సద్గురు: శూన్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి..? శూన్యం అన్న పదాన్ని మనం “ఖాళీగా ఉండడం” అని అనువాదం చెయ్యవచ్చు. కానీ ఇది శూన్యం అన్న పదానికి పూర్తి న్యాయం చేకూర్చదు. ఖాళీ అనేది ఒక ప్రతికూలమైన పదం.  అది, ఏదైతే ఉండాలో, అది లేకపోవటాన్ని సూచిస్తుంది. కానీ శూన్యం అన్నది అనుపస్థితి కాదు. ఇది అనంతమైన స్థితి. సున్నా అన్నది భారతదేశంలోనే కనుగొన్నాం. మనం సున్నాని కనుగొన్నప్పుడు దాన్ని “ఏమీ లేకపోవడం”గా చూడలేదు. దానిని పరమోన్నతమైన సంఖ్యగా చూశాం. సున్నా అంటే ఏదీ లేదని. కానీ అది ఏ సంఖ్యకైనా ఎంతో విలువను ఇవ్వగలదు. శూన్యం కూడా అలాంటిదే..! దీనిగురించి కొంత అవగాహన కలిగించాలంటే..., ఈ సృష్టిలో 99% ఉన్నది శూన్యమే అని ఈరోజున మన శాస్త్రవేత్తలు  చెప్తున్నారు.

ఒక అణువులో 99% ఉన్నది ఖాళీ స్థలమే. ఈ సృష్టిలో 99% అంతా ఖాళీస్థలమే. మనం శూన్యం అనేది - దీనినే. మీరు ఒక జీవంగా ఇక్కడ ఉన్నప్పుడు, మీకు ఒక ఎంపిక ఉంది. మీరు, ఈ అనంతమైన శూన్యంలో ఒక చిన్న జీవంగానైనా ఉండవచ్చు లేదా మీరు, ఈ సృష్టికి మూలమైన అనంతమైన శూన్యంగానైనా ఉండవచ్చు. మనం, శూన్య ధ్యానం ద్వారా చేరుకోవాలనుకుంటున్నది ఈ అనంతమైన శూన్యాన్నే..!

ఈ అనంతమైన సృష్టిలో మీరు అతి చిన్నవారు. కానీ, మిమ్మల్ని మీరు ఎంతో పెద్దవారగా ఉహించుకుంటున్నారు.
వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చూస్తే ఈ సృష్టిలో మీదే ఎంతో ముఖ్యమైన జీవం. మీ కుటుంబ వ్యవస్థలో మీరు ముఖ్యమైన వారిలో ఒకరు. మీ నగరంలో మీకు ఏదో కొద్దిగా ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు. కానీ, అక్కడ మీరు లేకపోయినప్పటికీ ఫర్వాలేదు. ఈ దేశంలో మీకు ఎంతో తక్కువ ప్రాముఖ్యత ఉంది. మీరు పోయినాగానీ ఎవరూ పట్టించుకోరు. ఎవరూ దానిని గమనించరు కూడా..! ఈ ప్రపంచంలో మీరు అంతకంటే ఎంతో చిన్న స్థాయి జీవం. ఇక ఈ బ్రహ్మాడం అంతటితో పోల్చుకుంటే మీరు అసలు ఇక్కడ లేనట్లే..! దీనిపట్ల మీకు ఎరుక లేకపోయినప్పటికీ, ప్రతీవారికీ ఈ విషయం ఎక్కడో తెలుసు. అందుకే ఈ హంగులూ, ఆర్భాటాలూ, ఇవన్నీ ఇలా పోగుజేసుకోవడాలూ అన్నీ కూడానూ..!

ఎందుకంటే మీలో ఎక్కడో మీ జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలన్న ఆకాంక్ష ఉంది. అది ధనం అవ్వనివ్వండి, డబ్బు అవ్వనివ్వండి, మీ అహంకారం అవ్వనివ్వండి, విద్య అవ్వనివ్వండి, కుటుంబం అవ్వనివ్వండి -  ఇవన్నీ కూడా మీరు మీ జీవానికి ఒక అర్థం కల్పించుకోవడానికే..! కానీ మీ శరీరంలో ఉన్న ప్రతి అణువులో ఉన్నది కూడా 99% ఖాళీ స్థలమే..! అంటే, ఈ సృష్టిలో కూడా 99% ఉన్నది ఖాళీనే. అంటే, ఏదైతే లేదో.. అది ఈ సృష్టికి మూలం. అది నిత్యం మీలోని ప్రతీ అణువులో ఒక గుండె చప్పుడులా కొట్టుకుంటూనే ఉంది. ఇది మీకు సజీవమైన అనుభూతి అయినప్పుడు, మీరు ఇక్కడ ఎంతో భిన్నంగా జీవిస్తారు. ఆ అనుభూతికై వెతుకులాడుతూ, ఎంతోమంది రాజులు భిక్షువులుగా కూడా మారారు. గౌతమ బుద్ధుడు భిక్షాటన చేశాడు. శివుడు స్వయంగా భిక్షాటన చేస్తాడు.

 దేనికైతే హంగులూ, ఆర్భాటాలూ మరేమైనా జోడించడాలూ అవసరం లేదో.. అలాంటిదాన్ని వారు కనుగొన్నారన్న విషయాన్ని సూచిస్తుంది. అదే ఈ బ్రహ్మాండాన్ని అంతా ఆక్రమించి ఉన్నది కూడా అదే. ఇక్కడ నేను కూర్చొని ఉన్నప్పుడు అది దానంతట అది పరిపూర్ణమైనదే.  జీవితంలోని ఈ పార్శ్వానికి ఎంతో సాధన అవసరం. కానీ ఈరోజుల్లో ప్రజలు, దానికి అతి కొద్ది సమయాన్ని మాత్రమే కేటాయించడానికి సుముఖంగా ఉన్నారు. 21వ శతాబ్దంలో గురువు అవ్వడంలోని చిక్కులివి. ఎలాగైతే, ఏదైతే లేదో అది ప్రతీ అణువులో మీ శరీరంలోని ప్రతీ కణంలో అమర్చబడిందో; మేము శూన్యాన్ని కూడా అదేవిధంగా ధ్యానంలో ఇమిడ్చాం. ఇది ఒక మాత్ర లాంటిది. "శూన్య మాత్ర". నేను దీనిని వ్యంగ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే, ఈ ప్రపంచంలో ప్రజలు వారి జీవితాన్ని ఇలా వ్యంగ్యంగానే జీవిస్తున్నారు. ఈ అనంతమైన సృష్టిలో మీరు అతి చిన్నవారు. కానీ, మిమ్మల్ని మీరు ఎంతో పెద్దవారగా ఉహించుకుంటున్నారు. నేను ఎంతోమందిని చూశాను.. వారికి వారి ఇల్లు, వారి కుటుంబం, వారి గోల, వారి నగలూ, వారి ఆస్తిపాస్తులూ ఇవన్నీ ఎంతో ముఖ్యం. వాటికోసం చివరి రోజువరకూ పోరాడుతూనే ఉన్నారు. ఉన్నట్లుండి వారు చనిపోయారు. వారు జీవించి ఉన్నప్పుడే, నేను ఇది వారికి తెలియజెప్పాలని ప్రయత్నించాను. కానీ, వారిని అది ఆకర్షించలేదు. దురదృష్టం ఏమిటంటే, కేవలం మరణం ద్వారా మాత్రమే ప్రజలు వారి స్పృహలోకి వస్తున్నారు.

“ఏదైతే లేదో” అదే అంతటా ఉన్నది

ఉదాహరణకు, మీకు ఒక పరీక్షలో 99% వచ్చిందనుకోండి, మీరు ఆ 99%తో ఎంతో ఆనందపడి, ఆ మిగతా ఒక శాతాన్ని వదిలిపెట్టేయడానికి చింతించరు. ప్రస్తుతం 99% శూన్యమే. ఒక శాతం మాత్రమే సృష్టి. ఈ శూన్య ధ్యానంలో మీరు ఈ ఒక శాతాన్ని కాసేపు పక్కకి పెట్టి, మిగతా 99%న్ని ఆస్వాదించండి. మీరు ఈ 99%న్ని ఇప్పటివరకూ విస్మరిస్తూనే ఉన్నారు. ఇది ఎంతో హాస్యాస్పదం కదా..!? మీరు పరిపూర్ణత కోసం పరుగు పెడుతూ ఎన్ని చికాకుల్ని ఎదుర్కొన్నారు..? ఎవరి జేబైన మీ జేబు కంటే నిండుగా ఉంటే మీకు చికాకు. ఎవరిదైనా ధాన్యాగారం మీ ధాన్యాగారం కంటే నిండుగా ఉంటే.. మీరు ఓర్చుకోలేరు. ఎవరి మనసైనా మీ మనస్సు కంటే నిండుగా ఉంటే మీకు చిరాకు పుడుతుంది. అందుకే మీరు ఎలా అయినాసరే గెలవగలిగే, ఒక కొత్త ఆటను మేము నేర్పిస్తున్నాము.

మీరు, ఏమీ చెయ్యకుండా ఉండాలని ఎంతగా ప్రయత్నిస్తే అంతగా పిచ్చివారైపోతారు.
ఎందుకంటే ఏమీ లేనితనం అన్నది నిండుదనం కంటే ఎంతో తేలికైనది. శూన్య అంటే ఖాళీగా ఉండడం. దీన్ని మనం సరిగ్గా చెప్పాలంటే “ ఏదీ లేదు” అని చెప్పవచ్చు. ఇది, ఏదీ లేకపోవడం. అంటే మీ భౌతిక స్వభావానికి మించిన మరో పార్శ్వం ఇది. శూన్య అంటే ఏమీ చెయ్యకుండా ఉండడం. నేను మీకు ఊరికే ఏమీ చెయ్యకండి.. ఏమీ చెయ్యకండి అని చెప్తే, మీకు పిచ్చి పడుతుంది. మీరు, ఏమీ చెయ్యకుండా ఉండాలని ఎంతగా ప్రయత్నిస్తే అంతగా పిచ్చివారైపోతారు. మీరు, ఏమీ చెయ్యకుండా ఉండగలగాలంటే మీకు కొంత సహకారం అవసరం. మీరు “ ఏదైతే లేదో”, అందులో ఈదాలనుకున్నప్పుడు, ఆసరాగా పట్టుకోవడానికి ఒక తాడుని అందించేవాళ్ళు ఉండాలి. ఇది ఏ రకమైన తాడు..? ఏమీ లేకపోవడం అంటే అది మౌనం కూడానూ..! ఏదైనా ఉండడం అన్నది శబ్దం.

మీకు ఆసరాగా ఉండడానికి మేము అందించే ఆ తాడు, ఒక ప్రత్యేకమైన మంత్రం లేదా శబ్దం. “ఏమీ లేనితనం” అన్నది మిమ్మల్ని ఎంతో పారవశ్యంలో ముంచేస్తున్నప్పుడు, మీరు ఈ శబ్దాన్ని గట్టిగా పట్టుకుని ఉండవచ్చు. ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన ఒక మంత్రం “ఆం(AUM)”. దానిని, మీరు బిగ్గరగా, స్పష్టంగా పలికినప్పుడు అది మీకు కొంత శక్తిని అందిస్తుంది. ఇంకా ఎన్నో వివిధ రకాల మంత్రాలు ఉన్నాయి. వాటిని మనం బీజ మంత్రాలు అని అంటాం. బీజమంత్రానికి ఎటువంటి అర్థం ఉండదు. అది ఉత్తి శబ్దం మాత్రమే. మంత్రం అంటే, ఒక స్వచ్చమైన శబ్దం. బీజం అంటే ఒక విత్తనం. ఒక విత్తనాన్ని, మనం ఒక విధానంలో ఉంచాలి. ఒకసారి మీరు దానిని మట్టిలో నాటిన తరువాత, దానికి సరియైన తేమను అందిస్తేనే అది చిగురిస్తుంది. ఒక బీజం -  అది ఏమి చెయ్యాలో అది చేస్తుంది. మట్టి -  అది ఏమి చెయ్యాలో అది చేస్తుంది. మీరు చెయ్యవలసినదల్లా,  దానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే..! శూన్య ధ్యానం కూడా అంతే. మీరు దానికి సరైన వాతావరణం అందించగలిగితే, అది చిగురించి, పెద్దదయ్యి ఒక అద్భుతమైన వృక్షంగా మారి ఫలాలని అందిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు