సత్యం అంటే ఏమిటి? అది మనం మాట్లాడే మాటల్లో కాదు అది మనం ఉండే విధానంలో ఉంది అని సద్గురు మనకు చెబుతున్నారు.

సద్గురు: మనం సత్యం, అసత్యం గురించి మాట్లాడినప్పుడు సహజంగా మనం ఏమనుకుంటున్నాం అంటే - మాట్లల్లో చెప్పే నిజాన్ని సత్యం అనుకుంటున్నాం. "నేను నిజం మాట్లాడాను, లేదా నేను అబద్దం మాట్లాడాను అని" అన్నట్టు. మనం మాటల్లో చెప్పే అబద్ధాలు, నిజాలు కేవలం నైతికతకి సంబంధించినవి. ఇవి సామాజికపరమైనవి. అంతేకాని, ఇవి మనుగడకి సంబంధించినవి కాదు. సృష్టికి సంబంధించినవి కాదు. మీకో విషయం తెలుసా? ప్రపంచంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. అమెరికాలో కేవలం ఒకటి జరిగింది. మన దేశంలో ఎన్నో జరిగాయి.

సృష్టి విధానం ఎలాంటిదంటే, అది అన్నింటిని ఒక్కటిగా ఇముడ్చుకుని ఉంది.

ఒక హాల్ నిండా మనుషులు ఉన్నారనుకోండి. ఒక ఉగ్రవాదికి ఇలాంటి ప్రదేశం అంటే ఎంతో ఇష్టం. ఇలాంటి చోట్లల్లో వారు ఎంతో ప్రభావం చూపించగలరు కదూ! ఉదాహరణకి, నేను అటుగా వస్తున్నప్పుడు నేను అక్కడ ఒక ఉగ్రవాదిని కలిసాననుకోండి. ఇక్కడంతా నిశబ్దంగా ఉండటంతో అతనికి మీరందరు లోపల ఉన్నారో లేదో తెలియలేదు. అతని దగ్గర బాంబులు ఉన్నాయి. లోపల మనుషులు ఉన్నారా అని అతను అడిగాడు. నేనతనికి నిజం చెప్పాలా..? అబద్ధం చెప్పాలా..? ఏది నిజం? ఏది అబద్దం? అది మీరు మాట్లాడే మాటల్లో లేదు. అది మీలో మీరు జీవాన్ని ఎలా నిలబెట్టుకున్నారో, దాన్ని బట్టి ఉంటుంది.

సృష్టి విధానం ఎలాంటిదంటే, అది అన్నింటిని ఒక్కటిగా ఇముడ్చుకుని ఉంది. ఇక్కడ ఒక పది మంది ఘోరమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుడ్ని నమ్మడం లేదు అనుకుందాం. అప్పుడు దేవుడ్ని నమ్మేవారు ఏమనుకుంటారంటే రేపు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పదిమంది మీద మాత్రం కిరణాలు పడవు అని అనుకుంటున్నారు. ఎవరైతే దేవుడ్ని నమ్ముతారో వాళ్ళు ఈ రకంగా అనుకుంటారు. కానీ, సూర్యుడు వచ్చినప్పుడు అది అన్నిటిని వెలుగుతో నింపేస్తుంది. మీరు  ఏమి  నమ్మినా, నమ్మకపోయినా అన్నిటిని కాంతితో నింపేస్తుంది. ఎవరైతే కళ్ళు తెరిచి చూడ్డానికి  సిద్ధంగా ఉన్నారో వారికి కాంతి కనిపిస్తుంది. మీరు ఎవరు? మీరేమిటి? మీరేమి ఆలోచిస్తున్నారు? మీరు ఇదా, మీరు అదా అని అది మీమీద వివక్ష చూపించదు. మీరు ఒక పాకే పురుగయినా, మీరు ఒక పెద్ద మనిషైనా సరే అది వివక్ష చూపించదు.

సత్యం మీరు మాట్లాడే మాటల్లో లేదు..

అందుకని సృష్టి అంతా కూడా అన్నిటిని ఒక్కటిగా ఇముడ్చుకుని ఉంది. అన్నిటిని ఒక్కటిగానే ఇముడ్చుకుని ఉంది. మీరు ఆ విధంగా అన్నిటితో ఒక్కటిగా ఉండగలిగినప్పుడు మీరు సత్యంలో ఉన్నట్టు. అలాకాకుండా మీరు మాత్రమే  ఇక్కడ విడిగా మనుగడ సాగిస్తున్నారు అని మీరు అనుకుంటే అది అసత్యం. సత్యం మీరు మాట్లాడే మాటల్లో లేదు. అది మీరు ఉన్న విధానాన్ని బట్టి ఉంటుంది. సత్యం అనేది మీరు చెప్పేదో, చెప్పలేనిదో కాదు. సత్యం అనేది ఎలాంటిది అంటే -  మీరు దాని  స్పర్శలో అయినా ఉంటారు, లేదా ఉండరు. అది మీరు చేసేది కాదు. మీరు చేసేదైతే అది అసత్యం అవుతుంది కదూ ! అది మీరు చేసేదో, నేను చేసేదో అయితే అసత్యమే అవుతుంది.

సత్యం మీరు మాట్లాడే మాటల్లో లేదు. అది మీరు ఉన్న విధానాన్ని బట్టి ఉంటుంది.

ఏదైతే సత్యమో, అది ఎల్లప్పుడూ ఉంటుంది. సత్యం ఒడిలోనే మనమందరం కూడా మనుగడ సాగిస్తున్నది. అది మనం చెప్పేదో, చేసేదో కాదు. అయితే మనం దాని స్పర్శలో ఉండచ్చు, లేదా దాని పట్ల స్పృహలేకుండా ఉండచ్చు కాని అది పని చేస్తూనే ఉంటుంది. మనకి నచ్చినా, నచ్చకపోయినా. మనం శ్వాస తీసుకునే విధానంలో మనం అంతా ఒక్కటిగా ఉన్నాం అవునా? ఇందుకు మనం సుముఖంగా ఉన్నా, సుముఖంగా లేకపోయినా మనం శ్వాస తీసుకునే విధానంలో మనమందరం ఒక్కటిగానే ఉన్నాం. మీరు కనక పూర్తిగా వ్యక్తిగతమైపోవాలి అనుకుంటే మీరు చనిపోతారు. కానీ చనిపోయిన వారు కూడా అన్నిటితో ఒక్కటిగానే ఉన్నారు చూడండి అవునా? చనిపోయిన వారు ఎంతో తేలిగ్గా ఈ భూమితో ఒక్కటైపోతారు. మీరు కూడా ఒక్కటైపోగలరు. కానీ సజీవంగా ఉన్నవారు  స్పృహతో, అన్నిటితో ఒక్కటిగా ఉండాలి. చనిపోయిన వారు చనిపోయారు కాబట్టి వారికా ఎరుక లేదు. కానీ వారు అన్నిటితో ఒక్కటిగానే ఉన్నారు.

మీరు సత్యాన్ని స్పృశిస్తున్నారా? లేదా? అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష ఏవిటంటే - ఇప్పుడు మిమల్ని ఏదైనా బాధపెడుతోంది అనుకోండి మీరు అసత్యంలో ఉన్నట్టు. మీరు కనక సత్యాన్ని స్పృశిస్తూ ఉంటే మీకు బాధ అన్నది ఉండదు. మీ బాధ ఎంత లోతుగా ఉంటే మీరు సత్యం నుంచి అంత  దూరంగా ఉన్నట్టు. దీన్ని మనం ఎన్నో విధాలుగా చూడవచ్చు. ఇది ఒక బోధన కాదు. ఇది కేవలం ఒక విధానం. ఒక పద్ధతి. "మీ స్పందన, శక్తి అనంతమైనది" అన్నది ఒక బోధన కాదు, ఒక విధానం. మీరు దాన్ని కనక ఎరుకతో చూడగలిగితే మీరు మెల్లిగా అన్నిటిని మీలో ఒక్కటిగా ఇముడ్చుకుంటారు. జీవితం ఇలానే ఉంది, జీవితంలో ప్రతీ అంశం కూడా అన్నిటిని ఒక్కటిగా ఇముడ్చుకునే ఉంది. అదే  విధంగా మీరు కూడా తయారౌతారు. ఇప్పుడు ఏది ఉందో దాని పట్ల మీరు పూర్తి అంగీకారంతో ఉన్నారనుకోండి అప్పుడు కూడా మీరు అన్నిటిని మీలో ఇముడ్చుకుని ఉన్నట్టే. ఈ రెండూ విభిన్నమైన విషయాలు కాదు. రెండు రకాల పద జాలాలు అంతే. మీరు విడిగా ఉండడం నుంచి అన్నిటితో ఒక్కటిగా అవడమే ఇది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు