సద్గురు: ఈ రోజున వ్యాపార నాయకత్వంలో రెండే కోణాలున్నాయి: నిర్వహణ ఇంకా నాయకత్వం అనేవి. నిర్వహణ (Management) అంటే ఇల్లు చక్కబెట్టుకోవడం లాంటిదేదాన్నే కొంచెం ఎక్కువ చేసి చెప్పడం. చిన్నవో పెద్దవో, ఉన్న పరిస్తితులను చక్కబెట్టుకోవడమే. నాయకత్వమంటే ఇతరులు చూడలేనివి, వారంతట వారు చెయ్యలేనివేవో మీరు చూసి, చేయ గలగడం.

నాయకత్వం సునాయాసంగా జరగాలంటే, ప్రజలు వారి జీవితాల్లో వారు కల్పించుకో గల అవకాశాల కంటే మీరు పెద్ద అవకాశాలు కల్పించాగలరని భావించాలి.

ప్రజలు వాళ్ళ జీవితాన్ని మీ చేతుల్లో పెట్టడానికి ఎందుకు సిద్ధంగా ఉంటారంటే , వారికిగా వారు సాధించలేనిదేదో వారు సాధించేలా మీరు చేస్తారని వారి నమ్మకం. వారంతట వారు తెలుసుకోలేని ఒక కోణాన్ని మీరు చూపిస్తారని నమ్మకం. అప్పుడే నాయకుడి వెనుక ప్రజలుంటారు. ఎంపికైన లేదా ఎన్నికైన నాయకుల విషయంలో ఇది మరోవిధంగా ఉండచ్చు.

నాయకత్వం సునాయాసంగా జరగాలంటే, ప్రజలు వారి జీవితాల్లో వారు కల్పించుకో గల అవకాశాల కంటే మీరు పెద్ద అవకాశాలు కల్పించాగలరని భావించాలి.

వారికిగా వారు ఉండడం కంటే మీతో ఉంటే గొప్పవేవో జరుగుతాయని వారు గమనించాలి. మీరు ఈ అవకాశాన్ని ఇవ్వగలిగితే నాయకత్వం, సహజంగా, సునాయాసంగా జరిగే ప్రక్రియ అవుతుంది. అలా చేయ లేకపోతే మీరు నాయకునిగా ఉండే ప్రయత్నం మాత్రమే చేస్తున్నట్లే. అందుకే నాయకుడి తెలివి తక్కువతనం గురించి నేను ఈ కవితను రాశాను.

నాయకత్వం

విహంగాలు సామూహికంగా కీర్తిని చాటుతూ

ఆకాశయానం చేస్తున్నప్పుడు ,

ఎవరైనా ఆ ఘనకార్యానికి నాయకుడెవరనేది కనుగొనగాలరా?

గుండె కొట్టుకుంటుంది, గ్రంధులు స్రవిస్తాయి,

మూత్రపిండాలు శుద్ధి చేస్తాయి,

ప్రతి కణం ఎంతో ఖచ్చితంగా తన విధులను నిర్వహిస్తుంది

మెదడు ప్రతిబింబిస్తుంది.

నక్షత్రాలుతో పొంగుతున్న కొన్ని లక్షల కోట్ల

పాల పుంతలు, ఎన్నో కృష్ణ బిలాలు, వాటి శూన్యం

వీటన్నిటి మూలాన్ని ఎవరైనా గమనించగలరా...!!

నాయకుడు అనేవాడు మూర్ఖుడు

మానవుడి మనుగడ లేకముందే ఈ భూగోళంపై ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఉనికిలో నాయకత్వం ఉందా? లేదు, అన్నిటినీ కదిలించే దేదో ఒక నిర్దిష్ట శక్తి.

Rally for rivers (నదుల రక్షణ ఉద్యమం) దీనికి ఒక గొప్ప ఉదాహరణ. మేము కేవలం ముప్పై రోజుల్లో 16.2 కోట్ల మంది ప్రజల మద్దతు పొందాం. అది నా మనసులో పదిహేనేళ్ళుగా మెదులుతోంది కానీ నేను ఎప్పుడూ బయటపెట్ట లేదు. ఉద్యమానికి కేవలం యాభై తొమ్మిది రోజుల ముందే నేను నా సన్నిహితులకు ఈ విషయం చెప్పాను. వారు, “సద్గురు, దేశ వ్యాప్తంగా ఇదెలా జరుగుతుంది?” అన్నారు. నేను “నీరు తాగే ప్రతి ఒక్కరూ నదుల కోసం ఉద్యమించాలి” అన్నాను,. అది జరగడానికి ఇంకా ఏమి చేయాలో వారికి చెప్పాను.

మానవ చైతన్యానికి ఉన్న శక్తి ఇది. స్మృతికి మించిన మేథస్సే చైతన్యం. అంటే అది మీకున్న జ్ఞానంతో పనిచెయ్యడం లేదు - ఒక అన్వేషణాత్మక పద్ధతిలో పని చేస్తుందని అర్థం. ఒక్కసారి మీ చైతన్యంలోనికి దేన్నయినా పెడితే, మీరు దానికిక ఆదేశాలు కూడా ఇవ్వనవసరం లేదు. మీకు తెలిసిన వారు, తెలియని వారు అందరూ మీకు కావలసింది చేసేస్తారు. చైతన్యం అనేది వ్యక్తిగత లాభంకోసం చేసే ఆలోచనతో రాదు, అది అన్నిటితో ఏకత్వ భావన తో ఉంటుంది.

కానీ చాలా మందికి వారి చైతన్యం, స్మృతులతో మలినమవుతుంది. దానికి తగినంత ప్రక్షాళన లేదు. జీవిత స్వభావం ఎలాంటిదంటే, ప్రతిరోజు మీరు కొత్త కొత్త స్మృతులను పోగేసుకుంటూ ఉంటారు - చూసినవి, వాసనలు, రుచులు, స్పర్శ, అనుభవాలు, ఇంకా మాటలు. ప్రక్షాళన అంటే ఈ స్మృతులను పక్కన పెట్టడం. ఇది నేర్చుకోవడానికి చాలా పద్ధతులున్నాయి.

మీరు ఈ ఒక్కటీ చెయ్యగలిగితే, కేవలం ఇక్కడ కూర్చోవడం, ఆడవారిగానో, మగవారిగానో లేదా భారతీయుడిగానో, అమెరికన్ గానో కాకుండా, కేవలం ఒక జీవంలా కుర్చోగలిగితే, మీ జీవితం పూర్తిగా సునాయాసంగా జరిగిపోతుంది. ఎందుకంటే అసలు మీరు జీవితాన్ని సాగించడం లేదు-మీరే జీవితం. కానీ బ్రతకడమే పెద్ద సమస్య అయిపోయింది ప్రజలకు. ఇది జీవితంతో ఉన్న సమస్య కాదు. మీరు మీ మేధస్సును నిర్వహించుకోలేకపోతున్నారు కాబట్టే ఇలా అవుతుంది.

దీన్ని ఆదియోగి చాలా చక్కగా చెప్పారు. మానవుడిగా ఉండడంలో ప్రాముఖ్యత ఏమిటంటే పరిణామం మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఇప్పుడే పరిణామం చెంది భగవంతుడిలా మారాలనుకుంటే అది సాధ్యమే. మీరు కౄరంగా తయారవ్వలనుకున్నా, అది కుడా సాధ్యమే. ప్రతిరోజూ ప్రజలు రెండు విధానాలనూ చేసి చూపుతున్నారు. మీ పరిణామం మీ చేతిలోనే ఉండడం అద్భుతమైన అవకాశం ఇంకా బాధ్యత కూడా.

వ్యాపారంలో నాయకత్వమంటే ఏదో ఒకరకంగా మీరు ఇతరుల బుర్రలను నియంత్రించ వలసి వస్తుంది. కానీ సమస్యేంటంటే, మీ బుర్ర మీరు చెప్పినట్టు వింటుందా? ఒకవేళ మీ బుర్ర మీరు చెప్పినట్టు వింటూ, మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మీ ఆదేశాల ప్రకారం పని చేస్తున్నట్లయితే, మీరు ఆనందంగా ఉంటారా లేక విచారంగానా?

దీన్ని మీరు ఒత్తిడి, ఉద్రిక్తత, ఆందోళన, కష్టాలు అని ఏమైనా అనండి. కానీ ఇది కేవలం: మీ తెలివి మీకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అంతే. ప్రస్తుతమున్న సమస్య ఏంటంటే మనం ప్రపంచాన్ని గెలవాలనుకుంటున్నాం. మీ సొంత శక్తులే మీనుండి ఆదేశాలు తీసుకోనప్పుడు మీరు దేన్ని జయించినా, దానిని చిందర వందర చేసేస్తారు. ఈ భూగోళంలో దేన్ని తాకినా గందరగోళం చేసేస్తారు.

వ్యాపారం, ఈ లోకం భవిష్యత్తునే మార్చేస్తుంది..

మన విద్యా వ్యవస్థను, మానవుడి గురించి తప్ప విశ్వంలో మిగితా వాటన్నిటిపై ఆసక్తి ఉన్న వారు తయారుచేసినట్లుగా కనిపిస్తుంది. పాఠశాలలో మీరు కప్పలను, బొద్దింకలను కోసి లోపల ఏముందో చూస్తారు. ఒకవేళ మన విద్యావ్యవస్థ మనం అంతరంగికంగా మారడానికి, అంతరాగాన్ని అర్థం చేసుకోవడానికి సాధనాలను ఇవ్వగలిగితే ప్రపంచ పరిస్థితి మొత్తంగా మారిపోతుంది.

మీలో జరుగుతున్న దానిని బట్టే మీరు ఈ విశ్వాన్ని అర్థం చేసుకుంటారు. మీరు అనుకున్న విధంగా విశ్వం లేదని ఈ రోజు సైన్సు అనేక విధాలుగా రుజువు చేస్తుంది. భూమి చదునుగా ఉందనుకున్నాము, కానీ గుండ్రంగా ఉందని తెలుసుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఇది మీరు మీ కళ్ళతో చూసినట్లు ఉండదు.

అంతర్ముఖ సాధనాలను కిండర్ గార్డెనులో కాకపోయినా కనీసం బిజినెస్ స్కూళ్ళలోనైనా మనం అందించే ప్రయత్నం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార నాయకులతో ఇంకా బిజినెస్ స్కూల్స్ తో పనిచేయడానికి నేను ఎందుకు ఆసక్తి చూపుతున్నానంటే, వ్యాపార నాయకులు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇంకా ప్రభావవంతమైన నాయకత్వంగా ఉండే సమయం వచ్చింది.

...భవిష్యత్తు తరాలలో, కాబోయే ప్రతీ నాయకుడు తమని తము పరివర్తించుకోవడానికి కనీసం ఒక నెల రోజులైనా వెచ్చించాలి.

నేడు, ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని ఒక వ్యాపారవేత్త అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. ప్రపంచం అటువైపుగా నడుస్తుంది. రానున్న పది, పదిహేనేళ్ళలో వ్యాపారవేత్తలే అన్నిటినీ నిర్ణయిస్తారు. వ్యాపారం ఈ గ్రహం యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతుంది. కాబట్టి వ్యాపారం వినాశనమైనది కాకుండా, వివేకవంతమైనదిగా మారడం చాలా ముఖ్యం.

ప్రస్తుతం వ్యాపార నాయకుల్లో ఒక నిర్బంధ స్థితి ఉంది. అదేంటంటే, వారు వారి సొంత ప్రయోజనానికి పని చేస్తున్నారు తప్ప మానవత్వం గురించి కించెత్తు కూడా పట్టించుకోవడం లేదు. ఇది పోవాలి. వ్యాపార నాయకుల దృక్పథంలో మార్గదర్శకత్వం ఉందని ఇంకా మానవాళి శ్రేయస్సు, ఈ గ్రహం శ్రేయస్సు గురించిన శ్రద్ధ ఉందని మనం చూపగలగాలి. ఇది జరగాలంటే, ఈ కోణాన్ని విద్యావ్యవస్థలోకి ప్రవేశపెట్టాలి.

ప్రజల జీవితాలను ప్రభావితం చెయ్యగల అవకాశం నాయకుడికి ఉంటుంది. మరొకరి జీవితాన్ని, వారి భవిష్యత్తును ఇంకా విధిని మార్చగల ప్రత్యేకాధికారాన్ని మీకు ప్రజలు ఇస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారన్నది ముఖ్యమైన విషయం కాదంటారా? మీరు చెయ్యాలనుకున్న పని ముఖ్యమైనది లేదా ప్రాముఖ్యం కలదైతే మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మిమల్ని మీరు తీర్చి దిద్దుకోవడమే.

నేటి బిజినెస్ స్టూడెంట్స్, రేపటి నాయకులు, వారు ఈ గ్రహం ఇంకా ప్రజల భవిష్యత్తును రూపుదిద్దుతారు. భవిష్యత్తు నాయకులందరూ తమని తాము పరివర్తించుకోవడానికి కనీసం ఒక నెల రోజులైనా వెచ్చించాలని నేనంటాను. లేకపోతే, మీరు ప్రపంచంలో ఏది ముట్టుకున్నా సరే, ఎంత బలవంతులైతే అంత నష్టం జరగటానికి మీరు కారకులవుతారు.

మన వ్యక్తిగత ప్రభావాలు చాలా పెద్దవైపోయాయి, కేవలం పర్యావరణ పరంగానే కాదు, మానవుడు సృష్టించగల సమగ్రమైన ప్రభావ పరంగా కూడా. మన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఎలా ఉన్నామన్నది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇది మీ మానసిక నిర్మాణాన్ని అస్థిత్వ స్వభావంతో సమన్వయం చెయ్యడం. మీ పక్కన కూర్చున్న వ్యక్తిని మీరు ద్వేషించినప్పటికీ, మీ శరీరానికి అతను వదిలిన శ్వాసను పీల్చుకోవడంలో ఇబ్బంది ఏమీ ఉండదు.

వాస్తవానికి మీకు ఈ ఉనికిలో దేనితోనూ సమస్య లేదు. కేవలం మానసికంగానే మీకు వారితోనో, వీరితోనో సమస్య. మీరు మీ మనస్సును జీవ స్వభావంతో అనుసంధానం చేస్తే, సహజంగానే మీరు అన్నిటితోనూ సమన్వయంలో ఉంటారు.

మీరు సృష్టించేదీ ఇంకా రూపొందించేదీ, సృష్టిలో ప్రతి దానితో సమతాళంలో ఉంటుంది. మనుషులకు ఒకరితో ఒకరికి ఉన్న సమస్య ఏంటంటే, ఒకరు తమ మానసిక సరిహద్దులను మరొకరిపై ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. మనల్ని నిర్వహించుకునే పధ్ధతి ఇది కాదు. సమస్య, సరిహద్దులు మన మనసులో మత్రమే ఉన్నాయి.

ఇది కేవలం గ్రహాన్ని కాపాడడానికే కాదు, మానవులను చైతన్య పరచడానికి కూడా. మీరు మానసిక జాడ్యంతో కాకుండా కేవలం ఒక పూర్తిస్థాయి జీవిగా ఉన్నట్లయితే, మీరు చేసే ప్రతిదీ మిగిలిన వాటితో అనుసంధానంలో ఉంటుంది. మనం ఇక్కడ అద్భుతంగా జీవించవచ్చు. అన్నిటికీ మించి, బాధను గురించిన భయం లేనప్పుడే స్వచ్చమైన మానవ మేధ పురివిప్పుతుంది. అంటే మీరు స్వభావ పరంగానే/ సహజంగానే ఆహ్లాదంగా ఉంటారు.

నాయకత్వం గురించి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ తెలివితేటలలోని లొసుగులను కనుగొనడానికి మీరు తగినంత అప్రమత్తతతో ఉండాలి.

తెలివి తక్కువ అపోహలతో, తీసుకున్న నిర్ణయాల వల్ల మానవ మేధస్సు తీవ్రంగా కుంటుపడింది. జాతి, మతం ఇంకా జాతీయత పేరిట అంతులేనంత రక్తం పాతం జరిగింది. మతం, జాతి ఇంకా జాతీయతలన్నీ నిర్దిష్ట పరిధులలోనే నిర్వహించబడతాయి. వ్యాపారం అనేది ఒక అవకాశం ఎందుకంటే దానికి హద్దులు ఉండవు. ఒక వ్యాపార వేత్త, ఒప్పందం మంచిదైతే దెయ్యంతోనైనా ఒప్పందం చేసు కోవటానికి సిద్దంగా ఉంటాడు. అవకాశం ఉన్న ప్రతీచోటుకీ వెళ్ళటానికి వ్యాపారం సిద్ధంగా ఉంటుంది.

వ్యాపారం లాభం వైపే మొగ్గు చూపినప్పటికీ, భవిష్యత్తు వాణిజ్యవేత్తలు చైతన్యంతో ఉంటే చాలు, అన్ని సరిహద్దులనూ విచ్చిన్నం చేసి, ప్రపంచంలో భిన్నమైన స్థాయిలో చైతన్యాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. ఇది సాధించడానికి సులువైన మార్గం యోగ మార్గం. నేను “యోగ” అనే పదాన్ని పలికితే, ప్రజలు శరీరాన్ని అటూ ఇటూ మెలితిప్పడం అనుకుంటారు. కానీ యోగా అంటే అర్థం “ఐక్యత” అని. ఐక్యత అంటే మీరు మీ వ్యక్తిత్వం యొక్క సరిహద్దులను ఎరుకతో నిర్మూలించడం.

