అన్నీ ప్రేమ వ్యవహారాలే

shop

Sadhguruమీరు ఈ రోజు ఏ గొప్ప లావాదేవీ చేయబోతున్నారు? మీ జీవితం అంతా లావాదేవీలు మాత్రమే  చేయాలనుకుంటే, మీరు దయ్యపు శిష్యరికం చేస్తున్నట్లే. దయ్యమే ఎప్పుడూ అందరితో లావాదేవీలు చేస్తుంది. మీ జీవితంలో ఉన్నతమైనవి మీకు దొరకాలంటే, అసలు ఎవరితోనూ ఒప్పందాలు చేసుకోవడం గురించి ఆలోచించకండి. మీరు వ్యవహరించేది వ్యాపారవేత్తతో అయినా లేదా మామూలు వర్తకునితో అయినా, వారు మిమ్మల్ని అభిమానించేలా మీరుండాలి. ఇందులో కిటుకుకేమీ లేదు. మీ ఇద్దరి మధ్య లావాదేవీ జరగవలసినదైతే జరుగుతుంది, లేకపోతే లేదు. వ్యవహారం అనేది ఇద్దరు వ్యక్తుల శ్రేయస్సుకు సంబంధించినది, కాబట్టి ఆ వ్యవహారం జరగడం ఇద్దరికీ అవసరమే. మనం ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి, కొన్ని వ్యక్తిగతమైనవైతే, మరికొన్ని ఇతరమైనవి. ఇవన్నీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

ప్రేమ అంటే బేషరతుగా, సంపూర్ణ నిబద్ధతతో అవసరమైనవి చేసుకుపోవడమే.

ప్రేమ అని మీరు దేనినంటారు? ప్రేమ అంటే బేషరతుగా, సంపూర్ణ నిబద్ధతతో అవసరమైనవి చేసుకుపోవడమే. మీకు అలాంటి నిబద్ధతే లేకపోతే, ఇతరులతో వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, ప్రతీసారి ఇతరుల నుంచి మీకే లాభం రావాలని ఆశిస్తుంటారు. ఇలా జరగాలంటే మీరు కలిసిన వారంతా తెలివితక్కువవారై ఉండాలి. వివేకం ఉన్నవారైతే, మీరే లాభపడాలనే ఉద్దేశ్యంతో, మీరు చేసే మూర్ఖ ప్రతిపాదనలకు అంత సులువుగా పడిపోరు కదా. వ్యవహారం వల్ల ఇరు వర్గాలకూ మేలు కలిగేలా మీరు చేయవలసింది చేస్తే, అవకాశాన్ని బట్టి అవి సఫలం అవుతాయి. అయితే ఒప్పందాలు మార్కెట్‌ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచపరిస్థితుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కానీ మీరు మీ ఆంతరంగిక వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ చెయ్యగలిగినంత మేర కృషి చేస్తే, మీ సామర్థ్యానికి తగ్గట్టుగా పనులు జరిగిపోతాయి. మీ సామర్థ్యానికి మించినవి ఎలాగూ జరగవు. మీరు తలబద్దలు కొట్టుకున్నా అవి జరగవు, అయినా ఫరవాలేదు.

మీరు అన్నివేళలా బేరసారాలతోనే జీవితం గడుపుతుంటే, మీరు దయ్యానికి శిష్యరికం చేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు.

మీరు అన్నివేళలా బేరసారాలతోనే జీవితం గడుపుతుంటే, మీరు దయ్యానికి శిష్యరికం చేస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దయ్యమే కదా ఎప్పుడూ ఎవరో ఒకరితో ఇలాంటి ఒప్పందాలు, బేరాలు, వ్యవహారాలు జరుపుతుంది. దేవుడు ఎప్పుడూ, ఎవరితోనూ బేరాలు చేయడు.  మీరు ఇంకా పూర్తిగా దేవుడిగా మరిపోకపోయినా, కాసేపు దేవుణ్ణి అనుకరించి చూడండి; దేవుడు ఎలాంటి  బేరాలూ చేయడు. మీ ముందుకు ఎన్నో రకాలైన  బేరాలు, వ్యవహారాలు రావచ్చు. మరోలా చెప్పాలంటే ప్రతి వ్యక్తీ వ్యాపారవేత్తే. ప్రతి వ్యక్తీ లాభసాటి బేరం చేసుకుందామనే భావిస్తాడు. కొందరు ఇంట్లో, కొందరు బయట, కొందరు గుడిలో, మరికొందరు తమ ఆధ్యాత్మిక జీవితంలో – ఇలా ఎక్కడో ఒక చోట ప్రతివారూ లాభ పడదాం అని భావించేవారే. ప్రతి ఒక్కరూ ఈ లావాదేవీల నుంచి ఏదో ఒకటి ఆశించేవారే. బేరాలు, ఒప్పందం మీకు అనుకూలంగా ఉంటే మీరు ఎంతో సంస్కారవంతంగా, చక్కగా ప్రవర్తిస్తారు. అదే ప్రతికులంగా ఉంటే  అరచి,  కేకలు వేస్తారు.

మీరు టాక్సీ డ్రైవర్‌తో ఒక్క నిముషం మాట్లాడినా, పై అధికారితో, క్లయింట్‌తో మాట్లాడినా, మీ భార్య లేదా భర్తతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, ఆ వ్యవహారాలన్నీఏదైనా సరే, అన్నీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

మీరు ప్రతి పనీ చేయగల సూపర్‌ మాన్‌ అయిపో అఖ్కరలేదు. కాని మీరు చేయగలిగిన దానిని కూడా మీరు చెయ్యకపోతే మాత్రం అది పద్ధతి కాదు, అప్పుడు మీరు విఫలులు అయ్యారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే ఎప్పుడూ ఇంకా, ఇంకా బేరాలు కుదుర్చుకోవడం గురించే ఆలోచించవద్దు. ప్రతి పనిలో మిమ్మల్ని మీరు సమర్పించుకునే ధోరణిని పెంచుకోండి, అదే అన్నింటి కంటే అత్యుత్తమమైన పని. అపుడు సహజంగానే ఇతరులకు మీ అవసరం ఉంటే మీతో వ్యవహరిస్తారు. మీరు టాక్సీ డ్రైవర్‌తో ఒక్క నిముషం మాట్లాడినా, పై అధికారితో, క్లయింట్‌తో మాట్లాడినా, మీ భార్య లేదా భర్తతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, ఆ వ్యవహారాలన్నీఏదైనా సరే, అన్నీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

అయితే మీతో వచ్చిన సమస్య ఏమిటంటే మీరు ఒకరిని మరొకరి కన్నా ముఖ్యం అనుకుంటారు. మీరు కొన్ని వ్యవహారాల పైనే ధ్యాస పెడతారు, మరి కొన్నింటిలో అసలు ఆసక్తే చూపరు. అయితే అలా ఉంటే పనులు సజావుగా జరగవు. జీవనసాఫల్యం కోసం అన్నిరకాల వ్యవహారాలూ కావలసిందే. అసలు మీరు అందరితో, అన్నింటితో ప్రేమలో ఎందుకు పడరు? ఎవరితోనైనా ఏదైనా పని చెయ్యాల్సి వచ్చినప్పుడు, ఆ వ్యవహారమంతా ఒక గొప్ప ప్రేమబంధంగా మార్చుకోండి, మీకు పోయేదేముంది? అప్పుడే అన్నీ సులువుగా జరుగుతాయి.

ప్రేమాశిస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert