శ్రీనివాస రామానుజం - దేవీ భక్తుడు
ఈ వారం స్పాట్ లో సద్గురు ఉనికి ద్వారాలను తెరిచిన రెండు వ్యక్తుల కథలను పంచుకుంటారు. "భారతదేశంలో, ప్రజలు చాలా శక్తివంతమైన మార్గాల్లో దేవతలను ఉపయోగిస్తారు. ఎంతో మంది దేవీ ఆరాధకులు ఉన్నారు, వారు దేవి ముందు కూర్చున్నప్పుడు జీవితంలోని వివిధ అంశాల పట్ల విపరీతమైన పరిజ్ఞానాన్ని కనబరుస్తారని..." సద్గురు చెబుతున్నారు. తన చిన్నతనంలో తనకు ఎదురైన ఒక దేవీ ఆరాధకురాలి గురించి, అలాగే తెలివైన గణిత శాస్త్రవేత్త రామానుజన్ గురించి వ్రాసారు. అలాగే ఈశా యోగా ఒక ద్వారంగా ఉండొచ్చని సద్గురు గుర్తుచేస్తున్నారు.
భారతదేశంలో చాలా మంది విగ్రహాలను శక్తివంతమైన విధానాలలో వాడడం నేర్చుకున్నారు. ఎంతో మంది దేవీ ఉపాసకులు ఉన్నారు. వీరు దేవి ఎదురుగుండా కూర్చున్నారంటే చాలు, వారు జీవితంలోని ఎన్నో అంశాలలోకి, ఎన్నో కోణాలలోకి పరికించి చూడగలుగుతారు. అదే ఒకసారి వారు అక్కడనుండి బయటికి వచ్చేసిన తరువాత, వారు ఏమ చెప్పారో వారే ఎరుగరు. నాకు సుమారు తొమ్మిదేళ్ళు వయసప్పుడు ఇలా జరిగింది, నేను గుంతకల్ లో ఉండేవాడిని, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నేను అక్కడ రెండు సంవత్సరాలు చదువుకున్నాను. అక్కడ ఓ వీధి పక్కన ఉన్న చిన్న గుడిలో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ జుట్టంతా జడలు కట్టుకుపోయి ఉండేది. ముసలావిడ, సుమారు ఎనభై సంవత్సరాలు ఉండచ్చు. ఈవిడ చిన్నగా ఒక పిట్టలా ఉండేది. ఇది నాకు బాగా గుర్తుంది, ఓసారి నేను మా అమ్మమ్మతో అక్కడికి వెళ్లాను. మా అమ్మమ్మ గారికి వాళ్ళ గురువుగారు ఒక మంత్రాన్ని ఇచ్చారు, ఆవిడ ఇంకొంతమందికి ఈ ఉపాసనని ఇచ్చేవారు. కొన్ని కుటుంబాలలో ఆవిడని గురువుగా స్వీకరించారు. చాలా దగ్గరివాళ్ళు మా అమ్మమ్మని మైసురమ్మ అని పిలిచేవారు. ఎందుకంటే ఆవిడ కొంతకాలం మైసూరులో గడిపింది. వారికి ఈవిడ పేరుకూడా తెలీదు. మా అమ్మమ్మ, నేను ఈ చిన్న గుడిలోకి వెళ్లి కూర్చున్నాం. ఇది ఇటుకలతో రాతితో కట్టబడి ఉంది, చాలా చిన్నది.
గుళ్ళో ఉన్న ముసులావిడ ఆ గుడిని సంరక్షిస్తూ ఉంటుంది. ఈమె ఒక రకమైన మైకంలో ఉన్నట్టుగా కుర్చుని ఉంది. ఆవిడ అన్ని రకాల శబ్దాలు చేయడం మొదలెట్టింది. ఊఉ, ఊ, అంటూ ఆవిడ 'మైసురమ్మ , మైసురమ్మ' అని అంది. ఈ పేరు ఆవిడకి తెలిసే అవకాశం లేనేలేదు. ఆవిడ మా అమ్మమ్మ గురించి అన్ని రకాల విషయాలు చెప్పడం మొదలెట్టింది, పైగా ఇవన్ని నా ఎదురుగుండా చెప్తోంది. ఇది మా అమ్మమ్మకి చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే అసలే ఆవిడకికి నాతో చాలా సమస్యలున్నాయి. ఇంకా ఇవన్ని నాకు తెలిస్తే కొంచెం కష్టమే కదా. మా అమ్మమ్మ మధ్యలో "లేదు లేదు, అది అలా కాదు" అని చెప్పడానికి ప్రయత్నించింది. కాని ఈ ముసలావిడా 'ఏయ్ ఏయ్' అంటూ మా అమ్మమ్మని నోరు మూసుకోమంది. ఈవిడ అలా మా అమ్మమ్మ గురించిన ఎన్నో ఇబ్బందికరమైన నిజాలు చెప్పేసింది.
దేవీ భక్తుడైన రామానుజం కూడా ఈ కోవకు చెందినవాడే. రామానుజం ఎంతో తెలివైన గణిత శాస్త్రజ్ఞుడు, ఆయన తమిళ నాడు నుండి వచ్చారు. ఆయన క్రమబద్ధంగా నేర్చుకున్న విద్య చాలా కొంచెం. చాలా వరకు ఆయనకు ఆయనే స్వయంగా నేర్చుకున్నారు. ఈయన ఎంత ఎత్తుకు వెళ్ళారంటే కేంబ్రిడ్జ్ కి వెళ్లి అక్కడ ఎందరో గణిత శాస్త్రజ్ఞులతో పని చేసారు. నేను గణితం అనగానే మీరు దీన్ని ఒక పాఠ్యశాలలో చెప్పేదిగా భావించకూడదు. ఈ సృష్టి మొత్తాన్ని అంకెలతో విశదీకరించవచ్చు. అదీ గణితం అంటే. ఎంతో గొప్ప శాస్త్రజ్ఞులకి ఈ విషయం అర్ధం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఈయన పని ఎంత గొప్పగా ఉండేదంటే, ఎన్నో గణిత సిద్ధాంతాలను (theorems) రాసారు. అవన్నీ నామగిరి అనే దేవత ఆయనకు ఇచ్చింది అని చెబుతుండేవారు. మొదట్లో ఈయన భారతదేశాన్ని విడిచి బయటికి వెళ్ళడానికి అంగీకరించలేదు. కాని తరువాత ఆయన తల్లిగా కొలుచుకున్న ఈ నామగిరి దేవి ఆయనకి కలలో ఇంగ్లాండ్ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చిందని చెప్పారు. 1920లలో ఆయన మృత్యు ముఖంలో ఉన్నప్పుడు ఆయన శిక్షకులైన G.H హార్డీ అనే ఒక గొప్ప ఆంగ్ల గణిత శాస్త్ర వేతకు ఒక ఉత్తరం రాసారు. ఇందులో ఆయన ఎన్నో గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాలను రాసారు. ఇవి ఇంతకు ముందర ఎవరూ వినలేదు, ఆయన తన సొంత మాటల్లో ఇలా రాసారు "నేను గాడమైన నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. అక్కడ నా కలలో ఒక ఎర్రటి పరదా, ఇది కారుతున్న రక్తంతో తడిసినట్టుగా ఏర్పడింది.నేను దాన్ని గమనిస్తూ ఉన్నాను, అప్పుడు ఒక చేయి వచ్చి, ఈ తెర మీద రాయడం మొదలెట్టింది. నేను మొత్తం ధ్యాస, ధ్యానంతో చూడటం మొదలుపెట్టాను. ఆ చేయి elliptical integrals రాసింది. అవి నామనసులో అలానే గుర్తుండిపోయాయి, నేను నిద్రలేచి వెంటనే వాటిని రాయడం మొదలెట్టాను" అని ఈయన ఆ లేఖలో రాసారు. ఇప్పటికి షుమారు 90 సంవత్సరాలుగా ఆయన ఏం రాసారు, ఆ సిద్ధాంతాలు ఏమిటి అనేది ఎవ్వరికీ అర్ధంకాలేదు. కాని ఇది ఎంతో అద్భుతమైనది అన్న విషయం మాత్రం తెలిసింది. కేవలం 2010లో ఇది బ్లాక్ హోల్స్ (Black Holes)ని విశదీకరించే సిద్ధాంతం అని అర్ధమైంది.
90 సంవత్సరాల క్రితం ఎవరికీ ఈ Black Hole అంటే కూడా తెలీదు. కాని రామానుజం అప్పట్లోనే దీనికి గణిత శాస్త్ర సంభందితమైన సూత్రాన్ని ఇచ్చారు. అది కూడా ఆయన మృత్యు ముఖంలో ఉన్నప్పుడు, ఆయన "నా దేవి నాకిదిచ్చింది" అని చెప్పారు. రామానుజం "ఇది దేవి నాకు ఇచ్చింది" అని చెప్పినప్పుడు, ఆయనకు ఈ దేవినే ద్వారం. ఈశా యోగా కూడా దానంతట అది ఒక ద్వారమే. ఈశా యోగా కి వచ్చిన ప్రతీవారు "అబ్బా ఇది ఎంత బావుందో" అని ఆ ద్వారాన్ని ఒకసారి తెరుస్తారు. మళ్ళి దాన్ని మూసేస్తున్నారు. ఇది మీరు రోజు మీ చుట్టూరా ఉన్నవారికి జరగడం గమనిస్తూనే ఉంటారు, మీతో సహా. ఒకసారి ఆ తలుపుని తెరిచి "అబ్బ ఎంత బావుందో" అనుకుని మళ్ళి దాన్ని మూసేస్తారు. దానిలోకి తొంగిచూసారు, కాని మీరు ఆ ద్వారం ఎల్లప్పుడూ తెరిచి ఉంచుకోవడం ఎంతో అవసరం. అదే కదా అసలైన విషయం.
ప్రేమాశీస్సులతో,
సద్గురు
PC: wikipidea