సత్యాన్వేషణకు ఇది సరైన సమయం..!
ఈ వారం..... అబద్ధాలూ, అసత్యాలూ ఎక్కడపడితే అక్కడ ప్రపంచవాప్తంగా ఎలా ఉన్నాయో సద్గురు ప్రస్తావిస్తున్నారు. అయితే, అంతటా విషాదమూ, వినాశమే అలముకొని లేవు. దానికి భిన్నంగా, ఆయన సూచించినట్టు, "ఈ భూతలం మీద సత్యాన్ని శక్తివంతమైన సాధనంగా చెయ్యడానికి మిక్కిలి అనువైన యుగం ఇది." అదెందుకో చదివి తెలుసుకొండి. "అవకాశం ఇస్తే, ప్రతి వ్యక్తికీ అంతర్గతంగా సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. కావలసినదల్లా, ప్రతివ్యక్తికీ త్రాగుడుకి మించిన బ్రహ్మానందం, మాదకద్రవ్యాలు సేవించడాన్ని మించిన పరమానందం ఒకటి ఉందని వాళ్ళు అనుభూతి చెందే అవకాశం కలిగించాలి," అని సద్గురు అంటారు.
ప్రపంచమంతా ఇపుడు అబద్ధాలూ, మోసాలతో తల్లడిల్లుతోంది. అత్యున్నతస్థాయి వర్గాలలో పరమ అసహ్యకరమైన విషయాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు సమీక్షిస్తే, ఈ అబద్ధాలకీ అసత్యాలకీ మీకు హద్దులు కనిపించవు. ప్రజాస్వామ్యం అంటే, వ్యక్తిత్వాల్ని దెబ్బతీయడమేనేమో అనిపిస్తుంది. ఒక విషయం అబద్ధమని తెలిసినా, దాన్ని ప్రస్తావించడానికి ఇక సిగ్గుపడవలసిన పని లేదేమోననిపిస్తుంది. ఈ రోజుల్లో అబద్ధాలే ముఖ్యమైన వార్తలు. ప్రపంచం ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, నేడు సత్యం కోసం నిలబడి, సత్యం కోసం జీవితం త్యాగం చెయ్యగల ఒక పెద్ద ప్రజాసమూహాన్ని తయారుచెయ్యడం అత్యంత ఆవశ్యకం.
సత్యం అంటే నమ్మకం కాదు. మీకు నచ్చిన విషయాన్ని దేన్నైనా మీరు నమ్మొచ్చు. వాస్తవానికీ దానికీ ఏ రకమైన సంబంధం ఉండనక్కరలేదు. మీరు ఎక్కువమంది మనుషుల్ని ఒక విషయాన్ని నమ్మించగలిగితే, అది అబద్ధమైనా, ప్రముఖ వార్త అవుతుంది. ఒకసారి మీరు నమ్మడం ప్రారంభిస్తే, మీ అస్తిత్వం మీ నమ్మకం చుట్టూ అల్లుకుంటుంది. నమ్మకం ఎంత హస్యాస్పదమైన విషయాన్నైనా పరమసత్యంగా అంగీకరించే మానసిక స్థితిని తీసుకువస్తుంది. సత్యాన్ని ప్రముఖంగా చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని శక్తులు దాన్ని పక్కదోవ పట్టించగలుగుతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడు మనుషులకి తమ అభిప్రాయాల్ని నలు దిశల్లో వ్యక్త పరుచుకోగల సామర్ధ్యం ఏర్పడింది.
సత్యం అందరి మనసుల్నీ, హృదయాల్నీ తాకేలా మనం చెయ్యవచ్చు. సాంకేతికత మనం ఇలా సమావేశం అవగలిగేలా చేసింది. ఈ భూతలం మీద సత్యాన్ని శక్తివంతమైన సాధనంగా చెయ్యడానికి మిక్కిలి అనువైన యుగం ఇది. మీరు సామాజిక మాధ్యమాల్లో కబుర్లు చెప్పడం ప్రారంభించి దాన్ని ప్రపంచం అంతటికీ అందుబాటులోకి తేగలరు. కబుర్లు ప్రపంచవ్యాప్తం ఎలా అవుతున్నాయో, సత్యం కూడా ప్రపంచవ్యాప్తం కావాలి.
ఈ క్షణంలో భారత ఉపఖండంలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఋతు ప్రభావం వల్ల పెద్ద వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి ఋతువులో, అనేకమంది శిష్యులతో పరివ్రాజకుడిగా నిత్యం ప్రయాణం చేసే గౌతమ బుద్ధుడు ఒక నియమం పెట్టాడు: ఈ రెండు నెలలూ బౌద్ధ బిక్షువులందరూ ఏదో ఒక ప్రదేశంలో తాత్కాలికంగా నివసించవచ్చునని. సాధారణంగా అతనితో కలిసి నడిచే సన్యాసులందరూ ఏ ప్రదేశంలో నైనా 2 రోజులు మించి ఉండేవారు కాదు. కానీ, వర్షాకాలంలో అడవుల్లో తిరగడం భయానకమేకాదు, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారు కూడా. అందుకని, ఎక్కువ గడపలున్న పెద్ద నగరంలో బసచెసేవారు.
ఉదయం పూట సన్యాసులు బిక్షాటనకు వెళ్ళేవారు. ఆనందతీర్థులని గౌతముని సమీప బంధువు ఒకరోజు ఒక వేశ్య ఇంటికి వెళ్లడం తటస్థించింది. అతనికి బిక్షవేస్తూ, పొడుగ్గా అందంగా ఉన్న అతన్ని చూసి ఆమె ఇలా అంది, "నేను సన్యాసులు వసతి కోసం వెతుకుతున్నట్టు విన్నాను. మీరెందుకు నా ఇంట్లో బస చెయ్యకూడదు?" అని. దానికి ఆనందతీర్థులు, "నేను బుద్ధుని అనుమతి తీసుకోవాలి. నేను ఎక్కడ బస చెయ్యాలో ఆయనే చెప్పాలి,"అన్నాడు. ఆమె అతన్ని ఎత్తిపొడుపుగా,"ఓహో, మీరు మీ గురువుగారి అనుమతి తీసుకోవాలా? సరే, అడగండి. వారేమి చెబుతారో చూద్దాం." అంది. ఆనందుడు బుద్ధుని దగ్గరకి వచ్చి, తెచ్చిన బిక్ష అతని పాదాల చెంత ఉంచాడు.
ప్రతివారూ, తాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ బిక్ష, వసతి సంపాదించుకోవాలి. అందుకని ఆనందుడు, "ఆ స్త్రీ నన్ను ఆహ్వానిస్తున్నది. నేను వెళ్ళవచ్చునా?"అని అడిగాడు. దానికి బుద్ధుడు, "ఆమె నిన్ను ఆహ్వానిస్తే, నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్లి ఉండవచ్చు." అన్నాడు. అది వినగానే ఆ పట్టణంలోని ప్రజలంతా ఎదురు తిరిగారు. వాళ్ళు "ఏమిటీ? ఒక సన్యాసి వేశ్యాగృహంలో బస చేయడమా? అంతే మరి. ఆధ్యాత్మిక ప్రక్రియలిప్పుడు భ్రష్టుపట్టాయి." అన్నారు. గౌతముడు వాళ్ళ వంక చూసి, "మీరెందుకు అంత బాధపడతారు? ఆ స్త్రీ అతన్ని అహ్వానించింది. అతన్ని అక్కడ ఉండనీయండి. అందులో సమస్య ఏముంది?" అన్నాడు.
ప్రజలు వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడాయన, "ఆగండి. నేను నా మార్గంలో ఉన్నానంటే, అది జీవించడానికి అత్యంత శక్తిమంతమైన, విలువైన మార్గం కాబట్టి. మీరిప్పుడు ఆమె జీవన విధానాలు నా మార్గంకంటే శక్తివంతమైనవని చెబుతున్నారు. అదే నిజమైతే, నేను ఆమె అనుచరగణంలో కలిసిపోవాలి. సత్యాన్వేషిగా, నేను చెయ్యవలసిన పని అదే... మనం అనుసరిస్తున్న దానికంటే ఉన్నతమైనది మరొకటి కనిపించినపుడు మనం దాన్ని అనుసరించాలి." ప్రజలందరూ చాలా ఆలోచనలో పడ్డారు. చాలామంది ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోయారు కూడా. ఆనందుడు వెళ్లి ఆమెతో ఉన్నాడు. వర్షాల వల్ల చలి ఎక్కువగా ఉంది. అతని శరీరం మీద పల్చని వస్త్రమే ఉంది. అందుకని ఆమె అతనికి ఒక మంచి పట్టు వస్త్రాన్నిచ్చింది. అతను దాన్ని నిండుగా కప్పుకున్నాడు.
ప్రజలు అది చూసి అతను దారి తప్పుతున్నాడనడానికి నిదర్శనంగా తీసుకున్నారు. ఆమె అతనికి మంచి ఆహారాన్ని వండి పెట్టింది. దాన్ని అతను భుజించాడు. సాయంత్రం అతనికోసం ఆమె నృత్యం చేసింది. అతను దృష్టి మరల్చకుండా ఆమె నృత్యాన్ని చూశాడు. వాళ్ళు సంగీతాన్ని వినగానే అతను దిగజారిపోయాడనుకున్నారు. కాలం గడిచింది. వర్షాలు తగ్గి, వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టవలసిన సమయం ఆసన్నమవగానే, ఆనందుడు తన కూడా ఒక సన్యాసినితో బుద్ధుని దగ్గరకి వచ్చాడు. సత్యమార్గంలో నడవాలన్న కోరిక ప్రతి మనిషిలోను ఉంటుంది. మనుషులకి అలా నడిచే అవకాశం ఇవ్వాలి.
ఈ క్షణంలో ప్రతివారూ అనేక విషయాల్లో తలమునకలై ఉండవచ్చు. కానీ, చివరకి, ప్రతివారికీ పరమానందాన్నిచ్చేదేదో అది కావాలని కోరుకుంటారు. మనం చెయ్యవలసినదల్లా ఎన్నో ఉత్కృష్టమైన ఆనంద మార్గాలున్నాయని చూపించడమే. మత్తు పానీయాలు సేవించడం కన్నా, మాదక ద్రవ్యాలు తీసుకోవడం కన్నా ఉత్తమమైన ఆనంద మార్గాలున్నాయి; రాజకీయ నాటకంలో పాలుపంచుకోవడంకన్నా, ఎవరో ఒకరి కన్నా మనం అధికులమవడాన్ని మించి ఆనందాన్నిచ్చేవి ఉన్నాయి. అనాది నుండీ ప్రజలకు మన ఋషులూ, మునులూ, యోగులూ, గురువులూ సత్యానికి ఉన్న శక్తిని అనుభవపూర్వకంగా రుచి చూపిస్తూ, వారిని సత్యమార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేవలం వారి అనుకంపవల్లా, తపశ్శక్తివల్లా వారిచుట్టూ ఉన్న ఎందరి జీవితాలనో మార్చగలిగారు.
కాని ప్రపంచంలోని అందరినీ చేరుకునే పరికరాలు, ఉపకారాలు వాళ్ళ దగ్గర లేవు. ఆ రోజు వాళ్ళు ఊహించలేనంత సాంకేతిక పరిజ్ఞానం మనకి ఉండడం వల్ల పది మందికీ సత్యాన్ని చేరవేయవలసిన గురుతర బాధ్యత మనమీద ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు, మన జీవితంలో, మనం చెయ్యలేనివి చెయ్యకపోవడం వలన ప్రమాదం ఏమీ లేదు. కానీ మనం చెయ్యగలిగినవి చెయ్యకపోతే, మనం దౌర్భాగ్యకరమైన జీవితం జీవించినట్టే. నేను ఆశిస్తున్నది, ముఖ్యంగా యువతరం నుండి, మీరు ఏది అత్యున్నత ఆనందదాయకమో దానికోసం నిలబడండి, పోరాడండి.
మీరు అందరికన్నా మెరుగ్గా ఉండవలసిన పనిలేదు; కానీ, మీరు మీలో దాగున్న శక్తిని పూర్తిగా వినియోగించుకోగల సమర్థతతో ఎప్పుడూ ఉండాలి. మీరు ఏది ఉత్కృష్టమని గమనిస్తున్నారో, దానికోసం మీ జీవితం వెచ్చించలేకపోతే, మీరు జీవితాన్ని వృధాచేసినట్టే. "కానీ, సద్గురూ..." ... మీరు ఈ "కాని" ని తన్ని ఆవలకు తోసెయ్యాలి. ప్రతివారికీ ఒక "కానీ..." ఉంటుంది. వాళ్ళ జీవితంలో అత్యున్నతమైన విషయాలని అందుకుంనేందుకు, ప్రయత్నించకపోవడానికి ప్రతివారికీ ఒక సాకు, ఒక మిష, ఒక కారణం ఉంటుంది. "నేను చేద్దామనే అనుకున్నాను. కానీ..." బాధ్యత అంటే ఏ సాకులూ చెప్పకుండా దాన్ని నెరవేర్చగలగడం. "అయితే, దీనంతటివల్లా నాకు ప్రయోజనం ఏముంటుంది, సద్గురూ? నేను ప్రపంచాన్ని మార్చాలనుకోవడం లేదు." ఇది మీరు నిర్ణయించవలసిన విషయం కాదు.
ఇది నేను మీ మనసులో జొప్పించడానికి చేస్తున్న ప్రయత్నమూ కాదు. ఈ మానవ జన్మకున్న సహజధర్మమే అది: మీరు మీ చేతనైనది చెయ్యకపోతే, దాని పర్యవసానం మీ మరణ శయ్య దాకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన, సఫలవంతమైన జీవితాన్ని జీవించాలంటే, మీరు దేనిని ఉత్కృష్టంగా భావిస్తున్నారో, అది అందుకునేందుకు ప్రయత్నం చేసి తీరవలసిందే. లేనపుడు మీ జీవితంలో ఆ వెలితిని ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటారు. మీరు అర్హమైన చాలా విషయాలకి మీరు అనర్హులేమో అని మీకు అనిపిస్తుంది.
చాలా విధాలుగా, ప్రపంచంలోని శక్తులన్నీ ఏకీకృతం అవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక సున్నితమైన పువ్వు వంటిది తనచుట్టూ ఉన్న వాతావరణానికి సుగంధాన్ని ఇవ్వగలుగుతోంది. మీరు ఎవరితోనూ పోరాడవలసిన పనిలేదు. మీరు చీకటితో పోరాడలేరు. కావలసింది చిన్న దీపం వెలిగంచడమే. మీరు దీపం వెలిగిస్తే, చీకటి దానంతట అదే తొలగిపోతుంది. చీకటి అన్నిటికన్నా అధిగమించలేని బలీయశక్తిగా కనిపిస్తుంది. అదే చిమ్మచీకటి అయితే, మీకు దైర్యం సడలిపోతుంది. కానీ మీరు దీపం వెలిగించగానే, ఎటువంటి ప్రయత్నం లేకుండా అదే తొలగిపోతుంది.
అజ్ఞానం యొక్క ధర్మం కూడా అలాంటిదే. అసత్యం సంగతి కూడా అంతే. దానితో పోరాడవలసిన అగత్యం లేదు. మీరు సత్యాన్ని వెలిగించండి, అసత్యం దానంతట అదే తొలగిపోతుంది. మిమ్మల్నీ, మీతో పాటు, ఈ ధరణి మీద ప్రతి వ్యక్తికీ వెలుగు చూపించే మార్గాన్ని వెతుకుతున్నాం. దానికి కొంత శ్రమపడవలసి రావచ్చు, కానీ, దానికి సప్తఋషులూ, గౌతమ బుద్ధుడూ, శ్రీ కృష్ణుడూ మొదలైన వాళ్ళందరూ పడినంత శ్రమ పడనక్కరలేదు, ఎందుకంటే, వాళ్లకి అప్పుడు సత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చెయ్యడానికి కావలసిన సాధనాలు లేవు. మన పూర్వీకులెవరిదగ్గరా లేని సాధనాలు ఇపుడు మన స్వంతం. కనుక ఇంతకుముందు ఎవ్వరూ సాధించనిది మనం సాధించాలి. ఇది నా కోరిక, నా ఆశీస్సు కూడా.