ఈ మధ్య ఎవరో నన్ను ఎంతో ఆత్రుతతో, నేను శరీరం వదిలేశాక ఏమవుతుంది? నేనెక్కడికి వెళతాను? అని అడిగారు. దీని గురించి నేను ఇంతకు ముందే ప్రస్తావించాను -  నేను(శరీరం వదిలేశాక కూడా) ఇంకా ఇక్కడే ఎనభై సంవత్సరాలదాకా ఉంటాను. ఉన్నదంతా, ఇక్కడే, ఇప్పుడే అయినప్పుడు, మనం వెళ్ళేది ఎక్కడికి? ‘‘ఇప్పుడు, ఇక్కడ’’ అన్నది ఒక ఆధ్యాత్మిక విషయం కాదు. ఆధునిక భౌతిక శాస్త్రం, ఈ విషయం మీద ఎంతో ఆసక్తి చూపుతోంది. మనం ‘‘ఇప్పుడు, ఇక్కడ’’ అన్నప్పుడు మనం మాట్లాడేది కాలం, దేశం (ఇక్కడ దేశం అన్నమాట స్థలం అనే భావనలో వాడబడింది) గురించి. ఈ దేశ, కాలాలు అనేవి భౌతిక సృష్టి జరగడానికి కావలసిన ముఖ్య ప్రమాణాలు. దేశ, కాలాలు అనేవి లేకపోతే, ఇక సృష్టికే అవకాశం లేదు. ఉన్నదంతా ఇప్పుడే, ఇక్కడే. అంటే దేశ కాలాలు మనం రూపొందించినవి. మీరు మీ శరీరాన్ని నిర్మించుకున్నట్టే, వాటితో పాటు, మీరు దేశ కాలాలకు కూడా రూపకల్పన చేశారు. మీరు శరీరం, మనస్సులను పోగుచేసుకోవడం వల్ల అవి మిమ్మల్ని దేశం, కాలం అనే నాటకంలో అందుబాటులో ఉంచుతాయి.

మీరు ‘విముక్తి’ అన్నారంటే అర్థం మీరు వాతావరణాన్ని దాటి, అంతరిక్షంలోకి పారిపోవడమనికాదు. మీరు ఈ స్థలం నుంచే విముక్తమవ్వడం.
శూన్యస్థితి ఎంత క్రియా శీలంగా, సృజనాత్మకంగా ఉంటుందో, ఎలా విస్తరిస్తోందో అన్నదాన్ని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది. అంతేకాదు, అసలు ఒక పెద్ద విస్ఫోటన జరిగిందని చెబుతారు, అలాగే  పెద్దగా కుచించుకుపోవడం కూడా జరగవచ్చు. అది ప్రతిదాన్నీ ఇప్పుడే, ఇక్కడే ఉండేలా చేయగలదు. నేను చెప్పేదేమిటంటే, విశ్వం అల్పమైన దానిని ఎంతో పెద్దదిగా చేసినట్లే, దానికి వ్యతిరిక్తంగా కూడా చేయగలదు, అంతా ఒక్కసారిగా కుచించుకుపోవచ్చు. యోగపరంగా, మా అనుభవం ద్వారా ఈ విషయం మాకు ముందునుంచీ తెలుసు. మేము ‘నిర్వాణం, మోక్షం, శూన్యం’ అంటున్నామంటే వాటి గురించే. మీరు వచ్చింది శూన్యం నుంచి, మీరు ఇంత వారు అయ్యారు, మీకు ఒక భ్రమణం పూర్తి అయితే, మళ్లీ మీరు శూన్యమే అవుతారు. అంటే మీరు ఎక్కడికి వెళతారు? “ఎక్కడికో వెళ్ళాలి” అన్నది అంతా ఆగిపోతే, ఆట ముగిసినట్లే.

మీరు ఎక్కువ ప్రదేశాలను చూసి ఉండకపోతే ఇంకా, ఇంకా వెళ్లడం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ మొదటి పురాతన స్థితినుంచి ఇప్పటిదాకా అన్నీ మీలోనే దాగివున్నాయన్న విషయం మీకు అవగతమైతే, మీకు బాగా ఆకర్షణ కలిగించేది ఏదీ ఉండదు. మీరు ‘విముక్తి’ అన్నారంటే అర్థం మీరు వాతావరణాన్ని దాటి, అంతరిక్షంలోకి పారిపోవడమనికాదు. మీరు ఈ స్థలం నుంచే విముక్తమవ్వడం. అది చిన్నపిల్లలాట. ఉదాహరణకు మిమ్మల్ని నేను ఒక చిన్న గదిలో బంధించాననుకోండి, అక్కడ నుంచి పెద్ద గదిలోకి మార్చాననుకోండి, ఓ రెండు రోజులు మీకు హాయిగా అనిపిస్తుంది, కాని మూడోరోజుకల్లా మళ్లీ మీకు బందిఖానాలో ఉన్నట్లే అనిపిస్తుంది. మళ్లీ మిమ్మల్ని ఇంకాస్త పెద్దగదిలోకి మారిస్తే, మీకు స్వాతంత్ర్యం వచ్చినట్టే అనిపిస్తుంది, మళ్లీ కొద్ది రోజుల్లో బందిఖానాలో ఉన్నట్లే అనిపిస్తుంది. మరి ముక్తి అంటే ఏమిటి? మీ గదికి గోడలు లేకపోతే, మీరు ఒకచోట బంధించబడలేరు, అలాగే దేశ కాలాలు ఒకటి లేకుండా రెండవది మనలేదు కాబట్టి, మీరు కాలంతో కూడా బంధించబడలేరు, అదే ముక్తి. దేశం (స్థలం) లేకపోతే కాలం లేదు. దీనినే మనం ‘ఇప్పుడు, ఇక్కడ’ అంటాము.

నేను శరీరాన్ని వదిలాక కూడా ఎనభై ఏళ్లదాకా ఉంటాను. అలా ఎందుకంటే నా ద్వారా ఏదో విధంగా స్పృశించబడినవారు, పూర్తిగా ఈ భూమండలం నుండి విముక్తులైపోవాలి.
మీరే గమనించండి, ‘ఇప్పుడు, ఇక్కడ’ అనేవి ఆధ్యాత్మిక పదాలు కాదు, ‘ఇప్పుడు, ఇక్కడ’ అనేవి భౌతికమైన పదజాలం. ‘ఇప్పుడు, ఇక్కడ’ లోకి అదృశ్య మవ్వడమంటే దేశకాలాల హద్దులను అధిగమించడం. మీరు దేశకాలాలు దాటి వెళ్లడం అన్నది తెలివితక్కువ మాట. ‘అసలు దేశ కాలాలు అన్నవి లేనప్పుడు, మీకు కూడా భౌతికంగాను లేదా మరో విధంగానూ దేశ కాలాలు అన్నవి ఉండవు. అంటే మీ ఉనికి ఇక ఉండదు. మరి మీరు ఎక్కడికి వెళతారు? ఎక్కడికీ వెళ్లరు. పోవడం అనేది ఉండదు. అదే విమోచనం అంటే, ముక్తి అంటే. ఇక నా మరణం గురించి- ఇప్పటికే నేను ఎంతోకాలంగా వెళ్లకుండా ఉండిపోయాను. అంటే జీవించడానికి అవసరమైనవన్నీ ఊడదీసేసినా, నేను ఇంకా ఉన్నాను, ఇది అస్తిత్వపరంగా మంచిది కాదు. జీవించడానికి అవసరమైన భౌతికమైనవన్నీ పోయాక, ఆ మనిషికి అక్కడ ఉండే పనిలేదు - అతను వెళ్లిపోవాలి. ముక్తి పొందాలన్న తపనలో, జీవించడానికి అవసరమైన భౌతికమైనవన్నీ వదిలేశాము, ఆ తరువాత ఈ అతి కష్టమైన పనిలో (ధ్యానలింగం ప్రతిష్ట) పడ్డాము. అందుకనే ఉండిపోయే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు అదికూడా జరిగిపోయింది, మరి ఎందుకు కొనసాగుతున్నామో ఎవ్వరికీ తెలియదు. నా మనుగడకు ప్రత్యేకంగా ఓ ప్రయోజనం లేకపోవడం వల్ల, ఇక్కడ ఏది అవసరమో అది చేసే ప్రయత్నం చేస్తున్నాను.

నేనిప్పుడు అద్దెకు తీసుకున్న వాటితో కాలం గడుపుతున్నాను

రేప్పోద్దున మొత్తం కొత్త సృష్టి జరిగినా, అంటే పూర్తిగా క్రొత్త విశ్వం పుట్టుకొచ్చినా సరే దాన్ని శోధించాలన్నఆసక్తి కూడా లేదు. ఎందుకటే అది అసలు ఎలా జరుగుతుందోనన్న మూలాలు తెలిసిన తరవాత అది ఆసక్తిరంగా ఉండదు. ఉదాహరణకు మీరు ఓ లక్ష గదులున్న పెద్ద హోటల్ లో ఉన్నారనుకుందాం, వారు మీ రూము మాత్రమే తెరచుకునే ఒక్క తాళామే ఇస్తారు. శుభ్రం చేసేవారి దగ్గర మాత్రం అన్ని తాళాలూ ఉంటాయి. రూములోకి వెళుతూనే మీకెంతో ఆసక్తిరంగా ఉంటుంది, కాని శుభ్రం చేసేవారు మాత్రం ఎన్నో గదులు రోజూ చూస్తున్నారు, వాళ్లకి మాత్రం మరో గదిలోకి వెళ్లడం అంత ఆసక్తికరంగా ఉండదు. హోటలు మేనేజరు వచ్చి “బాగావున్న మరో రూము ఉంది, మీరు  తీసుకుంటారా” అని అడిగితే, మీరు వెటనే దానినే తీసుకుంటామంటారు. కాని పనివారు మాత్రం అంత ఆసక్తి చూపరు. ఎందుకంటే వాళ్లు అలా ఎన్నో రూములు చూశారు. జీవితంలో కూడా అంతే.

మీ దగ్గర తాళం ఉంటే, మీకు సమయం, ఆసక్తి ఉంటే, ప్రతి గది తెరిచే ఆసక్తి ఉంటుంది. కాని ఎవ్వరూ నిజానికి అలా చేయరు. ఏ రూమూ అంతా కొత్తరకంగా ఉండదు. మీరు మరో కొత్త విశ్వంలోకి ప్రవేశించినా, అంతా ఆసక్తిగా ఉండవచ్చు, కాని మౌలికంగా అంతా ఒక్కటే. మీరు చూడవలసిందంతా చూసేస్తే, మీరు జీవించడానికి అవసరమైన మౌలికమైనవన్నీ తీసివేయడం మొదలెడతారు. నాలో మౌలికమైన అంశాలు ఎపుడో వెళ్లిపోయాయి. నేనిప్పుడు అద్దెకు తీసుకున్న వాటితో కాలం గడుపుతున్నాను. అవి ఎప్పుడూ ఎంతో బెదురుతో ఉన్నాయి. నేను శరీరాన్ని వదిలాక కూడా ఎనభై ఏళ్లదాకా ఉంటాను. అలా ఎందుకంటే నా ద్వారా ఏదో విధంగా స్పృశించబడినవారు, పూర్తిగా ఈ భూమండలం నుండి విముక్తులైపోవాలి. మరి ఎప్పటికీ ఎందుకు ఉండకూడదు? అలా ఎప్పటికీ ఉండిపోవడమన్నది ఉండదు. అలా ఉండిపోయే అవసరం కూడా లేదు. ఆ మేరకు కొన్ని అత్యంత ఉన్నతమైన ఏర్పాట్లు చేశాము. ధ్యానలింగం అందుకే ఉంది, ముక్తి ఇచ్చేలా ఎప్పటికీ ఉండిపోయే పరికరం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు