టెన్నెసీ లోని చెట్లకు..
III (Isha Institute of Inner Sciences), టెన్నెసీ లోని చెట్లను చూసి సద్గురు రాసిన కవిత మీకోసం తెలుగులో:
టెన్నెసీ లోని చెట్లకు..
ఓ పావన జీవులారా!
మీ హరిత వస్త్రమే
మా ఊపిరికీ, మనుగడకీ ఆధారము
మీ రాగరహితమైన భంగిమని
మేము నిశ్చైతన్యంగా పొరబడుతాము
నలుదిక్కులా విరిసిన మీ అపారమైన ఉనికి
మనిషి గుర్తింపుకి నోచుకోపోవచ్చు.
ఈ గుర్తించలేని అజ్ఞానము
వినాశకర పరిమాణాలకు దారితీయవచ్చు.
కానీ, ఈ క్షణంలో, మీరూ నేనూ అనుభవించే పరమానందం
ఒకరి ఊపిరి నొకరు శ్వాసిస్తున్న తరుణంలో
ఈ గాఢాలింగనంలో అనుభవించే ఆనందం
చూపుతిప్పనీని ఏ మిటారి దగ్గరా దొరికేది కాదు.
నేను కృతజ్ఞతతోనిండిన కన్నీటితో మిము ఆరాధించగలను.
నేను తిరిగి శీతకాలంలో వచ్చినపుడు
మీరు జిగితూలి దిగంబరంగా నిలబడవచ్చు
మీరు ఆనందంగాలేనపుడు ఈ సృష్టి స్వరూపాన్ని
ఒకసారి కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తూ
మీరు నిత్య స్థాణువులు,
నేను, నిరంతర సంచారిని.
అయినా, ఎప్పుడైనా మన ఊపిరి బంధాన్ని త్రెంచగలనా?
నా జీవితలక్ష్యాలు నెరవేర్చేదాకా ఆగండి.
మీ పాదాల చెంత మోకరిల్లి
ఈ తనువు సారంతో మిమ్మల్ని అభిషేకిస్తాను.
మీపసరులో నేనూ పసరునౌతాను.
ఈ ధరణినుండి గ్రహించినది
ఆమె ఒడిలోనే ఉంచి నమస్కరించడానికి.
అప్పటిదాకా, మీరూ నేనూ ఈ మోహనకేళి
ఏ ఆడంబరాలూ లేకుండా
ఎవరి దృష్టిలోనూ పడకుండా కొనసాగిద్దాము.
సద్గురు ఆంగ్లంలో రాసిన కవితని చదవండి : To Trees in Tennessee