ప్రశ్న:ధూపం వేయడం లోని ప్రాముఖ్యత ఏమిటి ఇంకా దీనిని ఆధునిక కాలంలో కూడా ఉపయోగించాలా?

సద్గురు:: కొన్ని రకాల పదార్థాలను కాలుస్తున్నప్పుడు, ముక్కు రంధ్రాలకు ఆహ్లాదకరమైన సువాసన వస్తుంది. కానీ ధూపం వేయడం అనేది వాతావరణం గురించి, మీ గురించి కాదు. ఇందులో ఒక అంశం ఏమిటంటే, అది సుగంధాన్నిస్తుంది - ముఖ్యంగా ఇంటి లోపల. ఇంకొకటి, ఆ గది ఆకారం ఇంకా పరిమాణాన్ననుసరించి వివిధ ప్రదేశాలలో, వివిధ రకాల శక్తి నిర్మాణాలు కూడా ఏర్పడుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో, మీరు నివసించే గది ఆకారం మరియు పరిమాణం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. భారీగా గాలి వెలుతురు వచ్చే విధంగా గది నిర్మిస్తే, అంటే రెండు గోడలు తెరిచినట్లుగా ఉంటే, అది దాదాపు ఆరుబయటలా అనిపిస్తుంది. అది వేరే సంగతి . చాలా ఇళ్లు ఈ విధంగాకట్టినవి కావు. . చాలా మటుకు మీరు కిటికీలను తెరవలేరు ఎందుకంటే , ఇరుగు పొరుగువారు ఉండడం వల్ల లేదా ఎయిర్ కండిషనింగ్ వల్ల లేదా ఒక్కోసారి వాతావరణ కారణాల వల్ల . వివిధ ఆకారాలు మరియు పరిమాణాలు వివిధ రకాల శక్తి నిర్మాణాలను సృష్టిస్తాయి. ఒకవేళ అవి చాలా బలంగా మారితే, ఈ శక్తి నిర్మాణాలు మీ మానసిక మరియు భావోద్వేగ స్థితిని నిర్ణయించగలవు, అది మీరేమి కావాలనుకున్నారో దానికి అనుకూలమైనది కావచ్చు లేదా మీకు అవరోధం కలిగించే విధంగా కూడా మారవచ్చు.

సాంబ్రాణి - దాని ప్రయోజనాలు

Volunteer Offering Sambrani at Adiyogi Alayam | Significance of Burning Incense Sticks

సాంబ్రాణి చాలా శక్తివంతమైన పదార్ధం. ప్రజలు ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు, సాంబ్రాణిని వేస్తారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, వారు చేసే మొదటి పని సాంబ్రాణి వేయడం. ఇది గాలిలో ఇంకా ఇతర ఉపరితలాలపై ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాను కూడా చంపుతుందని కూడా ఇప్పుడు కనుక్కున్నారు.

ముఖ్యంగా కుటుంబంలో మరణం సంభవించినట్లయితే, పన్నెండు రోజుల వరకు సాంబ్రాణిని వేస్తారు, ఎందుకంటే ఆ గాలిని పూర్తిగా శుద్ధంచేయడానికి.

ఇది ఒక చెట్టు నుంచి చుక్కలుగా కారుతూ ఉండే ఒక ప్రత్యేక రకమైన జిగురు పదార్ధం. సాంబ్రాణి కోసం లోపలి వరకు లోతుగా చెక్కేసిన భారీ చెట్లను మీరు అడవిలో చూడచ్చు. చెట్లు బయటకి దృఢంగా కనిపిస్తాయి, కానీ లోపల ఈ జిగురు కారడం కోసం ఒక గుల్ల ఉంటుంది. ఈ విధంగా సహజంగానే జిగురు ఎందుకు కారుతుందో నాకు కారణం తెలియదు కానీ, ప్రజలు దీనిని సేకరిస్తారు. ఇది చాలా తక్కువగా లభించే విలువైన పదార్థం. ఈ జిగురుని ఎక్కువ మొత్తంలో సేకరించాలంటే మైళ్ల దూరం నడవవలసి ఉంటుంది, ఎందుకంటే ఈ చెట్లు పరిపక్వత పొందాలి. అంటే వాటికి కనీసం ముప్పై నుంచి యాభై సంవత్సరాల వయస్సు ఉండాలి, లేకపోతే జిగురు రాదు.

సాంబ్రాణి వాతావరణంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కేవలం సువాసన ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, గాలిని శుద్ధి చేస్తుంది ఇంకా వాతావరణాన్ని సజీవంగా చేస్తుంది. మీరు ఇంట్లో తేలికపాటి సాంబ్రాణి ధూపం వేసినట్లయితే, మీరు ఇంటి లోపల ఉన్నప్పటికీ, ఆరుబయట, ఒక పరిమితమైన నిర్మాణం లేని చోట ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో మరణం సంభవించినట్లయితే, సాంబ్రాణిని పన్నెండు రోజుల వరకు వేస్తారు, ఎందుకంటే అది ఆ గాలిని పూర్తిగా శుభ్రపరుస్తుంది.

సద్గురు వెళ్ళిన మొదటి "ఆధ్యాత్మిక" ఎక్స్పో ( ప్రదర్శన)

ఈ సూక్ష్మమైన అంశాల గురించి మాట్లాడటానికి నేను కొంచెం జంకుతున్నాను ఎందుకంటే, ఇప్పటికే చాలా కొత్త-కాలపు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. నేను మొదట నాష్ విల్ కి వచ్చినప్పుడు, ఒకరు వచ్చి చెప్పారు, "సద్గురు, ఒక ఆధ్యాత్మిక ప్రదర్శన (ఎక్స్పో) జరుగుతోంది."

నేను, "ఏమిటీ, ఆధ్యాత్మిక ప్రదర్శనా? భారతదేశంలో కూడా, ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది.(కుంభమేళాను ఉద్దేశించి)"

"లేదు, ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం జరుగుతుంది."

"నేను చూడాలనుకుంటున్నాను" అన్నాను.

వాళ్ళు, "సరే, వెళ్దాం" అని చెప్పారు. తరువాత, మధ్యాహ్నం నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. పైగా,"సద్గురు, ఆధ్యాత్మిక ఎక్స్పోలో మాట్లాడటానికి మేము మీకు ఒక స్లాట్ తీసుకున్నాము" అని చెప్పారు.

"చాలా బాగుంది" అన్నాను. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద గుడారం ఉంది. మేము లోపలికి వెళ్లేసరికి, అమెరికన్ జానపద సంగీతం పూర్తి స్థాయిలో ధ్వనిస్తోంది. సహజంగానే, ఈ గుంపువాళ్ళు పాడే సంగీతాన్నిఎక్కడా కూడా డబ్బులిచ్చి ఎవరూ వినరు. బహుశా కాస్త వినసొంపైన బృందాలు సాయంత్రం వస్తాయి అనుకున్నాను. మధ్యాహ్నం పూట వేదిక ఖాళీగా ఉంది. ఇంకా సౌండ్ సిస్టమ్ను ఎవరైనా ఉపయోగించవచ్చు కాబట్టి, వాళ్ళు బాదిపడేస్తున్నారు. నేను, "సరే, ఆధ్యాత్మిక ఎక్స్పో! కానీ ఫరవాలేదు, సంగీతం అనేది కేవలం ఒక సాంస్కృతిక విషయం. ఆధ్యాత్మిక ప్రదర్శనపై దృష్టి పెడదాము" అనుకున్నాను.

నేను లోపలికి వెళ్లాను. ఎవరో ఆధ్యాత్మిక స్నానం సబ్బును అమ్ముతున్నారు, మరొకరు ఆధ్యాత్మిక శిల లేదా ఎక్కడో ఒక ఆధ్యాత్మిక ప్రదేశం నుంచి తెచ్చిన గులకరాయిని ఇక్కడ విక్రయిస్తున్నారు. వారు వింతైన, రకరకాల ధూపాలను కూడా విక్రయిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, "ఓహ్, ఇది మన భారతదేశంలో సంత లాగా ఉంది." అన్ని రకాల వింతవింత వస్తువులను అమ్ముతుంటారు. మీరు మాయమైపోయేలా చేసే ఒక వంకర్లు తిరిగిన వేరు ఉంటుంది. మీరు ఈ వేరుని ఆడ తిమింగలం ఎడమ దవడ ఎముకతో దంచాలి, అది బతికి ఉన్నదై ఉండాలి- అంటే మీరు నిజంగా సజీవంగా ఉన్న ఒక తిమింగలం లోపలికి ఈది, దాని దవడ ముక్కను విరిచి బయటకు తీసుకురావాలి. మీరు ఒక మంత్రాన్ని జపిస్తూ, ఈ రెండింటినీ కలిపి దంచితే వచ్చిన లేహ్యాన్ని పై అంగిలిలో వేస్తే, అప్పుడు మీరు మాయమైపోతారు అనమాట... నిజానికి, మీరు తిమింగలం నోటిలోకి వెళితే, మీరు ఎలాగూ కనిపించకుండా పోతారు!

కాబట్టి, ధూపం ఒక నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది, కానీ దాన్ని అతిగా వాడకూడదు. అది మీ ఆధ్యాత్మిక స్వభావాన్ని నిర్ణయిస్తుందని అనుకోవద్దు. ఇది వాతావరణాన్ని కొద్దిగా మార్చగలదు కానీ, దానికి అతిగా విలువ ఇచ్చి చూపకూడదు.

రసాయన ధూపం యొక్క ప్రమాదాలు

ఎవరైనా ధూపద్రవ్యాలను సరైన పద్ధతిలో ఉపయోగించవచ్చు. కానీ ఈ రోజుల్లో ధూపాన్ని రసాయన పదార్ధాలతో తయారు చేస్తున్నారు. మీకు వీధిలో, పరిశ్రమల్లో ఇంకా మీరు పని చేసే కర్మాగారాల్లో కావలసినన్ని రసాయనాలు ఉన్నాయి. కనీసం మీ ఇంటి లోపల రసాయనికంగా తయారు చేసిన ధూపం వేయవద్దు. ఎందుకంటే, ఈరోజు బజారులో అందుబాటులో ఉన్న వాటిలో దాదాపు ఎనభై శాతం రసాయనమేనని నేను భావిస్తున్నాను. మీరు దానిని వెలిగించే ముందు తప్పక తనిఖీ చేయాలి ఎందుకంటే మీరు మూసి ఉన్న గదులలో రసాయనాలను కాల్చినట్లయితే, దాని ప్రతికూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సహజమైన జిగురు లేదా కొన్ని ఇతర ముఖ్యమైన నూనెలు , పదార్థాలతో తయారు చేయబడాలి. ఇది ఒక చిన్న వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. మీకు అలాంటి వ్యత్యాసం అవసరమైతే, అది ఖచ్చితంగా సహాయపడుతుంది.

Editor's Note:  Pure herbal and organic incense sticks and cones in variety of fragrances are available from Isha Life.