ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో దాదాపు పది శిఖరాలు నేపాలులోనే ఉన్నాయి. యోగులు, మార్మికులు ఈ భూమిని ఒక తాంత్రిక శరీరంగా నిర్మించారు. వాళ్లు నేపాలులో అనేక శక్తి కేంద్రాలను సృష్టించారు, తద్వారా ఆ దేశ భౌగోళిక స్వరూపమే ఒక సజీవ శరీరంగా పనిచేసేట్లు చేశారు. ఒక విధంగా ఆ దేశమంతా ఒక ప్రాణిలా ప్రవర్తిస్తుంది. ఈ కోణాన్ని స్వీకరించడం కోసం ఈ దేశ మానసికస్థితి ఆధ్యాత్మిక ముక్తికోసం సన్నద్ధమయింది.

మీరు ఎక్కడ చూసినా అతి చిన్న వాసస్థానం కూడా దేవాలయం లాగానే గోచరిస్తుంది.

గత పన్నెండేళ్ల నుండి విడవకుండా ప్రతి సంవత్సరం ఈ దేశాన్ని సందర్శించాను. ఈ దేశం నా హృదయానికి చాలా సన్నిహితమైంది. మూడువారాలకంటే తక్కువ కాలవ్యవధిలో రెండు భూకంపాలు ఈ దేశాన్ని అతలాకుతలం చేయడం చాలా బాధాకరం. జననష్టం గుండెలను పిండి వేస్తున్నది. అంతేకాక ఈ భూకంపాలు సుదీర్ఘ  కాలపు చారిత్రిక స్థలాలను శిథిలం చేయడమేకాక, వాటి నిర్మాణం వెనుక ఉన్న శాస్త్రవిజ్ఞానాన్ని కూడా కొంత కల్లోల పరిచాయి.

అందమైన ప్రాచీననగరం భక్తపూరులో చాలాభాగం శిథిలమైపోయింది. భక్తపూర్ అంటే భక్తులనగరం లేదా భక్తినగరం. ప్రతి క్షణం దివ్యత్వానికి  సుముఖంగా ఉండే విధంగా దాని నిర్మాణం జరిగింది. మీరు ఎక్కడ చూసినా అతి చిన్న వాసస్థానం కూడా దేవాలయం లాగానే గోచరిస్తుంది. వీథుల్లో మీరు వేసే ప్రతి అడుగులో అద్భుత సౌందర్య భావన గోచరిస్తుంది. 1,100 సంవత్సరాల నుండి ప్రజలు నివసిస్తున్న ఈ సజీవ నగరం ఈ ప్రకృతి బీభత్సపు క్రోధానికి గురయింది. దాన్ని తప్పక పునర్నిర్మించవలసి ఉంది, భక్తపూర్ లాంటి వారసత్వ నగరాలకు ప్రత్యామ్నాయాలుండవు. నేపాల్ సౌందర్యతత్త్వానికీ, దేశీయ లక్షణానికీ అద్భుత వ్యక్తీకరణ అయిన ఈ పట్టణాన్ని అంతర్జాతీయ సంస్థలు పునరుద్ధరిస్తాయని నా ఆకాంక్ష.

ఈ భూమి మీద ఇదొక్కటే ‘హిందూ’ దేశం. అంటే ఈ దేశ సంస్కృతి విశ్వాసం మీద కాక, ముక్తి కాంక్ష మీద ఆధారపడిందన్నమాట.

సారరూపంలో భారత, నేపాలులకు ఏకత ఉంది. రాజకీయ సరిహద్దులను గీసే వరకు నేపాల్ భారతవర్షంలో భాగంగానే ఉండింది. సాంస్కృతిక బంధాలకూ, వాటి ప్రాధాన్యానికీ విరుద్ధంగా గీసిన సరిహద్దురేఖ ఇది. ఈ భూమి మీద ఇదొక్కటే ‘హిందూ’ దేశం. అంటే ఈ దేశ సంస్కృతి విశ్వాసం మీద కాక, ముక్తి కాంక్ష మీద ఆధారపడిందన్నమాట. ఆధికారికంగా ‘హిందూ’ దేశంగా గుర్తింపుపొందిన ఏకైక దేశం ఇది. ఇవ్వాళ కూడా 98% నేపాలీయులు ముక్తి సాధన కోసం గుడికి వెళ్తారు. ఈ సంస్కృతికి మూలమైన ఈ లక్షణం భారతదేశంలో చాలావరకు తగ్గిపోతూ ఉంది.

విదేశీ దండయాత్రలు, అజ్ఞానం మనం దేవాలయానికి వెళ్లే కారణాలలో ఎంతో మార్పు తెచ్చాయి. తమ దేశం మొత్తాన్నీ ఒక ఆధ్యాత్మిక శరీరంగా మలచడంలో ఈ గొప్ప సాహసాలకు ప్రోత్సాహమిచ్చిన వారి రాజులు అదే స్ఫూర్తి కొనసాగడానికి కారణమయ్యారు. నేపాల్ విశిష్టత ఇక్కడే ఉంది. ఈ దేశ నిర్మాణం ఎలా జరిగిందంటే ఇక్కడ పురుషుడుకాని, స్త్రీకాని, శిశువుకాని, జంతువుకాని, పక్షికాని, కీటకంకాని – ఏదైనా సరే ఆధ్యాత్మిక ప్రక్రియను తప్పించుకోలేరు. కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నవారికే ఇది పరిమితం కాదు. అది అత్యున్నత కారుణ్యానికి చిహ్నం, అందరూ దానినుండి లాభపడతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు