Sadhguruప్రతి ప్రకంపనకి గొప్ప ప్రాముఖ్యం ఉన్నా లేకున్నా కూడా, ఒక అస్తిత్వ మూలం ఉంటుంది. కాని దాని అర్థానికి అటువంటి అస్తిత్వ మూలం ఉండదు. మీ మానసిక చట్రంలో మాత్రమే మీరు వాటికి అర్థాలు ఇస్తున్నారు. మీరు మానవ సమాజంలో జీవిస్తున్నప్పుడు మాత్రమే అర్థాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే, మీరు సృష్టితో మీకున్న సామీప్యాన్ని కోల్పోయారు కాబట్టి. అర్థాలకు ప్రాధాన్యత ఉన్నది కేవలం మీ సొంత సృష్టిలోనే అంటే  మీ మానసిక స్థలంలో జరిగే సృష్టిలోనే. ఇది ఎవరికి వారు తమకోసం నిర్మించుకొనే ఒక నూతన ప్రపంచం. ప్రతివ్యక్తీ తన సొంత ప్రపంచంలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రపంచంలో జరిగే ఈ నిత్య ఘర్షణలను మీరు చూస్తున్నారు. ఇదంతా మీ మానసిక నిర్మాణమే. మీ కోసం మీరు సృష్టించుకున్న భ్రాంతి మాత్రమే.

ఈ భ్రాంతిలోనే మీరు అన్నిరకాల అర్థాల్నీ సృష్టించగలుగుతున్నారు. ఎవరైనా తన స్థితిని తాను అవగాహన చేసుకొన్నారంటే ‘‘అతని భ్రాంతి తొలగిపోయింది’’ అంటాం. సామాజిక సందర్భంలో భ్రాంతి తొలగిపోవడం అన్నది మంచి విషయమేమీ కాదు. కాని అదే ఆధ్యాత్మిక సందర్భంలోనయితే మీరెంత తొందరగా భ్రాంతిని తొలగించుకుంటే అంతమంచిది. మీ భ్రాంతులన్నీ ఇవాళే తొలగిపోతే అది ఎంతో మంచిది కదా. లేకపోతే మీ మరణశయ్యవరకూ మీ భ్రాంతులను తీసికొని పోతారా? మరణం అన్ని భ్రాంతులకీ ముగింపు పలుకుతుందనుకోండి.

ఎంతమంది వసంత ఋతువులో తీరికగా కూర్చుని పూలు వికసించడం గమనిస్తారు? ఇలాంటి పనులు చేసే బదులుగా ఎవరిమాటలు అర్థవంతంగా ఉన్నాయని వాదించుకుంటూ ఉంటారు. 

మనం మంత్రం ఉచ్చరించేది, దాని అర్థం గురించి కాదు. కానీ చాలా మంది వారికి అర్థం తెలియని వాటి పట్ల నిమగ్నత చూపించలేరు. ఈ లోకంలో జరుగుతున్న అద్భుతాలనెన్నిటినో వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు? సూర్యోదయం, సూర్యాస్తమయం, పౌర్ణమి ఇలాంటివన్నీ. ఈ భూగోళం మీద ఎంతమందికి వీటి పట్ల స్పృహ ఉంది? ఎంతమంది వసంత ఋతువులో తీరికగా కూర్చుని పూలు వికసించడం గమనిస్తారు? ఇలాంటి పనులు చేసే బదులుగా ఎవరి మాటలు అర్థవంతంగా ఉన్నాయని వాదించుకుంటూ ఉంటారు. ఈ విశ్వంలో జరుగుతున్న ఎంతో అద్భుతమైన విషయమైన సరే, వారికి అర్థరహితంగా తోచే విషయాలపట్ల వారికి శ్రద్ధ ఉండదు. వీళ్లు అర్థవంతమైన వాటికోసం వెతుకుతుంటారు మరి ...!!

శబ్దం ఈ సృష్టి నిర్మాణానికి మౌళికమైన పదార్ధం. అర్థాలు మాత్రం మనస్సుల్లో కల్పించుకునేవి. శబ్దాలు అనేక రకాలు - కొన్ని చాలా సుక్షమైన శబ్దాలు, మరికొన్ని స్థూలమైన శబ్దాలు. శబ్దాలు పూర్తిగా వాటి ప్రకంపనల స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. సృష్టిలో ప్రతిదీ కూడా ఏదో ఒక రకమైన శబ్దమే -  చెట్టు, గాలి, శరీరం, రాయి అన్నీ కూడాను. సరిగ్గా ధ్యానలింగం వంటి రాయే మరొకటి ఉండవచ్చు. కాని అది పూర్తిగా భిన్నమైన ప్రకంపన కలిగి ఉంటుంది.

శరీరం ఒక రకమైన ప్రకంపన, ఆలోచన మరోరకమైన ప్రకంపన, భావోద్వేగం ఒకరకమైన ప్రకంపన, చైతన్యం అన్నిటి కంటే  భిన్నమైన ప్రకంపన. వీటన్నిటికి ఆవల ఉన్నది ‘‘శివం’’, అంటే ‘‘ఎదీ కానిది ’’

ఒక శబ్దాన్ని తీసుకొని దానినొక విశిష్ట స్థాయికి మెరుగు పరచవచ్చు. ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రం ఆ రంగంలోకి ప్రవేశిస్తోంది. కాని, యోగ సంబంధమైన పద్ధతుల్లో, దీనిని  ఎప్పుడో తెలుసుకున్నారు. ఇప్పుడు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ధ్వని, కాంతి రెండూ కూడా ప్రకంపనలేనని చెప్తున్నది. ధ్వనిని ఒక నిర్దిష్ట డెసిబెల్ వరకు గుణిస్తూ పోతే అది గణితపరంగా కాంతిగా పరివర్తనం చెందే చోటికి చేరుకుంటాం. సిద్ధాంతరీత్యా ధ్వని కాంతిగా మారగలదు. సిద్ధాంతరీత్యా  సాధ్యమైనదేదైనా వాస్తవం కావడమన్నది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాని ఇది మనం ఎల్లప్పుడూ మనలో మనం చేసేది.

మీరు ఒక ధ్వనిని తీసుకొని దాన్ని మీలో వృద్ధి పరిస్తే, దాన్ని మీ చైతన్యపు ప్రకంపనలతో మెరుగుపెట్టి కాంతిగా మార్చగలరు. శరీరం ఒక రకమైన ప్రకంపన, ఆలోచన మరోరకమైన ప్రకంపన, భావోద్వేగం ఒకరకమైన ప్రకంపన, చైతన్యం అన్నిటి కంటే  భిన్నమైన ప్రకంపన. వీటన్నిటికి ఆవల ఉన్నది ‘‘శివం’’, అంటే ‘‘ఎదీ కానిది ’’. దాని ప్రకంపన ఎటువంటిదంటే, అదక్కడ ఉన్నదని మీరు గ్రహించలేనంత సున్నితంగా ఉంటుంది. అది సంపూర్ణ నిశ్చలత్వం. అయినా దానిలోనూ ఒక ప్రకంపన ఉంటుంది. మీరొక ధ్వనిని మీలో, మీ చైతన్యంతో వృద్ధి పరుస్తే, ఆ ధ్వని మెల్లగా కాంతిగా మారగలదు. ప్రకంపనలు ఒకొక్కరికి ఒక్కో విధంగా పనిచేస్తాయి. కాని ఒక ప్రకంపనని, మీరు ఒక కోణం నుండి మరో కోణానికి మీలోని చైతన్యంతో వృద్ధి చెందిస్తే, అది కాంతిగా మారుతుంది. ఈ విధంగా తనలోని అంతర్ముఖ కాంతిని ఒక మనిషి గ్రహించ గలుగుతాడు. అతనిలోని ఈ మార్పు, అతని చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కనిపించేంత స్పష్టంగా ఉంటుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు