సద్గురు: గత కొన్ని సంవత్సరాలుగా, తమిళనాడులో వర్షాల పరిమాణం దాదాపు 100% పెరిగింది. వర్షాలు కురవకపోవడం కంటే కూడా అధికంగా వర్షాలు కురవడం వల్ల భూమి మరింత వేగంగా ఎడారిగా మారుతుంది. గడిచిన కొద్ది సంవత్సరాల్లో ముంబై, హైదరాబాద్, చెన్నై ఇంకా బెంగుళూరు వంటి ప్రధాన నగరాలతో సహా దక్షిణ భారత దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో వరదలు వచ్చాయి. ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా, దక్షిణ ద్వీపకల్పంలో రోజులు గడిచేకొద్దీ చాలా ఎక్కువగా వర్షాలు కురుస్తాయి, ఈ పరిస్థితులలో తిరోగమనం వస్తే తప్ప! ఇంక ఈ తిరోగమనం తక్షణమే వస్తుంది అని నేను అనుకోను. మనం దీనిని సరిచేయడానికి చర్యలు ఇప్పుడు మొదలుపెట్టినా, ఇదంతా తిరిగి మాములు స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

విపత్తులు సంభవించినప్పటికీ, ప్రజలు తమ జీవితాన్ని తెలివిగా ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.

ఈ దేశానికి సంబంధించి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, 1964 నుండి ఇప్పటి వరకు మనకు ఎప్పుడూ కరువు రాలేదు. అంతకుముందు ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒక్కసారి భయంకరమైన కరువు వచ్చేది, అందువలన కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఇప్పడు కరువులు రావడం లేదు. ఇది ఎవరో పూజలు లేదా యజ్ఞాలు చేయడం వల్ల కాదు, మన వ్యవసాయ విధానాలు కొంతవరకు వ్యవస్థీకృతం కావడం వల్ల సాధ్యమైనది. పంటలు పండాలని దేవుళ్లకు పూజలు చేసే బదులు మన పంటలను మనమే స్వయంగా నిర్వహించడం ప్రారంభించాము. ఈ 40 ఏళ్లలో మనకు కరువు రాకపోవడానికి కారణం అదే.

2001లో గుజరాత్ లో భూకంపం వచ్చిన తర్వాత, నేను ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను ఒక ప్రశ్న అడిగేవారు, “ఇంత పెద్ద విపత్తు వచ్చింది, మనం ఏమి చేయాలి? దేవతలకు మనపై కోపం వచ్చిందా? ఈ దేశంలో భూకంపాలు రాకుండా ఉండాలంటే మనం చేయగలిగే ఆధ్యాత్మిక ప్రక్రియ ఏదైనా ఉందా?” అని. భూకంపం అనేది ఒక విపత్తు కాదు; ఇది ప్రతిచోటా జరిగే ఒక ప్రకృతి సహజమైన ప్రక్రియ.

ఉదాహరణకు, కాలిఫోర్నియాలో భూప్రకంపనలు దాదాపు ప్రతిరోజూ వస్తాయి. కానీ ఎవరూ చనిపోరు; ప్రజలు ఆ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన ఏర్పాట్లను చేసుకున్నారు. భారతదేశంలో, ఒక్కసారి భూకంపం వస్తే, వందల, వేల మంది ప్రజలు చనిపోతున్నారు. ఎందుకంటే, మనం మనం ఈ ప్రదేశాన్ని విపరీతమైన జనాభాతో నింపేశాం. పైగా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం అస్సలు సిద్ధంగా లేము.

కొన్ని సంవత్సరాల క్రితం, నేను నాష్ విల్ లో ఉన్నప్పుడు, రోజు మధ్యాహ్నం నాష్ విల్ పట్టణాన్ని సుడిగాలి చుట్టేసింది. అదీ సరిగ్గా పట్టణం మధ్య భాగంలో వచ్చి కొట్టింది. వెనువెంటనే ఆ పట్టణంలో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో 800కు పైగా పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు, నేలకూలాయి. వ్యాపార, వాణిజ్య, పరిపాలక కేంద్రాల సముదాయాలు ఉండే డౌన్ టౌన్ ప్రాంతంలో దాదాపు ప్రతీ భవనానికి కిటికీలు ఊడిపోయాయి. ఈదురు గాలుల కారణంగా వందలాది కార్లు కుప్పలా పేరుకుపోయాయి. నేను అప్పుడు రోడ్డు మీద ఉన్నాను. అర మైలు దూరంలో ఆ సుడిగాలి కదులుతూ కనపడుతోంది, మేము దానిని చూడగలుగుతున్నాము. అది అలా ఇళ్ళ మధ్యలో నుండి దూసుకెళ్తోంది, ఆ ఇళ్ళన్నింటినీ అగ్గిపుల్లల్లా ఎగర కొట్టేస్తోంది. అది చూసి ఆ రోజు కొన్ని వందల మంది చనిపోయి ఉంటారని నేను అనుకున్నాను. ట్రాఫిక్ స్తంభాలూ, పరికరాలు అన్నీ రహదారులకు అడ్డంగా పడిపోయాయి. రోడ్డు పై ఉన్న, చెట్లు ధ్వంసమయ్యాయి; ఎటు చూసినా విధ్వంసం.

మనం మన వ్యక్తిగత, సామాజిక జీవితాలను, దేశంలోని ఇంకా ప్రపంచంలోని పరిస్థితులను మరింత తెలివిగా నిర్వహించడం నేర్చుకోవాలి.

మరుసటి రోజు వార్తల్లో ఏడుగురు మాత్రమే కనిపించడంలేదు అని వచ్చింది. తర్వాతి రెండు రోజుల్లో ఆ ఏడుగురూ తిరిగి వచ్చేసారు. ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. అలాంటి సుడిగాలి కోయంబత్తూరులో వస్తే, కనీసం 50,000 మంది చనిపోవడం ఖాయం. ఇది వాళ్లు చక్కగా యజ్ఞాలు చేయడం వల్ల, మనం యజ్ఞాలు సరిగ్గా చేయకపోవడం వల్ల కాదు, కేవలం ప్రజలు విపత్తులను తెలివిగా ఎదురుకోవడం నేర్చుకున్నారు, అంతే. మన దేశాన్ని దేవుడు నడిపిస్తాడని మనం అనుకుంటున్నాము. అది అలాగ జరగదు. దేవుడు అద్భుతంగా ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు. ఈ సృష్టి గురించి మీరు ఫిర్యాదు చేయలేరు. ఇంతకంటే పరిపూర్ణమైన, ఉల్లాసమైన, మెరుగైన సృష్టిని మీరు ఊహించలేరు. మనము మన దేశాన్ని నిర్వహించే పనిని దేవుడి చేతుల్లో నుంచి మన చేతుల్లోకి తీసుకోకపోతే, ఇలాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి.

ఈ విపత్తులను ఆపాలని నేను అనుకోవటం లేదు. విపత్తులు సంభవించినప్పటికీ, వారి జీవితాలను తెలివిగా ఎలా నిర్వహించుకోవాలో ప్రజలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు బాగా బతకడానికి ఏ దేవుడూ అవసరం లేదు. మీకు కొంచెం తెలివి ఉంటే చాలు. మీరు భౌతిక జీవితానికి మించి ఏదైనా కోరుకుంటే, మీరు మీ జీవం మూలాలలోకి వెళ్లాలని కోరుకుంటే, అప్పుడు మాత్రమే మీకు దేవుడు కావాలి.

మీరు పరమాత్మను అనుభూతి చెందాలంటే, ముందుగా మనిషిగా సంపూర్ణమైన ఎరుకతో జీవించాలి. మీరు అలా జీవించేలా చెయ్యడమే నా పని. మీరు నిజంగా అంత సజీవంగా ఉంటే, మీలోని పరమాత్మ కూడా సజీవమవుతుంది. అప్పుడు ఈ విపత్తులు మిమ్మల్ని బాధించవు, వాటిని ఎలా నిర్వహించాలో మీకు తెలుస్తుంది. మన వ్యక్తిగత, సామాజిక జీవితాలనూ, దేశంలో ఇంకా ప్రపంచంలోని పరిస్థితులనూ మరింత తెలివిగా నిర్వహించడం మనం నేర్చుకోవాలి. మన మనస్సును, శరీరాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలిస్తేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఈ ప్రపంచాన్ని తెలివిగా ఎలా నిర్వహించాలో మనకు ఎప్పటికీ తెలియదు.