మనదేశంలో ఎక్కువ విలువైన నోట్లని రద్దుచేస్తున్నామని ప్రథానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించి అప్పుడే 3 వారాలు కావస్తోంది.  ఒక నెలా రెండు నెలల్లో, వ్యాపారవర్గాలూ, వ్యక్తులూ మొదట్లో ఎదుర్కొన్న ఒత్తిడినుండీ, ఇబ్బందుల నుండీ బయటపడగలరని ఆశిస్తున్నాను. ఇది మరికొన్ని రోజులు పట్టినా పట్టవచ్చు. ఇది రాజకీయంగా ప్రభుత్వానికి చాలా నష్టాన్ని కలుగజేసే ఎత్తుగడ. అది వాళ్ళకు తెలుసు. అయినా, తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహం వెనుకనున్న అనేక ముఖ్య కారణాలలో దేశంలో అధికమొత్తంలో చలామణీలో ఉన్న నకిలీ డబ్బుని అరికట్టడం ఒకటి. 10 లక్షల రూపాయల్లో 250 రూపాయల మేరకు (అంటే సుమారు 0.025%) అని భారతదేశ రిజర్వు బాంకు వేస్తున్న అంచనా కంటే ఎక్కువే నకిలీ డబ్బు చెలామణీలో ఉందని నా నమ్మకం. ఈ నకిలీ డబ్బు ఎక్కడో చీకటిగదుల్లో అచ్చుకావడం లేదు, మంచి అచ్చుయంత్రాలతోనే భారతదేశం బయట అచ్చు అవుతునాయి. బహుశా ఒకప్పుడు మన నోట్లను ముద్రించడానికి నియమించిన అచ్చుయంత్రాలతోనే ఈ ముద్రణ జరుగుతున్నా జరుగుతూ ఉండవచ్చు. ఈ నకిలీ నోట్లను ఎంత నేర్పుగా అచ్చువేస్తున్నారంటే, ఒక్కోసారి బ్యాంకు అధికారులే దాన్ని పోల్చుకోలేకపోతున్నారు.

దురదృష్టవశాత్తూ, పన్ను అధికారుల కళ్ళుగప్పి ఇంతవరకూ 50 శాతం వరకూ వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి.  కనీసం అందులో ఇప్పుడు 40 నుండి 50 శాతం  సంప్రదాయ ఆర్థికవ్యవస్థలో విలీనమౌతుంది.

భారతదేశంలో ఎప్పుడూ వ్యాపారం జరుగుతూనే ఉంది. రాజులు మహరాజుల కాలం నుండీ ఈ దేశంలో పన్నులున్నాయి.  ఇంగ్లీషువారు ఈ దేశానికి అధికారంలోకి వచ్చిన తర్వాత, జిల్లాలో తమ కార్యనిర్వాహకుల్ని "కలక్టర్లు" (వసూలుచేసేవారు) అని పిలిచేవారు. ... ఎందుకంటే, వాళ్ళు అంతకుమించి ప్రజలకి ఏ రకమైన సేవా చేసేవారు కాదు. దురదృష్టవశాత్తూ మనం ఇప్పటికీ ఆ నామకరణాలే ఉపయోగిస్తున్నాము. తరాలు మారినా, మనం ఎంత ఎక్కువగా పన్నులు ఎగవెయ్యగలిగితే మనం అంత తెలివైన వాళ్ళమని అనుకుంటున్నాం. మనం సంపాదిస్తున్న దానిలో ప్రభుత్వానికిచ్చే భాగమన్న ఆలోచన ఇంకా మనలోపలికి ఇంకలేదు. ఇదేదో నేరం చేద్దామన్న ఉద్దేశ్యంతో కాదు. ప్రభుత్వానికి పన్ను చెల్లించడం ద్వారా ప్రజలకి సేవచెయ్యడానికి తగిన నిధులు సమకూరుస్తున్నామన్న భావన మనలో ఇంకలేదు. ఆ పని తమవంతుగా, దేవాలయాలకీ, బీదసాదలకీ, లేదా ఒక అనాధ శరణాలయానికీ తామే సహాయం చేస్తుండేవారు. కొన్నిచోట్ల తమ సామాజిక వర్గాల్లో ఒకరికొకరు సహాయంచేసుకోవడం ఉందిగాని ఆ పరిథిదాటి చేసిన సందర్భాలు బహుస్వల్పం.

ఈ చర్య వెనుకనున్న రెండవ ఆలోచన నల్లధనాన్ని అదుపుచెయ్యడం. అది నా ఉద్దేశ్యంలో కొంతవరకే సఫలీకృతం అవుతుంది. మహా అయితే 25 నుండి 50 శాతం వరకూ తిరిగి పట్టుకోవచ్చునేమోగాని మిగతాది వాళ్ళు వేరే మార్గాల్లో మార్చుకోగలుగుతారు. దురదృష్టవశాత్తూ, పన్ను అధికారుల కళ్ళుగప్పి ఇంతవరకూ 50 శాతం వరకూ వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి.  కనీసం అందులో ఇప్పుడు 40 నుండి 50 శాతం  సంప్రదాయ ఆర్థికవ్యవస్థలో విలీనమౌతుంది. ఆర్థికవ్యవస్థలోకి విలీనం చెయ్యడం ద్వారా, ఇతరదేశాలలో మన ఆర్థిక వ్యవస్థ పటిష్టతని చూపించగలుగుతాం. అది ఈ రోజుల్లో చాలా ఆవశ్యకం కూడా. దానర్థం, 2.25 ట్రిల్లియను డాలర్ల ఆర్థికవ్యవస్థ ఒక్కసారిగా 3 ట్రిల్లియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతుంది.  మనందరం ఒకదేశంగా మనచర్యల్ని నియంత్రించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మనదేశ ఆర్థిక ప్రగతి వికసించడానికీ, ఒక గట్టిపునాదిమీద అది నిలబడడానికీ మనం తాత్కాలికంగా ఈ కష్టాన్ని సహించుకోవాలి. అలా చెయ్యడానికి మన వ్యాపార లావాదేవీలన్నీ సరిగ్గా నమోదు చెయ్యాలి, తగిన పన్ను చెల్లించాలి.

కొన్ని వేల కోట్లరూపాయలు దాచుకున్నవారు చాలా మంది ఉన్నారు.  వాళ్ళు డబ్బంటే దాచుకునే వస్తువు అనుకుంటున్నారు.

కొన్ని వేల కోట్లరూపాయలు దాచుకున్నవారు చాలా మంది ఉన్నారు.  వాళ్ళు డబ్బంటే దాచుకునే వస్తువు అనుకుంటున్నారు. డబ్బు దాచుకునే వస్తువు కాదు... అది కార్యకలాపాలు నెరవేర్చుకునేందుకు ఒక సాధనం. అది ఒకచేతిలో స్థిరంగా ఉండెకంటే ఎప్పుడు చేతులు మారుతూనే ఉండాలి. అంతే కాకుండా, ఈ దేశంలో చాలా మంది చట్టాన్ని ధిక్కరించడంలో తప్పులేదనుకుంటారు. చట్టాన్ని ధిక్కరించడం వీరత్వంగా, దేశభక్తిగా, దూరదృష్టిగలవారిగా పరిగణించి సమ్మానించే స్వాతంత్య్రపూర్వపు మానసిక స్థితిలోనే మనం ఇంకా ఇరుక్కుని బయటపడలేదు. మహాత్మా గాంధీ ఎంతో ఉత్సాహంగా చేసేవారు...రాస్తారోకోలు, హర్తాళ్, బంద్ లూ మొదలైనవి. మనం చాలా కాలం బానిసత్వంలో ఉన్నాము. ఈ దేశంలో అధికారం మనకి వ్యతిరేకంగా పనిచేసే మరొకరిచేతిలో ఉండేది. ఆ కారణంగా చట్టాన్ని ధిక్కరించిన వారందరూ వీరుల్లా కీర్తించబడేవారు. అప్పుడు ఆ దృక్కోణం, ఆ అవసరం ఉండేవి. కానీ ఆ రోజులు గడిచిపోయాయన్న విషయం మనం గుర్తించాలి.

మనం ఇప్పటికీ ఒక రాచరికపు మానసిక స్థితిలోనే ఉన్నాం. మనం ఒక వ్యక్తిని ఎంతగా కీర్తించడం ప్రారంభిస్తామంటే, ఆ వ్యక్తే ఒక రాజకీయ వ్యవస్థగా ఎదిగిపోతాడు. ఇప్పుడు రాజకీయ నాయకులను పరిశీలిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, సమాజంలో ఒక స్థాయి, ఒక హోదా ఉన్న వ్యక్తులు కూడా టెలివిజన్ కెమేరాల ముందు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళలా మాటాడుతున్నపుడు వింటున్న వాళ్ళందరికీ వాళ్ళు మాటాడుతున్నది అబద్ధం అని తెలుస్తుంది. అయినా వాళ్ళు దానికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేకుండా ప్రవర్తించగలుగుతున్నారు. ఎవరైనా బుద్ధిపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు వాళ్ళు ఆ పదవినుండి తొలగించబడాలి. కానీ, వాళ్లకున్న వ్యక్తిగత ఆకర్షణ, వెనుకనున్న అనుచరగణమూ, వాళ్ళు ఏ సంజాయిషీ ఇచ్చుకోనక్కర లేకుండా ఏది తోచితే అది చెప్పగల శక్తినిస్తుంది. మనం ముందుకివెళ్ళాలంటే, అటువంటి పరిస్థితి తప్పించాలి.

మనందరం దేశం అంటే నలుగురూ నివసించే భౌతిక భూభాగం కాదనీ, అది ఒక సంస్థ అనీ గుర్తించాలి.

మనందరం దేశం అంటే నలుగురూ నివసించే భౌతిక భూభాగం కాదనీ, అది ఒక సంస్థ అనీ గుర్తించాలి. ఈ సంస్థ పరిధిలో కొన్ని చట్టాలు పాటించాలి, మన కర్తవ్యాన్ని నిర్వహించాలి, కొన్ని లాభాలని అందుకోవాలి. దేశపౌరులుగా మనకి మౌలిక వసతులూ, సేవలూ మొదలైనవి దొరకనప్పుడు వాటిని అడిగిమరీ తీసుకునే హక్కు మనకి ఉంది. మనం కడుతున్న పన్నులు ఎక్కడికి పోతున్నాయని నిలదీసే హక్కు మనకుంది. ఇప్పుడు మనం ఆ రెండు పనులూ.... మనవంతు పాత్ర నిర్వహించడం, గట్టిగా నిలదీయడం... చెయ్యడం లేదు.  మనకి ఇంతవరకు ఆ విషయం తట్టలేదు. మనకి సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా, ప్రభుత్వం పనిచెయ్యడానికి పన్ను చెల్లించడం మన బాధ్యతగా ఎన్నడూ ఆలోచించడమే లేదు. మనదేశం సమర్థవంతంగా పనిచెయ్యాలంటే, మనమందరం మన కర్తవ్యం నిర్వహించాలి. అందరూ అనుసరించగలిగిన స్పష్టమైన చట్టాలుండాలి. చట్టాల్ని సులభతరం చెయ్యడం, చట్టాన్ని ఏ సందేహాలకూ తావులేకుండా దేశంలోని పౌరులందరూ అర్థం చేసుకునేలా  చెయ్యడమే మన తక్షణ కర్తవ్యం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు