శివుడు మహోత్సాహపూరిత క్రియాశీలతకు, నిశ్చల స్తబ్ధతకు పరాకాష్ఠ, పరమసంకేతం. అంటే మీరు నిశ్చలంగా ఉండదలచుకుంటారు, కాని, సజీవ చైతన్యంతో, ఉత్సాహభరితులై ఉంటారు. ఈ జీవితాన్ని ఒకస్థాయి నిశ్చలతలోకి తీసికొని రావాలంటే, ఒక వ్యక్తి తన మానసిక కార్యకలాపం నుండి సంపూర్ణంగా దూరం జరగాలి. శారీరిక కార్యకలాపం సమస్య కాదు - దాన్ని మనం తేలిగ్గా నిశ్చల స్థితికి తీసుకురావచ్చు – మానసిక నిర్మాణమే క్రియాశీలంగా ఉండేది. మీరు  అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంపూర్ణంగా నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా శరీరం ఉనికిలో ఉంటుంది. కాని మనస్సు నిశ్చలం అయితే, దాని అస్థిత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల  మనస్సు మిమ్మల్ని నిశ్చలంగా ఉండనివ్వదు. మీ మానసిక స్వభావంతో ఉన్నప్పుడు, అది మిమల్ని పూర్తిగా నిశ్చలంగా ఉండనివ్వదు. మీ మానసిక స్వభావానికి మీరు పూర్తిగా దూరమైతే తప్ప నిశ్చలంగా ఉండలేరు లేదంటే అది ఎన్నో పనులు చేస్తూనే ఉంటుంది.

మీరు నిర్ణయాలు చేయడానికి మీ బుద్ధిని ఉపయోగించకపోతే మీ మనస్సు చాలా వరకు స్తబ్ధంగా ఉంటుంది.

మనస్సును నిశ్చలంగా ఉంచే మామూలు పద్ధతులు ఆధునిక జీవితంలో అప్రస్తుతమై పోయాయి. మీరు వాటి గురించి మాట్లాడితే అది స్వలాభానికి ఉపయోగించుకున్నట్లనిపిస్తుంది. మీరెక్కడైనా ఆధ్యాత్మికత కోసం వెళితే మొదట మీకు చెప్పే విషయం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోవాలి, శరణాగతులవ్వాలి అని. అంటే మీరు నిర్ణయాలు చేయరు. మీరు నిర్ణయాలు చేయడానికి మీ బుద్ధిని ఉపయోగించకపోతే మీ మనస్సు చాలా వరకు స్తబ్ధంగా ఉంటుంది. మీకు ఆత్మసమర్పణ చేసుకోవడమెలాగో తెలియకపోతే, విధేయత నేర్చుకోండి – కేవలం చెప్పిన పని చేయండి. కూర్చోమంటే కూర్చోవాలి. నిలబడమంటే నిలబడాలి. మాట్లాడమంటే మాట్లాడాలి. నోరు ముయ్యమంటే నోరు మూసుకోవాలి. కాని నేటి ప్రపంచంలో ఇదంతా పూర్తిగా ‘తప్పు’. మిమల్ని దోపిడి చేయాలనుకున్న చోట, ఇలా ఉండడం తప్పే. కాని మీ శ్రేయస్సు కోసం ఎం చేసినా నాకు అందులో తప్పేమీ కనిపించదు.

అందువల్ల మీకు సంపూర్ణ శరణాగతి అంటే ఏమిటో తెలియకపోతే కనీసం విధేయులు కండి. ఈ చర్య తీసికోకుండా నిశ్చలం కావడానికి ప్రయత్నించడం ఎలాంటిదంటే, పాదరసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. మీరొక చుక్క పాదరసాన్ని పట్టుకోబోతే అది వంద చుక్కలవుతుంది. శరణాగతి వల్ల లేదా విధేయత వల్ల మీరు మిమ్మల్ని మీ మనస్సు నుండి వేరుచేసుకోవచ్చు. మీరు మనస్సును దూరం పెట్టగలిగితే అస్తిత్వంలో నిశ్చలత సహజమైన భాగమని మీరు గ్రహిస్తారు, ఎందుకంటే అస్తిత్వం చాలావరకు నిశ్చలమే. కేవలం భౌతికమే చలనశీలం. నిశ్చలత్వం అన్నది తీక్షణత యొక్క పరాకాష్ఠ. అప్పుడు మీ శరీరం, మనస్సు సర్వం – మహాతీవ్రతను పొందుతాయి. అది పూర్తిగా ఒక భిన్నమైన కోణానికి చెందిన జీవితం.

ఎవరైనా నిశ్చలతను కోరుకున్నట్లయితే అతని మనస్సుకు ప్రాధాన్యం మరీ మరీ తగ్గిపోవాలి. మన ఉనికి అంటేనే సజీవమైన మనస్సు, అంత భారీ మనస్సు పనిచేస్తున్నప్పుడు మీ అల్ప మనస్సును పక్కన పెట్టడం మంచిది. విశ్వపు ఆ మహా మనస్సును మీరు చూడలేకపోతే కనీసం మిమ్మల్ని అధిగమించిన వారి మనస్సునైనా చూడండి. కాని నేటి ప్రపంచంలో అది కుదరదు. దీన్ని బానిసత్వం అంటారు. నేటి ఆధ్యాత్మిక ప్రక్రియ కుంటుపడింది, అన్ని రకాల పనులిప్పుడు చేయలేం. అయినా కూడా మేము ప్రజలని జ్ఞానోదయం వైపు తీసికొని వెళ్లాలి అని అంటారు. ఇదేలంటిదంటే, కారు టైర్లు తీసివేసి, చాలాదూరం నడిపించాలని అడగటం లాంటిది.

ఇది బోధన వల్ల జరిగేది కాదు, కేవలం ఇంగితం వల్ల తెలుసుకునే విషయం. మీరు నోరు తెరిచే ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం.

ఆధ్యాత్మిక గురువులు తమ పనులు చేయడానికి ఎల్లప్పుడు తేలిక మార్గాలు కనుక్కుంటుంటారు. ఇవ్వాళ భోజన సమయంలో మీరు మీ చెవులతో ఆహారం తినాలని నిర్ణయించుకున్నారనుకోండి, అప్పుడు కనీసం మీ ముక్కుతో తినే ప్రయత్నం చేయమని మేము చెప్పవచ్చు. ఎందుకంటే కనీసం ఆహారం మీ గొంతులోకి పోతుంది కదా? మీరు నోరు తెరిస్తే ఎంత హాయిగా తినవచ్చు! ఆధ్యాత్మిక ప్రక్రియ ఇలా ఉంటుంది. ప్రస్తుతం మీరెలా ఉన్నారంటే, ‘నేనిది చేయలేను, అది చేయలేను, అయినా నాకు ఆధ్యాత్మిక ప్రక్రియ ఇవ్వండి’ అన్నట్లు. అంటే మీరు మీ కళ్లు, ముక్కు, చెవులతో ప్రయత్నిస్తున్నారన్నమాట – అది చాలా కష్టం, మరేం చేయాలి? మేము బలవంతంగా మీ ముక్కులోకి ఆహారం దూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీ నోరు తెరుస్తారని మా నమ్మకం. ఇది బోధన వల్ల జరిగేది కాదు, కేవలం ఇంగితం వల్ల తెలుసుకునే విషయం. మీరు నోరు తెరిచే ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం. గురువుగా ఉండడం ఎంత పిచ్చి విషయమో....!

మీరు శరీరం కాదు, మనస్సు కాదు, ప్రపంచం కాదు అన్న సంపూర్ణ స్పృహ కలిగిన స్థితి - సంయమ స్థితి. మీరు ఈ మూడింటికీ దూరమైతే మీకు బాధ అనేదే ఉండదు. శరీరం, మనస్సుల గందరగోళం నుండి దూరమై లోపలి సంపూర్ణ నిశ్చలత్వం వైపు వెళ్లడమే సంయమ లక్ష్యం. సంయమ స్థితిలోని నిశ్చలతను మీరు తెలుసుకోవాలని నా ఆకాంక్ష.

ప్రేమాశీస్సులతో,
సద్గురు