ఈ 2016 వ సంవత్సరం దక్షిణాయనం మొదలయ్యే రోజు (అత్యధిక దినప్రమాణము కలిగిన రోజు) జూన్ 21 వతేదీ పౌర్ణమినాడు వచ్చింది. దాని తరువాతి పౌర్ణమి నాడు,  సుమారు 15 వేల ఏళ్ళకు పూర్వం "ఆదియోగి" మొట్టమొదటి యోగా కార్యక్రమం చేపట్టాడు. ఆదియోగి అంటే మొట్టమొదటి యోగి అని అర్థం. ఆయన తన మొదటి ఏడుగురు శిష్యుల్ని పట్టించుకోకుండా ఉండడానికి చెయ్యగలిగినదంతా చేశాడు. ఈ రోజున  ఆ ఏడుగురు శిష్యుల్నీ మన భారతదేశంలో "సప్త ఋషులు"గా కీర్తిస్తున్నాము. ఈ ఏడుగురు ఆధ్యాత్మిక చింతనకి మూలపురుషులుగా సంభావించబడుతున్నారు.  వాళ్ళు ఆయన దృష్టిని ఆకర్షించడానికి చెయ్యగలిగినదంతా  చేశారు. ఆయన వాళ్ళని పట్టించుకోకుండా ఉండడానికి చెయ్యగలిగినదంతా చేశాడు. ఆయన తను అనుభవిస్తున్న యోగాలోని తన్మయత్వాన్ని అనుభూతించడానికి పూర్తి ప్రయత్నం చేశాడు. ఆయన ఏదీ బోధించదలుచుకోలేదు. ఆయన ఎవరినీ పట్టించుకోదలుచుకోలేదు, అయినా ఈ ఏడుగురూ అలా ఏళ్ళతరబడి నిరీక్షించారు.  అలా 84 సంవత్సరాలు నిరీక్షించారని సంప్రదాయిక కథలు చెబుతున్నాయి. మనకి ఖచ్చితంగా తెలీదు, కానీ, వాళ్ళు చాలా కాలమే నిరీక్షించారు.

వాళ్ళు ఆయన దృష్టిని ఆకర్షించడానికి చెయ్యగలిగినదంతా  చేశారు. ఆయన వాళ్ళని పట్టించుకోకుండా ఉండడానికి చెయ్యగలిగినదంతా చేశాడు.

ఆ రోజు, అంటే జూన్ 21 వతేదీన ఆదియోగి తనలో తాను కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ అత్యధిక దినప్రమాణము గల రోజు (Summer Solstice)నా, అత్యల్ప దినప్రమాణము కలిగిన రోజు (Winter Solstice)నా, రాత్రీ పగలూ సరిసమానంగా ఉండే (విషువత్తు, Equinox) రోజుల్లోనూ, సూర్యుడూ,  భూమీ కొన్ని మార్పులకి లోనవుతాయి. ఈ మార్పులు జరిగినపుడు ప్రతి యోగీ/యోగినీ తనలోకూడా కొన్ని మార్పులు చేసుకుంటాడు/ చేసుకుంటుంది. అలా మార్పులు చేసుకుంటున్నప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఈ ఏడుగురూ అక్కడ కుర్చుని ఉండడం చూసాడు.  వాళ్ళు చాలా శ్రద్ధగా వినడానికి ఉత్సుకులై ఉన్నారు; ఆయన తెలుసుకున్నది తమకు బోధిస్తాడని నిరీక్షిస్తున్నారు.  ఆయన వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళనుండి దృష్టి మరల్చలేకపోయాడు. వాళ్ళు ఎంతశ్రద్ధగా వినడానికి సిద్ధంగా ఉన్నారంటే, వాళ్ళని ఆయన ఎంతమాత్రం ఉపేక్షించలేకపోయాడు.  వాళ్ళపై దృష్టి నిలిపి తర్వాతి 28 రోజులూ వాళ్ళనే గమనించసాగాడు.

ఆ 28 రోజుల సమయంలోనే సరిగ్గా మనం ఈ క్షణంలో ఉన్నాము. నేను మిమ్మల్ని చూస్తున్నాను. రాబోయే పౌర్ణమి, అంటే గురుపూర్ణిమ, ఆదిగురు జన్మదినం 19వ తేదీ జులైన వచ్చింది. ఆ రోజు ఆయన వాళ్ళకి తను తెలుసుకున్నది బోధించకుండా ఉండలేకపోయాడు. శరీరానికున్న పరిమితులు, శక్తి వ్యవస్థలు, మీరు పనిచెయ్యగలిగిన 112 చక్రాలూ, ఈ వ్యవస్థని మార్చగలిగిన 5 ప్రాణాలు, మనసుకున్న 16 పరిధులూ ఆయన శోధించాడు. ఇదంతా వాళ్ళకి బోధించడానికి చాలా సమయం పట్టింది.  ఈ 112  మార్గాలనూ అవగాహనచేసుకోగల మేధోవిస్తృతి ఆ ఏడుగురు ఋషులలోనూ లేదని తెలుసుకున్నవాడై, ఆయన వాటి ఒక్కొక్కటీ 16 విభాగాలను 7 భాగాలుగా విభజించి ఒక్కొక్కరికీ ఒక్కొక్క భాగాన్ని ఇచ్చాడు.

మరొక సారి ఈ ఆయనాతం (Summer Solstice),  పౌర్ణమి ఒకే రోజు వచ్చాయి. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన.

ఈ జ్ఞానప్రసరణ అంతా, ఆ తర్వాత వచ్చిన పౌర్ణమినాటి నుంచి ప్రారంభమయింది. మనం ఇప్పుడు ఆ ఏడుగురు శిష్యులమీద దృష్టిపెట్టవలసిన సమయం వచ్చింది. ఈ ఏడాది ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. కారణం మరొక సారి ఈ ఆయనాతం (Summer Solstice),  పౌర్ణమి ఒకే రోజు వచ్చాయి. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. ప్రాచీన గాధలు ఆదియోగి 28 రోజులు శిష్యుల్ని పరికించినట్టు చెబుతాయి, అంటే అప్పుడు కూడా ఆయనాతం (Summer Solstice) పౌర్ణమినాడే పడిందన్నమాట. ఈ రోజు మనం ఇలా కలిసినందుకు చాలా అదృష్టవంతులం.  మీ విద్యా విధానాలూ, సాంస్కృతిక నేపధ్యాలూ ఏవీ కూడా ఎలా అంతర్ముఖులవ్వాలో చెప్పవు.  అవి ఎంతసేపూ బయటనున్నవి ఎలా సరిదిద్దాలో చెబుతాయి. ఈ ప్రపంచాన్ని ఎలా చక్కదిద్దాలి అని చెబుతాయి. మనం ఇప్పటికే ఈ ప్రపంచాన్ని చాలా చక్క దిద్దాము. ఇక ఏమాత్రం చక్కదిద్దడానికి ప్రయత్నించినా,  ప్రపంచం మిగలదు. ఈ ప్రపంచాన్ని సరిదిద్దడమనే ప్రయత్నం, ఈ మానవాళి శ్రేయస్సుకోరుతూనే చేశాము. సరిదిద్దడం జరుగుతోంది కాని, శ్రేయస్సు సమకూరడం లేదు. కారణం, శ్రేయస్సు సమకూరడానికి మనం అంతర్ముఖులం కావాలి.

అంతర్ముఖత్వం అంటే...? ఇప్పుడు మీరు మీ అయిదు జ్ఞానేంద్రియాలద్వారానే ప్రతీదీ అవగాహన చేసుకుంటున్నారు.  ఇప్పటివరకు, మీ జీవితానుభవం యావత్తూ కళ్ళతో చూడడం, చెవులతో వినడం, నాలుకతో రుచిచూడడం, ముక్కుతో వాసన చూడడం, చర్మంతో స్పృశించడం  ద్వారా జరుగుతోంది. వాటి ప్రకృతి సిద్ధమైన ఏర్పాటు వల్ల ఈ అయిదు జ్ఞానేంద్రియాలు బాహ్యముఖమైనవి. మీరు మీకు బయట ఏమున్నదో చూడగలరు. కానీ, మీ గుడ్లు లోపలికి తిప్పి మిమ్మల్ని మీరు పరీక్షించుకోలేరు. ఒక చీమ మీ చేతిమీద నడిస్తే అనుభూతిచెందగలరు.  మీ శరీరంలో ఎంతో రక్తం ప్రవహిస్తోంది - కానీ దాన్ని మీరు అనుభూతి చెందలేరు.  మీరు మీ తల్లి గర్భంలోంచి బయటపడగానే ఈ అయిదు జ్ఞానేంద్రియాలూ తెరుచుకున్నాయి. అది మీరు బ్రతకడానికి అత్యంత ఆవశ్యకం. కేవలం జీవించడానికంటే మిన్నగా ఒక మానవుడిగా మీరు ఏది సాధించాలనుకున్నా, మీరు అంతర్ముఖులవడానికి ప్రయత్నించాలి. అదెంత దూరం? హిమాలయాపర్వతాలకి వెళ్ళి అక్కడ గుహల్లో తప్పస్సు చెయ్యాలా? ఒక విషయం గుర్తుపెట్టుకొండి. హిమాలయాలలోని అన్ని గుహలూ నిండిపోయాయి. అక్కడ ఖాళీ లేదు. అది మీరు బెర్లిన్ లో చెయ్యడానికి ప్రయత్నించడమే మెరుగు.

మీ అనుభూతుల పీఠం ఎలా పనిచేస్తుందో మీకు అవగాహన అయితే, దాన్ని మీరు స్వాధీన పరుచుకోగలిగితే, మీకు కోరుకున్న అనుభూతిని మీరు సృష్టించుకోగలుగుతారు.

మీరు తూర్పు పశ్చిమ జర్మను దేశాలను విడదీసిన కాంక్రీటు గోడలు బద్దలుకొట్టగలిగినందుకు గర్వపడుతున్నారని నేను విన్నాను. మీరు అలా చెయ్యగలిగినందుకు నా హర్షాన్ని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు లోపలా-బయటా ఉన్న గోడలు బద్దలుకొట్టవలసిన సమయం ఆసన్నమైంది. చాలా కాలం వరకూ, మీరు "బెర్లిన్" అనగానే అందరికీ  గోడే గుర్తుకు వచ్చేది. ఇప్పుడు బెర్లిన్ అంటే గోడను కూల్చిన వ్యక్తులు గుర్తొస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. మరి, మనిషి లోపలా బయటా ఉండే గోడల మాట ఏమిటి?  మీరు అంతర్ముఖులవడానికి కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ ప్రయత్నం సమాజాల్లో లోపిస్తోంది. మీ అనుభూతుల పీఠం ఎలా పనిచేస్తుందో మీకు అవగాహన అయితే, దాన్ని మీరు స్వాధీన పరుచుకోగలిగితే, మీకు కోరుకున్న అనుభూతిని మీరు సృష్టించుకోగలుగుతారు.

మీరు "మాకు దుఃఖం వద్దు, సర్వోత్కృష్టమైన ఆనందం, కావాలి"అని అడుగుతున్నారు. ప్రతి మనిషి విషయంలోనూ ఇది సహజం. ఈ ప్రపంచంచానికి సంబంధించినంతవరకు, మనం ఈ విషయం మీద ఎన్నడూ దృష్టిపెట్టలేదు. మనం ఆనందంగా ఉండగలిగిన, వివేకంతో ఆలోచించగలిగిన మనుషుల్ని సృష్టించగలిగితే, మనం ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలం. అంతర్ముఖత్వం దూరాననున్న వస్తువేమీకాదు. అది కష్టం అంతకన్నా కాదు. కాకపోతే, అది మనం ఇంతవరకు అలవాటుగా తిరిగే దిశకి భిన్నమైన దిశలో తిరగడమే. మీరు బయటనున్నది ఎలా సరిదిద్దాలో నేర్చుకున్నారు. ఈ సృష్టిలో సర్వస్వాన్నీ చక్కదిద్దొచ్చు. కానీ, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోనంతవరకూ, ఈ జీవితంలోని అసలు సౌందర్యం మీకు అవగాహన కాదు.

నేను మరొకసారి చెబుతున్నాను. "అదొక్కటే మార్గం". ఈ గురుపూర్ణిమనాడు మిమ్మల్ని ఒక దివ్యమైన పాత్రగా మలుచుకొండి. మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలంటే, మీ ఇంద్రియాలూ, మనసూ, మీ ఆవేశాలూ మీకు అడ్డంకులు కాకూడదు. నేను మీలో ఉన్నాను. దాన్ని మనం సాధ్యం చేద్దాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురు