సాంకేతిక పరిజ్ఞానం మానవాళిని నాశనం చేస్తుందా?
@ఈ వీడియో ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ లో ఈ మధ్య జరిగిన దర్శనం సందర్భంగా తీయబడింది. ఈ సందర్భంగా సద్గురు మనుషులపై సాంకేతిక పరిజ్ఞ్యాన ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. మన నాశనానికి లేదా శ్రేయస్సుకి దోహదపడే మూడు ముఖ్య కారకాల గురించి ఆయన మాట్లాడారు. వ్యాపారధోరణీ, నిర్బంధాలకు బదులుగా చైతన్యాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. సద్గురు ఏం చెప్పారంటే “ మనుషులు చైతన్యంతో జీవిస్తే, ప్రపంచ నాయకత్వం చైతన్యంతో నిండి ఉంటే, సాంకేతిక పరిజ్ఞానం మనుషుల శ్రేయస్సుకి వాడాలా లేదా వినాశనానికా అనే ప్రశ్నే తలెత్తదు”. అన్నారు.
ప్రశ్న: వర్చువల్ రియాలిటీ నేటి ఆధునిక ప్రపంచంలో అతి ముఖ్యమైన పరిజ్ఞానం అయిపోయింది. ఎందరో పరిశోధకులు దీనిపై అనేక పరిశోధనలు చేసి మనషుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నప్పటికీ అదే పరిజ్ఞానం మనకి సంఘ వ్యతిరేకతనీ, తప్పించుకునే లక్షణాలని, అహంకారాన్నీ, గేమింగ్ అనే వ్యసనాన్నీ తాయిలంగా ఇస్తోంది. ఈ వర్చువల్ రియాలిటీ మనుషులకి ఉపయోగపడేలా ఎలా వాడుకోవాలి? ఈ సాంకేతికత ప్రభావం మానవ చైతన్యంపై ఎలా ఉంటుంది?
సద్గురు: మనం దీన్ని చాలా బాగా ఉపోయోగించుకోవచ్చు. చూడండి, ప్రస్తుతం మనం దీన్ని ఉపయోగిస్తున్నాం - సద్గురు ఇంకా ఇండియాలోనే ఉన్నారు! (నవ్వు, చప్పట్లు) ఏ సాంకేతిక పరిజ్ఞానం హానికరం కాదు. మనిషి యొక్క మెదడు ఎప్పుడైతే ఒక వినాశకర స్థితిలో ఉంటుందో, అప్పుడే ప్రతి సాంకేతిక పరిజ్ఞానం హానికరమే. మీరు మీ లాప్ టాప్ తీసి ఎదుటి వారి తల చితక్కొట్టచ్చు. దాని అర్ధం కంప్యూటర్లు ప్రమాదకరమనా? ఒకవేళ అలాంటి సంఘటనలు చాలా ఆఫీసుల్లో జరిగాయనుకోండి, ఉదాహరణకి ఒక పది ఆఫీసుల్లో ఇలా జరిగిందనుకోండి - ఒక ఆపిల్ ఎయిర్ తీసుకుని ఎవరో తల బద్దలు కొట్టాడు. దాని అర్ధం లాప్ టాప్ లు ప్రమాదకరమనా? కాదు.
మనుషులది తెలివి తక్కువతనం. వాళ్ళకి అనువుగా ఏది వచ్చినా దాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా మార్చుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మీకు ఇంకేం కావాలో చెప్పండి. ఇప్పుడు మనకి “సాంకేతికత వ్యసన విముక్తి సంస్థలు” ఉన్నాయ్. మీకీ విషయం తెలుసా? ఎలాగైతే మాదక ద్రవ్యాల విముక్తి సంస్థలు ఉన్నాయో, మద్యపాన విముక్తి కేంద్రాలు ఉన్నాయో, అలాగే ఇప్పుడు సాంకేతికత వ్యసన విముక్తి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే మనం ఒక నిర్బంధ లక్షణంతో ఉన్నాం. మనం తినటం మొదలు పెడితే, ఎప్పుడు తినటం ఆపాలో తెలీదు మనకి. అది సమస్య. నిజంగా పెద్ద సమస్య. మనం తాగటం మొదలెడితే, ఎప్పుడు ఆపాలో తెలీదు మనకి. షాపింగ్ మొదలెడితే ఎప్పుడు ఆపాలో తెలీదు మనకి. అలాగే ఫోను వాడటం మొదలెడితే అది ఎప్పుడు వాడటం ఆపాలో తెలీదు మనకి.
సమస్య సాంకేతికతది కాదు. సమస్య మన నిర్బంధానిది. నిర్బంధం లేదా బలవంతం అంటే ఎరుక లేదా చైతన్యం లేకపోవటమే. మనం చైతన్యంతో నిండిన మనుషులమైతే, మనం అన్నిటినీ మన శ్రేయస్సు కోసం, అందరిశ్రేయస్సు కోసం వాడతాం. మనం నిర్బంధంతో ఉన్నాం కాబట్టీ, మనం ఒక విషయాన్ని మొదలుపెట్టి దాన్ని ఎలా ఆపాలో తెలీక ఇబ్బంది పడతాం. మళ్ళీ మళ్ళీ అదే అమాయకపు పని చేస్తూ ఉంటాం. కాబట్టీ అది వర్చువల్ రియాలిటీ అయినా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అయినా, అది సాంకేతికత సమస్య కాదు. ఎప్పటికీ కాదు. ఎందుకంటే అవి కేవలం మనంతయారు చేసుకున్న పరికరాలు మాత్రమే. మనము వాటిని మన శ్రేయస్సు కోసమే వాడాలి-ఉద్దేశం అదే. కానీ మన అత్యాధునిక పరిజ్ఞ్యానం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అవసరాలకే వాడబడుతోంది. అందువల్లనే మనకి దీన్ని మన శ్రేయస్సు కోసం ఎలా వాడాలో తెలియటం లేదు. దానితో ఎప్పుడూ ఏదో ఒక దాన్ని ధ్వంసం చెయ్యటమే దాన్ని వాడుతున్నాం. ఇప్పుడే కాదు, ఇది ఎప్పటినించో అంతే.
ఎందుకంటే, మనం ఎప్పుడూ మానవ చైతన్యాన్ని సాధన చెయ్యలేదు. మనుషులు చైతన్యంతో జీవిస్తే, ప్రపంచ నాయకత్వం చైతన్యంతో నిండి ఉంటే, సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని మనుషుల శ్రేయస్సుకి వాడాలా లేదా వినాశనానికా అనే ప్రశ్నే తలెత్తదు. సాంకేతికత అంటే మన సామర్ధ్యాన్ని పెంచుకోవటం. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఈ మైకు ఉంది.ఇది మన సామర్ధ్యాన్ని పొడగించుకోవటం. నేను మైకు లేకుండా మాట్లాడితే కొంతమందే వినగలరు. కాబట్టీ, మైకు (గొంతుకి) పొడగింపు అంతే. ఉదాహరణకి నేను మైకు ఉంది కాబట్టి అరవటం మొదలుపెట్టాననుకోండి, సమస్య మైకుది కాదు. మైకుది అని మీరు అనుకుంటున్నారా? “అబ్బా ఈ మైకు పెద్దగా అరుస్తోందే” అనుకుంటారా? ఇదే మనం చేస్తోంది.
ఏ సాంకేతిక పరిజ్ఞానమూ సమస్య కాదు. అది ఏదైనా సరే. ప్రశ్న ఎప్పుడైనా ఒక్కటే- మనం దాన్ని వివేకంతో, ఎరుకతో చేస్తామా లేక ఒక నిర్బంధంతో, వాణిజ్య లక్షణంతో చేస్తామా? అనేదే. ఆర్ధిక లావాదేవీలు ఇప్పుడు ఒక నిర్బంధం అయిపోయాయి. మనం వర్తకం ఇలా మొదలుపెట్టాం: నా దగ్గర కొంత బియ్యం ఉంది, నీ దగ్గర చికెన్ ఉంది; మనం ఇద్దరం పంచుకున్నాం. నా దగ్గర బంగాళ దుంపలు ఉన్నాయి నీ దగ్గర గుడ్లు ఉన్నాయి -ఇద్దరం పంచుకున్నాం. ఇలాగే వ్యాపారాలు మొదలయ్యాయి. నా దగ్గర అదనంగా ఏదైనా ఉంటే, అది నీకు ఇస్తాను. నీ దగ్గర ఏదైనా అదనంగా ఉంటే, అది నాకివ్వు. ఈ విధంగా నీ జీవితం నువ్వు జీవిస్తావు, నా జీవితం నేను జీవిస్తాను.
