మనసుకి అయిన గాయం అంత త్వరగా మానదెందుకు?
జూలై 27న In the Lap of the Master సద్గురుతో జరిగిన సత్సంగంలో ఎన్నో ఏళ్ళ నుండి మనల్ని తొలిచివేస్తున్న గాయాల గురించి మాట్లాడుతూ, జీవితం సులభంగా సాగిపోవడానికి కావలసింది అన్నిటినీ అంగీకారించే తత్త్వమేనని. రానున్న ఇరవై నాలుగు గంటలు సంపూర్ణ అంగీకార భావనతో ఉండి జీవితాన్ని చవి చూడమని సద్గురు మనకు సవాలు విసురుతున్నారు.

సద్గురు: మీరు మీ మనసులోకి తొంగి చూసుకుంటే, ‘మీరు’ అని మీరు అనుకునే వ్యక్తిత్వాన్ని గమనించుకుంటే...సహజంగా, మీరు వ్యక్తిత్వం అని దేన్నయితే అంటున్నారో - అది ఎన్నో స్థాయిల్లో ఉన్న మలబద్ధకం. “ నాకు ఇది నచ్చదు, నేను దీన్ని భరించలేను, నేను ఇది చేయలేను, నేను అది చెయ్యలేను, నాకు ఇదే ఇష్టం, నాకది ఇష్టం ఉండదు “ ఇలా ఎన్నో స్థాయిలో ఉన్న మలబద్ధకం.
ఈ మలబద్దకం ఎందువల్ల కలుగుతుంది ? మలబద్ధకాన్ని అర్ధం చేసుకోవాలంటే - అది ఒక ట్రాక్ట్ ని అడ్డుకోవడం వల్ల జరుగుతోంది. ఇక్కడ ఇది మీ మనసుని చైతన్యాన్ని అడ్డుకోవడం వల్ల జరుగుతోంది. వాటిని మీరు అలా పట్టి ఉంచడం వల్ల జీవితం అలా సాఫీగా సాగిపోవడం లేదు. అది నిర్బంధించ బడుతోంది. ఎందుకంటే మీరు దేనినైనా అనుభూతి చెందగలిగేది మీ శరీరం ఇంకా మీ మనసుల ద్వారానే. మీ దేహం, మీ మనసు ఏదో నిర్బంధంలో చిక్కుకున్నాయంటే, మీ జీవితాన్ని మీరు అనుభూతి చెందగలిగే సామర్థ్యం కూడా తగ్గిపోయినట్టే.
ఇది ఎన్నో విధాలుగా జరుగుతూ ఉంటుంది. మీలో చాలామంది వాటన్నిటి నుంచి మేము ఎదిగిపోయాం అనుకుంటున్నారు. మీకు పదేళ్ళున్నప్పుడు మీ మామయ్య మిమల్ని “వెధవా” అన్నాడు. ఇప్పుడు మీకు 50 సంవత్సరాలు. అయినా, 40 ఏళ్ల క్రితం, మీ మామయ్య మిమ్మల్ని “వెధవా” అన్నాడన్న విషయం మిమ్మల్ని ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది. అయిన మొహం చూడగానే, మీకు “ఈయన నన్ను’ వెధవా’ అన్నాడు” అనుకుంటారు. ఇలా కొనసాగుతూనే ఉంటుంది.
మీ వ్యక్తిత్వం ఎంత బలంగా ఉంటే, మీరు అన్ని దెబ్బలు-గాయాలు భరిస్తుంటారు. నయమవడానికి ఇవి శరీరం మీద ఉన్న గాయాలు కాదు. ఇవి మీరు స్వయంగా చేసుకున్న గాయాలు. అంటే వీటిని మీరు జీవితానుభవానికి సంబంధించిన పతాకాలుగా ధరిస్తున్నారు. అందుకనే అవి పోవు. ఇందువల్లే, “నాకు ఇతనంటే ఇష్టం, నాకు అతనంటే ఇష్టం, నేను ఇతని ప్రేమిస్తున్నాను, అతన్ని నేనసలు భరించలేను” అన్న భావాలు వస్తున్నాయి.
వచ్చే 24 గంటల్లో మీరు ఒక పని చేయాలి - ఈ మావయ్యలు, మీ స్నేహితులు, శత్రువులు ఈ చెత్తనంతా పక్కన పెట్టండి. మీరు వారి దగ్గరికి వెళ్లి “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని చెప్పక్కర్లేదు. మీలో మీరు అన్నిటి పట్ల ఒక అంగీకార భావనతో ఉండండి. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు, ఎవరో మీకు కాలు తొక్కారు, ఎవరో మీ మీదకి వచ్చారు... ఒక 24గంటల పాటు అన్నిటి పట్ల ఒక అంగీకార భావనతో ఉండండి. మానసికంగా, శారీరకంగా, మీ భావపరంగా సమాజపరంగా ఉన్నవన్నీ ఉన్నట్టుగా అంగీకార భావనతో ఉండండి. మీరు ఎవరితో ఏమి చేయక్కర్లేదు. మీలో మీరు అలా ఉండండి. మీరు ఇలా చేయగలిగితే, జీవితం ఎంతో ఉన్నతస్థాయిలో సాగుతుంది