సద్గురు: రాబోయే నూతన సంవత్సరం మీకందరికీ అద్భుతంగా ఉండాలని నా ఆశీస్సు. కాలం అనే దాన్ని పది మంది పదిరకాలుగా నిర్వచించుకొంటారు. కొందరి దృష్టిలో కాలం అనేది వాళ్ళు తమ భుజాల మీద మోసే పెనుభారం. పసిపిల్లలకూ, పెద్దలకూ మధ్య ఉండే అతి ముఖ్యమైన వ్యత్యాసం ఇక్కడే ఉంటుంది. పిల్లలు గడిపే ఉత్సాహహభరితమైన జీవితంలో ఉండనిదీ, పెద్దలు గడిపే చింతాగ్రస్తమైన జీవితంలో ఉండేదీ ఈ బతుకు బరువే! పాత జ్ఞాపకాల భారాన్ని ఎలా నెత్తికెత్తుకోవాలో సరిగా తెలియకపోతే, గడిచిన కాలమంతా మోయలేని బరువుగా అనిపిస్తుంది.

మరో సంవత్సరం - 2019 - గడిచిపోయింది. దాంతో, ’అబ్బో, ఇక ఈ సంవత్సరం కూడా మన మీద ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా చేరుతుంది’ అని భావించే వాళ్ళు కొందరుండచ్చు. కానీ నిజానికి ఒక సంవత్సరమంటే కేవలం ఒక కాల పరిమితి మాత్రమే. కాలగతిలో ఈ సంవత్సరాలు ఒకదాని తరవాత ఒకటి, పొరలు వీడినట్టు కనుమరుగవుతున్నాయి. మరో సంవత్సరం గడిచిందంటే, మీరు మోయవలసిన భారం మరి కొంత తగ్గిపోయిందన్న మాటే. దాంతో మీకు కొంత ఊరట లభిస్తుంది కదా! కనకనే ఇప్పుడు మీరు రాబోతున్న నూతన సంవత్సరాదిని పండగ రోజుగా జరుపుకోవచ్చు. లేదంటే గడచిపోయి కాలగర్భంలో కలిసిన పాత సంవత్సరం అంతమయిన సందర్భాన్ని పర్వ దినంగా భావించినా భావించచ్చు. మీ జీవితంలో మీరు జాగ్రత్తతో నిర్వహించుకోవాల్సిన కాలంలో మరొక సంవత్సరం తగ్గిపోయింది.

జీవితాన్ని ఎప్పుడూ దానితో మీరు ఏర్పరుచుకోగలిగిన అనుబంధం తీవ్రతను బట్టి మీరు మూల్యాంకన చేసుకోవాలని నా సూచన. ఇప్పుడే గడచిపోయిన 2019 సంవత్సరంలో, మీరు జీవితంతో చక్కని అనుబంధాన్ని అల్లుకొని జీవించగలిగారా, లేక ఏవేవో చిక్కు ముడులు వేసుకొని చికాకులతో గడిపారా? మీరు చూసుకోవాల్సింది అంతవరకే. జీవితంలో ముఖ్యంగా గమనించుకోవలసిన విషయాలు జీవనం, మరణం- ఈ రెండే! మిగిలినవన్నీ అప్రధాన విషయాలు.

ఇంగ్లీషు లో ‘డెత్’ (death) అనే మాటలోనే ఎంతో నకారాత్మకత ధ్వనిస్తుంది. అదేదో చాలా భయంకరమైన విషయం అయినట్టు భావించటం సర్వ సాధారణం. భయంకరమైన దానిని మీరు దాన్ని స్వాగతించి స్వీకరించలేరు కదా? అందుచేత, మీ బుర్రలో నుంచి అలాంటి భావాలూ పరిగణనలూ తీసి పారేయండి. మరణం అనే దశ వెనక ఉన్న నేపథ్యమూ, సందర్భమూ బాగా అర్థం చేసుకోండి. మరణ దశ అనేది జీవన దశకు వ్యతిరేకమైనదేమీ కాదు. జీవనం అనేది కలగడానికి కారణం మరణమే. ఈ రెండింటి పూర్వాపరాలనూ సరిగ్గా తెలుసుకొంటే, మీరు రెండింటినీ స్వీకరించి అక్కున చేర్చుకోగలుగుతారు.

ఈ భూగోళానికున్న అతి సుదీర్ఘమైన చరిత్రలో మీరు సజీవులుగా ఉండేది చాలా కొద్దిపాటి కాలం మాత్రమే. మిగతా సమయమంతా, మీరు మృత దశలో ఉంటారు. కనక మీకు లభించిన ఈ యావజ్జీవ శిక్ష కాల ప్రమాణం మరీ అంతా ఎక్కువ కాదు!! మీరు మృతదశలో ఉండే కాల ప్రమాణంతో పోలిస్తే, అది అత్యంత స్వల్పం. అన్నాళ్లు అలా మృత దశలో ఉండి ఉండటం వల్లనే, ఇప్పుడు మీరిలా సజీవ ప్రకాశంతో వెలిగి పోగలుగుతున్నారు. మీరు మళ్ళీ మృతదశలో బహుకాలం గడపబోతున్న వారు కనకనే, స్వల్పకాలీనమైన మీ సజీవ దశలో ఈ వెలుగు చోటు చేసుకొంటున్నది. సజీవ దశా, మృత్యుదశా - ఈ రెండూ రెండు పరస్పర వ్యతిరేకమయిన దశలని భావించటం అవివేకం. జీవితంలో అనేక విషయాలలో ఇలాంటి ద్వంద్వాలు ఎదురవుతాయి. స్త్రీ పురుషులూ, చావుబ్రతుకులూ, చీకటి వెలుగులూ, శబ్ద నిశ్శబ్దాలూ – ఇలాంటి ద్వంద్వాలన్నిటిలోనూ ఒకటి లేకుండా మరొకటి ఉండనే ఉండదు. ఒకటి రెండో దానికి సంపూర్ణత్వాన్ని సమకూరుస్తుందే తప్ప వీటి మధ్య విరోధం ఏమీ ఉండదు.

ఇప్పుడు, కొద్దిపాటి కాలం మాత్రం, మీరు సజీవులుగా జీవ దశలో ఉన్నారు. ‘ఈ కొద్దిపాటి కాలాన్ని మాత్రమే నేను మనసారా స్వాగతించి, స్వీకరిస్తాను. నాకు మరేదీ వద్దు!’ అంటే, అది జరిగే పని కాదు. ఎందుకంటే, జీవ దశా, మృత దశా అనే ద్వంద్వాలు రెండూ కలిసే ఒకటిగా ఏర్పడతాయి. ఇప్పుడున్నది సజీవ దశలో ఉన్న మరణావస్థ. ఇది ‘జీవన్మరణం’ (living death). ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సిందేమిటంటే జీవ దశనూ మృత్యు దశనూ రెంటినీ ఎప్పుడూ ఏకకాలంలోనే అనుభవానికి తెచ్చుకొంటూ ఉండిపోవటం. ‘జీవన్మరణం’ అంటే అదే. జీవ దశ విలువైనది కావటానికి కారణం, మృత్యుదశ అనివార్యం కావటమే. మృత్యువు అనేది ఉండకనేపోతే, మీరు జీవితాన్ని అంత విలువైందిగా ఎందుకు భావిస్తారు, చెప్పండి? మరణించే వాళ్ళే జీవిస్తారు.

మీకెప్పుడయినా అవకాశం దొరికితే ఎవరయినా మరణించినప్పుడు జరిగే అంతిమ యాత్రలో పాలు పంచుకొని చూడండి. భారత దేశంలో అలాంటి సంప్రదాయం ఉంది. మీకు ఎప్పుడయినా దహన సంస్కారం కోసం తీసుకొని వెళ్తున్న మృతదేహం ఎదురు పడితే, మీరు ఆ ఊరేగింపుతో కనీసం మూడడుగులు నడుస్తారు. ‘నేను నీతో ఉన్నాను సుమా!’ అని ఆ మృతుడికి ప్రతీకాత్మకంగా (symbolically) తెలియజేస్తారన్న మాట. అది మరణించిన వారి పట్ల మనం చూపే గౌరవం. ఆ మరణించే వారి సన్నిహితుల పట్ల మనం చూపే సహానుభూతి.

మరణం అనేది మనం ఎంచుకొని తెచ్చుకొనే విషయం కాదు. అది అనివార్యం. అది సృష్టి సంకల్పం వల్ల జరుగుతుంది. జీవితాన్ని జీవించటం మాత్రమే మనం ఎంచుకొన్న మార్గంలో జరుగుతుంది. మీరు సరయిన మార్గం ఎంచుకోవాలనుకొంటే, మీరు జీవితంలోని అన్నీ పార్శ్వాలనూ, దశలనూ ఒకే ఒక సమగ్ర రూపంగా స్వీకరించగలగాలి. ‘సంపూర్ణమైన జీవకళతో ప్రకాశించే సజీవ దశనే నేను జీవితంగా స్వీకరిస్తాను, ఆ దశను సృష్టించిన నా అసలు స్వరూపాన్ని మాత్రం స్వీకరించను’ అని మీరనటం కుదరదు. మీకు అలాంటి ఎంపిక హక్కు ఉండదు. ఒకవేళ మీరలా అనుకొంటే, మీరు అస్వతంత్రంగా, ఎవరో పట్టి నిర్బంధంగా లాక్కు పోయినట్టు జీవనం సాగించాల్సి వస్తుంది. అప్పుడు మీరు మీ జీవదశను కూడా మృత్యుదశ లాగే గడపవలసి వస్తుంది. అది ఒక నిర్బంధమైన, అనివార్యమైన పద్ధతిలో సాగుతుంది. మీరు కావాలనుకొన్నట్టు, కోరుకొన్నట్టు సాగదు. చురుకుగా, చైతన్యవంతంగా, స్వతంత్రంగా స్వబుద్ధి ప్రకారం జీవితం గడుపుకొనే స్వాతంత్ర్యం మీకు కావాలంటే, మీకు అన్నింటినీ కలుపుకొని వెళ్లగల సర్వ గ్రహణ శక్తి అవసరమౌతుంది. జీవితాన్ని స్వాగతించినట్టుగానే, మరణాన్ని కూడా స్వీకరించాలి. అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. యోగ శాస్త్రంలో, శ్వాస క్రియలో ప్రతి ఉచ్ఛ్వాసమూ జీవితం అయినట్టూ, ప్రతి నిశ్శ్వాసమూ మరణం అయినట్టూ భావన చేస్తారు. ప్రతి పూర్తి శ్వాస లోనూ జీవనం, మరణం – ఈ రెండూ కలిసే ఉంటాయి. అలా కలిస్తేనే జీవనం. ఇది గుర్తించటమే యోగ శాస్త్రం లక్ష్యం. యోగం అంటే అర్థం ‘కలయిక’ అని. జీవనమూ మరణమూ రెండూ మీలో కలిసే ఉన్నాయి అని. అవి రెండూ రెండు విభిన్నమైన విషయాలు కాదు. మీరున్నదే జీవన్మరణ స్థితిలో. అంటే మీరు జీవన-మరణ స్వరూపులు. మీరే జీవనమూ, మరణమూ రెండూ అయినప్పుడు, ఆ జీవితం మహత్తరంగా ఉంటుంది. మట్టి మాటే మరచిపోతే, చెట్టు ఎలా ఎదుగుతుంది?

కనక మీరు నిజంగా చైతన్యవంతమైన జీవితం అనుభవించాలంటే, మీ మనుగడ స్వరూపాన్నంతా మీరే నిర్ణయించుకో గలిగినంత సజీవ శక్తితో ఉండాలంటే, మీరు జీవన్మరణ (Living death) రూపంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితాన్ని సమగ్రంగా పరిపూర్ణంగా స్వీకరించటం చాలా అవసరం. మీరు జీవన మరణాలను వేరు చేసి చూడ బోయారంటే, ఇక జీవితంలో మీకు నచ్చిన మార్గాలను స్వయంగా ఎంపిక చేసుకొనే స్వాతంత్ర్యం కోల్పోవలసి వస్తుంది. అలాంటి ఎంపిక కోసం మీరు నిలిచి ఉండేందుకు ఒక స్థానం (platform) అంటూ మీకు దొరకదు . మీరు నిలిచేందుకు అనాద్యంతమైన మృత్యు దశ అనే వేదిక లేకపోతే, ఏ జీవత్వ ప్రకాశం రూపంలో మీరిప్పుడు వెలుగుతున్నారో, అది అసాధ్యమైపోతుంది.

జీవన మరణాలను రెంటినీ ఇచ్ఛాపూర్వకంగా స్వాగతించి, స్వీకరించగలిగితే, మీరు నమ్మ శక్యం కానంత జీవత్వ స్ఫూర్తి అనుభవించగలుగుతారు. మీ జీవితం ఒక అద్భుతమైన అనుభవంగా పరిణమిస్తుంది. అలా పరిణమించటానికి కారణం ఆ జీవితంలో మీరు చేసే ఏ గొప్ప ఘనకార్యాలో కాదు. మీలో మీరు అంతర్గతంగా జీవించే విధానమే అద్భుతావహంగా ఉంటుంది.

రాబోతున్న నూతన సంవత్సరం – 2020 – మీకందరికీ అలాంటి అద్భుతావహమైన అనుభవాలను అందించాలని నా ఆశీస్సు.