మనందరం కూడా ఈ విశ్వంలో జీవించాల్సిందే. అందులో మనం ఎంచుకునేది ఏమీ లేదు... కానీ ఓ కళాశాలో, ఓ విశ్వవిద్యాలయమో ఎంపిక చేసుకోవచ్చు. అందుకే మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు – ఎంత సమయం అని. విద్య కొన్ని పనులు  చేయడానికి ఎంతో అవసరమైనది. కానీ మనం ఒక వ్యక్తిగా,   ఒక తరానికి చెందిన వారిగా - మన జీవితాలతో ఏం చేయాలి?  చాలామందికి  వాళ్ళు ఏం చేయాలో తెలీదు.  ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడలేదు. కాబట్టి, వాళ్ళు ఏవో చేయడం మొదలు పెడతారు.

మీరు యువకులు, మీరు కళ్ళు తెరిచి మీ చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏది అత్యవసరమో చూడండి? మీకు ఏదో సరదాగా ఉన్న పని చేయడం కాదు కదా! ఇప్పుడు ఏది అవసరమో  ఆ పని చేయాలి. మీరు పరిస్థితుల  వల్ల ప్రభావితమై ఎదో చేయడం మొదలు పెడితే, అది ఉపయోగ పడవచ్చు.  కానీ, అది మౌళికమైనది కాదు కదా. ఇవాళ  మీరు ఒక ట్రైన్ తగలపడి పోవడం చూసారనుకోండి మీరు ఫైర్ ఫైటర్ అవ్వాలనుకుంటారు. రేపు మరేదో చూస్తారు, అప్పుడు ఇంకేదో అవ్వాలని అనుకుంటారు. మీరు భావావేశం లో ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే అది  ఉపయోగపడచ్చు, కానీ అది మౌళికమైనది కాదు. ఈ రోజుల్లో చాలా మంది యువతకి  అసలు ఏమి చెయ్యాలి అన్న ఆలోచనే లేదు.

కనీసం మీరు "నేను నా జీవితంతో ఏం చెయ్యాలి?” అని  ఆలోచించ గలుగుతున్నారు. మీరు దీనికి ఇంకొంచెం సమయం కేటాయించండి. మీరు దేని వల్ల ప్రభావితం కాకుండా,  మీరు అలా ఆలోచించి చూడండి. ఇప్పుడు  మానవాళికి అత్యవసరమైనది ఏది? "ఈ ప్రపంచానికి అవసరమైనది ఏది? మీరు దాన్ని గుర్తించండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం సరిచేయవల్సింది ఒక్కటే. అది మానషులే. ప్రపంచంలో మిగిలిందంతా బానే జరుగుతోంది కదూ!

ఎవరైనా కళ్ళు తెరిచి, ఏమి  పక్షపాతాలు లేకుండా ఆలోచించినట్టైతే కేవలం ఒకే ఒక జాతిని  సరి చేయవలసి ఉంది –   అది మానవజాతి .  మనం మనుషులని ఎంతో సరి  చేయవలసి ఉంది. లేకపోతే  మనుషులు  ఈ ప్రపంచాన్ని ఏమి మిగల్చరు. ఈ గ్రహాన్నే కాదు, మొత్తం సౌరమండలం వైపు చూస్తున్నారు. ఈ గ్రహాన్ని మాత్రమే అంతం చేసేస్తే సరిపోదనుకుంటున్నారు.

అందుకని నేనేం చెప్తున్నానంటే, యువత అంతా కూడా, మీరు మాత్రమే కాదు మీరేం చేస్తున్నారో దాన్నుంచి  కాసేపు విరామం తీసుకోండి. ముందు మీరు స్కూల్ కి వెళ్లారు అందుకని కాలేజ్ కి వెళ్లారు, కాలేజీకి వెళ్లారు కాబట్టి, ఆ తరువాత ఏదో చేశారు, మీరు ఇలా ఆ తరువాత, ఆ తరువాతది చేసి పి.హెచ్ .డి సంపాదించారు. కానీ దానితో ఏం చేయాలి? ఇప్పుడు విద్యా శాస్త్రవేత్తలు  ఏం చెప్తున్నారంటే మీరు ఇరవై ఏళ్ల పాటు ఈ విధమైన విద్యా విధానంలో ఉన్నారనుకోండి, మీరు పి. హెచ్.డి అవుతరమో కానీ మీ మేధస్సులో డెబ్బయి శాతం తిరిగి బాగుచేయలేనంతగా పాడైపోతుందని చెప్తున్నారు. మీరు ఓ తెలివిగల మూర్ఖుల్లా తయారవుతారు. ఈ రోజున విషయ జ్ఞానానికి దానికే పెద్ద ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే ఒక పి.హెచ్.డి కి తెల్సిన విషయాలు,  ఒక చిన్న హై స్కూల్ పిల్లవాడు  కూడా ఇంటర్నెట్ లో తెరిచి అ విషయాల గురించి మాట్లాడేయగలడు. అందుకని దీని వల్ల మీరు పెద్ద తెలివిగల వారిగా కూడా కనిపించరు. ఎందుకంటే  ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి. మీరు ఒక విశ్వవిద్యాలయానికి సంసిద్ధులు కావాలనుకుంటున్నారా? లేక ఈ విశ్వానికా..?