ప్రస్తుతం, విద్యా వ్యవస్థ విజ్ఞానాన్ని పెంచడానికి చూస్తుంది. విజ్ఞానం అంటే జ్ఞాపకశక్తి. కానీ యోగ వ్యవస్థ మిమ్మల్ని ఒక జీవిగా ఎలా పెంపొందించాలో చూస్తుంది. “మీరైన’’ జీవంలా అనడంలో నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇది నా శరీరం...అది మీ శరీరం. ఇది నా మనసు.....అది మీ మనసు. అక్కడా ఇక్కడా, మీరు సాంగత్యంలో ఉనప్పుడు మీ మనసులు కలిసినట్లు అనిపిస్తాయి. మీరు కొద్దిగా లైంగికత చేసినప్పుడు, శరీరాలు ఒక్కటయ్యాయని అనుకుంటారు. అయినప్పటికీ, రెండు శరీరాలు, రెండు మనస్సులు, మీరు ఏమి చేసినా ఎప్పటికీ ఒక్కటి కావు.

కానీ ‘నా జీవితం, నీ జీవితం‘ అంటూ ఏమి ఉండదు. ఇదంతా సజీవ విశ్వం. మీరు కొంత, నేను కొంత అంది పుచ్చుకున్నాం. మీరు ఎంత సంగ్రహించుకున్నారనే దాని మీద, మీ జీవితం ఎంత గొప్పగా ఉందో నిర్ణయిస్తుంది. మీకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటే, ఈ కాలంలో మీరే బాస్ కావచ్చు. ఒక్కసారి Artificial Intelligence సాధనాలు మీకంటే ఎక్కువ జ్ఞాపకశక్తితో తయారైతే, మీ జ్ఞాపకశక్తికి అర్థం ఉండదు. చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు.

“ఇప్పుడు మేము ఏం చెయ్యాలి?” అని ఇప్పుడు అంటున్న వాళ్ళే, ఒకప్పుడు “హమయ్యా, శుక్రవారం వచ్చింది”(Thank God, it’s Friday) అనే వారు. నేను “దేవుడికి కృతజ్ఞతలు, ఇది ఏ.ఐ (AI – Artificial Intelligence)” అంటాను. ప్రతిదీ యంత్రాలే చేసినప్పుడు, మీరు ఎలాంటి వ్యక్తి అనేది చాలా ముఖ్యమైనదవుతుంది. మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఎంత చైతన్యంతో ఉన్నారో ఎంత అద్భుతమైన వ్యక్తో అనే విషయం చాలా ముఖ్యమైనది అవుతుంది.

నాయకత్వం గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ తెలివితేటలలోని లొసుగులను కనుగొనడానికి అప్రమత్తంగా ఉండాలి. మీ తెలివితేటలలోని లొసుగులను మీరు గుర్తిస్తే, ఇతరులు మీరు చాలా తెలివైనవారు అనుకుంటారు. కానీ మీకు మీరే తెలివైనవారు అనుకుంటే, మిమ్మల్ని మీరు మూర్ఖులుగా మార్చుకున్నట్టే. తెలివైన వ్యక్తికీ, మూర్ఖుడికీ మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఇదే. తెలివైన వ్యక్తికి ఇది ఎంత పరిమితమో తెలుసు; అతనొక ముర్ఖుడని అతనికి తెలుసు. ఒక మూర్ఖుడికి తాను ముర్ఖుడని తెలియదు.

మీరు నిష్కర్షంగా శ్రద్ధ వహించి చూస్తే, ఈ విశ్వంలో ప్రతి అణువూ మీకన్నా చాలా వివేకం కలిగి ఉందని మీరు తెలుసుకుంటారు. మీకు ఇది అర్థమైతే, మీరు నిరంతరం మీ వివేకంలోని లొసుగులను గమనిస్తూ ఉంటారు. మీరు ఈ లొసుగులను ఎంత ఎక్కువగా పూడ్చుకుంటారో, మీరు ప్రపంచంలో అంత సమర్దవంతంగా ఉంటారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు