దర్శనం - అనంతాన్ని రుచి చూపించే సాధనం
After a week of Darshans at the Isha Yoga Center, Sadhguru shares a post about the meaning of Darshan, and how one can make use of the rare opportunity to behold the Guru. “The Guru is soaked with the fragrances of limitlessness. You just have to behold, not try to understand, not try to think it through, not to try to grasp – nothing. Simply look.” A photo gallery of photos from the Darshans is also included. Enjoy!
దర్శనం అంటే కేవలం మీ కన్నులను తెరచి ఉంచి గ్రహించడం. దేన్ని గ్రహించడం? మానవ మేధ ప్రాథమిక స్వభావం ఏమంటే, అది ఉన్నదానితో తృప్తి చెందలేదు. దీని స్థూలమైన అభివ్యక్తీకరణ ఎలా ఉంటుందంటే అది డబ్బు, ఆస్తి, విజయం, షాపింగ్ వంటి వాటి గురించి ఆలోచిస్తుంది. కొంతమంది బజారులో ఉన్న వాటిని సొంతం చేసుకోవడానికి తుపాకులు, కత్తులతో వెలితే, మరి కొంతమంది పర్సులను ఉపయోగిస్తున్నారు. మీలోని మౌలికమైన ఆకాంక్షకు ఎంతో స్థూలమైన అభివ్యక్తీకరణలివి - మీకున్న దానితో సంతృప్తి చెందలేని మౌలికమైన ఆకాంక్ష. తృప్తి ఎంత మంచిదో, ఎంత అవసరమో, ఎందరో బోధించారు, కాని ఏ ఒక మనిషికైనా ఈ బోధనలు ఉపయోగపడ్డాయా?
మీ బుద్ధి పాదరసంలా చురుగ్గా ఉంటే అది ఎప్పుడూ మరింత కావాలని కోరుకుంటుంటుంది. దీన్నెవరూ ఆపలేరు. ఉదాహరణకు మీరు డబ్బు కోరుకుంటున్నారనుకోండి, నిజానికి మీకు కావాల్సింది ఎక్కువ డబ్బు కాదు.., మీరు కోరుకునేది సృష్టిలో ఉన్నదంతా - అదెప్పటికీ జరగదు. ఈ విధంగా అది జరిగే పని కాదు. దాన్ని లెక్కపెట్టడంలోనే మీ జీవితమంతా వృథా అవుతుంది. మీరు ఆ డబ్బుకు ఎన్ని సున్నాలు చేరుస్తూ వచ్చినా, జీవితానికది ఎటువంటి ఆచరణీయ పరిష్కారమూ చూపించదు. డబ్బు నుండి ధ్యానం వైపుగా మరలడమనేది కేవలం మిమల్ని మీరు మెరుగుపరచుకోవడం మాత్రమే కాదు, మీరు ఆచరణ యోగ్యమైన రీతిలో సున్నితత్వంతో మసలుకోవడం. ఇది మీ జీవన దిశను మార్చకోవడం కాదు, ‘మరింత’ అన్నది మీకు సంతృప్తి కలిగించలేదని మీరు తెలుసుకోవడం. మీకు కావాల్సింది ఉన్నదంతా అని తెలుసుకోవడం.
మీరు ఉన్నదంతా కావాలనుకుంటే దాన్ని భౌతికంగా సాధించాలనుకునే ప్రయత్నం అర్థం లేనిది. ఎందుకంటే భౌతికత అంటేనే చిన్నదో లేదా పెద్దదో, అంతే తప్ప మొత్తం కాదు. ‘మనిషి’ అనే ఈ మేధస్సు , మన అస్తిత్వ స్వభావాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటుంది. ఇవ్వాళ మీరు అలసిపోయి, విసిగిపోతే ‘‘ఓ, ఇది చాలు’’ అంటారు. కాని రేపు ఉదయం మీ నరాల్లో ఏ మాత్రం శక్తి మిగిలినా మళ్లీ మీరు ఎదో కావాలని సన్నద్ధమవుతారు. మనిషి స్వభావం ఇదే.
మీకు తెలియకుండానే, ఆ స్పృహ లేకుండానే, మీరు అనంతమైన దాన్ని అన్వేషిస్తూంటారు. అనంతమైనదేదయినా ఉంటే అది అంతటా ఉంటుంది. మీ సమస్య ఏమిటంటే, మీరు సర్వవ్యాప్తమైన దాన్ని అన్వేషిస్తున్నారు కాని మీ అవగాహన సాధనాలు - దానికొక సందర్భం ఉంటే తప్ప దాన్ని గ్రహించలేవు - చీకటి వెలుగులు, స్త్రీ పురుషులు, రాత్రింబగళ్లు, ఇదీ అదీ. ఒకవేళ ‘ఇదీ, ఇదీ’ మాత్రమే ఉంటే మీ జ్ఞానేంద్రియాలు దాన్ని గుర్తించలేవు. వేడి, చల్లదనం రెండూ ఉంటే మీరు తెలుసుకోగలరు. ఒక్కటే ఉంటే గ్రహించలేరు. అనంతమైన సత్యం కోసం మీరు తపన పడుతున్నారు, కాని దాన్ని గ్రహించే సాధనాలు మీ వద్ద లేవు.
దర్శనమంటే ఇది - మీ కోరికను కొంచెం తగ్గించుకోవడం. అంతిమమూ, అనంతమూ అయినదాన్ని గురించి అన్వేషించడానికి బదులు ఆ అనంతత్వం మూర్తీభవించిన దానికోసం చూడడం ప్రారంభించండమే. ఆ అనంతత్వంలో మునిగి తేలుతూ, దాని పరిమళాన్ని వెదజల్లే దాన్ని చూసే ప్రయత్నం చేయడమే. ఇందుకు, పరిమితమైన స్వభావం కలిగిన గురువు ఒక సంభావ్యత. ఒక సందర్భం లేకపొతే దేన్నీ మీరు గ్రహించలేరు. జ్ఞానేంద్రియాలు ముందుకు సాగడానికి కొన్ని నిర్దిష్ట విషయాలు కావాలి. గురువు అనంతత్వంలో, అపరిమిత పరిమళాలలో మునిగినవాడు. మీరు కేవలం అయన మీద చూపు నిలపాలి, అర్థం చేసుకోవడానికి కాని, అవగాహన చేసుకోవడానికి కాని, గ్రహించడానికి గాని ప్రయత్నించవలసిన అవసరం లేదు. కేవలం చూడండి.
దర్శన స్థితిలో ఉండడమంటే ఏమిటి? మీ శరీరం ఒక నిర్దిష్టమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది, మీ భావోద్వేగం మరోరకమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది. మీరు మీలో ఉన్న ప్రాణమని పిలిచే దానిలో మరోరకమైన ప్రకంపనలు ఉంటాయి. దర్శన స్థితిలో ఉండడమంటే ఈ జీవితాన్ని అత్యంత సున్నితంగా ప్రకంపించనివ్వడమే. జీవితంలోని సున్నితత్వం, మార్దవం శరీరాన్ని ఆలోచనను, భావోద్వేగాన్ని అధిగమించినప్పుడు - అప్పుడు మీరు నిజంగా దర్శన స్థితిలో ఉన్నారన్నమాట. అప్పుడు మీరు నిజంగా గ్రహించే స్థితిలో ఉన్నారన్నమాట.
అంటే జరిగేదేమిటి? దర్శనంలో జరిగేదేమిటిటంటే - అనంతమైన దాన్ని గ్రహించడానికి అవసరమైన సాధనాలు మీ దగ్గర లేవు. కానీ ఆ సాధనాలు లేకుండానే, దర్శనంలో అనంతత్వపు కోణాన్ని మీరు రుచి చూడగలరు. అంటే ఉదాహరణకు, మీకు నాలుక లేకుపోయినా మీరు వంట రుచి చూడగలగడం లాంటిది అన్నమాట.