నమస్కారం సద్గురు, మీరు ఎంతో తొందరలో ఉన్నారని చాలా మందికి అనేక రకాల అవకాశాలు కల్పించడానికి, వారితో పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. మేము దీని గురించి ఎం చేయగలం?

అన్నిటికంటే ముఖ్యమైనది, మొట్టమొదటిది ఏమిటంటే ఇచ్ఛ. ఇచ్ఛ అంటే ఓ బలమైన ఆకాంక్ష లేక ఓ బలమైన కోరిక. మీ కోరికకి తగినంత బలం లేదనుకోండి, ఏ ఒక్క చిన్న ఇబ్బంది మీ దారిలో ఎదురైనా సరే  మీరు పక్క దారి పట్టాలనుకుంటారు. ఉదాహరణకు, మీరు పర్వతాల్ని అధిరోహిస్తున్నప్పుడు ఇలాంటివి గమనించవచ్చు. మేము కిందటిసారి కైలాస పర్వతం వెళ్ళినప్పుడు, తోరోంగ్ లా అనే చోటికి, మనాంగ్ లోయను దాటి తోరోంగ్ లా పాస్ నుండి వెళ్ళాం. ఇది సుమారు 18000ఆడు. పొడవు, 60డిగ్రీల పల్లంలో ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని ఎక్కడం మొదలు పెట్టారనుకోండి మీ మనసు 'ఈ మనాంగ్ లోయ ఎంత హాయిగా ఉంది, చాలు కదా, ఇప్పుడు మనం ఎందుకు ఆ దోవ గుండా వెళ్ళడం , అక్కడ ఏమి లేనట్టుగా కనిపిస్తోంది, అంతా రాళ్ళు, రప్పల్లా ఉన్నాయి.

అక్కడ కొంచెం కూడా పచ్చదనం లేదు కాని ఇక్కడ, మనాంగ్ లోయలో ఎంత బాగుంది, అంతా పూలతో నిండిపోయుంది' అని అనిపిస్తుంది. మీ జీవితంలో కూడా మీ మనస్సు ఇటువంటి మాయ ఎప్పుడూ చెస్తూనే ఉంటుంది.  ఎవరైతే ఈ మాయకి లొంగకుండా ఉంటారో వాళ్ళు ఎదుగుతారు. ఎవరైతే లొంగి పోతారో వాళ్ళు తిని పడుకుంటారు.  అది ఆధ్యాత్మికత అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు లేదా కళలు అవ్వచ్చు ఏదైనా సరే. మీరు మీ స్థాయిని దాటి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇలాంటిది వస్తుంది. మీ మనస్సు ' ఇదంతా అవసరమా, ఇక్కడే బాగుంది కదా ఇప్పుడు ఆ కొండ ఎక్కాల్సిన పనేంటి అని అంటుంది.

ఈ రకమైన కోరిక  - ఇంకేదో కావాలి అన్న తపన, మీరిప్పుడు ఉన్న స్థాయి కంటే ఎక్కువ కావాలి అనేది ఎదో ఒక బోధనా వల్ల రాదు. ఇది జీవిత విధానం, ఇదే జీవిత తత్త్వం. 

ముందు మీకు ఒక తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. "నాకు తెలియాలి, ఇదేమిటో నాకు తెలియాలి, నాకు తెలియాలి", ఇది మిమ్మల్ని లోపలినించి తొలిచేస్తూ ఉండాలి. మీ ఆకాంక్ష ఇంత తీవ్రమైనది కాదనుకొండి, అప్పుడు మీకు ఈ పరిమితిని దాటి తెలుసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి మానవుడికి కూడా ఈ కోరిక ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఈ పరిమితులు దాటుతార లేదా అన్నదే ప్రశ్న. కొంత మంది, సరే ఇప్పుడిదంతా చేస్తే నేనేం సాధిస్తాను అని అనుకుంటారు. ఇది ఏదో సాధించడం గురించి కాదు. ఓ అందమైన వీడియో ఉంది, అదేమిటంటే ఒక మొక్క ఎలా ఎదుగుతుంది అని. ఆ మొక్క వేళ్ళు వాటి పౌష్టికత కోసం అవి ఎలా భూమిలోకి చొచ్చుకొని పోతాయి, ఒక పువ్వో లేక పండుని పూసేలా ఎలా చేస్తాయి అన్నదే ఈ వీడియో. ఎవరో దీన్ని ఫిలిం చేసి , ఫాస్ట్ ఫార్వార్డ్ లో మీకు తయారుచేసిచ్చారు. ఇందులో మీరు ఈ వేర్లు వాటి  పౌష్టికత కోసం, బతకడం కోసం ఎం చేస్తాయి అనేది చూడవచ్చు. ఈ రకమైన కోరిక  - ఇంకేదో కావాలి అన్న తపన, మీరిప్పుడు ఉన్న స్థాయి కంటే ఎక్కువ కావాలి అనేది ఎదో ఒక బోధనా వల్ల రాదు. ఇది జీవిత విధానం, ఇదే జీవిత తత్త్వం.

మీ ఆకాంక్షే ఓ  దావాగ్నిలా మారినప్పుడు, మిగతాదంతా నాకు వదిలేయండి 

జీవితంలో ఎన్నో కోణాల్లో మానవులు ఈ ప్రగతిని సాధించారు, ఇలా కొంత మంది మానవులు తప్పించి ఈ ప్రగతిని సాధించడం వల్లనే కదా సైన్స్ రూపంగానో, టెక్నాలజీ రూపంగానో, ఆధ్యాత్మికత రూపంగానో , మనం అన్నీ అనుభవిస్తున్నాం. చాలా మంది ఇది చేయాలనుకొని చేయకుండానే చనిపోయారు. కొంతమంది వీటిని మనకి సాధ్యపరిచారు. ఈ ఆకాంక్షే మీలో దహించే ఆకాంక్షగా మారినప్పుడు, మిగతావాన్ని నాకు వదిలేయండి. నేను మిమ్మల్ని అడుగులో అడుగు వేసుకుంటూ తీసుకెళ్తాను. ఈ ఆధ్యాత్మికత అనేది అంత కష్టమైందా?  ఇది అంత కష్టమైంది కాదు. కాని మీరు కరుడు కట్టేసున్నారు, ఇది కష్టమైనది కాదు. ఈ మొండితనం ఆధ్యాత్మిక ప్రక్రియలో లేదు, ఇది మీలో ఉంది. మీ ఆకాంక్షే ఓ దావాగ్నిలా మారినప్పుడు, మిగతాదంతా నాకు వదిలేయండి, నేను మీ అడుగులో అడుగు వెస్తూ నడిపిస్తాను. కాని మీ ఆకాంక్ష అన్నది రొజూ మారిపొతూ ఉందనుకోండి, అప్పుడిదేలా  పనిచేస్తుంది. నేను కేవలం కొంత మందికి ఒక పావుగంట లేక ఇరవై నిముషాల ధ్యాన ప్రక్రియ ఇవ్వాలనుకుంటే అది ఎంతో తేలిగ్గా ఎంతో సరళంగా చేసేవాడిని. కాని  కొంతమందిలో ఈ  దావాగ్ని ఉంటుంది, వీళ్ళని వాళ్ళ పరమోన్నత స్థితికి చేర్చాలి.

నా ఉద్దేశం ప్రతి ఒక్కరు ఆనందంగా, ఆరోగ్యంగా హాయిగా పడుకోవలనేది కాదు, వాళ్ళు వేరే రకమైన కాంతితో వెలుగుతూ ఉండాలి అని కోరుకుంటాను. మీరు ముప్పై తొమ్మిది ఏళ్ళు జీవించారా లేక వంద సంవత్సరాలు జీవించారా అన్నది కాదు, అది నాకు ముఖ్యం కాదు. నాకు ఏది ముఖ్యం అంటే మీరు ఈ దివ్యత్వాన్ని మీ జీవితంలో చూడగలిగారా, మీరు ఆ రకమైన వెలుగుతో ఆ రకమైన కాంతితో జ్వలించారా? మీరు ఈ దేహాన్నీ, ఈ రక్త మాంసాలని  దాటి చూడగలిగారా? అలా చూడగలగటం మీ జీవితంలో జరగాలి. లేకపోతే ఏముంది? ఈ మాంసం ఈ ఎముకలు- మీరు వందేళ్ళు జీవించినా సరే వీటితో ఇవే సమస్యలు ఉంటాయి. నన్ను నమ్మండి. ఇంకా ఎక్కువ సమస్యలు కూడా ఉండచ్చు. కావాలంటే మీకంటే పెద్దవారిని చూడండి వారు మీకేమైనా సంతృప్తికరంగా కనిపిస్తున్నారా? వాళ్లకు ఉన్న విషయాలతో వాళ్ళ జీవితంలో సంతృప్తికరంగా ఉన్నారా? నేను ఎవరైతే సంపూర్ణ ఆయుర్దాయం జీవించారో వాళ్ళ గురించే మాట్లాడతున్నాను, వాళ్ళు ఎప్పుడూ ప్రతి అడుగులో ఎదో బాధ పడుతున్నట్లు కనిపిస్తున్నారా ?

చాలా మందికి ఒకే ఒక సంతృప్తి ఏంటంటే వారి పక్కవారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, వారవి పడట్లేదు అంతే. మీకు తెలుసా? వాళ్ళు పడ్డ ఇబ్బందులు నేను పడలేదు అంటే నేను బానే ఉన్నట్టు అని. మీరు ఈ భూగోళం మీద మరోక మనిషిలా ఉండాలని అనుకుంటే మీరిలా ఉంటే సరిపోతుంది. కాని మీరు దివ్యత్వాన్ని మీలో నింపుకోవలనుకుంటే మాత్రం, మీకు జీవించడానికి మరో మార్గం ఉంది. ఇలా ఉండగలగడానికి  అన్నిటికంటే ముఖ్యమైనది - మీ  ఆకాంక్ష. ఇది మిమ్మల్ని దహించే విధంగా ఉండాలి. ఈ జ్వాల మీలో లేకపోతే, నేను ఎం చేయడం? మీకెలా దోవ చూపించడం? ఈ ప్రజ్వలనం మీలో కలగనివ్వండి, ఇది ప్రజ్వలితం చేసుకోడానికి ఇంకో ముప్పై ఏళ్ళు తీసుకోకండి. మీరింకా ఎంత సమయం తీసుకుంటారు ??

ప్రేమాశీస్సులతో,
సద్గురు