ఈ విశ్వంలోనే కదా మీరు జీవించాలి? మీరు విద్యావేత్త అవడంలో తప్పు లేదు. కానీ కొంచెం ఆలోచన ఉన్న  వ్యక్తులు, వారి జీవితాన్ని అన్నిటికంటే ఏది ఎక్కువ అవసరమో దానికి వినియోగించాలి కదా... అవునా? ఏదో సరదాగా అనిపించిందినో మరొకటనో కాదు కదా! మీరు ఏదయినా చెయ్యచ్చు- ఆనందంగానైనా, విచారంగానైనా. కదూ!

మీ జీవితం లో మీరు ఏం చేసినా సరే , ఓ వంద  సంవత్సరాల తరువాత తిరిగి చూసుకున్నా, అప్పుడు కూడా అది ఉపయోగకరాంగానే  మీకు అనిపించాలి

ఇవాళ మీకు “ఇది చేస్తే నేను ఆనందంగా ఉంటాను” అనిపించవచ్చు. మీరు కొద్దికాలం అయిన తరువాత కూడా అది చేస్తుంటే ఆనందంగానే ఉంటారా? ఉంటారని మీరు అనుకోకండి. ప్రతివాళ్ళు, వాళ్లకి కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు ఆహా! ఎంత అందమైన రోజు. మీరు ఆ కొత్త  ఆఫీసుకి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు. అబ్బా! ఎంత బాగా అనిపించింది. మీకు ఎంత ఆనందంగా అనిపించింది. కానీ కొన్ని ఏళ్ల తరువాత అదే టేబుల్ వెనకాల కూర్చోవాలంటే, మీకు ప్రాణం పోతున్నట్టు గా అనిపిస్తుంది. అదే ఉద్యోగం, అదే పెళ్లి , అవే పరిస్థితులు - ఇవి ప్రాణం తీసేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకరోజున ఇవన్నీ స్వర్గంలా అనిపించాయి. కానీ కొద్దికాలం తరువాత ఇదే  నరకంలా అనిపిస్తోంది కదూ. ఇది ఉద్యోగం లో ఏదో లోపం ఉందని కాదు... మీరు సరైన కారణాలకి ఉద్యోగం చేయడం లేదు కాబట్టి, అంతే...!

ఇప్పుడు మీకు ఆలోచించే సామర్ధ్యం ఉంది కాబట్టి, మీరు కొన్ని వారాలు సెలవు పెట్టి ఇక్కడకి రండి. మేం మీకు ఉండడానికి చోటు ఇస్తాము. మీరు ఇది ఆలోచించి చూడండి, ఇప్పడు మీకు ఎన్నో పనులు చేయాలనిపించ వచ్చు. ఇది మీ నిర్బంధనలను బట్టి ఉంటుంది. మీకు ఉద్యోగం లేదనుకోండి, మొట్టమొదటిగా నేను ఉద్యోగం వెతుక్కోవాలి, అనుకుంటారు. లేకపోతే మరేదో నిర్బంధాలు. వీటి వల్ల “ముందర ఇది  చేయాలి” అని అనుకుంటారు . మీలో ఇటువంటి నిర్బంధాలు ఏమీ లేవనుకోండి, అప్పుడు మీరు  ఈ జీవితంతో    ఏం చేయాలనుకుంటున్నారు..?  మీరు అదే చేయాలి. మీరు మీ జీవితాన్ని, మీ జీవితం ఎలా నడవాలి అన్నదాన్ని ఇప్పుడు మీకు ఉన్న నిర్బంధాల బట్టి  ఆలోచించకూడదు.

మీ జీవితం లో మీరు ఏం చేసినా సరే, ఓ వంద  సంవత్సరాల తరువాత తిరిగి చూసుకున్నా , అప్పుడు కూడా అది ఉపయోగకరాంగానే  మీకు అనిపించాలి. అలంటి పనే మీరు చేయాలి. ఎంతోమందికి మీలాగా ఉండాలి అనిపించేలాగా ఉండాలి. “నాకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఏం చేయాలో అప్పుడు ఆలోచించగలిగి ఉంటె బావుండేది, నాకి ఆలోచన రాక ఏదో చేసాను”  అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఇరవై ఏళ్ళు .  మీరు ఆలోచించ గలుగుతున్నారు కూడా. అలాంటి  అదృష్టవంతులు, ఇంకో అదృష్టం ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు. అందుకని మీరు ఏం చేసే  ముందరైన సరిగ్గా ఆలోచించండి.

 

ప్రేమాశిస్సులతో,
సద్గురు