కుంతిభోజ రాజు దత్తపుత్రిక అయిన కుంతిని, మద్ర దేశ రాకుమారి మాద్రిని పాండురాజు వివాహం చేసుకున్నాడు. ఒక రోజు, పాండురాజు వేటకు వెళ్ళినపుడు, అక్కడ  ప్రేమించుకుంటున్న జింకల జంటను చూసాడు. వాటిని సులభంగా బాణంతో గురి చూడవచ్చు అన్న ఆలోచనతో అవి ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా బాణంతో కొట్టాడు. ఆయన ఎంత గొప్ప విలుకాడు అంటే ఆ జింకల జంటను ఒకే బాణంతో ఒకే దెబ్బతో తను అనుకున్న విధంగా కొట్టాడు. అయితే ఆ జింకలు జంట మారు రూపంతో వన విహారం చేస్తున్న ముని దంపతులు. బాణంతో బాగా దెబ్బ తిన్న ఆ జింకల జంటను తిరిగి ముని రూపాన్ని పొందాయి, అందులో మగ జింక రూపంలో ఉన్న ముని తానూ చనిపోతూ పాండురాజుతో ‘గర్భంతో ఉన్న జంతువులను, ప్రేమతో శృంగారంలో ఉన్న జంతువులను చంపకూడదని వేటగాళ్లకు ఒక ధర్మం ఉంది ఎందుకంటే అవి రాబోయే తరాన్ని సృజించే ప్రక్రియలో ఉంటాయి.

నీవు ఆ ధర్మాన్ని అతిక్రమించావు. నీవు చేసిన అధర్మానికి నీవు కోరికతో నీ భార్యను తాకితే, నీవు అతి భయంకరమైన మృత్యువును పొందుతావు’ అని ఆ ముని శపించాడు. కాబట్టి ముని శాపం కారణంగా పాండురాజుకు ఇద్దరు భార్యలు ఉన్నా వారి వద్దకు ప్రేమతో వెళ్ళలేని, పిల్లలు పొందలేని స్థితి ఏర్పడింది. రాజ్య భవిష్యత్తుకు, పాలనకు రాజుకు పిల్లలు లేకపోవడం ఒక పెద్ద సమస్య. కాబోయే మహారాజు ఎవరు అవుతారు? రాజ్యానికి, రాజ సింహాసనానికి బలమైన వారసుడు లేనపుడు ఇతరులలో రాజ్యాన్ని చేజిక్కించు కోవాలనే అత్యాశ ఏర్పడుతుంది. ఇదే పెద్ద రాజకీయ సమస్య. ముందుటి తరం వలే మరొకసారి కురు వంశానికి వారసుడు లేని సమస్య ఏర్పడింది.

ఈ పరిస్థితితో పాండురాజు తీవ్రమైన క్షోభకు గురై తనకు గల అధికారాన్ని, రాజ్యాన్ని, వదిలి తన భార్యలతో కలసి అడవిలో జీవించసాగాడు. అక్కడ చుట్టు ప్రక్కల ఉన్న సాధువులు, ఋషులతో సంభాషిస్తూ ఆ కార్యక్రమాలతో కాలం గడుపుతూ తాను ఒక రాజనే విషయాన్ని మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ పిల్లలు లేరనే బాధ నానాటికీ ఆయనలో అధికమయ్యేది. ఒక రోజు ఈ బాధ అధికమై, కుంతితో ‘నేను ఏమి చేయగలను? నన్ను నేను చంపుకోవాలని వుంది. మీరిద్దరూ పిల్లలను కనక పొతే, కురు వంశం నశిస్తుంది. ధృతరాష్ట్రునకు కూడా పిల్లలు లేరు. ఆ విషయం అటుంచి, అతను పేరుకు మాత్రమే రాజు, అతను అంధుడు అవడం వల్ల అతని సంతానం రాజు కాలేరు. 

