుంది. అలా జరగడానికి భూకంపం లాంటిదేదీ సంభవించనక్కరలేదు. అతి చిన్న విషయాలు కూడా మనుషులు తమ సంయమనాన్ని కోల్పోయేలా, తమ నిలకడ తప్పేలా చెయ్యగలవు. ఉదాహరణకి అది ఎలా జరగవచ్చంటే: మీరు బయటికికెక్కడికో వెళ్తారు. ఎవరో మిమ్మల్ని చూసి ప్రపంచంలో మిమ్మల్ని మించిన అందమైనవారు లేరు అని పొగుడుతారు. మీరు ఆనందంలో తేలిపోతూ ఉంటారు. ఇంటికి వచ్చేసరికి, ఇంట్లో వాళ్ళు మీరు నిజంగా ఎలా ఉంటారో ఉన్నదున్నట్టు అసలు విషయం చెప్తారు. మీ ఆకాశ సౌధం కూలిపోతుంది. ‘ఇదెక్కడో విన్నట్లుందే’ అనిపిస్తోందా?

మీలో మీరు ఆనందంగా ఉండడం ముఖ్యం

మీ ఆంతర్యం ఆహ్లాదంగా ఎందుకు ఉండాలి? దీనికి సమాధానం ప్రత్యక్షంగా తెలిసినదే. మీ ఆంతర్యం ఆహ్లాదంగా ఉన్నప్పుడు, సహజంగా అందరితోనూ, మీ పరిసరాలతోనూ ఆహ్లాదంగా ఉంటారు. అందరితోనూ మంచిగా ఉండమని మీకే తత్త్వచింతనా, ధార్మిక గ్రంథాలూ బోధించనక్కరలేదు. మీ ఆంతర్యం ఆహ్లాదంగా ఉన్నప్పుడు మీలో ఇది సహజంగానే జరుగుతుంది. శాంతితో నిండిన సమాజాన్నీ, ఆనందంగా ఉండగలిగే ప్రపంచాన్నీ నిర్మించడానికి ప్రశాంతమైన ఆంతర్యమే తిరుగులేని భవిష్య నిధి. అంతేగాక, ప్రపంచంలో మీ సఫలత, తప్పనిసరిగా మీ మనశ్శరీరాల సామర్థ్యాలని ఎంత చక్కగా వినియోగించుకోగలరన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.

కనుక విజయం సాధించాలంటే, అంతరంగంలో ఆనందంగా ఉండగలగడం మీ ప్రాథమిక లక్షణమై ఉండాలి. అన్నిటినీ మించి, మీరు మీ ఆంతర్యం ఆహ్లాదంగా ఉన్నప్పుడే మీ శరీరమూ, బుద్ధి వాటి అత్యున్నత స్థాయిలో పని చెయ్యగలుగుతాయన్న వాస్తవానికి వైద్య, వైజ్ఞానిక దాఖలాలున్నాయి. ఇరవైనాలుగు గంటలపాటు ఆనంద స్థితిలో మీరు ఉండగలిగినట్టయితే, మీ మేధో శక్తి ద్విగుణీకృతమవుతుందని చెపుతారు. కనుక లోపలి అలజడిని సర్దుకోనిచ్చి, మనసుని తేటపరచుకుని, మీలోని స్పష్టతను పైకి తీసుకురావడం ద్వారా మీరిది సాధించవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు