‘చింతించకండి, సంతోషంగా ఉండండి', 'చింతించకండి, సంతోషంగా ఉండండి’,(Don't worry, Be happy) అనేది పనిచేయదు. ఎందుకంటే దీన్ని మీరు మీ జీవితంలో ఒక నినాదంలా‌ వాడుతున్నారు.మీ విషయాల గురించి మీరు చింతించకుండా ఎలా ఉంటారు? మీ మనసుకి మీరు, ‘చింతించకండి, సంతోషంగా ఉండండి!’ అని చెప్పిన మరుక్షణం నుండి మీ మనసు మీ నియంత్రణలో లేని  ఒక పునారవృత ఆలోచనా స్ధితిలోకి వెళ్ళిపోతుంది. దానినే చింత అంటారు, అవునా,కాదా?

ఒకే దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండటాన్ని చింతించడం అంటారు. అంతేకానీ, ఒక విషయం గురించి ఆలోచించడం చింతించడం కాదు. మీరు అన్ని విషయాల గురించి సరిగ్గా ఆలోచించాలి. కానీ ఒకే దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండడం చింతించడమవుతుంది. అంటే మీ మనసు, ఒకే దాన్ని మళ్ళీ, మళ్ళీ  ప్లే చేసే ఒక అరిగిపోయిన రికార్డు లాగా పని చేస్తుంది.

మీ మనస్సు ఇలా అయ్యిందంటే, అది సరిగా పనిచేయటం లేదని అర్థం. అవునా, కాదా? మీ జీవితంలోని ఏదో ఒక పరిస్థితి మీ మనస్సు మీద ఒక గీత పడేలా చేసుంటుంది. అందువల్ల మీ మనస్సు అరిగిపోయిన రికార్డు లాగా ఒకే దాన్ని మళ్ళీ, మళ్ళీ  ప్లే చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, అది అదే ప్లే చేస్తుంది.ఈ రికార్డుని బాగుచేయకుండా లేదా దాన్ని ఆపేయకుండా, మీరు దానిని ఇంకో బాణిలోకి మార్చేసారు. ఒక పాట పాడే బదులు వేరొక పాట పాడుతున్నారు. ప్రారంభంలో అది పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ కొంత కాలం తరువాత మీరు ప్రగాఢ నిస్పృహకు లోనవుతారు.

ఒకప్పుడు 'పాజిటివ్ థింకింగ్' అని బాగా ప్రాచుర్యం పొందిన దాని గురించే జనాలు మీకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు - ‘చింతించకండి, సంతోషంగా ఉండండి!’, ' ఏమి జరిగినా అది మీ మంచికే!’, ‘నేను బాగున్నాను, మీరు బాగున్నారు, అంతా బాగుంది!’ అంటుంటారు. అంటే జీవితం ఇంకా మిమ్మల్ని సరిగా ఇబ్బంది పెట్టలేదని అర్థం.

పాజిటివ్ థింకింగ్ బోధించినవారే తమ బుర్రలని పాడుచేసుకున్నారు, ఉరివేసుకుని ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఎందుకంటే అది ప్రారంభంలో పనిచేస్తుంది, అది కూడా  కొంత సమయం వరకే. జీవితంలోని అన్ని అంశాలలో అది పని చేయదు, ఈ విషయం మీకు స్పష్టమవ్వాలి. ఈ ఉనికికే ఆధారమైన ప్రాధమిక వాస్తవం తప్ప, వేరేదేది  జీవితంలోని అన్ని స్ధాయిలలో పని చేయదు. మీకు మీరు వివిధ రకాలుగా బాగున్నట్లు నచ్చ చెప్పుకోవచ్చు, కానీ అది చాలా కాలముండదు.

ఇందువల్లే అన్నారు, దేవుడు తప్ప మరో మార్గం లేదని. వారు దేవుడు అన్నప్పుడు, మీ దేవుడో, మా దేవుడో, ఈ దేవుడో, ఆ దేవుడో లేదా పైన కూర్చున్న ఏ మూర్ఖుడి గురించో మాట్లాడటం లేదు. దేవుడంటే మీ సృష్టికి ఆధారం. ఇప్పుడు మీ అనుభవంలో మీ సృష్టికి ఆధారం ఎక్కడ ఉంది, లోపలా, బయటా? ఖచ్చితంగా లోపలే, అవునా,కాదా?ఈ శరీరం యొక్క ఎదుగుదల లోపలి నుండి అవుతోంది. అంటే సృష్టికి ఆధారం మీ లోపల ఉంది. నేను అంటోంది కూడా అదే. మీ సృష్టికి ఆధారభూతమైన మీ అస్థిత్వ మూలమే ఆనందం;  జీవితంలోని అన్ని స్ధాయిలలో పని చేసేది అది ఒక్కటే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.