మన నిర్బంధ లక్షణం వల్ల మనం నెమ్మదిగా ఆర్ధిక కార్యకలాపాల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళామంటే, ప్రస్తుతం అది మన జీవితంలోని ప్రతి అంశాన్నీ శాసిస్తోంది. గవర్నమెంటు మీకు ఏం చెబుతోందంటే, అందరూ దయచేసి లోన్లు తీసుకోండి, లేకపోతే మన ఆర్ధిక వ్యవస్థ పడిపోతుంది అంటోంది. ఔనా కాదా? వాళ్ళు దానికి మిమల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎవరో నాతో అన్నారు “సద్గురు, మీకు “అప్పు విలువ” అదే క్రెడిట్ వర్తీనెస్ లేదు ఎందుకంటే మీరు ఎప్పుడూ లోన్ తీసుకోలేదు కదా అని. నేను అది చాలా మంచి విషయమే అనుకున్నాను. కానీ అది చెడు విషయం అంటున్నారు వాళ్ళు. “మీకు క్రెడిట్ వర్తీనెస్ లేదు. మీరు ఒక లోన్ తీసుకోవాలి” అంటున్నారు. నేను ఏం చెయ్యాలని అడిగితే, “ఎక్కడో ఒక చోట ఒక ఇల్లు కొనండి. ఒక చోట ఇల్లు కొని దాన్ని కావాలంటే అద్దెకి ఇవ్వండి సద్గురు, అప్పుడు మీకు క్రెడిట్ వర్తీనెస్ వస్తుంది” అంటున్నారు.
నిర్బంధం, ఆర్థిక లావాదేవీగా పరివర్తన చెందిన వైనమిది. ఔనా కాదా? ఎవరైనా ఇల్లు కట్టుకునేది అందులో హాయిగా ఉండటానికే. కానీ ఇప్పుడు ఇది ఎంత నిర్బంధం అయి కూర్చుందంటే, కామర్స్ ఈ గ్రహాన్నే కబళిస్తోంది. ఈ మధ్యనే ఒక వార్త వచ్చింది, సుమారు ఇరవైరోజుల క్రితం అనుకుంటా, మీరు చూశారో లేదో తెలీదు. ఒకానొక రష్యన్ కంటైనర్ క్యారియర్ ఐన పెద్ద పడవ - సుమారు నలభై వేల టన్నుల బరువు ఉంటుంది. అది ఆర్కిటిక్ ఐసుని పగలగొట్టి ఇప్పటివరకూ వెళ్ళని ఒక కొత్త సముద్ర మార్గాన్ని తయారు చేసింది. దీనివల్ల ఎనిమిదివేల కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది వాళ్ళకి. దానితో పాటు బోల్డంత డబ్బు కూడా కలిసి వస్తుంది. కానీ అతి పల్చనైన ఆర్కిటిక్ హిమాన్ని వాళ్ళు చీల్చి ఒక ఆర్థికపరమైన వనరుగా దాన్ని తయారు చేస్తున్నారే, ఇది నిర్బంధ ఆర్ధిక లావాదేవీ. వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రకృతి విపరీతానికి ఒడిగట్టారో తెలీదు. ఔనా కాదా?
ఇది కేవలం నిర్బంధం. దీన్ని వ్యాపారమని అనకూడదు. ఇది కేవలం మనుషుల బలవంతపు చొరవ. వాళ్ళు ఊరికే కూర్చోలేక ఏదో ఒకటి చేస్తున్నారు. అందుకే మేము చేసిన ఆలోచన ఏంటంటే, ఈ గ్రహం మీద ఉన్న మనుషులందరినీ ఒక ఇరవై నిమిషాల పాటు ఊరికే కూర్చోపెట్ట గలిగితే, ఈ భూమి రక్షింపబడుతుంది అనుకుంటున్నాం. వాళ్లకి ధ్యానం చెయ్యటం రాకపోయినా పరవాలేదు. ఈ 7.6 బిలియన్ల మనుషులూ ఒక రోజులో ఊరికే ఒక ఇరవై నిమిషాలపాటు ఏమీ చెయ్యకుండా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే నేను అంటున్నాను మానవ మేధస్సు కాదు ఈ భూమిని కాపాడుతోంది, మనుషుల ప్రేమ, కరుణ కూడా కాదు. మనుషుల బద్ధకమే భూమిని కాపాడుతోంది. బద్ధకం కలిగిన సగం మంది జనాభాయే ఈ గ్రహాన్ని కాపాడుతున్నారు. అందరూ బాగా పనిమంతులై సాంకేతిక పరిజ్ఞాన్నంతా వాడేస్తే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఈ భూగ్రహమంతా పూర్తిగా క్షవరమైపోతుంది. ఔనా కాదా?
మనం అటువైపే ప్రయాణం చేస్తున్నాం. ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానమైనా సరే, అదిపెంచే సామర్థ్యం మనకి ఎప్పుడూ సమస్య కాకూడదు. మనుషుల సామర్ధ్యం పెరిగితే అది వారికి సమస్యగా మారాలా చెప్పండి? అది ఏదో ఒక దానికి పరిష్కారంగానే ఉండాలి. కానీ మనం దాన్నే ఒక సమస్యగా మారుస్తున్నాం. ఎందుకంటే మనది నిర్బంధ లక్షణం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వెనక్కి లాగటంలో ఏ లాభం లేదు, మనుషుల పనితీరులో ఎంత చైతన్యం నిండింది అన్నదే ముఖ్యం.