Video transcript

మేమిక్కడ అన్నపూర్ణా పర్వత దక్షిణ సానువుల్లో ఉన్నాము...

మాలో కొంత మందిమి ’ఖగ్భుసంది‘ సరస్సుకు ట్రెక్కింగ్ చేశాము, అద్భుతమైన ప్రదేశం, మేమిక్కడ రెండురోజులు బస చేద్దామనుకుంటున్నాము.

నాశరీరంలో  ప్రతి కండరమూ అరచి గీ పెడుతున్నాయి, నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చావని శరీరం అంటోంది, కాని నా హృదయం మాత్రం పూర్తిగా భిన్నమైన రీతిలో ఆస్వా దిస్తోంది, ఆనందంతో పరవళ్లు తొక్కుతోంది, కాని శరీరం నొప్పితో రోదిస్తోంది.

మీరీ పర్వతాలవంక వెయ్యి సార్లు చూసినా మీకు తనివి తీరదు. ఎవరో ‘మీరీ పర్వతాలకు మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారు సద్గురూ?’ అనడిగారు. నేనది హిమాలయాలపైనున్న వ్యామోహం అన్నాను.

నేను దీనిని తగ్గిద్దామని ప్రయత్నించినా ఈ గ్రూపులో కూడా ఉన్న ముప్పై ఐదుమందిలో రెండవసారి, మూడవసారి వచ్చిన వారు ఐదారుగురు ఉన్నారు. ఎందువల్లనంటే ఒకసారి ఈ పర్వతాలు మిమ్మల్ని పట్టుకుంటే, అవి మిమ్మల్ని ఎలాగో బంధించి వేస్తాయి.

మంచుటోపీలతో ఉన్న ఈ పర్వత శిఖరాలు నీటిని జాలువారుస్తుంటే, నేను కాస్త కవిత్వాన్ని జాలువారుస్తున్నాను. వాటంత అందంగా, తేటగా, తెల్లగా కాకపోయినా, నేను హిమాలయాన్ని కాదు, నేను నేనే. ఇదిగో మీకోసం చదువుతున్నా, నేను కవిత్వం చెప్పి చాలా కాలమైంది.

Sadhguru at Hamde, Nepal | Mountain Lust

 

హమ్దే లో హాయిగా

ఈ హమ్దే లోయే 
నా సొంత ఇల్లు. 
ఈ అద్భుత పర్వతాలలో 
అంతగా తిరగని ఈ ప్రాంతంలో, 
ఈ జీవినీ, ఈ శ్వాసనూ,  
ఆయన లోబరుచుకున్నప్పటి నుంచీ   
నేను తల్లి అక్కువలోని చంటివానిలా
ఉండిపోయాను.
చావు బతుకుల చింతాలేదు, పరానికి పోయే పనీ లేదు..
ఇదే సర్వం..సర్వం ఇక్కడే...

అందమైన అన్నపూర్ణ పర్వతాలను చూస్తూ....నేను ఈ కవిత్వం చెబుతున్నాను… 

Sadhguru at the foothills of the Annapoorna mountain range, Himalayas, Nepal | Mountain Lust

 

అన్నపూర్ణ

మంచుతో కప్పబడిన 
అన్నపూర్ణ పర్వత శిఖరం
ఒక క్షణం కనబడుతూ మళ్ళీ 
మబ్బుల చాటున కనుమరుగౌతూ
నవ వధువులా దోబూచులాడుతోంది ఎన్నటికీ..
మళ్లీ సూర్యకాంతికి తన
ఆచ్చాదన తీసేసి అద్భుత ముఖారవిందాన్ని 
కనబరుస్తోంది... ఒక క్షణమే అయినా..

మరో కవిత్వంతో మీ సమయాన్ని వృథా చెయ్యనివ్వండి..

Sadhguru at Hamde, Nepal | Mountain Lust

 

పర్వతాల జలతారు

మంచు కరిగి, వంకలు తిరుగుతూ అమృత జలధార జారి,

ఆచ్చాదన లేని శిఖరాలను కప్పుతున్నది. 

ఈ సన్నని జలధార పరవళ్ళు తొక్కే నదిగా మారి 

మనచే మన్నలనందుకుంటోంది.

ఒక మనిషికి ఈ పర్వతాలు ఏమేమి చేస్తాయో చెప్పడం అంత సులువుగాదు. అసలు ఈ పర్వతాలకు రాని మనిషిని, మనిషి అని మీరు అనవచ్చో లేదో నాకు తెలియదు.
నేను అందరినీ ముఖ్యంగా ఈ దేశ యువతకు, ఈ ప్రపంచంలోని యువతను అర్థిస్తున్నాను, ఏమనంటే ఈ పర్వతాలతో ఏదోరకమైన ఒక  ప్రేమ సంబంధం ఏర్పరచుకోమని. ఏ పర్వతాలైతే మిమ్మల్ని ఆకర్షిస్తాయో, వాటి పరిమాణం, శక్తి, ఉనికితో మిమ్మల్ని లోబరచుకుంటాయో వాటితో ఏదో ఒకరకమైన ప్రేమ సంబంధం ఏర్పరచుకోమని. 

ఈ హిమాలయాలకు మీ అందరికీ ఆహ్వానం...

Sadhguru walking at the foothills of Annapoorna range in Himalayas, Nepal | Mountain Lust

 

ప్రేమాశీస్సులతో