ప్రాధమికంగా, క్రియ అంటే ‘అంతర్గత చర్య’ అని అర్ధం. మీరు ఈ అంతర్గత చర్య చేసినప్పుడు మీ శరీరం, మనస్సు రెండూ అందులోకి రావు. ఎందుకంటే ఇవి రెండు, అంటే మీ శరీరం, మనస్సులు మీకు బాహ్యమైనవే. మీ శక్తితో ఓ అంతర్గత చర్య చేసే ప్రావీణ్యం మీలో ఉంటే అప్పుడు అది ఒక క్రియ అవుతుంది.

మీరు క్రియా మార్గం ఎంచుకుంటే మిమల్ని తల్లక్రిందులుగా పడుకోమంటే మీరు ఎలాంటి ప్రశ్న వేయకుండా అలానే చేయాలి.

క్రియ యోగా ఆధ్యాత్మిక పధంలో చాలా శక్తివంతమైన మార్గమే కానీ అదే సమయంలో అది చాలా కచ్చితమైనది. అది ఒక వ్యక్తి నుంచి ఎంతో కృషిని కోరుకుంటుంది. తమ శరీరాన్ని పూర్తిగా ఉపయోగిచుకోవటం తెలియని నేటి విద్యావంతులకు క్రియ యోగా కొంచం అమానుషంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి కొంత క్రమశిక్షణ, ఖచ్చితత్వం అవసరం అవుతాయి. క్రియ యోగాకు అవసరమైనటువంటి శరీరం గానీ, మేధస్సు గానీ లేక మానసిక స్థిరత్వం గానీ చాలా మందికి ఇప్పుడు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జనాలు మరీ ఎక్కువ సౌకర్యాలతో బ్రతుకుతున్నారు. నేను కేవలం శారీరిక సుఖం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. సౌకర్యంగా ఉండే కుర్చీలో కూర్చోవటం ఒక అడ్డంకి కాదు. కానీ మీరు ఎప్పుడూ సౌకర్యాన్నే కోరుకుంటున్నారు, అదే ఒక అడ్డంకి. మీరు సౌకర్యంగా ఉన్న దేని మీదైనా కూర్చుంటే, దాన్ని ఆనందించండి, దానిలో సమస్యేమి లేదు. కానీ మీరు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటే అప్పుడు అటువంటి మెదడు, భావాలూ క్రియా మార్గానికి సరైనవి కావు. క్రియ యోగా ఎప్పుడూ ‘స్వేచ్ఛ’ గురించి మాట్లాడే వాళ్ళకు కాదు. ‘నాకు ఇలా చేయటానికి స్వేచ్ఛ లేదా? అది చేసే స్వేచ్ఛ నాకు లేదా? నేను ఇది ఎందుకు తిన కూడదు? నేను అక్కడ ఎందుకు పడుకోకూడదు?’ అని అడుగుతూ ఉండేవాళ్ళకు కాదది. మీరు క్రియా మార్గం ఎంచుకుంటే మిమల్ని తల్లక్రిందులుగా పడుకోమంటే మీరు ఎలాంటి ప్రశ్న వేయకుండా అలానే చేయాలి. ఎందుకంటే ఇదంతా ఎన్నటికీ మీకు వివరించలేము. మీరు చేస్తూ ఉంటే మీకు అర్ధం అవ్వచ్చు కానీ అది ఎన్నటికీ వివరించలేనిది. దాన్ని ఒకవేళ మీకు వివరించాల్సి వస్తే, దానిలోని సారాంశమే కనుమరుగైపోతుంది. ప్రతీదాని గురించి జనాలు తార్కికమైన ప్రశ్నలు అడుగుతుంటే వారికి తార్కికమైన సమాధానాలే ఇవ్వాల్సి వస్తుంది. కానీ క్రియ అనేది తర్కాన్ని అధిగమించి, మర్మజ్ఞ పార్శ్వాలను ఇనుమడించుకోవటానికే.

మీకు క్రియలను ఒక సాధనగా నేర్పించాలంటే దాన్ని నేను ఒక పుస్తకంగా రాస్తే అందరు చదివి, నేర్చుకోవచ్చు. కానీ మీరు క్రియ ఒక సజీవ ప్రక్రియగా  మీ వ్యవస్థలో ఒక నిర్దిష్ట విధానంలో ముద్రించబడాలంటే, దానికి కొంత క్రమశిక్షణ, నిమగ్నత, నమ్మకం ఉండాలి. మీరు కొత్త ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు, మీకు దిశానిర్దేశం చేసే వారి మీద మీకు నమ్మకం లేకపోతే, అప్పుడు ఆ ప్రయాణం అనవసరంగా కష్టతరం అవుతుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది.

సాధారణంగా క్రియా పధంలో చాలా మంది గురువులు శిష్యుల్ని వేచి ఉండమంటారు. మీకు ఒక గురువు దగ్గరికి వెళ్ళారని అనుకుందాము, మీరు క్రియా యోగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు, ఆయన మిమల్ని ‘సరే, నేలను ఊడవండి’ అని అనవచ్చు.

 మీరు కేవలం విముక్తి పొందాలని అనుకుంటే క్రియ లాంటి ఒక సంపూర్ణ మార్గం అవసరమం లేదు. 

‘లేదు, నేను క్రియ యోగ నేర్చుకోవాలనుకుంటున్నాను.’ అని మీరంటారు.

‘అందుకే నేనూ చెప్పింది, నేలను ఊడవండి.’ అని గురువు అంటారు.

మీరు ఒక సంవత్సరం పాటు ఊడుస్తారు, ఆ తరువాత ‘నేను ఒక సంవత్సరం పాటు ఊడ్చాను.’ అని మీరంటారు.

‘ఓహ్, ఒక సంవత్సరం పాటు ఊడ్చారా? గిన్నెలు కడగండి.’ అని గురువు అంటారు.

ఆ గురువు మిమల్ని అలా వేచి ఉండేలా చేస్తారు. ఇతని నమ్మకం చెదరకుండా ఉంటే అప్పుడు క్రియలలోకి దీక్షను ఇవ్వవచ్చు. లేకపోతే మనం ఒకసారి ఒక వ్యక్తి యొక్క వ్యవస్థను ఒక నిర్దిష్ట విధానంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా సచేతనం చేసినప్పుడు వాళ్ళ వైఖరి, భావోద్వేగాలు ఎలా ఉండాలో అలా లేకపోతే, వాళ్ళకి వాళ్ళు తీవ్రమైన హాని చేసుకోవచ్చు. నేటి ప్రపంచంలో జనాల నుంచి అటువంటి సమయం దొరకటం, వాళ్ళు ఎదురుచూడటం, అటువంటి నమ్మకం కుదిరేదాకా ఉండటం, ఆ తరువాత ఈ క్రియలను వాళ్ళలో ముద్రణ చేయటం అనేది అసాధ్యం కాదు కానీ, ఆ అవకాశాలు తక్కువే.

జ్ఞానసాక్షత్కారానికి మించినవి మీరేదైనా చేయాలని అనుకుంటే అప్పుడు క్రియా యోగా ముఖ్యమవుతుంది. ఏదో విధంగా మీరు ఈ జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటే, మీకు జ్ఞానోదయం లేక ముక్తి మాత్రమే కావాలనుకుంటే, అప్పుడు మీరు క్రియా పధంలో వెళ్ళనవసరం లేదు. మీరు కేవలం విముక్తి పొందాలని అనుకుంటే క్రియ లాంటి ఒక సంపూర్ణ మార్గం అవసరమం లేదు. ఎందుకంటే దానికి ఎంతో సాధన, క్రమశిక్షణ, ధ్యాస అవసరం. మీరు క్రియలను ఒక చాలా తక్కువ స్థాయిలో కూడా వాడుకోవచ్చు; వాటిని ఎంతో తీవ్రంగా చేయనవసరం లేదు.

 క్రియా పధంలో ఉన్నవారి సమక్షం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శక్తుల మీద వాళ్ళకు ఆ పట్టు ఉంటుంది.

మీరు క్రియా పధాన్ని ఎటువంటి ఉపదేశం లేకుండా చాలా తీవ్రంగా పాటిస్తే, దాని ఫలితం దక్కటానికి కొన్ని జన్మల కాలం పట్టచ్చు. ఈ ప్రక్రియలో చురుకగా పాల్గొని, మార్గ నిర్దేశనం చేయగలిగే వారు ఒకరుంటే,  అప్పుడు మీ అంతర్గత స్వభావాన్ని, మార్మిక అద్భుతాలను అన్వేక్షించటానికి క్రియ ఎంతో మహత్తరమైన, శక్తివంతమైన మార్గం అవుతుంది. లేకపోతే క్రియ ఒక చుట్టుతిరుగుడు విధానం అవుతుంది. ఈ మార్గంలో మీరు కోరుకునేది కేవలం జ్ఞానోదయం మాత్రమే కాదు; ఈ జీవిత విధానాలను తెసుకోవాలనే ఆర్తి మీలో ఉంది. మీరు ఈ జీవితం యొక్క ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందువల్లనే ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ.

క్రియా పధంలో ఉన్నవారి సమక్షం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శక్తుల మీద వాళ్ళకు ఆ పట్టు ఉంటుంది. వాళ్ళు జీవితాన్ని విచ్ఛిన్నం చేసి మళ్ళీ సృజించగలరు. మీరు వేరే మార్గాలను అనుసరిస్తుంటే, ఉదాహరణకు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తుంటే మీరు రేజర్ అంత పదునుగా అవ్వచ్చు. మీ మేధస్సుతో ఎన్నో చేయవచ్చు, కానీ మీ శక్తితో మీరు పెద్దగా ఏమీ చేయలేరు. మీరు భక్తి మార్గంలో ఉంటే మీరు మీ శక్తులతో ఏమీ చేయలేరు, అయినా మీరు దాని గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఆ మాధుర్యం, మీ భావోగ్వేదాల మీద ధ్యాసే మీకు ముఖ్యం. మీరు అందులో కరిగిపోవాలని కోరుకుంటారు. మీరు కర్మ పధంలో ఉంటే ఈ ప్రపంచంలో మీరెన్నో చేయచ్చు, కానీ మీతో మీరు ఏమి చేయలేరు. కానీ క్రియా యోగులు వారి శక్తిపరంగా ఏది కావాలంటే అది చేయగలరు, అలాగే ఈ ప్రపంచంలో కూడా ఎన్నో చేయగలరు.

ప్రేమతో,
సద్గురు