తనకు గల తీవ్రమైన బాధ మూలంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పాండురాజు చెప్పినపుడు, కుంతి, పిల్లలు కలుగడానికి అవకాశం ఉన్నదని తెలిపింది. పాండురాజు అదేమిటని అడుగగా, కుంతి చెబుతూ ‘నేను యుక్త వయస్సులో ఉన్నపుడు ఒకనాడు దుర్వాస మహాముని నా తండ్రి కుంతిభోజుని వద్దకు వచ్చినపుడు ఆ మునికి ఉపచారికగా సపర్యలు చేశాను. అందుకు ఆ ముని సంతోషించి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రంతో, నేను ఏ దేవతనైనా పిలచి సంతానం పొందవచ్చునని ముని తెలిపాడు. కాబట్టి మీకు నిజంగా సంతానం కావాలని ఉంటే, నేను ఆ మంత్ర సహాయంతో పిల్లలను మీ కొరకు పొందగలను అన్నది. కానీ ఆ మంత్ర సహాయంతో గతంలో ఒక దేవతను తాను పిలచినట్లు కుంతి పాండురాజుకు తెలియపర్చలేదు. పాండురాజు ఈ వార్త విని మరింత ఉత్సాహంతో ఆ పనిని వెంటనే చేయమని చెప్పి, ఏ దేవతను పిలవాలా ఆలోచించాడు. కొంతసేపు ఆలోచించిన తరువాత పాండురాజు కుంతితో ‘మనం ధర్మదేవతను పిలుద్దాము. కురు వంశానికి కాబోయే రాజుగా కుమారుడ్ని మనం పొందాలి. ధర్మదేవతే మరణానికీ, న్యాయానికీ ప్రభువైన యమధర్మరాజు ధర్మదేవత.

యుధిష్టిర, భీమ జననం

పాండురాజు అనుమతితో కుంతి అడవిలోకి వెళ్లి ధర్మదేవత అయిన యమ ధర్మరాజును ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో యుధిష్టిరుడిని కన్నది, అతనే పాండురాజు కుమారుల్లో పెద్దవాడు. సంవత్సరం గడచిన తరువాత సంతానంపై మరింత ఆశతో పాండురాజు కుంతితో ‘మరో బిడ్డను కనమని’ చెప్పగా, కుంతి ‘అందుకు వీలుకాదని, మనకు ఇప్పటికే కురు వంశానికి వారసునిగా ఒక బిడ్డ ఉన్నాడని, ఇక చాలని’ తెలిపింది. పాండురాజు కుంతితో ‘నాకు ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నట్లయితే అందరూ  రాజుగా నా గురించి ఏమనుకుంటారు, కనుక మరో బిడ్డ కావాలని ఆమెను పట్టుపట్టాడు’. చివరకు ఆమె అంగీకారంతో మరో బిడ్డకు తండ్రి ఎవరైతే బాగుంటుందని ఆలోచించి, పాండురాజు కుంతితో మనకు ఒక బిడ్డగా ధర్మం ఉంది, కానీ దానికి బలం అవసరం. కాబట్టి గాలికి దేవుడైన వాయువును ప్రార్థించమన్నాడు. కుంతి వెళ్లి వాయు దేవుణ్ణి  ప్రార్థించగా, ఆయన వచ్చాడు. ఆయనకు గల తీవ్ర వాయు వేగం కారణంగా వారు వున్న చోటు నుంచి కుంతిని సుదూర ప్రాంతాలకు తీసుకొనివెళ్ళాడు.

అలా వారు పర్వతాలను, సముద్రాలను దాటారు, క్షీరసాగరం వద్దకు ఎలా ఎగురుతూ వెళ్లారు అనే విషయమై మహాభారతంలో అందమైన, పూర్తి వివరణ ఇవ్వబడింది. భూమి గుండ్రంగా వుందని వాయు దేవుడు కుంతికి వివరించాడు. ఆయన ఆమెతో మరిన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడుతూ, భూమికి ఇటువైపు భరతవర్షంలో పగలు ఉన్నపుడు అటువైపు ఉన్న ప్రాంతంలో రాత్రి వుంటుందని, ఇక్కడ రాత్రి  ఉంటే, అక్కడ పగలు వుంటుందని తెలిపాడు. అలాగే భూమికి అవతల వైపు ఉన్న ప్రాంతంలో మరో గొప్ప నాగరికత వుందని తెలుపుతూ అక్కడ ఎలాంటి ప్రజలు నివసించేవారో, వారికి గల నైపుణ్యత, సామర్థ్యాల గూర్చి ఆమెకు వాయువు వివరించాడు. వాయువు మరిన్ని విషయాలు చెబుతూ అక్కడ గొప్ప సాధువులు, జ్ఞానులు, వీరులు కూడా వున్నారని తెలిపాడు. తదుపరి వాయుదేవుని అనుగ్రహంతో కుంతి వాయు పుత్రుడైన భీముడిని అను పేరుగల బిడ్డను కన్నది. ఆ భీముడే పెరిగి పెద్దై ప్రపంచంలో అత్యంత బలవంతుడుగా ప్రఖ్యాతి పొందాడు.

అర్జున జననం

ఇలా కొద్ది కాలం గడచిన తరువాత, పాండురాజు తిరిగి కుంతితో ‘నాకు తెలుసు నేను అత్యాశగల వాడినని, కానీ ఈ అందమైన ఇద్దరు పిల్లలను చూసిన తరువాత నేను ఎలా నిలువగలను? నాకు మరో కొడుకు కావాలని’ కోరగా, ఆమె వీలుకాదని చెప్పింది. కాలం గడుస్తున్నా పాండురాజు పట్టు వదలక పోవడంతో కుంతి ‘ఈసారి  ఎవరిని ప్రార్థించాలని’ అడుగగా, ఆయన ‘దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి ప్రార్థించామని’ కోరాడు. ఆమె అలాగే ఇంద్రుణ్ణి మంత్ర సహాయంతో ఆహ్వానించి ఆయన అనుగ్రహంతో అర్జునుడిని కన్నది. ఆయనే తదుపరి  కాలంలో గొప్ప విలుకాడుగా, వీరుడుగా ప్రఖ్యాతి పొందాడు. మహాభారతం అర్జునుడిని ‘క్షత్రీయ’ అని సూచిస్తుంది, అంటే గొప్ప వీరుడు అని అర్థం. ఆయన వంటి వీరుడు ఇప్పటి వరకు లేరు, ఇకపై వుండరు.

మద్రి అసూయ

కుంతికి దైవానుగ్రహంతో కలిగిన ముగ్గురు పిల్లలు అద్బుత నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, తెలివితేటలను ప్రదర్శిస్తూ పెరుగుతున్నారు. అందరి దృష్టి ఆ ముగ్గురు పిల్లలపై, కుంతిపై ఉండేది. అటు భర్త ప్రేమకు దూరమై, పిల్లలులేక పాండురాజు మరో భార్య మద్రిలో చిన్నపాటి అసూయ ప్రారంభమైంది. ఒకరోజు, ఎంతో అందమైన తన భార్య అయిన మద్రి ముఖం కళావిహీనం అయి ఉండటాన్ని గమనించి పాండురాజు ఆమెతో ‘ఏమిటి విషయం? నీవు సంతోషంగా లేవా?’ అని అడుగగా ఆమె ‘నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉండగలను? మీకు మీ ముగ్గురు పిల్లలు, మీ మరో భార్య అంతా, ఇక నాకు ఇక్కడ పని ఏముంది?’ అని తెలిపింది. వారిద్దరి మధ్య కొంత వాదన జరిగిన తరువాత, మద్రి భర్తతో ‘మీరు కుంతితో ఆ మంత్రాన్ని నాకు నేర్పమని కోరితే, నేనూ పిల్లలను కనగలను. తరువాత మీరు నాపై కూడా శ్రద్ధ చూపుతారు. లేకపోతె, నేను పనికిరాని ఒక ఉపచరికగా మిగిలిపోతాను’ అని వేడుకొంది.

పాండురాజు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, కుంతి వద్దకు వెళ్లి ‘మద్రికి కూడా పిల్లలు కావాలి’ అని తెలిపాడు. కుంతి భర్తతో ‘ఎందుకు? తన పిల్లలు ఆమె పిల్లలే కదా?’ అని తెలుపగా, ఆయన ‘మద్రికి స్వంత బిడ్డలు కావాలి. కనుక నీవు ఆ మంత్రాన్ని ఆమెకు నేర్పితే, ఆమె కూడా తనకు ఇష్టమైన దేవతను ప్రార్థించి పిల్లలను కనగలదు’ అని తెలిపాడు. అందుకు కుంతి ‘నేను మంత్రాన్ని నేర్పలేను, కాని అవసరమైతే, ఆ మంత్రాన్ని నేను ఉపయోగించి ఆమె తనకు ఇష్టమైన దేవుడిని పిలేచేలా చేయగలను’ అని చెప్పి, కుంతి తనతో మద్రిని అడవిలోని ఒక గుహ వద్దకు తీసుకొని వెళ్లి ‘నేను మంత్రాన్ని ఉపయోగిస్తున్నాను. ఏ దేవుణ్ణి పిలవాలో నీవు ఆలోచించుకోమని’ తెలిపింది. కానీ మద్రి ఎవరిని ప్రార్థించాలనే ఆలోచనలో కంగారుపడి ఇద్దరు అశ్వనీ దేవతలను కోరింది. అయితే వారు దేవతలు కారు కానీ దైవాంశం కలవారు. అశ్వం అంటే గుర్రం – ఆ ఇద్దరు దైవాంశం కలిగి, గుర్రాన్ని బాగా నడిపే వంశానికి చెందిన గొప్ప రౌతులు. ఈ అశ్వనీ దేవతల అనుగ్రహంతో మద్రి ఇద్దరు కవల పిల్లలను కన్నది – వారే నకుల, సహదేవులు.

పంచ పాండవులు

ఈవిధంగా కుంతికి ముగ్గురు పిల్లలు కలిగారు – వారే యుధిష్టిర, భీమ, అర్జునులు. అలాగే మద్రికి ఇద్దరు పిల్లలు కలిగారు – వారే నకుల, సహదేవులు. కానీ పాండురాజుకు పిల్లలు మరింత మంది కావాలని అనుకున్నాడు. ఒక రాజుకు ఎంత ఎక్కువ మంది కొడుకులు ఉంటే అంత మంచిది. యుద్ధాలు వచ్చినపుడు, పిల్లలు చనిపోయి కొడుకుల సంఖ్య తగ్గవచ్చు, కాబట్టి యుద్ధంలో గెలవాలన్నా, రాజ్యాన్ని పరిపాలన చేయాలన్నా ఎంత మంది అవకాశం వుంటే అంత మంది పిల్లలు ఉండటం మంచిది అని ఆయన ఆలోచించాడు. ఇందుకు కుంతి ‘ఉన్న పిల్లలు చాలని, ఇక వద్దని’ చెప్పింది.

కానీ పాండురాజు కుంతితో ‘నీకు వద్దకపోతే సరే, కనీసం మద్రి కోసమైనా ఆ మంత్రాన్నే ఉపయోగించమని’ పట్టుపట్టాడు. ఇందుకు కుంతి ఒప్పుకోలేదు ఎందుకంటే ఏ రాణికైతే ఎక్కువ మంది పిల్లలు వుంటారో వారే పట్టపురాణి అవుతారు. ఆమెకు ముగ్గురు, మద్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాబట్టి తనకు అనుకూల ప్రయోజనంగా ఉన్న ఈ సంఖ్యా బలాన్ని కుంతి వదులుకోదల్చుకోలేదు. అందువలన కుంతి మంత్రాన్ని ఉపయోగించే వీలులేదని పాండురాజుతో ఖచ్చితంగా తెలిపింది. పాండురాజు ఐదురుగు పిల్లలు పాండవులుగా, పంచ పాండవులుగా ప్రసిద్ది పొందారు. వారు ఒక రాజు రాజపుత్రులు, పెద్ద రాజ వంశానికి వారసులు. కానీ వారికి 15 సంవత్సరాలు వచ్చే వరకూ వారు అరణ్యంలోనే పెరిగారు.