ఈ క్షణంలో ఎంతో ఆనందంగా ఉన్నవాళ్లే మరు క్షణంలో దుఃఖంలోకి జారిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? మీరు దేనికోసం తపిస్తున్నారో అది ఒక్కొక్క సమయంలో మీ చేతికి చిక్కినట్టే అనిపిస్తుంది. మరుక్షణం అందనంత దూరానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణమేమిటంటే, ఇప్పటి ప్రపంచంలో మనసులను స్వాధీనంలో ఉంచుకొనే దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. మన విద్యా విధానంలో ఏ, బీ, సీ లు నేర్చినా, ఎక్కాలూ అంకెలూ నేర్చినా, E= mc2 అని సమీకరణాలు నేర్చినా, మనం మన బుర్రలను కేవలం సమాచారంతో నింపే ప్రయత్నమే చేస్తున్నాం. అవతలి వాడికంటే మీరు మీ బుర్రలో కొంత ఎక్కువ సమాచారం నింపేసుకోగలిగితే, మీరు తెలివయిన వారికింద లెక్క. నిజానికయితే, మీరు మీ బుర్ర నిండా పనికిరాని సమాచారం పోగుచేసి పెట్టుకొన్నందుకు, లోకం మిమ్మల్ని మూర్ఖులుగా భావించాలి. కానీ అలా జరగటం లేదు, మిమ్మల్ని చాలా తెలివయిన వారిగా పరిగణిస్తున్నారు. మీరేమీ చెయ్యక్కర్లేదు. మీ ఫోన్ లో కొంత సమాచారం చూసుకొని, దోవన పోయే వారినెవరినో పిలిచి, ఏ గాలక్సీల గురించో నాలుగు ముక్కలు వల్లించండి. 'అయ్య బాబోయ్, మీరెంత మేధావులో!' అంటారు. ఆ మేధాశక్తి ఏమయినా ఉంటే గింటే, అది మీది కాదు. ఆ ఫోనుది.

మీరు ఆనందంగా, హాయిగా, స్పష్టతతో ఉన్నప్పుడు మీ జీవన దిశను నిర్ణయించుకోండి. ఆ తరవాత అది మారకూడద

ఈ రోజుల్లో సమాచార సేకరణే మేధా శక్తి అయిపోయింది. ఎటువంటి మూర్ఖుడైనా సమాచార సేకరణను చేయగలరు. ఒక పుస్తకం తెరిచి అందులో ఉన్నది చూసి పైకి చదవగలిగితే, చాలు! చాలా కాలంపాటు, పుస్తకం చదవటమంటే, అదొక పవిత్ర దైవ కార్యం అనుకొనే వాళ్ళు. ఇప్పుడూ అలా అనుకొనేవాళ్ల చాలా మంది ఉన్నారు. సాధారణ అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరయినా పుస్తకాలు చదవవచ్చు. అక్షరాస్యత అరుదుగా ఉండే రోజులలో, చదవటం తెలిసిన వాళ్ళు గ్రామానికొకళ్ళు ఉండేవాళ్లు. 'పుస్తకంలోకి చూస్తే, మనకయితే ఏమీ అర్థం కాదు. ఈ మనిషి అదే పుస్తకంలోకి చూసి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాడో!' అని ఆ వ్యక్తిని చూసి మిగతా వాళ్ళు అబ్బురపడే వాళ్ళు. అదొక అద్భుతంగా వాళ్ళకు కనిపించేది. మీరు బొత్తిగా అజ్ఞానంలో ఉంటే, మీకు అన్నీ అద్భుతాలుగానే కనిపిస్తాయి. మళ్ళీ ప్రస్తుతాంశానికి వద్దాం. మనకు ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అది మనకు మన మనసును గురించి, దాని స్వభావాన్ని గురించీ నేర్పదు. మనసును ఎలా వినియోగించుకోవాలో నేర్పదు. అందుకు కావలసిన క్రమశిక్షణ అలవాటు చేయదు. అందుకే ఒక క్షణంలో మనకు, మనం సాధించటానికి కృషి చేస్తున్నదేదో అది అతి చేరువలో ఉన్నట్టు అనిపిస్తుంది. మరు క్షణంలో అది చాలా దూరమైపోయినట్టు అనిపిస్తుంది.

మీరు మీ మనసును దృఢంగా నిలిపి ఉంచుకోకపోతే, మీ జీవితమే వ్యర్థం అయిపోతుంది. ప్రతి క్షణం మీ ఆలోచనలు అటూ ఇటూ ఊగిసలాడుతూనే ఉంటాయి. మనసుకు ఒక స్థిరమైన ఆకారం అంటూ లేదు. దాని ప్రత్యేకతే అది. దాన్ని మీకు కావలసిన విధంగా మలచుకోవచ్చు. లేదంటే దాన్ని పక్కన పెట్టేయచ్చు కూడా. మీ శరీరానికి ఒక ఆకారం ఉంది, మనసుకు లేదు. దాంతో ఏం కావాలంటే అది చేయచ్చు. మనసుకున్న అద్భుతమైన లక్షణం అదే. చాలా మంది మనుషులకు ప్రస్తుతం సమస్యాత్మకంగా మారింది కూడా అదే. సమస్యేంటంటే, మీ మనసు మీ ఆదేశాలకు లొంగదు. దానికి తోచిన ఆకారలోకి అది మారిపోతూ ఉంటుంది. మీరే మనసును నిర్ణయాత్మకంగా ఉంచాలి. అందుకు ఇవాళే మంచి రోజు అనుకోండి. ఏకాంతంగా ఎక్కడైనా కూర్చొని మనసును స్థిరపరచుకోండి. మీ జీవితం ఏ దిశగా సాగుతున్నదో ఆ దిశ మీ జీవితమంతా అలాగే మారకుండా ఉండేలా చూసుకోండి. మీరు ఏ దిశలో సాగాలనుకొన్నా నాకు ఆమోదమే. కానీ ఆ దశను కచ్చితంగా నిర్ణయించుకోక పోతే మాత్రం, మీ మనసు ఆకారం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కనక, దాని దిశను కూడా మార్చవలసిన అవసరం ఉందని ఎప్పటికప్పుడు మీరు అనుకొంటూనే ఉంటారు.

మీరు వర్షాకాల సమయంలో ఈశా యోగ కేంద్రంలో ఉండి ఉంటే, అక్కడ మేఘాలు ప్రతి నిమిషం ఆకారాలు మార్చటం చూసే ఉంటారు. మేఘాల ఆకారం మారటం సమస్య కాదు. కానీ గాలి వాటం మారిపోయి, ఆ మేఘాలు అవి ప్రయాణం చేయాల్సిన దిశగా వెళ్లలేకపోతే మాత్రం అది సమస్య. మీ విషయంలోనూ అంతే. మీ మనసు దాని ఆకారం మార్చుకోవటం సమస్యకాదు. దాని దిశనే మార్చేసుకొంటుంటే అది సమస్య. మీ జీవితానికి దిశా నిర్దేశం మీ అంతట మీరే చేసేసుకోవాలి. నేను దాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయను. నా దిశా నిర్దేశం నేను చేసుకొన్నాను. అది అద్భుతంగా పని చేసింది. మీ దిశా నిర్దేశం మీరు చేసుకోండి. అది ఏ దిశ అయినా ఫరవాలేదు. కానీ, ఒకసారి నిర్ణయించుకొన్న తరవాత మాత్రం ఇక అది ప్రతిరోజూ మారకూడదు. మీకు కనిపించే ప్రతి తుక్కు ముక్కనూ అనుసరించటం సరయిన జీవన విధానం కాదు. మీరు నిర్దేశించుకొన్న దిశ పని చేసినా చేయకపోయినా ఫరవాలేదు. మీరు ఆనందంగా, హాయిగా, స్పష్టతతో ఉన్నప్పుడు మీ జీవన దిశను నిర్ణయించుకోండి. ఆ తరవాత అది మారకూడదు.

సందర్భానికి తగిన ఆకారాన్ని ప్రయత్న పూర్వకంగా మలచుకోగల మనసు జ్ఞానోదయానికి సోపానం

మీ భావోద్రేకం (emotion) దిశ మారిపోవటంవల్ల, 'నేను ఉండాల్సింది ఇలా కాదేమో!' అని ఎప్పుడయినా మీకు అనిపిస్తే, మీరు దాన్ని పట్టించుకోవద్దు. మీ క్రుంగుబాట్లనూ, ఆశాభంగాలనూ, మీరు పట్టించుకొని, వాటి బోధనల ప్రకారం నడుచుకొంటానంటే, మీ గొయ్యి మీరు తవ్వుకొని, సమయం రాకముందే మీ సమాధి నిర్మించుకొన్నట్టే. మీ గొయ్యి మీరే ఎందుకు తవ్వుకొంటారు? రెక్కలు విప్పి రివ్వున ఎగురుతూ ఉండవలసిన సమయం ఇది. మనిషి మనసుకు ఉన్న అత్యద్భుతమైన లక్షణం, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా తన ఆకారం మార్చుకోగలగటం. అయితే ఆ మార్పులను దిశానిర్దేశంగా పొరబడితే మాత్రం సమస్యే. ఇప్పుడు మనుషుల జీవితాలలో జరుగుతున్నది ఇదే. మీరు దిశను సరిగా నిర్ణయించుకొంటే, మీ మనసు ఆకారం ఎలా మారిపోయినా మారిపోనివ్వచ్చు. సమస్య లేదు. దిశను నిర్ణయించుకొన్న తరవాత, మనసు ఆకారం ఎలా మారినా అది సృజనాత్మకతకు దారి తీస్తుందే తప్ప, క్రుంగుబాటుకు దారితీయదు.

సందర్భానికి తగిన ఆకారాన్ని ప్రయత్న పూర్వకంగా మలచుకోగల మనసు జ్ఞానోదయానికి సోపానం. మనసు, అస్పష్టంగా, స్థిరమైన రూపం లేకుండా ఉన్నప్పటికీ, ఏకాగ్రంగా, నిశ్చలంగా ఉంటే, అపారమైన జ్ఞానార్జనకు సాధనమౌతుంది.

ప్రేమాశిస్సులతో,

సద్గురు