మనది వ్యవసాయిక సంస్కృతి, బహుశా ఈ భూమి మీద ఇంత దీర్ఘకాలంగా వ్యవసాయం చేస్తున్న సంస్కృతి ఇదేనేమో.  పశువులు, ముఖ్యంగా ఆవులు, ఎద్దులు మన జీవితాల్లో, మన భూముల్లో, మన ఆహార ఉత్పత్తిలో చాలా ముఖ్య భూమికని పోషించాయి. ఈరోజు, ఎన్నో విషయాల్లో మార్పు వచ్చింది, అయినా, మన భూమిని సారవంతం చేయడానికి మనకు పశువులు కావాలి. మన దేశంలో 120 కి పైగా దేశవాళి జాతుల పశువులు ఉండేవి. కాని ఇప్పుడు కేవలం 37 రకాల జాతులే మిగిలాయి, మిగతా వన్నీ అంతరించి పోయాయి. కనీసం మిగిలిన వాటినన్నా మన పరిరక్షించుకోవాలి.  

అంతరించిపోతున్న జాతుల గురించిన అవగాహన మనం ప్రజలకు కలుగజేయాలి. వాటిని మనం సంరక్షించనట్లైతే, అవి ఎంతో కాలం ఉండవు. ఈ దేశవాళీ జాతులను మనం సంరక్షించడం ఎందుకు? దేశవాళి ఆవుల నుండి వచ్చిన పాలు, వాటి పేడ, మూత్రం కూడా మన వ్యవసాయానికి అత్యంత ఉపయోగకరం అని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ పాలల్లో ఒక ప్రత్యేకత ఉన్నది, దానిలో A2 ప్రొటీను ఉన్నది. ప్రపంచంలో మిగతా ఆవుల పాలలో A1 ప్రొటీను ఉంటుంది, దానివల్ల గుండె రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చునని అంటారు. మన ఆరోగ్యంగా ఉండేందుకు, కాన్సరు వ్యాధి నివారణకు, అన్నింటికీ మించి, మన పిల్లలు చక్కగా పెరగడానికి, మన భూములను సారవంతం చేసేందుకు, ఈ దేశవాళీ జాతులు ఎంతో ముఖ్యమైనవి. మనం మన ప్రజల్లో, అంటే పట్న వాసులతో సహా అందరిలో ఈ అవగాహనను తీసుకురావాలి.

దురదృష్టవశాత్తూ గత ముప్ఫై, ముప్ఫై అయిదేళ్ళుగా మనకెందుకో విదేశీ జాతి పశువులు మేలైనవి అన్న ఆలోచన వచ్చింది.

దురదృష్టవశాత్తూ గత ముప్ఫై, ముప్ఫై అయిదేళ్ళుగా మనకెందుకో విదేశీ జాతి పశువులు మేలైనవి అన్న ఆలోచన వచ్చింది. కాని పాడికి గానీ, పొలం పనులకు గానీ మన దేశీయ పశువులు మేలైనవన్నవిషయం ఈనాడు శాస్త్రీయంగా నిరూపించగలం. ఈ జాతులు మన సంస్కృతిలో, మన ఇళ్ళలో, మన కుటుంబాలలో ఎప్పడూ ఒక అంతర్భాగం గానే ఉన్నాయి. చాలామంది నగరాలకు తరలిపోయారు, వారికి పశువులు ఉండే ప్రశ్నేలేదు. కాని సంవత్సరానికి ఒక్కసారైనా మనకై కృషి చేసిన ఈ పశువులకు మన కృతజ్ఞతా సూచనగా  ఈ కనుమ రోజున పండగ జరుపుకుంటాం. ప్రస్తుతం ఈశా యోగా కేంద్రంలో మన దగ్గర 250 దేశవాళీ పశువులు ఉన్నాయి.

మిగిలి ఉన్న ఈ  37 జాతి పశువులను మచ్చుకైనా కొన్ని ఇక్కడకు తెచ్చి, పోషించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రాంతం రైతులను ఈ విషయంలో ప్రోత్సాహిస్తున్నాము. ఈ ప్రాంతంలో మనం సేంద్రీయ వ్యవసాయం అభివృద్ధి చేస్తున్న చోట్ల, మనం ఈ దేశవాళీ పశువులను ప్రోత్సహిస్తున్నాము. ప్రస్తుతం ఇది చిన్న స్థాయిలో జరుగుతున్నది, కాని దీనినే పెద్ద స్టాయిలో అభివృద్ధిచేయాలన్న ఆలోచన ఉన్నది. దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఆ ప్రాంతానికి సంబంధించిన దేశవాళి పశుజాతులను పెంచి పోషించే ఒక సంస్థో, కేంద్రమో ఉండాలి. మనం వాటిని పునరుద్ధరించాలి, ఈ పని చేయడం చాల చాల ముఖ్యం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు